కృష్ణగాడి వీరప్రేమగాథ (2016)

KVPG Poster

సినిమాకు “రచన” అనే అంశం ఎంతో ముఖ్యం. కథ ఎలాంటిదైనా, మంచి రచన ఉంటే ఆ సినిమా ప్రేక్షకులకు చేరుతుంది. అలా, “అందాల రాక్షసి”లాంటి పాత కథను ఎంచుకొని తనదైన రచనతో దాని ప్రేక్షకులకు దగ్గర చేసిన దర్శకుడు “హను రాఘవపూడి”. తన రెండో సినిమాగా “కృష్ణగాడి వీరప్రేమగాథ”ను చెప్పాడు. నాని, మెహ్రీన్ జంటగా నటించగా, 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై అనిల్ సుంకర, రామ్ ఆచంట, గోపీనాథ్ ఈ సినిమాను నిర్మించారు.

కథ :

హిందూపురంలో కృష్ణ (నాని), మహాలక్ష్మి (మెహ్రీన్) రహస్య ప్రేమికులు. ఆ ఊరిలోని ముఠా కక్షలు వారి ప్రేమకు ఎలా అడ్డుగా మారాయి? పిరికివాడైన కృష్ణ తన ప్రేమను సాధించడానికి ఎలాంటి సాహసం చేశాడు? అనేవి ఈ సినిమా కథాంశాలు.

కథనం :

ఇది కొత్త కథాంశం కాదు. అటుఇటుగా “ప్రేమించుకుందాం రా!”ను పోలిన కథే. ఈ సినిమా కూడా ఆరంభం నుండి నెమ్మదిగానే నడిచినా, దాదాపుగా బోరు కొట్టలేదు. “అందాల రాక్షసి” అనేది ప్రేమకథ కనుక దాన్ని కవితాత్మకంగా చెబితే బాగుంటుంది. కానీ ఇలాంటి కథను కూడా కవితాత్మక కథనంతో చెప్పడం దర్శకుడు హను శైలిని తెలిపింది. ఇది దర్శకత్వం కంటే రచన మీద ఎక్కువ ఆధారపడిన సినిమా అని చెప్పొచ్చు. కనుక ఈ కథనాన్ని “సిడ్ ఫీల్డ్” (Syd Field) చెప్పిన “ఆక్ట్” (Act) పరిభాషలో విశ్లేషించుకుందాం.

ఆక్ట్ 1 – పరిచయం :

కృష్ణ, మహాలక్ష్మిల పరిచయాలు మాములుగా ఉన్నా, వారి మధ్యనున్న సన్నివేశాలు చాలా కవితాత్మకంగానూ, సహజంగానూ ఉన్నాయి. ఉదాహరణకు, ఇద్దరు ఎవరికీ తెలియకుండా ఊరి చివర కలుసుకోవడం, అందరి ముందు ఒకరినొకరు ద్వేషించుకుంటున్నట్టు నటించడం, ఇలాంటివి సహజంగా మనకు కనబడేవి, వినబడేవి. దానికి నాని ఆహార్యం తోడై నవ్వించింది. “నువ్వంటే నా నువ్వు” అనే పాట చెవులకు వినసొంపుగా అనిపించకపోయినా, కంటికి అందంగా కనిపించింది. ముఖ్యంగా, చిన్ననాటి జ్ఞాపకాలను నేమరువేసుకోవడాన్ని దర్శకుడు తెరపై ఆవిష్కరించిన విధానం ఓ కవితలా అనిపించింది. అతడికి “యువరాజ్” ఛాయాగ్రహణం బాగా సాయపడింది.

హిందూపురం, అందులోని ముఠా కక్షల నేపథ్యాన్ని ఎంచుకున్న దర్శకుడు హను, అందులోనూ తన కవితాత్మక శైలిని వదలలేదు. అలా నాకు అనిపించినది, మహాలక్ష్మి అన్న రామరాజు (శత్రు) కృష్ణని పొలిమేర దగ్గరికి తీసుకొని వెళ్ళే సన్నివేశం. మనిషిపై అజ్ఞానం స్వారీ చేస్తే పరిణామాలు ఎలా ఉంటాయి, వారి మధ్యనున్న పనికిరాని పగల వల్ల ఓ చిన్న పిట్టకు కూడా బ్రతకడం ఎంత కష్టం అనే విషయాలను కూడా కవితాత్మకంగా చెప్పాడు దర్శకుడు. దీనికి, అలాంటి గడ్డమీద పగ కంటే భయమే మంచిదని వచ్చే నేపథ్య గీత బాగా సాయపడింది.

అలాగే, కథనానికి కావాల్సిన అన్ని పాత్రలను “ఆక్ట్ 1″లోనే పరిచయం చేసేశాడు.

ఆక్ట్ 2 – సమస్య :

అప్పటివరకు తికమకగా పరిచయమైన పాత్రలను విరామం సమయానికి కథనంలోని సమస్యలో బాగా వాడుకున్నాడు దర్శకుడు. రెండో సగమంతా ఇక ఆ సమస్య మీదే దృష్టి సారించాడు. అక్కడే ఇది మళ్ళీ ఓ మాములు సినిమాగా మారిపోయింది. అప్పటివరకున్న దర్శకుడి శైలి కూడా పూర్తిగా తప్పిపోయింది. ఓ పెళ్ళి మండపంలో పాత్రల్లో తికమక పెట్టిన విధానం శ్రీనువైట్లని మరోసారి గుర్తుచేసింది. కానీ, మరోప్రక్క జమదగ్ని (పృథ్వీరాజ్), డేవిడ్ (మురళీశర్మ) పాత్రలు బాగా నవ్వించాయి. కొన్ని రోజులుగా పేరడీలతో విసిగించిన పృథ్వీరాజ్ ఈ సినిమాలో కొత్తగా కనిపించాడు.

