టెర్రర్ (2016)

Terror Poster

సినిమా పరిశ్రమలో “చిన్న సినిమా”, “పెద్ద సినిమా” అనే విభజన కొన్ని సినిమాల పట్ల శాపంగా మారాయని చెప్పాలి. కొన్ని సినిమాలు కనీసం విడుదల కూడా కాలేదంటే దానికి పేరుమోసిన నిర్మాణ సంస్థ, దర్శకుడు, హిట్టు లేని నటుడు ఉండడంతో పాటు, ఈ “చిన్న సినిమా” అనే బిరుదు కూడా ఉంటోంది. అలాంటి ఒక “చిన్న” సినిమానే “టెర్రర్”. శ్రీకాంత్, నిఖిత జంటగా నటించిన ఈ సినిమాకు “సతీష్ కాసెట్టి” దర్శకత్వం వహించారు. ఈయన గతంలో స్వాతి నటించిన “కలవరమాయే మదిలో” సినిమాను తీశారు. “అఖండ భారత్ క్రియేషన్స్” పతాకంపై “షేక్ మస్తాన్” నిర్మించారు.

కథ :

రాజకీయ ఒత్తిళ్ళకు లోబడి ఓసారి తప్పు చేసిన సీ.ఐ. విజయ్ (శ్రీకాంత్), మరోసారి ఆ తప్పు జరగకుండా హైదరాబాదులో జరిగే ఉగ్రవాదుల దాడిని ఆపాలని నిర్ణయించుకుంటాడు. అది ఎలా చేశాడు అన్నది ఈ సినిమా కథాంశం.

కథనం :

ఇలాంటి అంశాల మీద పలు సినిమాలు తీశారు కనుక మళ్ళీ అదే అంశం మీద సినిమాలు తీయాలంటే కథనం కట్టిపడేసేలా ఉండాలి. ఆ విషయంలో దర్శకుడు సతీష్ వందశాతం సఫలమయ్యారని చెప్పాలి.

ఈ సినిమాలో ప్రధాన అంశమైన “టెర్రరిస్ట్ ఎటాక్”కు 13 రోజుల గడువు ఉంటుంది. ఆ సమయంలో జరిగే కథను దర్శకుడు సతీష్ పక్కా కథనంతో చెప్పారు. ఇది కమర్షియల్ కథే అయినా, పనికిరాని కమర్షియల్ ఆగడాలకు పోకుండా ఈ సినిమాను తెరకెక్కించిన విధానం ప్రశంసనీయం.

ఈ సినిమాలో ఆకట్టుకున్న కొన్ని అంశాలున్నాయి. సినిమాలో పరభాషా పాత్రల డైలాగులు సబ్ టైటిల్స్ తో వేసిన విధానం హాలీవుడ్ సినిమాల్లో చూస్తుంటాం. సినిమాలో అలాంటి ఏ పాత్రతోనూ పొరపాటున కూడా తెలుగులో మాట్లాడించలేదు దర్శకుడు. కథానాయకుడి పాత్ర చిత్రణ చాలా సహజంగా ఉంది. ఒత్తిళ్ళకు లోబడి కర్తవ్యం సరిగ్గా నిర్వర్తించలేని ఓ పోలీసు మనస్తత్వం ఎలా ఉంటుందనే విషయాన్ని సహజమైన మాటల్లో చెప్పిన విధానం ఈ మధ్య వచ్చిన పోలీసు సినిమాల్లో చూడలేదు. సినిమా జరుగుతున్నంత సేపు వేరే విషయాల గురించి ఆలోచించకుండా పూర్తిగా సినిమా గురించే ఆలోచించేలా చేశాడు దర్శకుడు. ఆ మధ్యలో గమనించని విషయమేమిటంటే, ఈ సినిమాలో ఒక్క పాట కూడా లేదు. కమర్షియల్ సినిమాలో ఇది ఒక సాహసోపేతమైన చర్య. దర్శకుడిలో పరిపక్వత లేకపోతే క్లబ్ మీద రైడింగ్ చేసే సమయంలో ఓ ఐటెం సాంగ్ ఉండేదేమో. అలా వెళ్ళకుండా, చెప్పాలనుకున్న విషయాలను సూటిగా చెప్పడం దర్శకుడి పరిపక్వతను తెలిపింది. రెండో సగంలో కథనంలో బాగా ఉత్కంఠను కలిగించాడు దర్శకుడు. ముఖ్యంగా, పతాక ఘట్టంలో బాంబును నిర్వీర్యం చేసే సమయంలో విజయ్ ఆలోచించిన విధానం నాకు బాగా నచ్చింది.

