
ప్రతి కథకు ఇద్దరు వ్యక్తులు కావాలి. ఒకరు కథకుడు, మరొకడు ప్రేక్షకుడు. కథనాలు రెండు రకాలు. ఒకటి బాహ్య కథనం, మరొకటి ఆత్మాశ్రయ కథనం. వీటినే ఇంగ్లీషులో ఆబ్జెక్టివ్ నెరేషన్ మరియు సబ్జెక్టివ్ నెరేషన్ అంటారు. ఆబ్జెక్టివ్ నెరేషన్ లో కథకుడు కూడా ఓ ప్రేక్షకుడే. అతడి కళ్ళముందు జరిగిందే అతడు చెబుతాడు, అది ప్రేక్షకుడు వింటాడు. ఉదాహరణకు, టీవీలో విలేఖరి కథనం. సబ్జెక్టివ్ నెరేషన్ లో కథకుడు తన కథను ఓ పాత్ర కోణంలోంచి చెబుతాడు. లేదా ప్రేక్షకుడు కథనాన్ని ఓ పాత్ర కోణంలోంచి నమ్ముతాడు. ఉదాహరణకు, రాజ్ కుమార్ హిరాణి తీసిన “3 ఇడియట్స్”. ఈ సినిమాలో ఎదో ఒక పాత్ర కోణంలోంచి కథకుడు చెప్పడం, అది నిజమని ప్రేక్షకుడు నమ్మడం జరుగుతుంది. అమీర్ ఖాన్ పాత్ర చెప్పేదే సరైనదని కథకుడు అనచ్చు, మాధవన్ పాత్రలాగే తను కూడా బ్రతికానని ఓ ప్రేక్షకుడు భావించవచ్చు. అంటే 3 ఇడియట్స్ లో మనం ఎవరో ఒక ఇడియట్ అని అర్థం.
ఈ విషయాలన్నింటినీ పరిచయం చేయడానికి కారణం “ఇంతియాజ్ అలీ” చేసిన “తమాషా”. 2015 నవంబరులో వచ్చిన ఈ సినిమా ఫలితం ఎలా ఉన్నా, కథను చెప్పే విషయంలో చాలా విషయాలు తెలిపింది. మన కథకు ఉంటే సబ్జెక్టివ్ నెరేషన్ ఇవ్వాలి లేదా ఆబ్జెక్టివ్ నెరేషన్ ఇవ్వాలి. రణబీర్ కపూర్, దీపికా పదుకొనె జంటగా తెరకెక్కిన ఈ సినిమాలో, ఒకే కథకు రెండు రకాల కథనాలు ఇచ్చాడు ఇంతియాజ్.
నా ఈ విశ్లేషణ పెద్దదిగా అనిపించి బోరు కొడితే నన్ను క్షమించండి. పూర్తిగా చదివాక, నచ్చినా, నచ్చకపోయినా క్రింద కామెంట్ చేయండి 🙂
ముందుగా కథ…
ఫ్రాన్స్ లోని కోర్సికా దీవిలో ఇద్దరు అనామకులు నకిలీ పేర్లతో కలుసుకుంటారు. వారే డాన్ (రణబీర్) మరియు మోనా (దీపిక). ఆ దీవిలో ఉన్నన్నాళ్ళు పేర్లతో సహా తమను గురించిన నిజాలను ఏమాత్రం బయట పెట్టకూడదని, కేవలం అబద్దాలతోనే గడపాలని నియమం పెట్టుకుంటారు. ఓ వారం గడిపిన తరువాత ఎవరి దారి వారు చూసుకుంటారు. కొన్ని సంవత్సరాల తరువాత ఢిల్లీలో అసలు పేర్లతో పరిచయం అవుతారు వేద్ (రణబీర్) మరియు తార (దీపిక). ఆ తరువాత వారి జీవితాలు ఎలా మారాయి, వారి బంధం ఎలా కొనసాగింది అనేవి ఈ సినిమా కథాంశాలు.
ఇప్పుడు కథనం…
“Why always the same story?” అనేది ఈ సినిమా ప్రచార వాక్యం. కానీ సినిమా చూసిన తరువాత నాకు అనిపించింది ఆ వాక్యాన్ని “Why always the same narration?“ అని మారిస్తే బాగుంటుందేమో అని. ఎందుకంటే పైన చెప్పుకున్నట్టుగా, మన కథనం సబ్జెక్టివ్ అయినా అయ్యుండాలి లేదా ఆబ్జెక్టివ్ అయినా అయ్యుండాలి. కానీ ఈ సినిమాలో, ఒకే కథ రెండు విధాలుగా చెప్పబడింది.
