రామాయణం కథను చాలామంది చెప్పారు. అందులో వాల్మీకిది ఒక శైలి, మొల్లది ఇంకో శైలి, గోన బుద్దారెడ్డిది మరో శైలి. మూడు కథలు ఆదరణ పొందాయంటే, వారి వారి శైలి వేరుగా ఉండడమే కారణం. సినిమా కూడా అంతే. ఒక కథను వేర్వేరు దర్శకులు తమ తమ శైలిని అనుసరిస్తూ చెప్పగలరు. అలాంటి దర్శకుల్లో “ప్రవీణ్ సత్తారు” ఒకరు. ఉదాహరణలు, మునుపు ఆయన తీసిన “ఎల్.బీ.డబ్ల్యు”, “రొటీన్ లవ్ స్టొరీ” మరియు “చందమామ కథలు”. ఈసారి “గుంటూర్ టాకీస్” అనే సినిమాతో మన ముందుకు వచ్చారు ప్రవీణ్. నరేష్, సిద్ధు జొన్నలగడ్డ, శ్రద్ధాదాస్, రష్మి గౌతమ్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమాను “ఆర్.కె.స్టూడియోస్” పతాకంపై “రాజ్ కుమార్” నిర్మించారు.
కథ :
గుంటూరులో ఉన్న ఇద్దరు చిల్లర దొంగలు గిరి (నరేష్) మరియు హరి (సిద్ధు) ఓసారి ఓ ఇంట్లో కొంత డబ్బును కాజేస్తారు. ఆ దొంగతనం వారి జీవితాలను ఎలా పరుగులు పెట్టించిందో అదే ఈ సినిమా కథాంశం.
కథనం :
“రొటీన్ లవ్ స్టొరీ”, “చందమామ కథలు” లాంటి సున్నితమైన కథలు చెప్పిన ప్రవీణ్ సత్తారు ఈసారి “గుంటూర్ టాకీస్” లాంటి రఫ్ సినిమాతో రావడం ఆశ్చర్యపరచడమే కాకుండా ట్రైలర్ తో ఆసక్తిని కూడా కలిగించింది. ఎప్పటిలాగే, ఇందులోని మంచి విషయాలను, ఇతర విషయాలను చర్చించుకుందాం.
మంచి విషయాలు…
దర్శకుడు ప్రవీణ్ క్రైమ్ కామెడీ కథను ఎంచుకున్నా, భిన్నమైన కథనంతో సినిమాను మొదలుపెట్టాడు. మొదటి సగంలో ముఖ్య పాత్రలైన హరి, గిరిల జీవితాలను చూపించిన విధానం “విశాల్ భరద్వాజ్” శైలిని తలపించింది. పాత్రల స్వభావాన్ని ముందే ఒక వాయిస్ ఓవర్లో చెప్పకుండా, వాటి దినచర్యను చూపిస్తూ, మెల్లగా వాటిని ప్రేక్షకులకు సూటి సన్నివేశాలతో చేరవేశాడు. కామంతో రగిలిపోయే హరి పాత్రను నెలకొల్పిన విధానం ఆకట్టుకుంది. గిరి పాత్రను నెలకొల్పిన విధానం అయితే అద్భుతం. ఆ పాత్రకు సంబంధించిన కొన్ని సన్నివేశాలు అద్భుతంగా పండాయి. ఉదాహరణకు…
- తన భార్య రోజారాణి బట్టలకొట్టు సుందరంతో లేచిపోతుండగా, గిరి ఆవిడను ఆపే సన్నివేశం.
- భార్యను కోల్పోయి నాలుగేళ్ళుగా పడక సుఖానికి దూరమైన బాధలో ఉన్న గిరి, హరి ఆ సుఖాన్ని అనుభవించడం చూసి ఆ తాపాన్ని బాత్రూంలో ఓ మాగజైన్లో ఓ శృంగార కథను చదివి తీర్చుకునే ప్రయత్నం చేస్తాడు. ఆ సమయంలో తన మోకాళ్ళ నొప్పులకు మందులు ఇవ్వమని అతడి తల్లి (పావలా శ్యామల) ఆటంకం కలిగిస్తుంది. ఎలాగైనా ఆ కథను పూర్తి చేయాలనుకుని తపన పడినా కథను పూర్తిగా చదవలేకపోతాడు.
