ఓ కథలో కథానాయకుడు, ప్రతినాయకుడు అని ఇద్దరు వ్యక్తులుంటారు. అందులో మొదటివాడు “మంచివాడు”, రెండోవాడు “చెడ్డవాడు” అయ్యుండాలి అనేది అనాదిగా వస్తున్న సినిమా సూత్రం. దాన్ని ఎప్పుడో బద్దలుకొట్టాడు “రామ్ గోపాల్ వర్మ”. అదే డాక్యుడ్రామా (docudrama) కథలను తీయడంలో వర్మని సిద్ధహస్తుడుని చేసింది కూడా. “రక్తచరిత్ర”, “26/11 ముంబై దాడులు” తరువాత అతడి తీసిన డాక్యుడ్రామా “Killing వీరప్పన్”. కన్నడలో తీసిన ఈ సినిమా అనువాదమై తెలుగు రాష్ట్రాల్లో ఈ నెల 7వ తేదిన విడుదలయింది. “కన్నడ కంఠీరవ” రాజ్ కుమార్ తనయుడు, సుప్రసిద్ధ నటుడు “శివ రాజ్ కుమార్” పోలీసు పాత్రలో నటించగా, వీరప్పన్ పాత్రలో “సందీప్ భరద్వాజ్” నటించాడు.
కథ :
హత్యలు, గంధపుచెక్కల అక్రమ రవాణా, ఏనుగుల దంతాలతో వ్యాపారం, ఇలా పలు నేరాలు చేసి మూడు రాష్ట్రాల ప్రభుత్వాలకు నిద్రపట్టకుండా చేసిన వీరప్పన్ (సందీప్ భరద్వాజ్)ని హతమార్చిన ఘటన ఆధారంగా రూపొదించిన సినిమా ఇది.
కథనం :
ఇలాంటి డాక్యుడ్రామా కథలకు బాహ్యమైన కథనం (objective narration) అవసరం. అలాంటి కథనంలో కూడా వర్మ శైలి చాలా ప్రత్యేకం. కథ, అందులోని పాత్రలలో మంచి, చెడులను వదిలేసి వాటి స్వభావానికి కారణమైన భావోద్వేగాలను పట్టుకుంటాడు వర్మ. అందుకే “రామ్ గోపాల్ వర్మ” అంటే మామూలు వ్యక్తి కాదు, అతడో రకం అంతే. అతడిని స్పూర్తిగా తీసుకొని ఎంతమంది పరిశ్రమకు వచ్చినా, ఈ విషయంలో వర్మ దరిదాపుల్లోకి కూడా రాలేకపోయారు.
ప్రశంసలు…
ఈ సినిమా కోసం వర్మ ఈ కథను రెండో కోణాల్లో విన్నాడు. ఒకటి వీరప్పన్ ని చంపడానికి పథకం వేసిన పోలీసు అధికారి (శివ రాజ్ కుమార్) కోణం. మరొకటి వీరప్పన్ భార్య ముత్తులక్ష్మి (యజ్ఞ శెట్టి) కోణం. ఒకటి బాధ్యత, పగకు సంబంధించింది, మరొకటి ప్రేమకు సంబంధించింది. కానీ వర్మను అత్యధికంగా ఆకట్టుకున్న పోలీసు అధికారి కోణంలోనే ఈ కథను చెప్పాడు. అలాగని ముత్తులక్ష్మి చెప్పిన విషయాలను వదిలేయలేదు. “సినిమా” పరంగా ఈ కథకు నాయకుడు శివ రాజ్ కుమార్ అయినా, ఆయన పాత్రను కేవలం వృత్తికే పరిమితం చేసి, వీరప్పన్ యొక్క వ్యక్తిగత జీవితాన్ని తనదైన శైలిలో చూపించి వర్మ తన ప్రత్యేకతను చాటుకున్నాడు. “వాసన చూడడానికి పువ్వుని నలపను నేను!” అనే మాట వీరప్పన్ లాంటివాడు పలికాడు అంటే అది నమ్మశక్యం కాని విషయం. అలాగే, కన్నకూతురు విషయంలో అతడి చర్యను కూడా పై ఇద్దరి కోణాల్లో చూపించాడు. ఓ కరుడుకట్టిన నేరస్థుడి ప్రేమకథను చూసే వీలు కలిపించాడు వర్మ ఈ సినిమాతో.
