కథ, కథనం, స్టార్, పాటలు, ఫైట్లు ఇవన్నీ ప్రతి సినిమాకు కామన్. కానీ వీటిలో “సుకుమార్” సినిమాను ప్రత్యేకంగా నిలిపే అంశం “కథనం”. మామూలు కథను కూడా సరికొత్త కథనంతో, పాత్రలతో చెప్పగల సత్తా ఉన్న దర్శకుడు సుకుమార్. వ్యాపారం, అభిమానం అనే చట్రాలలో ఇరుక్కుపోయిన కథానాయకుడు “ఎన్టీఆర్”. అతడిని దాన్నుండి పూర్తిగా బయటకు లాగి సుకుమార్ తీసిన సినిమా “నాన్నకు ప్రేమతో”. రకుల్ ప్రీత్ సింగ్ కథానాయికగా, జగపతిబాబు ప్రతినాయకుడిగా, భోగవల్లి ప్రసాద్ నిర్మాతగా, దేవీశ్రీప్రసాద్ సంగీత దర్శకుడిగా రూపొందించబడిన ఈ సినిమా ఈ నెల 13న విడుదలయి సంక్రాంతి పండగను ముందే మొదలుపెట్టింది.
కథ :
జీవితపు చివరి క్షణాల్లో ఉన్న తన తండ్రి సుబ్రమణ్యం (రాజేంద్రప్రసాద్) కోరుకున్న కృష్ణమూర్తి (జగపతిబాబు) పతనాన్ని సాధించాలనుకుంటాడు అభిరామ్ (ఎన్టీఆర్). దాన్ని ఎలా సాధించాడు అనేది ఈ సినిమా కథాంశం.
కథనం :
కేవలం మూలకథ గురించి మాట్లాడితే ఇది సర్వసాధారణమైన సినిమా అయిపోతుంది. కానీ దీన్ని నడిపించేది సుకుమార్ కథనం కాబట్టి ఇందులో అసాధారణ విషయాలు చాలా ఉంటాయి. అందులో ఆమోదించేవి, తిరస్కరించేవి ఉండకమానావు. అవేంటో చూద్దాం…!
ప్రేమించే విషయాలు…
సృజనాత్మకత…! సుకుమార్ సినిమాల్లో అతడి సృజనాత్మకతను పరిచయం చేసే మొట్టమొదటి అంశం “పేర్లు”. తన ప్రతి సినిమాకు వినూత్నంగా పేర్లు వేసి, సినిమాను చూడాలనే ఆసక్తిని ప్రేక్షకులకు కలిగిస్తాడు. అందులో ఉన్న మరో ప్రత్యేకత ఏంటంటే అది కథకు సంబధించినదే అయ్యుంటుంది. ఉదాహరణకు, “ఆర్య2″లో డైరీ, “100% లవ్”లో పరీక్ష పత్రం. ఈసారి సినిమా కథనం జరగబోయే ప్రదేశాలను బొమ్మలుగా చూపించి వేసిన పేర్లు విధానం ఆకట్టుకుంది. తన ప్రతి సినిమాలో ఒక పదాన్ని బాగా వాడి జీవితంలో దాని ప్రత్యేకతను తెలుపుతాడు. ఇందులో “ఎమోషన్” (emotion) అనే పదాన్ని వాడి, దానివల్ల మనిషి ప్రవర్తన ఎలా మారుతుందో చక్కగా చూపించాడు. అభిరామ్ పాత్రను కూడా ఆ పదంతోనే పరిచయం చేసి దానిమీదే నెలకొల్పాడు. అలాగే, సీతాకోకచిలుక రెక్కల ఆడింపు (Butterfly Effect) వెనుక ఉన్న విషయాన్ని ఈ సినిమా కోసం బాగా వాడుకున్నాడు సుకుమార్.
పాత్రలు…! ఎన్టీఆర్ లాంటి మాస్ కథానాయకుడిని ఓ “షెర్లాక్ హోమ్స్” (Sherlock Holmes) లాంటి పాత్రలో చూపించడం సుకుమార్ కే చెల్లింది. అభిరామ్ దివ్యాంక (రకుల్) మధ్యున్న సన్నివేశాలన్నీ “షెర్లాక్ హోమ్స్” కథల నుండి ప్రేరణ పొందినవే. కానీ వాటిని ఒప్పించేలా తీశాడు సుకుమార్. ఉదాహరణే, కిడ్నాప్ అయిన దివ్యను అభిరామ్ కాపాడే సన్నివేశం. మాములుగా, మన సినిమాల్లో కథానాయకుడి మీదున్న గౌరవం ప్రతినాయకుడి మీద ఉండదు. కానీ, కథానాయకుడి చేత ప్రతినాయకుడిని గౌరవిస్తూ, ఆ గౌరవాన్ని ప్రేక్షకుడికి కూడా కలిగించడం ఈ సినిమాలో నాకు అమితంగా నచ్చింది. ప్రతినాయకుడిలో కూడా ఓ నాయకుడు ఉన్నాడన్న విషయాన్ని గుర్తించని ఇప్పటి కమర్షియల్ సినిమాలకు అతీతంగా నాయకుడిని, ప్రతినాయకుడిని సముజ్జీలను చేశాడు. జగపతిబాబు లాంటి నటుడికి ఇది ఒక గౌరవం కూడా. దీనికి పలు ఉదాహరణలున్నాయి. సినిమా చూడనివారి కోసం అవి ఇక్కడ చెప్పదలచుకోలేదు. మరో విషయం ఏమిటంటే, సుకుమార్ తన కథానాయకులను చెడ్డవారిగా చూపిస్తాడనే నింద ఉంది. కానీ అందులో ఒక నిజాయితీ ఉందని మాత్రం అతి తక్కువమంది గుర్తిస్తారు. ఈసారి ఆ పోకడకు విరుద్ధంగా ఈ సినిమాలో అభిరామ్ పాత్రను మొదటినుండి చివరివరకు మంచివాడుగానే చూపించాడు.