ఈ రెండు సన్నివేశాలు తెరపై పండిన విధానం అద్భుతం. వాటి లీడ్ సన్నివేశాలు కూడా చాలా బాగున్నాయి. వాటికి బలమైన ఊతంగా మారింది నరేష్ గారి నటన. ఈ రెండు సన్నివేశాలు ఈ సినిమాలో చెప్పుకోదగినవి కనుక ఇక్కడ వాటిని వివరంగా ప్రస్తావిస్తున్నాను. సినిమాలోని చాలా విషయాలు పచ్చిగా చెప్పాడు దర్శకుడు. అవి అందరికి నచ్చకపోవచ్చు కానీ కథలోని ముఖ్యపాత్రల స్వభావానికి అలాంటి పచ్చి కథనమే సరైనది. సినిమాకు “ఏ” సర్టిఫికేట్ ఇచ్చినా కూడా “కుమారి 21F” లాంటి సినిమాల్లో అనేక మాటలను కట్ చేసి ఇబ్బందిపెట్టారు. కానీ ఈ సినిమాకు “ఏ” సర్టిఫికేట్ ఇచ్చి, చాలావరకు మాటలకు సెన్సార్ కట్స్ లేకుండడం మంచి పరిణామం. ఇంకా చెప్పాలంటే, ఇది పర్ఫెక్ట్ అడల్ట్ రేటెడ్ సినిమా.
సిద్ధు, రష్మిల మధ్యనున్న డ్యూయెట్ లో అందాల ఆరబోత ఎక్కువగా ఉన్నప్పటికీ, దాన్ని చిత్రించిన విధానం చూస్తే, కేవలం శారీరక వ్యామోహంతోనే మొదలయిన వారిద్దరి బంధాన్ని బలంగా నెలకొల్పినట్టుగా అనిపించింది. ఇది నా భావన. దీనితో మీరు ఏకీభవించలేకపోతే క్షమించగలరు.
నిరాశపరిచిన విషయాలు…
ఈ సినిమాలోని మంచి విషయాలన్నీ మొదటి సగంతోనే ముగిసిపోయాయి. ప్రత్యేకంగా ఉన్న మొదటి సగాన్ని చూసి విరామంలో దర్శకుడిని అభినందించేలోపే రెండో సగంలో మామూలు క్రైమ్ కామెడీ తరహాలోకి కథనం వెళ్ళిపోయింది. “స్వామీ రారా”తో మొదలైన ఈ పోకడ మొన్నటి “భలే మంచి రోజు” వరకు సాగి విసిగించిన తరుణంలో ఎంతో ప్రతిభ ఉన్న ప్రవీణ్ లాంటి దర్శకులు కూడా అదే పోకడను అనుసరించడం బాగా నిరాశపరిచింది. అనేక కొత్త పాత్రలను ప్రవేశపెట్టి, వాటి మధ్య ఒక సమస్యను సృష్టించి, అటు తెరపై నటించేవారికి, ఇటు ఆ తెరను చూసే ప్రేక్షకుడికి గందరగోళం సృష్టించడం సర్వసాధారణం అయిపొయింది. ఆ పాత్రలను ఉన్నట్టుండి అంతం చేయడం కూడా బాగోలేదు. కొన్నిచోట్ల నాన్ లీనియర్ కథనంతో చెప్పిన విషయాలు బలవంతంగా ఇరికించినట్టు అనిపించింది.
“మంచి విషయాల్లో” పచ్చి కథనం ఈ సినిమాకు సరిపోయిందని చెప్పాను. ఆ పచ్చిదనం నిర్దేశిత గమ్యం ఉన్న అన్ని పాత్రలకు సరిపోయింది, ఒక్క రివాల్వర్ రాణి (శ్రద్ధాదాస్) పాత్రాకు తప్ప. ఈ పాత్రకు హరిపై కామం తీర్చుకోవడం తప్ప మరో లక్ష్యం ఉండదు. అతడిపై కామం తీర్చుకోవాలనే లక్ష్యం కోసం గిరిని వాడుకొని అతడి పైనా తీర్చుకోవడం కోల్పోయిన పడక సుఖాన్ని అతడికి తిరిగిచ్చింది కానీ రివాల్వర్ రాణి పాత్రపై చెప్పలేనంత చులకన భావనను కలిగించింది. బహుశా, సృజనాత్మకత హద్దులు దాటితే ఇలాంటి పాత్రలే పుడతాయేమో అనిపించింది.
ఒక్క మాటలో…
“గుంటూర్ టాకీస్” అనే ఈ సినిమా ఎటువంటి హద్దులు లేకుండా అన్ని రకాల సినిమాలను ఆదరించే ప్రేక్షకులు మాత్రమే చూడగలరు. కేవలం “చందమామ కథలు” లాంటి సున్నితమైన కథలు ఇష్టపడే ప్రేక్షకులు ఎవరైనా ఆ దర్శకుడి పేరు చూసి ఈ సినిమాకు వెళ్ళాలి అనుకుంటే, ఒకటికి రెండుసార్లు నా ఈ సమీక్ష చదువుకొని వెళ్ళమని ప్రార్థన.
