ఇప్పటి పరిశ్రమలో కేవలం “ఒక్క” సినిమా “పరాజయం” ఆ దర్శకుడి సినీజీవితంపై చాలా ప్రభావం చూపిస్తోంది. తరువాత తనను తాను నిరూపించుకోవడానికి అగ్నిపరీక్ష పెడుతోంది. అలాంటి పరీక్ష ఎదురుకొన్న ఓ దర్శకురాలు “నందిని రెడ్డి”. మళ్ళీ తన శైలిలోకి వెళ్ళి ఆవిడ తీసిన సినిమా “కళ్యాణ వైభోగమే”. నాగ శౌర్య, మాళవిక జంటగా నటించిన ఈ సినిమాను “శ్రీ రంజిత్ మూవీస్” పతాకంపై దామోదర్ ప్రసాద్ నిర్మించారు.
కథ :
పెళ్ళి అనే అంశంపై గౌరవం లేని శౌర్య (నాగ శౌర్య), దివ్య (మాళవిక) పెద్దల ఒత్తిళ్ళు తట్టుకోలేక ఓ పథకం వేసుకొని పెళ్ళి చేసుకుంటారు. ఆ పథకం ఏంటి? పెళ్ళి చేసుకున్న వారి జీవితాలు ఎలా మారాయి? అనేవి కథాంశాలు.
కథనం :
ఇలాంటి కథలు ఇదివరకే చాలా వచ్చాయి తెలుగులో. కానీ దర్శకురాలు నందిని రెడ్డి తనదైన శైలిలో ఈ కథను చెప్పే ప్రయత్నం చేశారు.
మంచి విషయాలు…
ఈ సినిమాకు సంబంధించి నందినిని మెచ్చుకోవాల్సింది పాత్రల చిత్రణ విషయంలో. చాలా పాత్రల్లో ఆవిడ ముద్ర స్పష్టంగా కనిపించింది. ఉదాహరణకు, పెళ్ళి సంబంధాలు చూసే ప్రగతి పాత్రలో, శౌర్య తండ్రి పాత్రను పోషించిన రాజ్ మదిరాజ్ లో. మహిళా దర్శకురాలు కాబట్టి మహిళల మనోభావాలను తెరపై బాగా ఆవిష్కరించగలిగింది. అమ్మ దగ్గర ఇష్టం వచ్చినట్టు మాట్లాడే దివ్య, తన తండ్రి దగ్గర మాత్రం అణకువతో అన్నింటికీ తల ఊపడం మరియు పెళ్ళిలో నాట్యం చేసే రాశి తన భర్తను చూసి వెంటనే ఆగిపోవడం లాంటివి ఉదాహరణలు.
ఈ సినిమాలో ముఖ్యమైన అంశం “పెళ్ళి” కనుక దాని విలువను చెప్పిన సన్నివేశాలు బాగున్నాయి. మొదటి సగంలో ఇప్పటి పెళ్ళిళ్ళ దుస్థితిని గురించి రాజ్ మాదిరాజు చెప్పే సన్నివేశం, రెండో సగంలో ఆనంద్ (దివ్య తండ్రి) పెళ్ళిని గురించి చెప్పిన సన్నివేశం మరియు చివర్లో “పెళ్ళి అంటే బాధ్యత కాదు స్నేహం” అని చెప్పే సన్నివేశంలో సంభాషణలు బాగున్నాయి.
ఈ సినిమాకు కొన్ని పాటలు ప్రాణం పోశాయి. మొదటి సగంలో పెళ్ళి తంతుని చూపించిన “శతమానం భవతి” పాట వినసొంపుగా ఉండడంతో పాటు చిత్రీకరణతో కూడా ఆకట్టుకుంది. అతిశాయోక్తి అనుకోకపోతే, మురారి సినిమాలోని పెళ్ళి పాటకు కొంచెం దగ్గరగా అనిపించింది. “అర్థనారీశ్వరం” అనే వాక్యం దగ్గర వధూవరులను చూపించిన షాట్ బాగా ఆకట్టుకుంది. అలాగే, శౌర్య, దివ్యల స్నేహం బలపడుతోందని చెప్పిన “చిరునవ్వులే” పాట కూడా బాగుంది. “మనసంతా మేఘమై” పాట చిత్రీకరణ కూడా నాకు నచ్చింది.
ఇంకా, మొదటి సగంలో శౌర్య, దివ్యలు హాజరయ్యే పెళ్ళి చూపుల సన్నివేశాలు నవ్వించాయి. అలాగే జెమిని సురేష్ ఉన్న సన్నివేశాలు కూడా నవ్వించాయి.