ఈ సినిమాలో సంతృప్తి కలిగించని కొన్ని అంశాలున్నాయి. మొదటిది, విజయ్ కు తన కుటుంబంతో ఉన్న సంబంధం అనే అంశం. విజయ్ పాత్రను నెలకొల్పడానికి ఈ అంశాన్ని దర్శకుడు బాగా వాడుకున్నాడు కానీ దాని ద్వారా కథనానికి పెద్ద ఉపయోగం కనబడలేదు. కానీ విజయ్ ఇంట్లోకి అడుగుపెడుతుండగా, “ఎంత లంచం ఇచ్చి ఉద్యోగం సంపాదించాడో కనుక్కో” అని అతడి తండ్రి అన్న సన్నివేశం నాకు నచ్చింది. అలాగే, చివర్లో హోంమంత్రి (కోట శ్రీనివాసరావు)తో ఉన్న సన్నివేశం అనవసరం అనిపించింది. అక్కడ కోట మరియు పృథ్వీరాజ్ ల నటనలు నవ్వించినా, సినిమా చూసిన తరువాత అది అవసరం లేదనిపించింది. ఇది నా అభిప్రాయం మాత్రమే.

మొత్తానికి, “టెర్రర్” అనే ఈ సినిమాకు అందరి ఆదరణ అవసరం. చిన్న సినిమా అని వెనక్కు నెట్టేయకుండా, కావలసినన్ని థియేటర్లు ఇస్తే మరింత ప్రేక్షకాదరణ లభిస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు.

నటనలు :

శ్రీకాంత్ సినిమా అంతా తానై నడిపించారు. నటుడిగా ఆయన అనుభవం ఈ సినిమాకు బాగా ఉపయోగపడింది. నిఖితకు పెద్దగా ప్రాముఖ్యత లేదు. కోట, పృథ్వీరాజ్ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. నాజర్, సుధ, రవివర్మ, తదితరులు ఫరవాలేదు.

ప్రత్యేకతలు :

  1. కథనం & దర్శకత్వం (Screenplay & Direction). సతీష్ కాసెట్టి పనితనం అద్భుతం. సరైన కథనం ఉంటే, అందరూ అనుకునే కమర్షియల్ అంశాలు లేకుండా కూడా ఓ కమర్షియల్ కథను చెప్పొచ్చు అని నిరూపించారు.
  2. శ్యాం ప్రసాద్ ఛాయాగ్రహణం (Cinematography). ఈ సినిమాకు ఇది మరో పెద్ద ఆకర్షణ. సినిమాలో లైటింగ్ వాడిన విధానం దగ్గర నుండి కలరింగ్ చేసిన విధానం వరకు అన్నీ బాగున్నాయి.
  3. సాయికార్తీక్ నేపథ్య సంగీతం (Background Score). ఇలాంటి థ్రిల్లర్ సినిమాలకు నేపథ్య సంగీతం ఎంతో ఉపయోగపడుతుంది. ఆ విషయంలో కార్తీక్ పనితనం అద్భుతం. ముఖ్యంగా, విజయ్ అతడి తండ్రి మధ్యనున్న సన్నివేశాల్లో వచ్చే నేపథ్య సంగీతం నాకు బాగా నచ్చింది.
  4. నిర్మాణ విలువలు (Production Values). నిర్మాత షేక్ మస్తాన్ తన మొదటి నిర్మాణంతోనే అభిరుచి గల నిర్మాతగా అనిపించారు.

బలహీనతలు :

  1. ఇది బలహీనత అనడంకంటే, అభిప్రాయం అని చెప్పడం సబబు. విజయ్ కుటుంబంతో ఉన్న సన్నివేశాలు పెద్దగా పండినట్టు అనిపించలేదు.

ఈ చిత్రం నేర్పిన పాఠాలు :

  1. సినిమాలో కంటెంట్ ఉంటే చాలు. దానికి కమర్షియల్ కంటెంట్ అవసరం లేదు.
  2. చిన్న సినిమా, పెద్ద సినిమా అనే కొలమానాలు లేవు. ఉన్నవి మంచి సినిమా మరియు చెత్త సినిమా అనే కొలమానాలు.

– యశ్వంత్ ఆలూరు

Click here for English version of this Review…

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s