మరో విషయం ఏమిటంటే, ఇంతియాజ్ పై హాలీవుడ్ దర్శకుడు “నోలాన్” ప్రభావం ఎక్కువగా ఉన్నట్టు కూడా అనిపిస్తుంది. ఎందుకంటే, నోలాన్ లాగే ఇంతియాజ్ దాదాపుగా తన కథను దాని మొదటి సన్నివేశంతో మొదలుపెట్టడు. ఓసారి “లవ్ ఆజ్ కల్”, “రాక్స్టార్”, “హైవే” సినిమాల్లోని మొదటి సన్నివేశాలను గుర్తు చేసుకుంటే ఈ విషయం అర్థమవుతుంది. ఈ సినిమాలో కూడా అదే పోకడను అనుసరించాడు. సినిమా ఆరంభంలోనే “చలీ కహాని” గీతాన్ని ఉంచడం దీనికి నిదర్శనం, ఇదే మంచి మొదలని అనిపించేలా చేయడం ఇంతియాజ్ గొప్పతనం. రాబోయే నిమిషాల్లో ఏదో వింత జరగబోతోంది అన్న భరోసాను ఇస్తుంది ఈ గీతం.
కోర్సికా దీవిలో…
డాన్, మోనాలను పరిచయం చేయడం దగ్గరనుండి అంతా బాహ్యమైన కథనమే. ప్రేక్షకుడు వారిద్దరికీ మిత్రుడుగానో, శత్రువుగానో కేవలం జరిగేదే చూడగలడు తప్ప, వారిలో ఒకడు కాలేడు. డాన్ మరియు మోనా ఒకరికొకరు అబద్ధాలు చెప్పుకుంటున్నారని, పర్వతాలతో మాట్లాడుతున్నారని, జంతువుల్లా కొలనులో నోరుపెట్టి నీరు త్రాగుతున్నారని, రవి వర్మన్ చక్కని ఛాయాగ్రహణంలో “మటర్గస్తి” అని పాడుకుంటున్నారని, విడిపోయే ముందు ఒకరినొకరు గాఢంగా ముద్దాడుకున్నారని ఇంతియాజ్ తను వారిని ప్రత్యక్షంగా చూసినట్టు చెబుతాడు.
కొన్ని సంవత్సరాల తరువాత…
డాన్ వల్ల మోనా అనుభవించే ఒంటరితనాన్ని ఓ పంజాబీ నృత్య బృందం తెలపడం, డాన్ ని హఠాత్తుగా ఓ రెస్టారెంట్లో చూసి అయోమయంలో మెట్లు ఎక్కి దిగడం, మళ్ళీ వేద్ (రణబీర్), తార (దీపిక)ల అసలు పరిచయం వరకు అంతా బాహ్యమైన కథనమే. చిన్నప్పటినుండి వేద్ విన్న కథలను అతడి జీవితానికే ఆపాదించడం ఇంతియాజ్ తెలివని చెప్పొచ్చు. అసలు ఈ కథలోకి మనం ఎలా రా వెళ్ళేది అని ప్రేక్షకుడు బుర్ర బద్దలుకొట్టుకునే సమయంలో ఇంతియాజ్ ఓ ద్వారాన్ని తెరుస్తాడు. ఇక అక్కడినుండి ఆ కథ ప్రేక్షకుడిది అయిపోతుంది. కోర్సికాలో కనిపించిన డాన్ కి ఏమాత్రం పోలికలేని వేద్, వేద్ ని తిరస్కరించిన తార, కుటుంబం కోసం తన ఇష్టాన్ని వదిలేసి బ్రతుకుతున్న ఓ ఆటో డ్రైవర్, క్రమశిక్షణను పాటించే వేద్ యొక్క బాస్, ఇలా ఎదో ఒక రూపంలో ప్రేక్షకుడు ఈ కథలోకి ప్రవేశించవచ్చు. తనను తాను చూసుకోవచ్చు. ఈ మార్పులోనే ఇంతియాజ్ తడబడ్డాడేమో అనిపిస్తుంది. ఆబ్జెక్టివ్ నుండి సబ్జెక్టివ్ కి వెళ్ళడంతో నెరేషన్ లో పస తగ్గిపోతుంది.
