కొందరు కేవలం కథను నమ్ముకొని సినిమా చేస్తారు. మరికొందరు కేవలం వ్యాపారాన్ని నమ్ముకొని సినిమా చేస్తారు. కానీ కథతో పాటు వ్యాపారాన్ని కూడా పక్కాగా చూసుకొని చేసే కథానాయకుడు అక్కినేని నాగార్జున. దీనికి ఆయన గతంలో చేసిన పలు సినిమాలే సాక్ష్యాలు. అలాగే కొత్త దర్శకులను పరిచయం చేయడంలోనూ ముందుండే ఏకైక “హీరో” నాగార్జున అని చెప్పొచ్చు. ఈసారి “కళ్యాణ్ కృష్ణ” అనే నూతన దర్శకుడిని పరిచయం చేస్తూ, తనే నిర్మాతగా నిర్మించిన సినిమా “సోగ్గాడే చిన్నినాయనా”. ఆయన ద్విపాత్రాభినయం చేసిన ఈ సినిమాలో రమ్యకృష్ణ, లావణ్య త్రిపాఠి కథానాయికలు. 2016 సంక్రాంతి బరిలో దిగిన చివరి సినిమా ఇది.
కథ :
అమెరికాలో నివసించే రాము (నాగార్జున), సీత (లావణ్య) విడాకులు తీసుకోవాలనే విషయాన్ని రాము తల్లి సత్య (రమ్యకృష్ణ)కు చెప్పడానికి తమ పల్లెకు వస్తారు. ఇంతలో చనిపోయిన రాము తండ్రి బంగార్రాజు (నాగార్జున) ఆత్మను భూలోకానికి పంపుతాడు యమధర్మరాజు (నాగబాబు). రాము, సీత విడాకులు ఎందుకు తీసుకోవాలనుకున్నారు? బంగార్రాజు ఆత్మ ఎందుకు భూలోకానికి వచ్చింది? అనేవి ఈ కథాంశాలు.
కథనం :
ఈ తరహా కథాంశంతో ఒకప్పుడు అక్కినేని నాగేశ్వరరావు గారి “శ్రీరామరక్ష” సినిమా వచ్చింది. కానీ దర్శకుడు కళ్యాణ్ ఆ ఛాయలు గుర్తుకురాకుండా దీన్ని తెరకెక్కించడం అభినందనీయం.
మంచి విషయాలు…
సంక్రాంతి ఆహ్లాదం ఎక్కువగా కనిపించేది గోదావరి జిల్లాలోనే. సంక్రాంతి బరిలోకి వచ్చిన ఈ సినిమా పల్లెటూరులో తీయబడి తెలుగు సినిమా మర్చిపోయిన పల్లె వాతావరణాన్ని మళ్ళీ కళ్ళముందు తీసుకొని వచ్చింది. ఆ పల్లెలో ఓ అందమైన జమీందారు బంగార్రాజు, అతడు ఆటపట్టించే పదహారణాల తెలుగు అందాలు, అందరూ మనవారే అనే భావన కలిగిన మనుషులు, ఇలా కంటికి, మనసుకి ఇంపుగా ఈ సినిమాను తెరకెక్కించాడు దర్శకుడు కళ్యాణ్. అందుకే ఈ విషయంలో అతడికి పూర్తి మార్కులు వేసేయాలి.
సినిమాలో నన్ను ఆకట్టుకున్న అంశాలు చాలా ఉన్నాయి. మచ్చుకు, “వస్తానే వస్తానే” అనే పాట “మనం”లోని “చిన్ని చిన్ని ఆశలు” పాట కలిగించిన చక్కని భావాన్ని మళ్ళీ కలిగించింది. అలాగే, “డిక్క డిక్క డుం డుం” అనే పాటలో నాగార్జున నృత్యం బాగా అలరించింది. సినిమాలో మెలోడ్రామా సరైన మోతాదులో ఉంది. రాము, సీతలను కలపడానికి బంగార్రాజు చేసిన పనులు కూడా నవ్వు తెప్పించాయి. మొదటి సగమంతా అలా ఆహ్లాదకరంగా సాగిపోయింది.