నటనలు :
ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ నరేష్ గారేనని చెప్పాలి. ఆయనకున్న అనుభవానికి, ఈ మధ్యకాలంలో ఆయనకు దక్కిన ఉత్తమ పాత్ర “గిరి”. దాన్ని ఆయన పోషించిన విధానం ఇంకా అద్భుతం. ముఖ్యంగా, పైన ప్రస్తావించిన ఆ రెండు సన్నివేశాలలో ఆయన లేకుంటే వాటిలో జీవమే ఉండేది కాదు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇక హరి పాత్రలో సిద్ధు కూడా పరిణితి చెందిన నటనను ప్రదర్శించాడు. ఈ మధ్యకాలంలో ఏ తెలుగు కథానాయికైనా, ఫలానా సినిమాలోని పాత్ర తన సినీజీవితానికి ఊతమిచ్చి, ఒక మైలురాయిగా నిలిచిపోతుందని ఏదైనా ఇంటర్వ్యూలో చెబితే అది పచ్చి అబద్ధమని నిర్ధారించుకోవచ్చు. ఇందులోని రష్మి మరియు శ్రద్ధాదాస్ లు “పచ్చి” ఉదాహరణలు. శ్రద్ధాను ఇలాంటి పిచ్చి పాత్రల్లోకంటే ఐటెం సాంగ్స్ లో చూడడమే బాగుందని నా అభిప్రాయం. మహేష్ మంజ్రేకర్ ఈ సినిమాలో మరో “ఏ” రేటెడ్ పాత్రను పోషించారు. “ఖానా ఖాయేగా?” అని అందరిని పంపించే ఆయన హావభావం బాగుంది. ఇక రఘుబాబు, రాజా రవీంద్ర, రవిప్రకాష్, ఫిష్ వెంకట్, తాగుబోతు రమేష్, జోగి నాయుడు, స్నిగ్ధ అందరూ మామూలు క్రైమ్ కామెడీ సినిమాల్లో కనిపించే పాత్రలే పోషించారు. ఈ వారం విడుదలయిన “గుంటూర్ టాకీస్” మరియు “కళ్యాణ వైభోగమే” సినిమాల్లో అలనాటి హాస్యనటి “పావలా శ్యామల”కు పాత్రలు ఇచ్చి ఆవిడకు తోడ్పాటును ఇవ్వడం ఆనందం కలిగించింది. మంచు లక్ష్మి, చైతన్య కృష్ణ అతిథి పాత్రల్లో కనిపించారు.
ఏకీకృత ప్రత్యేకతలు (Consolidated Eminences) :
- ప్రధాన పాత్రల చిత్రణ. ప్రధాన పాత్రలైన గిరి, హరిలను నెలకొల్పిన విధానం చాలా ప్రత్యేకంగా ఉండి దర్శకుడి శైలికి అద్దం పట్టాయి.
- నటనలు. నరేష్ మరియు సిద్ధు తమ పాత్రలకు సంపూర్ణమైన న్యాయం చేశారు.
- మొదటి సగం. బాలీవుడ్ తరహాలో ఉన్న మొదటి సగం ఈ సినిమాకు మరో బలం.
- రామ్ రెడ్డి ఛాయాగ్రహణం. కథ జరిగే ప్రదేశాలను ఎలా చూపించాలో అలాగే చూపించారు రామ్ రెడ్డి.
- కళాదర్శకత్వం. ఈ సినిమా కళాదర్శకుడి పేరు నోట్ చేసుకోవడం మరిచిపోయాను. కథనం జరిగే ప్రదేశాలను, పాత్రలు ఉందే ఇళ్ళను సరిగ్గా సరిపోయేలా సృష్టించిన ఆయనను ప్రత్యేకంగా అభినందించాలి. మీకు గుర్తుంటే దయచేసి క్రింద కామెంట్ చేయండి.
- నిర్మాణ విలువలు. దర్శకుడిని, కళాదర్శకుడిని నమ్మి నిర్మాత రాజ్ కుమార్ ఈ సినిమాకు సరిగ్గా ఖర్చుపెట్టారు అనిపించింది.
బలహీనతలు :
- మామూలు క్రైమ్ కామెడీ కలిగిన రెండో సగం.
- రివాల్వర్ రాణి పాత్ర.
- బలవంతంగా పెట్టినట్టుగా అనిపించిన నాన్ లీనియర్ కథనం.
ఈ చిత్రం నేర్పిన పాఠం :
సినిమా విషయంలో “భిన్నత్వంలో ఏకత్వం” కన్నా “ఏకత్వంలో భిన్నత్వం” అనే సూత్రమే పనికొస్తుంది.
– యశ్వంత్ ఆలూరు
Click here for English version of this Review…
Pingback: Guntur Talkies (2016) – Film Criticism