“సంతోషం”, “స్వాగతం”, “మిస్టర్ పర్ఫెక్ట్”, “గ్రీకువీరుడు” లాంటి సినిమాల వల్ల “దశరథ్” కుటుంబ చిత్రాల దర్శకుడిగా ప్రేక్షకుల చేత ముద్ర వేయించుకున్నారు. కేవలం కుటుంబ చిత్రాలే కాదు, ఇతర జోనర్లకు సంబంధించిన సినిమాలు కూడా తీయగలడని నిరూపించిన సినిమా “శౌర్య”. మంచు మనోజ్, రెజీనా జంటగా నటించిన ఈ సినిమాను “మల్కాపురం శివకుమార్” నిర్మించారు.
కథ :
తన ప్రేయసి నేత్ర (రెజీనా)ను హత్య చేశాడన్న నేరంపై పోలీసులు శౌర్య (మనోజ్)ను అరెస్ట్ చేస్తారు. ఆ తరువాత ఏమి జరిగింది? అసలు నిజాలేంటి అన్నది ఈ సినిమా కథాంశం.
కథనం :
“జరిగిన ప్రతి సంఘటన వెనుక మూడు కథలుంటాయి. ఒకటి జనం ఊహించేది, రెండు చేసినవాడు చెప్పేది, మూడు వాస్తవంగా జరిగింది”. ఈ అంశాన్ని ప్రధానంగా తీసుకొని దర్శకుడు దశరథ్ కథను వ్రాసుకున్నాడు. ఇందులో అంతర్లీనంగా ఉన్న “పరువు హత్యలు” అంశంపై ఇదివరకే రాధామోహన్ “గౌరవం” సినిమా వచ్చింది. అదే అంశాన్ని ఎంచుకున్నా, దానికన్నా ఈ సినిమా కథనం ఎంతో మెరుగు. ప్రతి పది నిమిషాలకు ఒక మెలిక వచ్చినా కూడా ఎక్కడా అవి మోతాదు మించినట్టు అనిపించలేదు. ఈ విషయంలో దర్శకుడికి సగం మార్కులు వేయాలి.
ఈ కథ ఒక రొమాంటిక్ థ్రిల్లర్. అంటే ఇందులో ప్రేమకథ చెబుతూ ప్రేక్షకుడికి ఉత్కంఠను కలిగించాలి. తనపై ఉన్న ముద్రను చేరిపేసుకోవడానికేమో దర్శకుడు దశరథ్ ఈ సినిమాలో ప్రేమకథ కన్నా థ్రిల్లర్ అంశాలపైనే ఎక్కువ దృష్టి సారించాడు. శౌర్య, నేత్రల ప్రేమకథ పెద్దగా ప్రభావం చూపలేదు. మొదటి సగంలో ప్రభాస్ శ్రీను పాత్ర కాస్త నవ్వించింది. ప్రకాష్ రాజ్ పాత్ర పరిచయం బాగుంది. నాన్ లినియర్ కథనంతో వెళ్తూ విరామం సమయానికి సరైన ఉత్కంఠను కలిగించాడు దర్శకుడు. అక్కడ ఇంకొన్ని మార్కులు వేయాలి.
రెండో సగంలో బ్రహ్మానందం పాత్ర పూర్తిగా అనవసరం. అది పండించిన హాస్యం కూడా నవ్వించలేదు. బ్రహ్మానందానికి బదులు వేరే నటుడిని ఎంపిక చేసుకొని సీరియస్ కథనాన్నే నడిపి ఉంటే బాగుండేది. అయినా తెలివిగా ఆ ఘట్టాన్ని తక్కువ సమయానికే తెగ్గోట్టేశాడు దశరథ్. ఈ మధ్యలో వచ్చే ఓ డ్యూయెట్ ని బాగా తీశారు.
