ఇప్పుడున్న పరిశ్రమలో “విజయం” అనేది దర్శకుడికి, ఇటు కథానాయకుడికి ఎంతో కీలకమైనది. ఒక్క సినిమా పరాజయం పొందినా చాలు ఫలానా దర్శకుడి తలరాత మారిపోవడానికి. ఆ “ఒక్క” సినిమాను చూసుకునే మన కథానాయకులు ఆ దర్శకుడికి మళ్ళీ అవకాశం ఇవ్వాలా వద్దా అని ఆలోచిస్తుంటారు. కానీ కొందరు కథానాయకులు ఈ సూత్రానికి దూరంగా ఉంటారు. అలాంటి కొద్దిమందిలో ఒకరు “నారా రోహిత్”. మంచి అభిరుచిగల కథానాయకుడిగా పేరొందిన ఈయన “గుండెల్లో గోదారి”, “జోరు” సినిమాలతో పరిచయమైన దర్శకుడు “కుమార్ నాగేంద్ర”పై నమ్మకంతో అవకాశం ఇచ్చిన సినిమా “తుంటరి”. తమిళంలో విజయవంతమైన “మాన్ కరాటే” సినిమా ఈ సినిమాకు మాతృక. రోహిత్ కు జంటగా లతా హెగ్డే నటించిన ఈ సినిమాను “శ్రీ కీర్తి ఫిలిమ్స్” పతాకంపై “అశోక్ బాబా” మరియు “నాగర్జున్” నిర్మించారు.
కథ :
ఓ స్వామీజీ వరం వల్ల స్నేహితులైన కిషోర్ (వెన్నెల కిషోర్), సుదర్శన్ (సుదర్శన్), కల్కి (కల్కి), పూజిత (పూజిత) మరియు ఆనంద్ (ఆనంద్)లకు జరగబోయే కొన్ని సంఘటనలు ముందే తెలిసిపోతాయి. దానిలో భాగంగా, రాజు (నారా రోహిత్) బాక్సింగ్ పోటిలో పాల్గొంటే తమ కష్టాలు తీరుతాయని తెలిసిన వీరు, దానికోసం రాజుని ఎలా కలిశారు? అతడి సాయం ఎలా పొందారు? అన్నవి కథాంశాలు.
కథనం :
ఈ సినిమా చూడాలన్న ఉద్దేశ్యంతో దీని మాతృక “మాన్ కరాటే”ను నేను చూడలేదు. ఆ కథను రచించిన “మురుగదాస్”ని మనస్పూర్తిగా అభినందించాల్సిన అవసరం ఎంతో ఉంది. కేవలం అదృష్టాన్ని, తలరాతని నమ్ముకోకుండా, మానవ ప్రయత్నం చేస్తే ఏదైనా సాధించవచ్చు అనే చక్కటి సందేశాన్ని ఈ కథ ద్వారా చెప్పారు. మాతృకకు కొన్ని మార్పులు చేసి ఈ సినిమాను తీశారని వినికిడి. కనుక, ఇది కుమార్ నాగేంద్ర తీసిన “తుంటరి” సినిమా మీద వ్రాసే సమీక్ష.
మంచి విషయాలు…
భవిష్యత్తుని తెలుసుకునే అంశం మీద ఇదివరకే సినిమాలు వచ్చినా, విడుదల ముందు చూపించిన ట్రైలర్ కు ఇలాంటి ఆరంభం సినిమాపై ఆసక్తిని కలిగించాడు దర్శకుడు. దీనికి మరో కారణం ఛాయాగ్రాహకుడు “పళని కుమార్” మరియు సంగీత దర్శకుడు “సాయికార్తీక్” అని చెప్పొచ్చు. తరువాతి కథనం ఏదో అలా సాగిపోయినా, మధ్యలో “డైమండ్ గర్ల్” పాట చిత్రీకరణతో మళ్ళీ ఆకట్టుకున్నాడు దర్శకుడు. ముఖ్యంగా ఇందులో నీలం, పసుపు మరియు ఎరుపు రంగులను సరిగ్గా వాడిన “మురళీ కొండేటి” కళాదర్శకత్వం చాలా బాగుంది. తరువాత చెప్పుకోదగ్గది విరామం సన్నివేశం. ఇది కథలో మంచి ట్విస్ట్.
మొదటి సగంలో కొన్ని సన్నివేశాలు నవ్వించాయి. రెండో సగంలో ముహమ్మద్ అలీ (అలీ) పాత్ర ప్రవేశించి కాస్త నవ్వించింది. రాజు చేసే బాక్సింగ్ కూడా నవ్వించింది.
