సినిమాకు పండగలు ఎంతో కీలకం. ముఖ్యంగా సంక్రాంతి పండుగ మన కథానాయకులకు ఆయువుపట్టు. ఇలాంటి పండుగలతో సంబంధం లేని కథానాయకులు కూడా ఉంటారు. ఉదాహరణకు శర్వానంద్ లాంటివారు. కానీ ఈసారి అగ్రనటుల సినిమాలతో పాటు శర్వానంద్ సినిమా కూడా సంక్రాంతి బరిలో దిగింది. అదే “ఎక్స్‌ప్రెస్ రాజా”. వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ తో పరిచయమైన “మేర్లపాక గాంధీ” ఈ సినిమాకు దర్శకుడు. సురభి కథానాయిక. యువీ క్రియేషన్స్ పతాకంపై వంశీ-ప్రమోద్ ఈ సినిమాను నిర్మించారు.
కథ :
నిరుద్యోగి అయిన రాజా (శర్వానంద్) వైజాగ్ నుండి హైదరాబాదు వస్తాడు. అక్కడ అమ్ము (సురభి)ని మొదటిసారి చూడగానే ప్రేమలో పడతాడు. కష్టపడి ఆమె మనసు గెలుచుకునే తరుణంలో ఓ చిన్న తప్పు చేసి ఆమె ప్రేమను కోల్పోతాడు. ఆ తప్పేంటి? దాన్ని అతడు ఎలా సరిదిద్దుకున్నాడు? దాని పరిణామాలను ఎలా ఎదురుకున్నాడు? తిరిగి అమూల్య ప్రేమను ఎలా పొందాడు? అనేవి కథాంశాలు.
కథనం :
నిజానికి ఇది లెక్కలు, పత్రాలు, పండగలు అవసరంలేని సినిమా. అయినా కూడా మూడు సినిమాలతో పోటి పడడానికి సిద్ధపడింది అంటే నిర్మాతలకు ఈ సినిమాపైనున్న నమ్మకానికి మెచ్చుకోవాలి.
మంచి విషయాలు…
ఇలాంటి కథల్లో సమస్య ఒకటే, దానికి సంబంధించిన పాత్రలు అనేకం ఉంటాయి. పాత్రలన్నింటినీ సమస్యకు తెలివిగా అనుసంధానం చేయడంలో దర్శకుడు గాంధీ విజయవంతమయ్యాడు. సమస్యకు సంబంధించిన పాత్రల చిత్రణలో కూడా చాలా స్వేచ్చను తీసుకున్నాడు. వాటితో పసందైన హాస్యాన్ని కూడా పండించాడు. రాజా తనకు కుక్కలు నచ్చకపోవడానికి చెప్పిన కారణం, అమ్ముని మళ్ళీ మళ్ళీ కలవడానికి రాజా నిఘంటువులో పేజీలు చింపే ఉపాయం, షకలక శంకర్ తన నాటక బృందంతో కలిసి ఆత్మహత్యకు పాల్పడే సన్నివేశం, ఇలా కొన్ని దర్శకుడి ఊహలు బాగున్నాయి. ధనరాజ్ పోషించిన “ఇనుము” పాత్ర ఖుషి సినిమాలోని ఎస్.జే.సూర్య పాత్రను గుర్తుచేసింది. కానీ దానికంటే ఇదే బాగా అలరించింది. అలాగే, చిరంజీవి నకిలిగా షకలక శంకర్ బాగా అలరించాడు.
మిగతా విషయాలు…
పైన చెప్పినట్టుగా, ఇలాంటి సినిమాల్లో పలు పాత్రలను సృష్టించడంలో దర్శకుడు తీసుకున్న స్వేచ్చ కొంచెం మితిమీరింది. ఉదాహరణే, ఊర్వశి పోషించిన పాత్ర. మతిమరుపు వచ్చే ఈ పాత్ర ఏదో ఒకసారి నవ్వించింది కానీ ప్రతిసారి దాన్ని అదే దారిలో తీసుకొని వెళ్లి, సరైన హాస్యం లేకపోవడం వల్ల అది బోరు కొట్టేసింది. అలాగే రెండో సగంలో కథనం కూడా బాగా నెమ్మదించింది. ఇక్కడ కత్తెరకు పని చెప్పి ఉంటే బాగుండేదేమో. నిడివి కాస్త అయినా తగ్గేది. చివర్లో ఉన్న మెలోడ్రామా కూడా ఆకట్టుకోలేదు.
ముగింపు…
అలా, ఎక్స్‌ప్రెస్ రాజా కొంచెం మొదటి సగంలో ఎక్స్‌ప్రెస్ రైలులా పరుగెత్తి తరువాత పాసెంజర్ రైలులా నెమ్మదించాడు.
నటనలు :
శర్వానంద్ ఇలాంటి పాత్రలు అవలీలగా పోషించగలడని “రన్ రాజా రన్” సినిమాతోనే నిరూపించాడు. ఈ సినిమాలో అతడి నటన గురించి మాట్లాడుకోవడం అనవసరం. సురభి తన పాత్రకు మొదట్లో ఫరవాలేదు అనిపించి తరువాత పెద్దగా ప్రభావం చూపలేదు. ప్రభాస్ శ్రీనుకి ఈ సినిమాలో పెద్ద పాత్రే దొరికింది. దాన్ని బాగా పోషించాడు. ఇక ఈమధ్య పెరడీలతో విసిగించిన సప్తగిరి, షకలక శంకర్ లు ఈ సినిమాలో బాగా నవ్వించారు. హరీష్ ఉత్తమన్, సుప్రీత్, ఊర్వశి గుర్తుపెట్టుకునే పాత్రలేమి చేయలేదు. పోసాని ఈసారి అరుపులు లేని పాత్రను పోషించాడు. ఇక “ఇనుము”గా ధనరాజ్ అప్పుడప్పుడు కనిపిస్తూ అలరించాడు.
మరిన్ని ప్రత్యేకతలు :
- కార్తీక్ ఘట్టమనేని ఛాయాగ్రహణం (cinematography). ఈ సినిమాకు ఇతడు వాడిన లైటింగ్ చాలా బాగుంది. ముఖ్యంగా, ఓ పార్కింగ్ ప్రదేశంలోని పోరాట సన్నివేశం మరియు మార్కెట్లో వచ్చే సన్నివేశాలు అన్నింటిలోనూ లైటింగ్ బాగుంది.
- నిర్మాణ విలువలు (production values). యువీ క్రియేషన్స్ సంస్థ మంచి నిర్మాణ విలువలకు పెట్టింది పేరు. ఈ సినిమాలో ఆ పేరును మళ్ళీ నిలబెట్టుకుంది.
బలహీనతలు :
- రెండో సగంలో నెమ్మదించిన కథనం.
- నిడివి. ఇలాంటి థ్రిల్లర్ తరహా సినిమాలకు 144 నిమిషాల నిడివి అనవసరం. కొన్ని సన్నివేశాలు, పాటలు కత్తిరించి రెండు గంటల సినిమాను చేసుంటే బాగుండేది.
– యశ్వంత్ ఆలూరు
Click here for English version of this Review…