ఓ వ్యక్తి ఓ తప్పు చేయడం అందరూ చూశారు. ఆ తరువాత ఆ మనిషి ప్రమేయం లేకుండా జరిగిన మరో తప్పును ఎవరూ చూడలేదు. కానీ మొదటి తప్పు కన్నా రెండవ తప్పుకే పరిణామాలు తీవ్రంగా ఉన్నాయి. మొదటి తప్పు వల్లే ఈ పరిణామాలు వచ్చాయని అందరూ భావించి మొదటి వ్యక్తినే అందరూ దోషిని చేశారు. అసలు రెండవ తప్పు ఎలా జరిగింది, ఎవరు చేశారు అనేదే “మలుపు”. ఆది పినిశెట్టి, నిక్కి గల్రాని జంటగా నటించిన ఈ సినిమాకు “సత్య ప్రభాస్ పినిశెట్టి” దర్శకత్వం వహించారు. అలనాటి సుప్రసిద్ధ దర్శకుడు, ఆది పినిశెట్టి తండ్రి అయిన రవిరాజా పినిశెట్టి “ఆదర్శ్ చిత్రాలయ” పతాకంపై దీన్ని నిర్మించారు.
కథ :
సతీష్ గణపతి అలియాస్ సగ (ఆది) ఓ మధ్యతరగతి కుటుంబానికి చెందినవాడు. అతడికి ముగ్గురు స్నేహితులు, ఒక ప్రేయసి (నిక్కి) ఉంటారు. డిసెంబర్ 31 రాత్రి తన స్నేహితులు చేసిన ఒక పొరపాటు వల్ల సగ ముంబై డాన్ అయిన ముదలియార్ (మిథున్ చక్రవర్తి)ని కలవాల్సి వస్తుంది. ఆ పొరపాటు ఏంటి? ముదలియార్ ను కలిసిన సగ జీవితం ఎలా మారింది? అదే ఈ సినిమా కథ.
కథనం :
ఉపోద్ఘాతంలో వ్రాసిన అంశమే ఈ సినిమా కథకు పునాది. అది దర్శకుడు సత్య ప్రభాస్ జీవితంలో జరిగిన ఓ సంఘటన అని కూడా వినికిడి.
మాములుగా థ్రిల్లర్ సినిమాల్లో ఒక అంశం ఉంటూ, కథనం తిరిగి తిరిగి దాని వద్దకు చేరుతుంది. కానీ సత్య ప్రభాస్ వ్రాసుకున్న ఈ థ్రిల్లర్ కథలో అనేక అంశాలున్నాయి. ప్రతి అంశానికి ఒక కారణం, దాన్ని చేరుకోవడానికి కొంత కథనం, కొన్ని పాత్రలున్నాయి. ఈ పోకడ కొత్తగా అనిపించింది కానీ మంచిదో కాదో అర్థంకాలేదు. కానీ ప్రభాస్ వ్రాసుకున్న కథ, కథనాలు మాత్రం బాగున్నట్టు అనిపించాయి. కనుక రచనకు అతడికి మార్కులు వేయాలి.
సినిమా ప్రారంభంలోనే కథలోని ముఖ్యమైన అంశాలను చూచాయగా పరిచయం చేసి ఆ తరువాత కథనాన్ని మరో దారి తొక్కించాడు దర్శకుడు. కథానాయిక పాత్రకు మొదట్లో చాలా ప్రాముఖ్యత ఉన్నట్టుగా అనిపించినా, క్రమేణా అది తగ్గిపోయింది. నాయకానాయికల ప్రేమకథ కూడా మాములుగానే ఉంది. ఇదే కాకుండా, మొదటి సగం ఆరంభంలోనే చాలా పాత్రలు ప్రేక్షకుడికి పరిచయమై మాయమైపోతాయి. ప్రతి పాత్రకు ప్రాముఖ్యత ఉన్నట్టుగా దర్శకుడు చెప్పాడు. ముఖ్య పాత్రైన ముదలియార్ పాత్ర విరామం దగ్గర ప్రేక్షకుడికి కనిపిస్తుంది. “ముదలియార్” అనే పాత్రను ఇప్పటికే చాలా తమిళ సినిమాల్లో వాడుకున్నారు. బహుశా ఇది తమిళ సినిమా కనుక తమిళ ప్రజల కోసం ఆ పాత్రను మళ్ళీ ఇందులో సృష్టించారేమో అనిపించింది. మొదటి సగంలో పలుచోట్ల తమిళ వాసన వచ్చింది.