ఎమోషన్…! నిజజీవితంలో చేయలేని కొన్ని పనులు సినిమాలో చూసుకుంటే ఆత్మారాముడు ఆనందపడతాడు. అందులో ఒకటి తల్లిదండ్రులపై ప్రేమ. ఈ విషయమై పిల్లలు ఎలా ఉంటారో ఎన్టీఆర్, రాజీవ్ పాత్రల ద్వారా చెప్పాడు సుకుమార్. ఇక అవసరాల శ్రీనివాస్… “ఇది గుర్తుపెట్టుకోండి! తరువాత మాట్లాడుకుందాం!“. అలా, సమాజం ఎలా ఉందో, ఎలా ఉండాలో తెలిపే పాత్రలు ఈ సినిమాలో ఉన్నాయి. ముఖ్యంగా చెప్పుకోవాల్సిన ఘట్టాలు రెండో సగంలో కొన్ని ఉన్నాయి. తన తండ్రి విలువ తను తండ్రి అయ్యేవరకు తెలుసుకోలేని రాజీవ్, తండ్రి ఒక్కక్షణం తను చెప్పేది వింటే చాలని ఆరాటపడే ఎన్టీఆర్. దానితో ఈ సినిమా పతాక ఘట్టం పతాక స్థాయికి చేరింది. దీనికి మరింత ఊతమిచ్చింది చివర్లో “నాన్నకు ప్రేమతో…” అని దేవిశ్రీప్రసాద్ తన తండ్రికి నివాళిగా వ్రాసిన పాట. అందులోని సాహిత్యం గుండెను హత్తుకుంది.
ప్రేమించలేని విషయాలు…
మంచైనా, చెడైనా అంచులు చూడాలనేది సుకుమార్ సిద్ధాంతమని ఈమధ్యే ఎన్టీఆర్ ఓ ముఖాముఖిలో అన్నాడు. మోతాదు మించితే ఏదైనా హానికరమే. “ఆర్య” నుండి సుకుమార్ లో ఈ ఆలోచన మారలేదనిపించింది. అందులో “ఫీల్ మై లవ్”, “కుమారి 21F”లో “మెచ్యురిటీ”లా ఈ సినిమాలో కూడా “ఎమోషన్” పేరు చెప్పి కొన్నిచోట్ల ఇబ్బందిపెట్టాడు. ఉదాహరణకు, రెండో సగంలో దివ్యాంక “ఎమోషన్”ని ప్రశ్నించే సన్నివేశం. అలాగే LEAD పేరుతో చూపించిన ఘట్టం బోరు కొట్టించింది. “లవ్ దెబ్బ” పాట కథనానికి అడ్డువచ్చినా, అందులోని కోరియోగ్రఫీ బాగుంది.
నేను ఈ సినిమాలో కోరుకొని చూడలేకపోయిన మరో అంశం ఉంది. సుబ్రమణ్యంని కృష్ణమూర్తి మోసం చేశాడని తెలుసు కానీ ఎలా మోసం చేశాడో నాన్న డైరీ చదివిన అభిరామ్ కోణంలో కొన్ని షాట్స్ చూపించి ఉంటే తీవ్రత పెరిగి బాగుండేదేమో అనిపించింది. (ఇది ఓ ఆలోచన మాత్రమే). అలాగే, ఈ సినిమా స్క్రీన్ప్లే మీద నాకున్న అనుమానాలను మరికొన్ని రోజుల తరువాత దీనిపై వ్రాయబోయే మరో విశ్లేషణలో పేర్కొంటాను.
నాన్నకు ప్రేమతో…
మొత్తానికి, “నాన్నకు ప్రేమతో” అనే ఈ సినిమాలో ప్రేమను, పగను, తెలివిని, అన్నీ మేళవించి చూపించాడు సుకుమార్. షెర్లాక్ హోమ్స్ కథలను ఎక్కువగా ఇష్టపడే ప్రేక్షకులకు ఇది యిట్టె నచ్చుతుందన్న నమ్మకం బలంగా ఉంది. మిగతావారు మాత్రం కొన్ని విషయాలను అర్థం చేసుకోవడానికి కాస్త బుర్రకు పదును పెట్టాల్సిన అవసరం ఉంది. ఏదేమైనా, సంక్రాంతికి మంచి నాంది పలికిన సినిమా ఇది…!