ఇతర విషయాలు…
“మాన్ కరాటే” సినిమాను తెలుగులో తీసే సమయంలో కథకుడు మురుగదాస్ అందులోని ప్రేమకథను ఇంకొంచెం బలంగా తీయమని చెప్పాడట. కానీ దర్శకుడు కుమార్ నాగేంద్ర దాన్ని బలంగా తీసినట్టు అనిపించలేదు. ప్రేమ కోసం రాజు ప్రాణాలకు తెగించి పోరాడాలని నిర్ణయించుకున్నప్పుడు, సిరి (లత హెగ్డే)తో అతడి బంధాన్ని ఇంకొంచెం హృద్యంగా చూపించాల్సింది. వారిద్దరి మధ్యనున్న దాదాపు సన్నివేశాల్లో నవ్వించే ప్రయత్నమే చేశాడు తప్ప వారి ప్రేమను తెలిపే సన్నివేశాలు చాలా తక్కువ వ్రాసుకున్నాడు దర్శకుడు. “నేను పోటి నుండి పారిపోతే?” అని రాజు అడిగిన సన్నివేశంలో సిరి చెప్పిన సమాధానం ఆ పాత్రలో పరిపక్వత లోపించింది అని చెప్పింది.
ఈ సినిమా నిడివి 124 నిమిషాలే అయినా, రెండో సగం నెమ్మదిగా అనిపించింది. కారణం, అందులో ఉన్న రెండు పాటలు. నాయకానాయికల మధ్య ఒక్క డ్యూయెట్ పెట్టి, రాజు బాక్సింగ్ నేర్చుకునే సమయంలో ఒక పాట పెట్టి ఉన్నా బాగుండేది. అలాగే, చివర్లో బాక్సింగ్ కూడా సాగదీసినట్టుగా అనిపించింది.
ముగింపు…
అలా, “తుంటరి” సినిమా అక్కడక్కడ నవ్విస్తూ, ఒకట్రెండు మంచి సన్నివేశాలతో ఓ మామూలు సినిమాగా మిగిలిపోయింది.
నటనలు :
నారా రోహిత్ ఈ సినిమాతో కామెడీ టైమింగ్ ని బాగా మెరుగుపరచుకున్నాడు. కానీ ఇలాంటి కామెడీ సినిమాలకు కథానాయకుడు తక్కువ బటువు ఉండాలి. ఆ విషయంలో అతడు జాగ్రత్త తీసుకొని ఉంటే బాగుండేది. లత హెగ్డే పాత్రకు విలువ ఉంది కానీ అది అంతర్లీనంగానే. ఉన్న పాత్రలో కూడా నటించే అవకాశం లేదు. ఐదుగురు స్నెహిథులు కిషోర్, పూజిత, సుదర్శన్, ఆనంద్, కల్కి కథను ఆరంభించే పాత్రలు, వారి హాస్యం బాగుంది. విలన్ పాత్రను పోషించిన కబీర్ ఫరవాలేదు. అలీ కాస్త నవ్వించాడు. అలాగే, షకలక శంకర్ కూడా. మిగతావారివి గుర్తుపెట్టుకునే నటనలు కావు.
ప్రత్యేకతలు :
- మూలకథ. అదృష్టాన్ని కాకుండా కష్టాన్ని నమ్ముకుంటే అదృష్టం కూడా కలిసి వస్తుందని చెప్పిన మురుగదాస్ కథ బాగుంది.
- పళని కుమార్ ఛాయాగ్రహణం. సినిమా అంతా కనువిందైన ఛాయాగ్రహణం ఉంది.
- సాయికార్తీక్ సంగీతం. పాటలు ఓ మోస్తరుగా ఉన్నా, నేపథ్య సంగీతంతో సినిమాకు తనవంతు సాయం అందించాడు కార్తీక్.
- మురళీ కొండేటి కళాదర్శకత్వం. “డైమండ్ గర్ల్” పాటే కాకుండా, సినిమా అంతా కథకు సరిపోయే సెట్స్ నిర్మించారు మురళీ.
- నిర్మాణ విలువలు. సినిమాలో ఎక్కడా వృథా ఖర్చు పెట్టినట్టుగా అనిపించలేదు. నిర్మాతలు అశోక్ బాబా మరియు నాగర్జున్ ఉన్న బడ్జెట్లో కూడా సినిమా నాణ్యత విషయంలో రాజీపడలేదు.
బలహీనతలు :
- నెమ్మదిగా సాగిన కథనం. నిడివి 124 నిమిషాలే అయినా, చాల సేపు థియేటర్లో కూర్చున్న భావన కలిగింది.
- ప్రభావం లేని ప్రేమకథ. సరైన ప్రేమ సన్నివేశాలు లేకపోవడం వల్ల, రాజు పాత్ర పడిన కష్టాన్ని గుర్తించలేని పరిస్థితి వచ్చింది.
ఈ చిత్రం నేర్పిన పాఠం :
పైన చెప్పుకున్నట్టుగా, “విజయం” ఎంత కీలకమో, అది లేనప్పుడు వచ్చే “అవకాశం” మరింత కీలకం. దాన్ని వృథా చేసుకోకూడదు.
– యశ్వంత్ ఆలూరు
Click here for English version of this Review…
Pingback: Tuntari (2016) – Film Criticism