
నాకు బాగా గుర్తు! 2009లో “మగధీర” సినిమా వచ్చిన రోజులవి. అందులో, కాలభైరవ వందమంది యోధులతో చేసిన పోరాటం చూసి అబ్బురపోయి ఓ స్నేహితునితో దాని గురించి ఉత్కంఠతో చర్చించే సమయంలో, ఆ స్నేహితుడు అన్నాడు “ఆ సన్నివేశం 300 అనే హాలీవుడ్ సినిమా నుండి కాపీ కొట్టాడు రాజమౌళి!” అని. అంతే, అప్పటివరకున్న ఉత్సాహం నీరుగారిపోయింది. 1000 మంది ఒక థియేటర్లో ఓ సినిమా చూస్తుంటే అందులో 999 మంది సినిమాను ఆస్వాదిస్తుంటే, ఎక్కడో ఓ మూల కూర్చున్న ఓ వ్యక్తి ఇది ఫలానా సినిమా నుండి “కాపీ” కొట్టి తీశాడు అని విమర్శలు గుప్పిస్తాడు. అలాంటి సో కాల్డ్ విమర్శకుడు ధియేటరుకు ఒకడు చెప్పున ఆంధ్రదేశమంతా ఓ వెయ్యిమంది ఉన్నారు అనుకుందాం. వారివల్ల మగధీర సినిమాకు వచ్చిన నష్టమేమి లేదు. ఆ విషయం దాని ఫలితం నిరూపించింది.
సినిమా అనేది ఓ “సృష్టి” అనేది నానుడి అయితే, దానితో నేను ఏకీభవించను. నాకు సంబంధించినంత వరకు, సినిమా అనేది ఓ “ప్రేరణ”. ఆ “ప్రేరణ”కు ఓ “ఊహ” తోడైతే “సినిమా” సృష్టించబడుతుంది. ప్రేరణ లేని ఊహ నుండి ఎప్పుడూ సినిమా పుట్టలేదు. పుట్టినా, మనుగడ సాగించలేదు. మగధీరలోని యుద్ధానికి “300” ప్రేరణ అయితే, 300లోని యుద్ధానికి ఇంకేదో సినిమానో, లేదా పుస్తకమో ఖచ్చితంగా ప్రేరణ అయ్యుంటుంది. ఇంకా చెప్పాలంటే, అత్యుత్తమ భారతీయ సినిమాల్లో ఒకటిగా చెప్పుకునే “షోలే” (Sholay) కూడా జపనీస్ దర్శకుడు “అకీర కురసావా” తీసిన “సెవెన్ సమురాయి” (Seven Samurai) నుండి ప్రేరణ పొందినదే. సెవెన్ సమురాయికి అకీరకు కూడా ఏదో విషయం ప్రేరణ కలిగించి ఉండవచ్చు. “సింహాద్రి” లాంటి మాస్ కథ వ్రాయడానికి రచయిత “విజయేంద్రప్రసాద్” గారికి “వసంత కోకిల” లాంటి సున్నితమైన ప్రేమకథ “ప్రేరణ” కలిగించింది అంటే నమ్మగలరా? దీని బట్టి, “ప్రేరణ”, “ఊహ” ఒకే రకంగా కూడా ఉండవు అని కూడా అర్థం చేసుకోవాలి. “బాలచందర్” గారి సినిమాలు చాలా సహజంగా ఉంటాయని కితాబు ఇచ్చాం. దానికి అంతర్లీనంగా ఉన్న కారణం, బాలచందర్ గారు సమాజం నుండి “ప్రేరణ” పొందడం.