నటనలు :
ఎన్టీఆర్ ఈ సినిమాతో మళ్ళీ తెలుగుతెరకు కొత్తగా పరిచయమయ్యాడు. ఇదివరాకు చూసిన ఎన్టీఆర్ కు ఏమాత్రం పోలిక లేకుండా పూర్తి 180 కోణంలో తిరిగి నటించాడు ఈ సినిమాలో. తెలివిగా, నెమ్మదిగా మాట్లాడుతూ, స్టైలిష్ గా కనిపించాడు. తప్పకుండా తన ఈ 25వ సినిమా తన ప్రయాణంలో ఓ మైలురాయని చెప్పొచ్చు. రకుల్ కి మొదటినుండి కాకపోయినా, సినిమా మధ్యలో నటించే అవకాశం లభించింది. జగపతిబాబు ఈ సినిమాకు మరో ఆకర్షణ. నాయకుడి నుండి ప్రతినాయకుడిగా మారిన తన ప్రయాణంలో ఇది ఓ గౌరవప్రదమైన ప్రతినాయక పాత్ర అని చెప్పొచ్చు. రాజేంద్రప్రసాద్ తండ్రిగా బాగా సరిపోయినా, ఆయన పాత్ర పరిధిని మరికొంత పెంచి ఉంటే బాగుండేదేమో. రాజీవ్ కనకాల తనకిచ్చిన పాత్రాను బాగా పోషించాడు. ఇందాక గుర్తుపెట్టుకోమన్నట్టుగా అవసరాల శ్రీనివాస్! ఈ పాత్ర సినిమాకు అసలు అవసరం లేదు. అస్తమానం తన ముందు జరిగే సన్నివేశాలను రికార్డు చేసే ఇతడి వల్ల ఏదైనా ఉపయోగం ఉందనుకొంటే అది పొరపాటు. మధుబాల, రమేష్, నవీన్ ఇలా అందరు ఫరవాలేదు.
మరిన్ని ప్రత్యేకతలు :
- ఛాయాగ్రహణం (cinematography). అసలు ఛాయాగ్రాహకుడు విజయ్ చక్రవర్తి మరియు కొసరు ఛాయాగ్రాహకుడు అమోల్ రాథోడ్ ఈ సినిమాలోని ప్రతి దృశ్యాన్ని కళ్ళకు ఇంపుగా తెరకెక్కించారు. సుకుమార్ తరువాత ఈ సినిమాకు అభినందించాల్సిన వ్యక్తులు వీరే.
- దేవిశ్రీప్రసాద్ సంగీతం (music). పాటలే కాదు నేపథ్య సంగీతంలో కూడా దేవి ఆరితేరిపోయాడు. అభిరామ్ కృష్ణమూర్తిని మొదటిసారి కలవడానికి వెళ్ళే సమయంలో వచ్చే వయోలిన్ నేపథ్య సంగీతం హాలీవుడ్ రీతిలో చాలా బాగుంది.
- పీటర్ హెయిన్ పోరాటాలు (action sequences). సాధారణంగా, ఎన్టీఆర్ సినిమాల్లో పోరాటాలు నమ్మశక్యం కావు. కానీ ఈ సినిమాలో రక్తం చిందకుండా, పాత్రకు తగ్గట్టుగా నమ్మగలిగిన పోరాటాలున్నాయి. ఎన్టీఆర్ సినిమాకు సంబంధించి ఇది ఓ అరుదైన విషయం.
- నిర్మాణ విలువలు (production values). నిర్మాత భోగవల్లి ప్రసాద్ నిర్మాణ విలువలు ఈ సినిమాని హాలీవుడ్ స్థాయిలో తెరకెక్కించడానికి బాగా ఉపయోగపడ్డాయి.
బలహీనతలు :
- మోతాదు మించిన తర్కాలు. “ఎమోషన్” అనే పదాన్ని వాడి పలుచోట్ల ఇబ్బందిపెట్టాడు సుకుమార్.
- రెండో సగంలో నెమ్మదిగా నడిచిన కథనం. ఇదే ఈ సినిమాను 168 నిమిషాల సినిమాను చేసింది.
ఈ చిత్రం నేర్పిన పాఠం :
ఎప్పుడూ రచయిత, దర్శకుడే కాకుండా ప్రేక్షకుడికి కూడా సినిమా కోసం బుర్ర వాడే అవకాశం కల్పించాలి. కానీ అన్నీ హద్దులలోనే ఉండాలి.
– యశ్వంత్ ఆలూరు
Click here for English version of this Review…
Pingback: Nannaku Prematho (2016) – Film Criticism