సాధారణంగా, వర్మ సినిమాల్లోని పాత్రలు మంచివి కావు, చెడ్డవి కావు. అవి తమ లక్ష్యం కోసం పని చేస్తుంటాయి, మంచో, చెడో వాటి భావోద్వేగాలలో ఓ నిజాయితి ఉంటుంది, ఒక్కోదాని కోణంలో ఓ బలమైన కారణం ఉంటుంది. రక్తచరిత్ర1లో “రవి” పాత్ర, రక్తచరిత్ర2లో “సూర్య” పాత్ర దీనికి ఉదాహరణలు. వీరప్పన్ కథలో కూడా వర్మ అదే చెప్పాడు. పోలీసు పాత్ర లక్ష్యం వీరప్పన్ ని చంపడం. దానికోసం ఏమైనా చేయాలని నిర్ణయించుకున్నవాడు. తనకు సాయం చేసినవారిని చంపడానికి, చివరకు తనను తాను చంపుకోవడానికి కూడా వెనుకాడడు. వీరప్పన్ కూడా తనను తాను కాపాడుకోవడానికి ఏమైనా చేసేయగల వ్యక్తి. మామూలు సినిమాల్లో కథానాయకుడు ప్రతినాయాకుడిని ఎలా ఓడిస్తాడా అని ఎదురుచూస్తాం, ఎలాగైనా ఓడించాలని కోరుకుంటాం. కానీ ఈ సినిమాలో పోలీసు అధికారి వీరప్పన్ ని పట్టుకోవడానికి ఎలాంటి వ్యూహం పన్నుతాడా, దాన్ని చేధించి వీరప్పన్ ఎలా తప్పించుకుంటాడా అని ఎదురుచూస్తాం. ఎందుకో తెలుసా? ఇది “వర్మ” సినిమా గురు!!
వర్మ చేసిన ఇంకో మంచిపని తను చెప్పాలనుకున్న విషయాలను దాదాపుగా దృశ్యరూపంలో చెప్పడం. అందుకోసం, శివ రాజ్ కుమార్, సందీప్ భరద్వాజ్ అతడికి బాగా సాయపడ్డారు. వీరప్పన్ తెలివైనవాడని అందరూ అనుకుంటారు. కానీ తన పరిశోధనలో అతడు ఓ చిన్నపిల్లాడి మనస్తత్వం కలిగినవాడని, మనసుకు ఏమనిపిస్తే అది చేసుకుంటూ వెళ్ళిపోయేవాడని ఓ ముఖాముఖిలో చెప్పాడు వర్మ. ఆ విషయాన్ని దృశ్యరూపంలో కొన్ని సన్నివేశాల్లోనూ చెప్పాడు. ఉదాహరణకు, మొదటిసారి “ఏ.కే.47” (A.K.47) తుపాకిని చూసినప్పుడు, తను ఎంతో ఇష్టంగా పెంచుకున్న మీసాలను కత్తిరించాల్సి వచ్చినప్పుడు వీరప్పన్ భావోద్వేగాలను వర్మ చూపించిన తీరు నాకు ఎంతగానో నచ్చింది. ఓ రెండు షాట్స్ వర్మ శైలిని మరోసారి తెలిపాయి. మారువేషంలో వెళ్ళిన పోలీసు ఓ మట్టికుప్పపై నిలబడి ఉన్న వీరప్పన్ ని చూసే షాట్ మరియు పోలీసు గూఢచారి శ్రేయ (పరుల్ యాదవ్) కళ్ళముందు వీరప్పన్ పరిగెత్తే షాట్. ఈ రెండు వర్మను అభినందించేలా చేశాయి.
ఈ సినిమాలో పోలీసు వేసే ప్రతి వ్యూహం నుండి వీరప్పన్ తప్పించుకుపోతుంటే, ఎలాగైనా అతడిని పట్టుకోవాలని అతడు పన్నే మరో వ్యూహం చూస్తే, “వీరప్పన్ ని పట్టుకోవడం ఇంత కష్టమా?” అని అనిపించింది. అలాగే “రాక్షసుడిని చంపాలంటే రాక్షసుడిగా మారక తప్పదు!” అని పోలీసు అన్నప్పుడు “నిజమే కదా!” అని కూడా అనిపించింది. అంటే, మంచి, చెడు అనేవి మనుషుల్లో కాదు, మారే పరిస్థితుల్లో ఉంటాయన్న విషయాన్ని వర్మ ఈ సినిమాతో మరోసారి బల్లగుద్ది చెప్పాడనిపించింది. భావోద్వేగాలను చూపించడానికి ఈ సినిమా కథనం నెమ్మదిగా నడిచినా ఫరవాలేదనిపించింది.
