ఓ దర్శకుడికి తన మొదటి సినిమా చాలా ముఖ్యం. ఎందుకంటే, అతడు తరువాత పరిశ్రమలో నిలబడతాడా లేదా అన్నది నిర్ణయించేది ఆ సినిమానే కనుక. అందుకే ఇప్పుడు పరిచయమయ్యే చాలామంది కొత్త దర్శకులు ఫార్ములాల మీద ఆధారపడుతున్నారు. వాటికి భిన్నంగా, “రవికాంత్ పెరేపు” అనే దర్శకుడు ఓ “సరైన” థ్రిల్లర్ సినిమాతో పరిచయం అయ్యాడు. అదే “క్షణం”. అడివి శేష్, అదా శర్మ, అనసూయ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు అడివి శేష్ కథను అందించాడు. పీవీపీ సినిమా మరియు మ్యాటినీ ఎంటర్టైన్మెంట్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి.
కథ :
కనిపించకుండా పోయిన తన కూతురు రియా (బేబీ డాలీ)ని కనిపెట్టమని అమెరికాలోని తన మాజీ ప్రేమికుడు రిషి (అడివి శేష్)ని సాయం కోరుతుంది శ్వేత (అదా శర్మ). ఇండియాకు వచ్చిన రిషి ఆ ప్రయత్నాన్ని ఎలా సాగించాడు అన్నది ఈ సినిమా కథాంశం.
కథనం – దర్శకత్వం :
ఉపోద్ఘాతములో “సరైన” అనే మాట ఎందుకు వాడానంటే, థ్రిల్లర్ సినిమాకు మూలాంశం ఎలాంటిదైనా కావచ్చు. కానీ, దానివరకు ప్రేక్షకుడిని తీసుకుని వెళ్ళడమే అసలు సమస్య. అతడి ఊహకు అందేలా ప్రయాణం చేయకూడదు. అప్పుడే అది థ్రిల్లర్ అవుతుంది. ఆ విషయంలో రచయిత అడివి శేష్ తో కలిసి దర్శకుడు రవికాంత్ తీసుకున్న శ్రమ ఎంతో అభినందనీయం.
ముందుగా మంచి విషయాలకు వస్తే, సినిమా ప్రారంభం నుండి కథనంలో పలు పాత్రలను, మెలికలను ప్రవేశపెట్టి ఆసక్తి కలిగించాడు దర్శకుడు. ఓ ప్రేమకథ ఉన్నప్పటికీ, అది ఎక్కడ కూడా బోరు కొట్టలేదు. కథలోని ముఖ్యమైన అంశానికి, ఆ ప్రేమకథకు సంబంధం ఉంది కనుక ఈ సినిమాలో “నాన్ లినియర్” (Non-Linear) కథనాన్ని ఎంచుకోవడం సరైన ఆలోచన. అందుకు ఎడిటింగ్ విభాగంలో కూడా “అర్జున్ శాస్త్రి”తో కలిసి చక్కటి ప్రతిభను ప్రదర్శించాడు రవికాంత్. విరామం వచ్చే సమయానికి రిషి పాత్రని, ప్రేక్షకుడిని సరైన సందిఘ్దంలో పెట్టడమే దర్శకుడు సాధించిన సగం విజయమని చెప్పాలి. ఈ కథనంలోని మరో మంచి విషయమేమిటంటే, ప్రేక్షకుడికి పరిచయమయ్యే ఏ పాత్ర కూడా వ్యర్థమైనది కాదు. దేని విలువ దానికి ఉంది. పాత్రల పరిచయం, వాటి అంతం కూడా సరైన సమయంలో జరిగాయి. అక్కడ రచయిత విజయం ఉంది. సినిమా నిడివి కూడా రెండు గంటలే కావడం మరో ఆకర్షణ.
ఇతర విషయాలకు వస్తే, దర్శకరచయితలు ప్రేక్షకుడిలో సస్పెన్స్ ని కలిగించే ప్రయత్నం అద్భుతంగా ఉంది కానీ, కథకు ప్రధానమైన అంశం పెద్దగా ఒప్పించేలా లేదని నా అభిప్రాయం. ఉదాహరణకు, జయ (అనసూయ) మాత్రలు వేసుకోవడం చూస్తే, దాని వెనుక ఏదో కారణం ఉంది ఉంటుందని అనిపిస్తుంది. కానీ దానికి, మూలకథకు ఎటువంటి సంబంధం లేకపోవడం నిరాశ కలిగింది. నిజానికి, ఆ అంశాన్ని కథనంలో వాడుకొని మూలాంశాన్ని చెప్పి ఉంటే బాగుండేది. అలాగే, చౌదరి (సత్యం రాజేష్)కి నిజాన్ని తెలుసుకునే వీలున్న ఒక సందర్భం ఉంది (థ్రిల్లర్ సినిమా కనుక ఆ సన్నివేశం గురించి చెప్పడంలేదు). కానీ దాన్ని ప్రశ్నించకుండా వదిలేయడం బాగోలేదు. అలాగే కార్తిక్ (సత్యదేవ్) పాత్ర కూడా ఒప్పించేలా అనిపించలేదు.