ఇదే రెండో సగంలో మరో అద్భుతమైన అంశాన్ని చర్చించాడు దశరథ్. ఏడాది క్రితం ఢిల్లీ జూలో పులి బోనులో ఓ వ్యక్తి పడిపోయిన సంఘటనకు ఓ కొత్త అర్థం చెబుతూ దాన్ని కథనానికి అనుసంధానం చేసిన విధానం చాలా బాగుంది. ఈ పాయింట్ మీద అతడికి పూర్తి మార్కులు వేసేయాలి. దాని గురించి చర్చించాలని ఉన్నా, సినిమా చూడనివారి కోసం చేయడంలేదు. ఆ సన్నివేశం అంత బాగా రావడానికి కారణం మనోజ్ నటన కూడా. భావోద్వేగంతో కూడిన నటన వలన ఆ సన్నివేశం బాగా పండింది.
అలా, “శౌర్య” దర్శకుడు దశరథ్ తనపై పడిన ముద్రను చెరిపేసుకోవడానికి చేసిన ఓ నిజాయితి కలిగిన సినిమా. ఈ వారం విడుదలయిన సినిమాల్లో నాకు బాగా నచ్చిన సినిమా ఇదే. థ్రిల్లర్ సినిమా కనుక కూలంకషంగా కథనాన్ని విశ్లేషించలేదు. సినిమా చూసి తెలుసుకోండి.
నటనలు :
నిజం చెప్పాలంటే, ఇదివరకు మంచు మనోజ్ నటనకు నేను పెద్ద అభిమానిని కాదు. తెరపై అతడు చేసే అల్లరి, అస్తమానం మోహన్ బాబుని అనుకరించడం చూస్తే ఇబ్బందిగా అనిపించేది. కానీ ఈ సినిమాకు తన నటనతో ప్రాణం పోశాడు. ఎక్కడ కూడా రవ్వంతైనా అల్లరి లేకుండా, పాత్రకు తగ్గట్టుగా సహజమైన నటనను ప్రదర్శించాడు. కోర్టులోని ఓ సన్నివేశంలో సహజంగా ఏడ్చినట్టు అనిపించిన అతడి నటనకు అభిమానిని అయ్యాను. నా దృష్టిలో “వేదం” తరువాత అంత అణకువతో మనోజ్ నటించిన సినిమా ఇదే. ఇందుకు దశరథ్ కు కూడా ధన్యవాదాలు తెలుపుకోవాలి. రెజీనాకు నటించే అవకాశం ఈ సినిమాలోని నేత్ర పాత్ర ద్వారా లభించింది. ప్రకాష్ రాజ్ పాత్ర పరిచయం చాలా బాగుంది కానీ నటన మాములుగానే ఉంది. సుబ్బరాజు, నాగినీడు, సాయాజీ షిండే, నందు, సుధాకర్ నాయుడు, సుధ ఇలా అందరూ ఫరవాలేదు. ప్రభాస్ శ్రీను కాస్త నవ్వించగా, బ్రహ్మానందం, వేణు మరియు శివారెడ్డి విఫలమయ్యారు.
ఏకీకృత ప్రత్యేకతలు :
- కథాంశం, కథనం. పైన చెప్పిన రెండు అంశాలను కథ, కథనాలకు జోడించడంలో దర్శకుడి పరిపక్వత కనిపించింది. ఈ విషయంలో అభినందించాల్సిన మరో వ్యక్తి “గోపీమోహన్”.
- మనోజ్ నటన. పైన చెప్పుకున్నట్టుగా ఈ సినిమాకు దర్శకుడి తరువాత చెప్పుకోవాల్సినది ఇతడి నటన గురించే.
- నిడివి. కేవలం 122 నిమిషాల్లో సినిమాను ముగించాడు దర్శకుడు. ఈ మధ్యకాలంలో తక్కువ నిడివి ఉండడం సినిమాలకు అదనపు బలాన్నిస్తోంది.
- నేపథ్య సంగీతం. వేద ఈ సినిమాకు సరైన నేపథ్య సంగీతాన్ని అందించారు.
బలహీనతలు :
- పండని బ్రహ్మానందం హాస్యం. ఈ ఘట్టమే లేకుంటే బాగుండేది.
- ప్రభావం చూపలేని లేని ప్రేమకథ.
ఈ చిత్రం నేర్పిన పాఠం :
కథ, కథనాల మీద అవగాహన ఉండాలి. చెప్పే విషయాన్ని సూటిగా, నిజాయితిగా చెప్పాలి.
– యశ్వంత్ ఆలూరు
Click here for English Version of this Review…
Pingback: Shourya (2016) – Film Criticism