అంతర్జాలం అందరికీ అందుబాటులోకి వచ్చిన ఈ కాలంలో, సినిమా అనేది పూర్తిగా “సృష్టి” అయ్యుండాలనే భావనతో ఇప్పటి సమీక్షకులు అస్తమానం సినిమాను తమ సమీక్షల్లో ఏకిపారేస్తుంటే ఒక్కోసారి బాధేస్తుంది. ముఖ్యంగా, తెలుగు సమీక్షలలో ఈ పోకడ ఈ మధ్య ఎక్కువగా కనబడుతోంది. ఓ సినిమా వస్తే, దాన్ని మొదటి ఆటలో చూసేసి, ఆ సినిమాలో ఏదైనా సన్నివేశం ఇదివరకే చూసిన ఓ సినిమాలో ఉందనిపిస్తే చాలు, భూమికి ఆకర్షణ శక్తి ఉందని గుర్తించిన “న్యూటన్”లా ఫీల్ అయిపోయి ఆ తరువాత వ్రాసే సమీక్షలో సినిమాను ఏకటం మొదలుపెడుతున్నారు. సినిమాలో ఒరిజినాలిటీ లేదని, ఫలానా సినిమా నుండి “కాపీ” కొట్టేశారని, ఆ సినిమాను అగౌరవపరిచారని, ఇలా పలు విమర్శలు గుప్పించేస్తున్నారు. ఒకవేళ అది ఇంగ్లీష్ కాకుండా ఏ ఫ్రెంచి, ఇరానీ లాంటి పాశ్చాత్య సినిమా అయితే ఇక అంతే. అలాంటి సినిమాలు కూడా చూసే అలవాటు తమకు ఉందనే ఉనికిని చాటుకోవడానికి ఈ సినిమా దర్శకుడికి “కాపీ క్యాట్” (Copy Cat) అనే బిరుదు ఇచ్చేస్తారు. సరిగ్గా “కాపీ” కొట్టక తెలుగు దర్శకుడు ఆ ఫ్రెంచి దర్శకుడిని అవమానపరిస్తే, తెలుగు సినిమాపై వ్రాసే సమీక్షలో ఫ్రెంచి సినిమాను పొగడటం ఈ సమీక్షకులు తెలుగు సినిమాకు చేసే అవమానమో కాదో ఓసారి ఆలోచించుకోవాలి.
తెలుగు సినిమా విషయానికి వస్తే, అఖండ విజయాలను అందుకున్న “రాజమౌళి” ఈ “కాపీ క్యాట్” బిరుదును అనేకసార్లు అందుకున్నారు. “బెన్ హర్” (Ben Hur), “లార్డ్ ఆఫ్ ది రింగ్స్” (Lord of the Rings), “300” సినిమాలను కాపి కొట్టి “మగధీర” తీశాడని, ఓ బొద్దింక మీద తీసిన ఏదో లఘు చిత్రాన్ని కాపీ కొట్టి “ఈగ” తీశాడని, ఇలా ఆ సినిమాలు విజయవంతమైనా పలు విమర్శలు అందుకున్నారు రాజమౌళి. బహుశా ఈ బాధ తట్టుకోలేక, ఇలాంటివారి నోర్లు మూయిస్తూ, రాజమౌళి కూడా తను కాపీ కొడతానని ఒప్పేసుకున్నాడు. “బాహుబలి”లో కట్టప్ప తలపై శివుడు కాలు మోపే సన్నివేశాన్ని ఎప్పుడో వచ్చిన “గెంఘిస్ ఖాన్” (Genghis Khan) సినిమాలోనిదని చెప్పాడు. మొన్నటికి మొన్న “సుకుమార్” తీసిన “1 నేనొక్కడినే“ “ఫైట్ క్లబ్” (Fight Club) నుండి, “కుమారి 21F” “లైలా సేయ్స్” (Lila Says) అనే ఫ్రెంచి సినిమా నుండి, “నాన్నకు ప్రేమతో”నేమో “ప్రిన్సెస్ బ్రైడ్” (Princess Bride) అనే సినిమా నుండి కాపీ కొట్టాడని, వాటిని కష్టపడి వెతికి, ట్విట్టర్, ఫేస్ బుక్ లలో షేర్ చేసి, నైజాం నవాబు గుప్తనిధి తమకు దొరికినట్టు ఫీల్ అయిపోతున్నారు ఈ సమీక్షకులు. ఇలాంటి సందర్భాలు అనేకం.