మొత్తానికి, “క్షణం” ఒక మంచి థ్రిల్లర్ సినిమా. ప్రేక్షకుడు “థ్రిల్”ని ఫీల్ అయ్యేలా చేసే సినిమా
నటనలు :
అడివి శేష్ రిషి పాత్రకు సరిగ్గా సరిపోయాడు. పలు సన్నివేశాల్లో అతడి హావభావాలు చాలా బాగున్నాయి. ఉదాహరణకు, పతాక సన్నివేశం. అదా శర్మ నటన కూడా ఆకట్టుకుంది. జయ పాత్రలో అనసూయ కూడా బాగుంది. ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది చౌదరి పాత్రను పోషించిన రాజేష్ గురించి. హాస్యానికి వాడుకునే రాజేష్ ను దర్శకుడు రవికాంత్ ఓ సీరియస్ పాత్రలో వాడుకున్నాడు. ఆ పాత్రకు రాజేష్ సరిపోవడం ఆశ్చర్యపరిచే విషయం. నిజమైన పోలీసులా ఉన్న అతడి ఆహార్యం, “రెడ్డి! రాసుకో!” అనే ఊతపదం చాలా నచ్చింది. రవివర్మ, సత్యదేవ్ పాత్రలకు సరిపోయారు. బాబు ఖాన్ పాత్రలో వెన్నెల కిషోర్ సీరియస్ నటన కొత్తగా ఉంది. ఆఫ్రికన్ కు అబద్ధం చెప్పి రవివర్మను ఇరికించే సన్నివేశంలో అతడి నటన బాగుంది.
ప్రత్యేకతలు :
- కథ, కథనం & దర్శకత్వం (Story, Screenplay & Direction). అడివి శేష్ అందించిన కథ, శేష్ మరియు రవికాంత్ సమకూర్చిన కథనం మరియు రవికాంత్ దర్శకత్వం ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ. అక్కడక్కడ ఒప్పించలేని అంశాలు ఉన్నప్పటికీ, కథనంలో ఉత్కంఠను కలిగించినందుకు వీరిని అభినందించాలి.
- కూర్పు (Editing). అర్జున్ శాస్త్రి, దర్శకుడు రవికాంత్ ఈ సినిమాకు చేసిన కూర్పు చాలా బాగుంది.
- శానియాల్ డియో ఛాయాగ్రహణం (Cinematography). ఈ సినిమాకు ఇతడు వాడిన లైటింగ్ అద్భుతం. నేనింత వరకు వైజాగ్ నగరాన్ని చూడలేదు. దాన్ని ఇతడి కెమెరా నుండి చూశాక అక్కడికి వెళ్ళాలన్న కుతూహలం కలిగింది.
- అబ్బూరి రవి మాటలు (Dialogues). ప్రేమకథలో రవి వ్రాసిన కొన్ని మాటలు కథకు బాగా సరిపోయాయి. ఉదాహరణకు, “ప్రేమంటే ప్రామిస్”, “ఇదివరకు పెళ్లి విషయం తనని అడుగుదాం అనుకున్నాను కానీ ఇప్పుడు చెప్తే చాలనిపించింది” లాంటివి.
- శ్రీచరణ్ సంగీతం (Music). పాటలు ఫరవాలేదు కానీ థ్రిల్లర్ సినిమాకు కావాల్సిన సరైన నేపథ్య సంగీతాన్ని అందించడంలో సఫలమయ్యాడు శ్రీచరణ్. పతాక సన్నివేశంలో వచ్చిన వయోలిన్ సంగీతం చాలా బాగుంది.
- నిర్మాణ విలువలు (Production Values). పీ.వీ.పీ సినిమా మరియు మ్యాటినీ ఎంటర్టైన్మెంట్ సంస్థలు కేవలం కోటి రూపాయలలో ఈ సినిమాను నిర్మించినా నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడలేదు.
బలహీనతలు :
- ఒప్పించలేని కొన్ని అంశాలు (ఇది నా అభిప్రాయం మాత్రమే. ప్రేక్షకుల అభిప్రాయం వేరే ఉండచ్చు).
ఈ చిత్రం నేర్పిన పాఠం :
మొదటి సినిమాతో పరిశ్రమలో గుర్తింపు తెచ్చుకోవాలంటే ఫార్ములా సినిమాలే చేయాల్సిన అవసరంలేదు. వ్రాసుకున్న కథను సరిగా చెప్తే చాలు.
– యశ్వంత్ ఆలూరు
Click here for English version of this Review…
Pingback: Kshanam (2016) – Film Criticism