ఇతర విషయాలు…
కథ పాతది కనుక కథనంలో కొత్తదనం చూపించే అవకాశం పెద్దగా లేదు. అయినా కూడా నందిని ఏదో చెప్పాలన్న తపన కలిగి ఉన్నట్టుగా అనిపించింది. ఆ తపనే సినిమా కథనాన్ని బాగా తప్పుదారి పట్టించిందని చెప్పాలి. ఇలాంటి కథను నేరుగా మొదలుపెట్టొచ్చు. ఓ గతంలా చెప్పవలసిన అవసరం లేదు. పాటలు మినహా మొదటి సగం కొంచెం బోరు కొట్టించినా, రెండో సగంలో సన్నివేశాలు ఊహకు అందినవే అయినా, శౌర్య, మాళవిక నటనల వల్ల నిజానికి అవి బోరు కొట్టలేదు. దివ్యను తన తండ్రి తీసుకొని వెళ్ళిపోయే సన్నివేశంలో లేదా విడాకులపై సంతకం చేసే సన్నివేశంలో సినిమాను ముగించే అవకాశం ఉన్నా, కథనాన్ని కొన”సాగించడం” అనవసరం. నిజం చెప్పడానికి లాయరు పాత్ర ఉన్నప్పుడు, ఏదో న్యూస్ చానెల్ ని వాడుకోవాల్సిన అవసరంలేదు. “అలా మొదలయింది” సినిమా కథనం బలహీనపడిన సమయంలో “తాగుబోతు రమేష్” మరియు “ఆశిష్ విద్యార్ధి” పాత్రలు దాన్ని బలపరిచాయి. “కళ్యాణ వైభోగమే” కథనం బలంగా ఉన్నప్పుడు వీరిద్దరి పాత్రలు దాన్ని పూర్తిగా బలహీనపరిచాయి. ఇదే నందిని చేసిన పెద్ద తప్పు. నవ్వురాని హాస్యం, పనికిరాని సన్నివేశాలు 20 అదనపు నిముషాలతో ఈ సినిమాను 157 నిమిషాల సినిమాను చేశాయి. నిజానికి ఈ సినిమాకు 130 నిమిషాల లోపు నిడివి సరైనది. ఊహకు అందే కథనం ఉన్నా సరే, సరైన సమయంలో ముగిస్తే ప్రేక్షకుడికి చిరాకు రాదు. ఈ విషయంలో నందిని జాగ్రత్త వహించి ఉంటే బాగుండేది.
ఒక్క మాటలో…
“కళ్యాణ వైభోగమే” మాములుగా మొదలై పెళ్ళితో వైభోగంగా మారి, చివరకు పేదరికపు కథనంతో ఇబ్బందిపెట్టింది. కానీ, నటనల కోసం, పాటల కోసం ఈ సినిమాను చూడవచ్చు.
నటనలు :
నాగ శౌర్య ఈ సినిమాకు వెన్నెముక అయ్యాడు. అతడి నటనలో చాలా పరిణితి కనిపించింది. ముఖ్యంగా, రెండో సగంలో ఇంటికి వచ్చిన అత్తామామల దగ్గర నిజాలు దాచే విషయంలో అతడి నటన బాగా ఆకట్టుకుంది. మాళవిక కూడా పాత్రాకు బాగా సరిపోయి బాగా నటించింది. రాశి పోషించిన పాత్రకు మాటలు ఎక్కువగా లేకున్నా, హావభావాలతో ఆకట్టుకుంది. ముఖ్యంగా, తన భర్త భోజనం వడ్డించే సన్నివేశంలో ఆవిడ పలికించిన భావం హత్తుకుంది. ఐశ్వర్య, రాజ్ మాదిరాజు, ఆనంద్, ప్రగతి, పెర్ల్ మానె ఇలా అందరు తమ పాత్రలకు న్యాయం చేశారు. జెమిని సురేష్, హేమంత్ కాస్త నవ్వించగా, అతిథి పాత్రలు పోషించిన తాగుబోతు రమేష్ మరియు ఆశిష్ విద్యార్ధి సహనాన్ని పరీక్షించారు.
ప్రత్యేకతలు :
- కళ్యాణ్ కోడూరి సంగీతం. “శతమానం భవతి”, “మనసంతా మేఘమై” పాటలు వినడానికి చాలా హాయిగా ఉన్నాయి. నేపథ్య సంగీతం కూడా సన్నివేశాలకు సరిపోయింది.
- పాటల చిత్రీకరణ. పై రెండు పాటలతో పాటు, “చిరునవ్వులే” అనే పాట చిత్రీకరణ ఆకట్టుకుంది.
- లక్ష్మి భూపాల్ మాటలు. పెళ్ళి విలువను గురించి చెప్పిన అన్ని సన్నివేశాల్లో మాటలు బాగున్నాయి.
- జీ.వీ.ఎస్ రాజు ఛాయాగ్రహణం. పాటల్లో ఛాయాగ్రహణం చాలా బాగుంది.
- నిర్మాణ విలువలు. కథనం మరియు పాటలు అందమైన ప్రదేశాల్లో తీయడానికి కారణం నిర్మాత దామోదర్ ప్రసాద్ కారణం.
బలహీనతలు :
- కథనం. పైన చెప్పుకున్నట్టుగా, కథనంలో అవసరంలేని విషయాలను ఇరికించి ఇబ్బందిలో పెట్టారు దర్శకురాలు నందిని రెడ్డి.
- నిడివి. 130 నిమిషాలలోపు ముగించాల్సిన కథనాన్ని 157 నిమిషాల వరకు సాగించారు.
ఈ చిత్రం నేర్పిన పాఠం :
కొన్ని రకాల కథలకు పాత చింతకాయపచ్చడి లాంటి కథనమే కరెక్ట్. అలాంటప్పుడు, సినిమా నిడివిని కూడా దృష్టిలో ఉంచుకోవాలి.
– యశ్వంత్ ఆలూరు
Click here for English version of this Review…
Pingback: Kalyana Vaibhogame (2016) – Film Criticism