తనకు సంబంధం లేని ఒక గొడవలో సగ అనుకోకుండా ఒకడిని కాపాడితే, తరువాత ఆ పాత్రే సగకు సాయం చేయడం వంటి అంశాలు బాగున్నాయి.
రెండో సగంలో దర్శకుడిపై భారం పెరిగినట్టు అనిపించింది. “మలుపు” అనే పేరున్న కథలో “మలుపులు” ఉండడంతో, పేపరుపై బాగా వ్రాసుకున్న వాటిని తెరపై విడమర్చి చూపించడానికి ఇబ్బందిపడి కథనాన్ని సాగదీశాడు. కథనాన్ని పలు అడ్డదార్లు కూడా తొక్కించాడు. ప్రేక్షకుడి మనసులో అసలు మెదిలే అవకాశం లేని అత్యంత చిన్న అంశాలను కారణాలుగా చూపించడం ఓ చులకన భావాన్ని కలిగించింది. కానీ డిసెంబర్ 31 రాత్రి జరిగిన సంఘటనను అతడు చూపించిన విధానం, అందులో కనిపించే ప్రతి పాత్రకు ఒక కథను అనుసంధానం చేసిన విధానం బాగుంది. ఆ తరువాత కథ అనేక “మలుపులు” తిరిగి కాస్త ఇబ్బంది పెట్టిందనే చెప్పాలి. కొన్ని అంశాలను చూపించిన విధానంలో పరిపక్వత లోపించినట్టు అనిపించింది. ఉదాహరణకు, పతాక ఘట్టంలో థ్రిల్లర్ రసానికి ఎమోషన్ రసాన్ని జోడించిన విధానం.
ఏదేమైనా, “తప్పు మేం చెయ్యలేదని ప్రూవ్ చెయ్యలేని పరిస్థితి మాది… అది మేము వివరించినా నమ్మలేని పరిస్థితి మీది” అనే మూలంశాన్ని చెప్పాడు దర్శకుడు.
అలా, కేవలం ఒక్క మలుపుండే మామూలు థ్రిల్లర్ సినిమాలకు భిన్నంగా అనేక మలుపులున్న “మలుపు” సినిమాను ముగించాడు దర్శకుడు. రచన వల్ల ఈ సినిమాను చూడదగిన సినిమాగా చెప్పొచ్చు.
నటనలు :
ఆది సగ పాత్రను సునాయాసంగా పోషించినట్టు అనిపించింది. నిక్కి పాత్రకు మొదట్లో ప్రాముఖ్యత ఉన్నట్టు అనిపించినా తరువాత అది కనిపించలేదు. ఉన్నంతలో బాగా చేసింది. ముదలియార్ గా మిథున్ చక్రవర్తి సరిగ్గా సరిపోయారు. నాజర్, పశుపతి, ప్రగతి, హరీష్ ఉత్తమన్, ఆది స్నేహితులుగా చేసిన ముగ్గురు తమ తమ పాత్రలకు సరిపోయారు. చాలాకాలం తరువాత “నువ్వేకావాలి” కథానాయిక రిచా ఈ సినిమాలో ఒక ముఖ్య పాత్ర పోషించింది.
ప్రత్యేకతలు :
- మూలాంశం (Basic Plot). కథకు పునాది అయిన “తప్పు మేం చెయ్యలేదని ప్రూవ్ చెయ్యలేని పరిస్థితి మాది… అది మేము వివరించినా నమ్మలేని పరిస్థితి మీది” అనే అంశం బాగుంది.
- షన్ముగ సుందరం ఛాయాగ్రహణం (Cinematography). థ్రిల్లర్ కు సాయం చేసే ఛాయాగ్రహణాన్ని బాగా చేశాడు షన్ముగ.
- నిర్మాణ విలువలు (Production Values). కొడుకు తీసే సినిమా కోసం రవిరాజా బాగానే ఖర్చుపెట్టారు.
బలహీనతలు :
- ప్రదర్శన. పేపరుపై కథ, కథనాలు బాగానే ఉన్నాయి కానీ తెరపై తడబడినట్టు అనిపించింది. మలుపుల మోతాదు మించినట్టు అనిపించింది.
- పాటలు. థ్రిల్లర్ కథనానికి పాటలు అడ్డుకట్టలుగా మారాయి.
ఈ చిత్రం నేర్పిన పాఠం :
కొన్ని కథలను చెప్పాలంటే కొంత అనుభవం అవసరం.
– యశ్వంత్ ఆలూరు
Click here for English version of this Review