ప్రకృతిలో పర్వతాలు, నదులు, సముద్రాలు మారనట్టే చిత్రపరిశ్రమలో కొందరి సినిమాలు మారవు. వాటిలో ముందుండేవి నందమూరి బాలకృష్ణ గారి సినిమాలు. వంద మైలురాయిని చేరుకునే ఆయన ప్రయాణంలో తన 99వ సినిమాగా వచ్చింది “డిక్టేటర్”. లక్ష్యం, లౌక్యం లాంటి సినిమాలతో మనకు పరిచయమైన “శ్రీవాస్” ఈ సినిమాకు దర్శకుడు. ఆయనే నిర్మాతగా మారి ఎరోస్ సంస్థతో కలిసి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 14న విడుదలయింది. అంజలి, సోనాల్ చౌహాన్ కథానాయికలు.
కథ :
చంద్రశేఖర్ (బాలకృష్ణ) ఓ సూపర్ మార్కెట్ లో పనిచేస్తుంటాడు. ఓసారి ఆపదలో ఉన్న ఇందు (సోనాల్ చౌహాన్)ని కాపాడతాడు. అది ఎలాంటి పరిణామాలకు దారితీసింది? తన భార్య కాత్యాయని (అంజలి)లా మాట్లాడుతూ శృతి (అక్ష) తన కుటుంబసభ్యులను ఎందుకు మాయ చేయాల్సివస్తుంది? అసలు డిక్టేటర్ ఎవరు? అనేవి ఈ సినిమా కథాంశాలు.
కథనం :
మొదటగా, ఇలాంటి కథలు చేయడం బాలకృష్ణకు కొత్త కాదు, వ్రాయడం కోన – గోపిలకు కొత్త కాదు, చూడడం తెలుగు ప్రేక్షకులకు కొత్త కాదు. 99 సినిమాలు చేసిన ఓ నటుడి నటజీవితంలో పలు సినిమాలు ఒకే కథ, కథనాలతో ఉన్నాయంటే అది కూడా ఓ అరుదైన విషయంగా చెప్పొచ్చు.
మంచి విషయాలు…
ఈ సినిమాలో కొన్ని ఘట్టాలు గుర్తుపెట్టుకునేంత బాగోకపోయినా, ఈ సినిమా వరకు మాత్రం బాగున్నాయి. ఉదాహరణకు, ఇందుని కాపాడే క్రమంలో వచ్చే పోరాట సన్నివేశం. ఏ సమస్యనైనా వేర్ల నుండి తొలగించే కథానాయకుడి తత్వాన్ని బాగా నెలకొల్పింది ఆ ఘట్టం. అలాగే విరామం ముందొచ్చే డిక్టేటర్ పరిచయ ఘట్టం కూడా బాగుంది. రెండో సగంలో మహిమ రాయ్ (రతి అగ్నిహోత్రి)తో ఉన్న మరో సన్నివేశం కూడా బాగుంది. దీనికి కారణం బాలకృష్ణే అని చెప్పొచ్చు. సన్నివేశం కొత్తది కాకపోయినా, ఆయన హఠాత్తుగా ముఖకవళికలు మార్చడం, నేపథ్య సంగీతం వల్ల అది బాగా పండింది.
మిగతా విషయాలు…
సినిమా సమాజానికి ఎదో ఒకటి చెప్పాలి అనే సిద్ధాంతంతో నేను అక్షరాల ఏకీభవిస్తాను. ఒక సినిమా ఒక సందేశాన్నే చెప్తే బాగుంటుంది. కానీ బాలకృష్ణ తన ప్రతి సినిమాలో బోలెడు సందేశాలు ఇవ్వాలని ఎందుకు తపిస్తారో అర్థంకాదు. ఒకే క్లాసులో పలు పాఠ్యపుస్తకాలు చదివిన భావన కలుగుతుంది. అలాగని ఆయన చేసే పాత్రలు ఎప్పుడూ ఎవరికీ అణిగిమణిగి ఉండవు. కనీసం ఓ సామాన్యుడు తనను తాను చూసుకునే మధ్యతరగతి పాత్రను కూడా పోషించరు. సినిమాలో బోలెడుమంది ప్రతినాయకులు ఉన్నప్పటికీ, వాళ్ళు సవాళ్లు విసరడానికే, చెవులు అదిరేలా అరవదానికే తప్ప ఒక్కసారి కూడా కథానాయకుడిపై తమ ఆధిక్యతను చూపించలేరు.
ఇక కథనం పోకడ “సమరసింహారెడ్డి” సినిమా నుండి మారలేదు. కేవలం సినిమా జరిగే ప్రదేశాలు, బాలకృష్ణ వేసుకునే దుస్తులు, ఆయన ఆహార్యం మారుతోందే తప్ప కథ, కథనాలు కాదు. భారతదేశంలోనే అత్యధిక ఆదాయ పన్ను కట్టే చంద్రశేఖర్ ధర్మ మారువేషంలో లేకపోయినా సరే ఎవరూ గుర్తుపట్టలేరు. కానీ ఆయన సోదరుడు సుమన్ ని మాత్రం అందరూ గుర్తుపడతారు. ఏదో కథానాయకుడి పాత్రను పెంచడానికి, ధియేటర్లో అభిమానుల ఈలాలు రాబట్టడానికి ఇలాంటి మాటలు వ్రాసే దర్శకరచయితలు దాని వెనుక ఉన్న చిన్న తర్కాలను ఎలా మర్చిపోతారో అసలు అర్థంకాదు.