నిజానికి కాపీ కొట్టడం కాపీ కొట్టారని విమర్శించినంత సులువు కాదు. ప్రతీ సినిమాకు ఓ నేటివిటీ ఉంటుంది. “సెవెన్ సమురాయి” అనేది ఓ జపనీస్ సినిమా. దాని నుండి “షోలే” తీసుకున్నా, అందులో ఇండియన్ నేటివిటీని తెప్పించడానికి రచయితలు “సలీం – జావేద్” చాలా కష్టపడ్డారు. ఉదాహరణే, అందులోని “గబ్బర్ సింగ్” పాత్ర. ఆ కష్టమే ఆ సినిమాను ఉన్నతస్థాయికి తీసుకొని వెళ్ళింది. “300”, “బెన్ హర్” లాంటి సినిమాల నుండి రాజమౌళి “మగధీర” తీసి ఉండొచ్చు. కానీ ఆ సినిమాకు “తెలుగు” ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారంటే, అది అందులో తెలుగు నేటివిటీని తీసుకొని వచ్చిన “రాజమౌళి” గొప్పతనమే. మరో ఉదాహరణ చెప్పాలంటే, “బాహుబలి”లో శివుడిని చూసిన కట్టప్ప అతడి కాలుని తలపై పెట్టించుకునే సన్నివేశంలో మరో సన్నివేశాన్ని ఊహించుకోవడం కష్టమే. “సుకుమార్” విషయంలో కూడా అంతే. “కుమారి 21F” చివర్లో కుమారి చీరపై రక్తపు మరక చూసినప్పుడు పండిన భావోద్వేగం ఆ సినిమా స్థాయిని పెంచేసింది. ఈ వ్యాసానికి పైన మీరు చూసిన “చింతకాయల రవి” సినిమాలోని సన్నివేశం కూడా “మిస్టర్ బీన్” (Mr. Bean) నుండి తీసుకున్నదే. కానీ ఆ సన్నివేశానికి ప్రేక్షకులు ఆనందించారు. దానికి ఆ సినిమా రచయిత “కోన వెంకట్” మరియు ఆ సన్నివేశంలో నటించిన “వెంకటేష్”లు కారణం. ఇప్పటి సినిమాలే కాదు, దర్శకుడు “కోదండరామిరెడ్డి” మరియు “మెగాస్టార్ చిరంజీవి”ల సినీ జీవితాల్లో మైలురాయిగా నిలిచిన “ఖైదీ” సినిమా కథ కూడా “ఫస్ట్ బ్లడ్” (First Blood) అనే సినిమా నుండి తీసుకున్నదే. ఇలా చెప్పుకుంటూ పోతే మరెన్నో ఉదాహరణలు…
మరో సినిమా సన్నివేశాన్ని తన సినిమాలో వాడుకోకుండా, సొంతంగా ఆలోచించాలని ప్రతీ దర్శకుడికి ఉంటుంది. కానీ ఫలానా సినిమాలోని ఓ సన్నివేశమే తన కథకు సరిగ్గా సరిపోతుందని అతడికి తెలుసు కాబట్టే ఆ సన్నివేశాన్ని వాడుకుంటాడు. మనందరిలాగే ఓ దర్శకుడికి కూడా మరొకరి కష్టాన్ని వాడుకోవడానికి అహం అడ్డువస్తుంది. అప్పుడే, మరో విషయాన్ని ఆ దర్శకుడు మనసులో ఉంచుకుంటాడు. తన సినిమాను ఎలాంటి ప్రేక్షకులు చూడబోతున్నారో, వారు మెచ్చే నేటివిటీని ఆ సన్నివేశంలో తీసుకొని రావడానికి ప్రయత్నిస్తాడు. ఆ ప్రయత్నంలో విజయం సాధిస్తే, అతడి సినిమా కూడా విజయం సాధిస్తుంది. ఆ సమయంలోనే “కాపీ” కాస్తా “ప్రేరణ”గా మారిపోతుంది.
చివరి మాట :
సమయం వచ్చినప్పుడు, తను వ్రాసే పరీక్షలో పాసవ్వడానికి మరొకడి పేపర్లో “కాపీ” కొట్టడం ఓ విద్యార్ధి ఒప్పుగా భావించడం సబబు అయితే, తన సినిమా పండడానికి ఓ దర్శకుడు మరో దర్శకుడి సినిమా నుండి “కాపీ” కొట్టడం కూడా సబబే అనుకోవాలి. కాకపోతే, పరీక్ష సమయంలో వచ్చే ఫ్లైయింగ్ స్క్వాడ్స్ లాగా సమీక్షకులు “కాపీ” పేరుతో సినిమాను ఏకిపారేస్తే, విద్యార్ధిలా ఆ దర్శకుడు నష్టపోడనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అందుకు పైన మాట్లాడుకున్న సినిమాలే ఉదాహరణలు.
ఈ వ్యాసానికి పెట్టిన పేరు కూడా నవతంగంలో ఇదివరకు వచ్చిన “పర్యవేక్షక సినిమా”, “సహకార సినిమా” లాంటి వ్యాసాల పేర్ల నుండి ప్రేరణ పొంది, “కాపీ” కొట్టినదే…!
– యశ్వంత్ ఆలూరు
07/02/2016
“Wayback Machine”లో గల నవతరంగం వ్యాసం ఇక్కడ.