ఈ రెండో ఆక్ట్ లోనే దర్శకుడు ఎక్కువ సమయం ఎందుకు గడిపాడో అర్థం కాలేదు. త్వరగా మూడో ఆక్ట్ లోకి వెళ్ళకుండా, ఓ మామూలు కమర్షియల్ సినిమాలాగా అనవసరంగా “కృష్ణగాడి వీర ప్రేమగాథ”, “ఉలికిపడకు” లాంటి పాటలను కథనంలో ఇరికించేశాడు. దీని ద్వారా సినిమా నిడివి కూడా బాగా పెరిగిపోయినట్టు అనిపించింది.

ఆక్ట్ 3 – పరిష్కారం :

కథలోని సమస్యకు ప్రేక్షకుడు ఊహించగలిగే పరిష్కారమే చూపించాడు దర్శకుడు. ఇక్కడ కథనంలో పెట్టిన కొసరు మెలికలు, భావోద్వేగాలు కూడా ఊహించినవే. చివరికి “కృష్ణగాడి వీరప్రేమగాథ” అనే పేరుకి న్యాయం చేశాడు.

అలా, ఓ మంచి కవితలా మొదలై, ఓ మామూలు సినిమాలా ముగిసిన కథ ఈ “కృష్ణగాడి వీరప్రేమగాథ”. కానీ సినిమా బోరు కొట్టినట్టు దాదాపుగా అనిపించలేదు. కనుక, ఈ సినిమాను ఓసారి మొహమాటం లేకుండా చూడవచ్చు.

నటనలు :

కృష్ణగా నాని నటన ఎప్పటిలాగే సహజంగా ఉంది. తొలి పరిచయంలోనే మెహ్రీన్ కు సహజమైన పాత్ర దొరికింది. చూడడానికి కూడా మన వీధిలోని అమ్మాయిగా సహజంగా ఉంది. శత్రు, సంపత్ రాజ్ లాంటివారు పాత్రలకు న్యాయం చేశారు. సీనియర్ నటి అన్నపూర్ణ కూడా ఊళ్ళల్లో ఉండే సహజమైన బామ్మ పాత్రను పోషించారు. బ్రహ్మాజీకి దొరికినది ఎప్పటిలాంటి పాత్రే అయినా, దాన్ని అతడు పోషించిన విధానం కూడా ఎప్పటిలాగే బాగుంది. ముఖ్యంగా, విరామం ముందు పోలీసుస్టేషన్ లోని సన్నివేశంలో అతడి నటన కడుపుబ్బ నవ్వించింది. రెండో సగంలో పృథ్వీరాజ్, ప్రభాస్ శ్రీను, మురళీశర్మ నవ్వించారు. ‘సత్యం’ రాజేష్ ఫరవాలేదు. హరీష్ ఉత్తమన్, ఫిష్ వెంకట్, రవి కాలే చెప్పుకోదగ్గ పాత్రలు పోషించలేదు. ఈ సినిమాలోని ముఖ్య పాత్రల్లో పిల్లలు నయన, శ్రీప్రాతం, మోక్ష బాగా చేశారు.

మరిన్ని ప్రత్యేకతలు :

  1. యువరాజ్ ఛాయాగ్రహణం (Cinematography). కథనం కవితాత్మకంగా ఉందని పైన చెప్పుకున్నాం. ఆ కవితను తెరపై గీసిన ఘనత మాత్రం యువరాజ్ కెమెరాదే. సన్నివేశాలన్నీ కనువిందుగా ఉన్నాయి. “నువ్వంటే నా నువ్వు” పాటలో లైటింగ్ అద్భుతంగా ఉంది. ఏరియల్ మరియు లాంగ్ షాట్స్ కూడా బాగున్నాయి.
  2. విశాల్ చంద్రశేఖర్ సంగీతం (Music). పాటలు ఫరవాలేదనిపించినా, నేపథ్య సంగీతం మాత్రం కథకు, కథనం జరిగే ప్రదేశాలకు చక్కగా కుదిరింది.
  3. నిర్మాణ విలువలు (Production Values). 14 రీల్స్ సంస్థ ఈ సినిమా ఎక్కడ కూడా తక్కువగా అనిపించేలా చేయలేదు. అందమైన ప్రదేశాలలో కావలసినంత ఖర్చుపెట్టి సినిమాను నిర్మించారు.

బలహీనతలు :

  1. నెమ్మదైన కథనం. అనవసరపు పాటలు, సన్నివేశాలు, ఈ సినిమా కథనం నేమ్మదించడానికి కారణమై, ఈ సినిమాను 148 నిమిషాల సినిమాగా మార్చాయి. ఇదొక్కటే బలమైన బలహీనత ఈ సినిమాకు.

ఈ చిత్రం నేర్పిన పాఠం :

మంచి సినిమాకు ఎప్పుడూ మంచి రచనే ప్రాణం పోస్తుంది.

– యశ్వంత్ ఆలూరు

Click here for English version of this Review

One thought on “కృష్ణగాడి వీరప్రేమగాథ (2016)

  1. Pingback: Krishna Gaadi Veera Prema Gaadha (2016) – Film Criticism

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s