సినిమా అంతా ప్రేక్షకుడి ఊహకు అందుతూనే సాగుతున్నా, రెండో సగాన్ని అనవసరంగా పొడిగించాడు దర్శకుడు. దానికి తోడు ఎం.రత్నం, సీపాన, కోనలాంటి రచయితలు వ్రాసిన మాటలు ప్రాసలతో ప్రాణం తీశాయి తప్ప సినిమాకు ఏమాత్రం ఉపయోగపడలేదు. కామెడీ పేరుతో ప్రేక్షకుడి చేత రక్తకన్నీరు పెట్టించడంలో కోన – గోపిల కథనం ఆరితేరిపోయింది. ఇక పోరాటాలు ఒకట్రెండు బాగున్నా అవి చాలా నిడివి కలిగినవి. దానికి తోడు తమన్ కొట్టిన డప్పులు ఉండనే ఉన్నాయి.
ముగింపు…
అలా, డిక్టేటర్ నిజంగానే ఓ నియంతలా తాను చెప్పాలనుకున్నదే చెప్పాడు కానీ ప్రేక్షకుడి మనోభావాలను ఏమాత్రం పట్టించుకోలేదు.
నటనలు :
బాలకృష్ణకు ఇలాంటి పాత్ర కొట్టినపిండి లాంటిది. అందులో ఆయన నటన గురించి మాట్లాడుకోవడం అనవసరం. కానీ ఆయన తెరపై కనబడిన విధానం, ఆయన డైలాగు చెప్పిన విధానం చూస్తే, ఇలాంటి సినిమాలు, పాత్రలు ఇక మానేసి తన వయసుకు తగ్గ సినిమాలు చేస్తే మంచిదనిపించింది. అంజలి నటించినట్టు అనిపిస్తుంది కానీ ఓసారి కళ్ళు నులుముకొని చూస్తే అదేమీ లేదని అర్థమవుతుంది. సోనాల్ చౌహాన్ “వాట్సప్ బేబీ” పాటలో చేసిన అందాల ఆరబోత తప్ప ఆమె వల్ల ఎలాంటి ఉపయోగం లేదు. ఇక సుమన్, రతి అగ్నిహోత్రి, పోసాని కేవలం బాలకృష్ణ పాత్ర గొప్పతనాన్ని మనకు తెలియజెప్పడానికే తప్ప నటనలో వారి గొప్పతనం చూపించుకునే అవకాశం దక్కించుకోలేకపోయారు. నాజర్, సాయాజీ షిండే, రఘుబాబు, చలపతిరావు, కబీర్ దుహాన్, అక్ష, వెన్నెల కిషోర్, ఇలా అందరూ వ్యర్థ పదార్థాలే అని చెప్పాలి. పృథ్వీ, షకలక శంకర్, ప్రభాస్ శ్రీను, హేమ తదితరులు ప్రేక్షకులను నవ్విస్తున్నాం అనే భ్రమలో ఏడిపించారు.
ప్రత్యేకతలు :
- శ్యామ్.కె.నాయుడు ఛాయాగ్రహణం (cinematography). ఈ సినిమాలో అమితంగా మెచ్చుకోదగ్గ అంశం ఏదైనా ఉంటే అది ఇదే. సినిమా అంతా మంచి లైటింగ్ వాడి తీశారు శ్యామ్.
- చిన్నా నేపథ్య సంగీతం (background score). అక్కడక్కడ బాగుంది.
- నిర్మాణ విలువలు (production values). నిర్మాతలు ఎరోస్ మరియు శ్రీవాస్ ఈ సినిమాపై పెట్టుకున్న నమ్మకం ఓ సాహసం.
బలహీనతలు :
- రచన. కోన వెంకట్, గోపీమోహన్, శ్రీధర్ సీపాన, ఎం.రత్నం ఈ సినిమాకు కలిసి పనిచేసినా అదే కథ, కథనాలను అందించారు.
- తమన్ సంగీతం. యాభై సినిమాలు పూర్తి చేసుకున్నా, ఏ నటుడికి ఎలాంటి గాత్రం నప్పుతుందో తెలుసుకోలేని సంగీత దర్శకుడు తమన్. ఉదాహరణకు, బాలకృష్ణకు “దివ్య కుమార్” గాత్రం సరిపోతుందని, అది కూడా “గణేశ” లాంటి తెలుగు సాహిత్యాన్ని అతడి గొంతులో వినిపించాలని తమన్ కు ఎలా అనిపించిందో మరి!
- కథనం. సినిమా నిడివి 155 నిమిషాలు. కానీ మూస కథనం వల్ల ఓ నాలుగు గంటల సినిమా చూస్తున్న భావన కలిగింది.
- నటనలు. బాలకృష్ణతో సహా అనుభవజ్ఞులైన నటులు ఎంతోమంది ఉన్నా, ఒక్కరి నటన కూడా చెప్పుకోదగినది కాదు.
ఈ చిత్రం నేర్పిన పాఠం :
వీలైతే మారాలి, లేదా మానేయాలి. అంతేకానీ, మనం ఏది చేసినా ఆదరిస్తారనే అపోహలో ప్రేక్షకుల ఉసురు మాత్రం పోసుకోకూడదు.
– యశ్వంత్ ఆలూరు
Click here for English version of this Review…