ఈ సినిమాలో మెచ్చుకోవాల్సిన ఇంకో విషయమేమిటంటే, కథలో బంగార్రాజుదే ముఖ్యమైన పాత్ర. కానీ ఆ పాత్ర ఆత్మలాగే తప్ప భౌతికంగా కనిపించే సన్నివేశాలు చాలా తక్కువ. అసలు ఓ సన్నివేశం పెట్టేవరకు బంగార్రాజు ఎలా చనిపోయాడన్న ఆలోచనే కలగకపోవడం దర్శకుడి ప్రతిభకు నిదర్శనంగా చెప్పొచ్చు. ఈ విషయం దగ్గరే ఈ సినిమా విజయం సాధించింది.
రెండో సగంలో “సోగ్గాడే”, “నీ నవ్వే” పాటలను కూడా బాగా తెరకెక్కించాడు దర్శకుడు.
మిగతా విషయాలు…
ఇది ఒక సోషియో ఫాంటసీ కథ కనుక ఇందులో మరికొన్ని విషయాలను క్షుణ్ణంగా వివరించి ఉంటే బాగుండేదేమో. ఉదాహరణకు, “పాము” గురించి, ఆ గుడి రహస్యం గురించి మరింత వివరణ అవసరమనిపించింది. అప్పటివరకు ఆలోచించని బంగార్రాజు మరణం గురించి దర్శకుడు ప్రస్తావించి, దాన్ని తేలికగా తెల్చేశాడని అనిపించింది. అలాగే, రెండో సగంలో కథనం కూడా బాగా నెమ్మదించింది. బ్రహ్మానందం హాస్యం కూడా నవ్వించలేదు. ఇక పతాక సన్నివేశం కూడా బాగా సాగదీసినట్టు అనిపించింది.
ముగింపు…
మొత్తానికి, ఈ సంక్రాంతి బరిలో, నాన్నకు ప్రేమతో తరువాత నాకు బాగా నచ్చిన సినిమా “సోగ్గాడే చిన్నినాయనా”.
నటనలు :
ఈ సినిమాకు ఆయువుపట్టు నాగార్జున. ఉత్తర దక్షిణ ధృవాల్లాంటి రెండు పాత్రలకు తేడా సమర్థవంతంగా చూపిస్తూ పోషించారు. అలాగే, బంగార్రాజుగా పంచకట్టులో చాలా అందంగా ఉన్నారు. వయసుతో సంబంధం లేకుండా “సోగ్గాడే చిన్నినాయనా” అనే ఈ పేరు ఆయనకు తప్ప మరొకరికి పెట్టలేరు అంటే అతిశయోక్తి కాదు. రమ్యకృష్ణ, లావణ్యలు తమ పాత్రలకు న్యాయం చేశారు. సంపత్, నాజర్ ఫరవాలేదు. వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ, చలపతిరావు కూడా ఫరవాలేదు. బ్రహ్మానందం కొంచెం నవ్వించి మరికొంచెం ఇబ్బందిపెట్టారు. అనుష్క, అనసూయ, హంసానందిని అతిథి పాత్రలను బాగా పోషించారు.
మరిన్ని ప్రత్యేకతలు :
- ఛాయాగ్రహణం (cinematography). వినోద్ మరియు సిద్ధార్థలు ఈ సినిమా కలిగించిన ఆహ్లాదానికి కారకులు. పల్లె వాతావరణాన్ని చాలా బాగా చూపించారు. ముఖ్యంగా, “వస్తానే వస్తానే” పాటలోని ఛాయాగ్రహణం నాకు బాగా నచ్చింది.
- అనూప్ సంగీతం (music). కథకు సరిపోయే సంగీతాన్ని అందించాడు అనూప్. “వస్తానే వస్తానే”, “నీ నవ్వే” పాటలు వినసొంపుగా ఉన్నాయి.
- నిర్మాణ విలువలు (production values). నిర్మాతగా నాగార్జున ఈ సినిమా కోసం సరిగ్గా ఖర్చుపెట్టారు. మంచి ప్రదేశాల్లో చిత్రీకరించారు.
బలహీనతలు :
- రెండో సగంలో నెమ్మదించిన కథనం.
- కొన్ని విషయాలకు సంబంధించి లేని వివరణ.
ఈ చిత్రం నిరూపించిన విషయం :
కొత్త ప్రతిభలను పరిశ్రమకు పరిచయం చేయడంలో నాగార్జున తరువాతే ఎవరైనా…!
– యశ్వంత్ ఆలూరు
Click here for English version of this Review…