కొన్ని విషయాలను దృశ్యరూపంలో చెప్పడానికి ఇంతియాజ్ చాలా షాట్స్ తీశాడు. ఉదాహరణకు, వేద్ అసలు జీవితమేంటో చూపించిన విధానం, అతడిలోని మార్పుని రోజు సాయంత్రం అతడికి తార “బై” చెబుతూ గమనించే షాట్స్, ఇలా కొన్ని ఒకే సమయంలో సబ్జెక్టివ్ మరియు ఆబ్జెక్టివ్ గా అనిపిస్తాయి. ఇక్కడ “ఆర్తి బజాజ్” చేసిన కూర్పు ఇంతియాజ్ కు బాగా సాయపడింది. అలాగే ఏ.ఆర్.రెహమాన్ కూడా తన నేపథ్య సంగీతంతో అతడికి బాగా సాయపడ్డాడు. తను తిరస్కరించిన ఉంగరాన్ని తిరిగి ఇచ్చేయమని తార వేద్ ని అడిగే సన్నివేశం రణబీర్, దీపికలు తమ తమ నటనాప్రతిభను నిరూపించుకునేందుకు ఉపయోగపడింది. అరిజిత్ సింగ్, అల్కా యాగ్నిక్ లు పాడిన “తుమ్ సాథ్ హో” నెరేషన్ ని పూర్తిగా సబ్జెక్టివ్ గా మార్చింది. అక్కడినుండి ప్రేక్షకుడు వేద్ పాత్రలో తనను చూసుకునే పూర్తి వీలును కల్పించాడు ఇంతియాజ్.
మళ్ళీ అదే కథ మొదలు…
డబ్బులు తీసుకొని కూడా ప్రతిసారి ముసలాడు ఒకే కథ చెబుతున్నాడని వేద్ తికమక పడతాడు. కొత్త కథ, దానికి కొత్త ముగింపు చెప్పమని అతడిని బతిమాలతాడు. అయినా ఆ ముసలాడు చెప్పడు. ఇంతియాజ్ కూడా అదే తీరులో, మళ్ళీ అదే కథను చెప్పాడు. తన వేద్ పాత్రలాగే తను కూడా తికమక పడ్డాడు. సబ్జెక్టివ్ నెరేషన్ లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ప్రేక్షకుడికి కథనంపై పట్టు బాగా ఉంటుంది. ఆబ్జెక్టివ్ నెరేషన్ లో ఇంతియాజ్ ఎంత మెరుగ్గా ఉన్నాడో ఇందులో అంత తడబడ్డాడు. మోతాదు మించిన డైలాగులతో క్లైమాక్స్ కు వచ్చాడు. ఇదేంటి ఇంతియాజ్ కథనం బాగా డీలాపడింది అనుకునేసరికి, “తూ కోయి ఔర్ హై” అని రెహమాన్ గొంతుకలో ఓ చక్కని గీతం. అది కూడా ఆబ్జెక్టివ్ నెరేషన్ తో. రెహమాన్ తన సినిమాల్లో ఏదైనా గీతాన్ని స్వయంగా పాడాడు అంటే, అది ఆ సినిమాకే ఉత్తమ గీతమని చెప్పొచ్చు. లగాన్, స్వదేస్, రంగ్ దే బసంతి, రాక్స్టార్ సినిమాలు వాటికి ఉదాహరణలు. అదే మళ్ళీ తమాషా విషయంలో అది పునరావృతమైంది.
కథ ముగిసింది…
తమాషా సినిమా ఫలితం ఇది మామూలు ప్రేక్షకుల కోసం తీసిన సినిమా కాదు అని నిరూపించింది. కానీ భవిష్యత్తులో సినిమాలు తీయాలి అనుకునేవారు తప్పకుండా ఈ సినిమాను తమ సినీ గ్రంథాలయంలో ఉంచుకోవాల్సిన అవసరం ఉందని నా భావన!
– యశ్వంత్ ఆలూరు
03/01/2016
“Wayback Machine”లో గల నవతరంగం వ్యాసం ఇక్కడ.