విమర్శలు…
ఇవి ఏ సినిమాకు కొత్త కాదు. వర్మ సినిమాకు అసలే కాదు. అతడు పట్టించుకోడు కూడా. వర్మ తన సినిమాల్లో కెమెరా వాడే విధానం మాత్రం మారలేదు. తెరపైనున్న నటుల ముఖాలు కూడా సరిగ్గా కనిపించకుండా చేసిన ఛాయాగ్రహణం బాగా ఇబ్బందిపెట్టింది. వీరప్పన్ పరిచయపు సన్నివేశం మరియు విరామం ముందొచ్చే సన్నివేశంలోని కెమెరా పనితనం ఏదో టీవీ న్యూస్ చూస్తున్న భావనను కలిగించింది. ఇలాంటి సినిమాలు బాహ్యమైన కథనంతోనే ఉంటాయి, వాటిలో దర్శకుడు కూడా ఓ ప్రేక్షకుడిగా కథను చెప్పాలి కనుక ఇలా పెట్టాడని అనుకుందాం. అయినప్పటికీ, సినిమా సినిమాలాగే ఉండాలి. దీనికి తోడుగా, సన్నివేశానికి అవసరం ఉన్నా, లేకపోయినా ఏమాత్రం వినసొంపుగా లేని, ఒక తీరుతెన్ను ఎరుగని నేపథ్య సంగీతం కూడా బాగా ఇబ్బందిపెట్టింది. ఈ రెండు విషయాల్లో వర్మ జాగ్రత్త వహించి ఉంటే ఈ సినిమా మరింత బాగుండేది. వ్యవసాయ క్షేత్రానికి (farm house) రాడనుకున్న వీరప్పన్ అక్కడికి వచ్చే సన్నివేశాన్ని కొంచెం నాటకీయంగా చూపించి ఉంటే బాగుండేదేమో అనిపించింది.
నటనలు…
“Killing వీరప్పన్” అనే ఈ సినిమా పూర్తిగా శివ రాజ్ కుమార్ పాత్ర కోణంలోంచే సాగుతుంది. పోలీసు పాత్రలో ఆయన జీవించారని చెప్పాలి. ఉదాహరణకు, “గాంధీ” పాత్రను విచారించే సన్నివేశం. ఇక వీరప్పన్ పాత్రను పోషించిన సందీప్ భరద్వాజ్ ఓ అద్భుత సృష్టి. అతడి ఆహార్యం, హావభావాలు బలమైన ముద్రను వేశాయి. ముత్తులక్ష్మిగా యజ్ఞ శెట్టి బాగా సరిపోయింది. గూఢచారి శ్రేయ పాత్రలో పరుల్ యాదవ్ కూడా బాగా నటించింది.
ముగింపు…
ఈ సినిమా వర్మ తీసిన గొప్ప సినిమాల్లో ఒకటి అని చెప్పలేము కానీ రక్తచరిత్ర 1, 26/11 ముంబై దాడులు తరువాత వర్మ తీసిన ఓ మంచి డాక్యుడ్రామా అని చెప్పొచ్చు. వీరప్పన్ జీవితం కోసం, అతడిని పట్టుకోవడానికి ప్రయత్నించిన పోలీసు అధికారి కోసం, చివరగా రామ్ గోపాల్ వర్మ కోసం ఈ సినిమాను చూడాలి. మెచ్చుకోదగ్గ మరో విషయమేమిటంటే, సినిమా ప్రేక్షకుడిని దాని లోకంలోకి తీసుకొనివెళ్ళే ప్రయత్నం బాగా చేసింది.
మరిన్ని ప్రత్యేకతలు :
- పాత్రల చిత్రణ (characterizations). కంటిపై కాఫీ కప్పు పెట్టుకునే పోలీసు పాత్ర ప్రేక్షకులకు కొన్నాళ్ళపాటు గుర్తుండిపోతుంది అనడంలో సందేహం లేదు. అలాగే కుమార్ పాత్ర చిత్రణ కూడా నాకు నచ్చింది.
- విక్రమ్ గైక్వాడ్ మేకప్ (make-up). సందీప్ భరద్వాజ్ ని వీరప్పన్ గా చూపించడంలో ఇతడి కష్టం గుర్తించదగినది.
- నిర్మాణ విలువలు (production values). నిర్మాతలు మంజునాథ, సుధింద్ర, శివప్రకాష్ ఈ సినిమాను కథకు సరిపోయే దట్టమైన అడవుల్లో తీయడానికి బాగా శ్రమించారని అర్థమైంది.
బలహీనతలు :
- శాండీ నేపథ్య సంగీతం. అవసరం లేకున్నా కూడా వినిపించాడు. అయినా సరే, “టక్కం టిక్కం టక్కం టిక్కం…” అనే సంగీతం నన్ను ఇంకా వెంటాడుతూనే ఉంది.
- రామ్మి ఛాయాగ్రహణం. రెండో సగంలో ఇది బాగుంది. అలాగే మొదటి సగంలో కూడా చేసుంటే బాగుండేది.
ఈ చిత్రం నేర్పిన పాఠం :
కొన్ని కథల్లోని పాత్రల చిత్రణలో వర్మ పద్ధతిని అనుసరించడం మంచిది.
– యశ్వంత్ ఆలూరు
Click here for English version of this review…