ఓ సినిమాను రీమేక్ చేయడం మాములుగా కాస్త కష్టమైన పనే. రీమేక్ చేయబోయే భాష ప్రేక్షకులను దృష్టిలో ఉంచుకొని మార్పులు చేయాల్సివస్తుంది. కానీ కొన్ని సినిమాల విషయంలో అది అవసరంలేదు. దానితో దర్శకుడి పని సులువు అయిపోతుంది. అలాంటి సినిమానే “రన్”. సందీప్ కిషన్, అనిషా ఆంబ్రోస్ జంటగా నటించిన ఈ సినిమాకు 2013లో వచ్చిన మళయాళ సినిమా “నేరం” మాతృక. “మిస్టర్ నూకయ్య” తీసిన “అని కన్నెగంటి” ఈ సినిమాకు దర్శకుడు. “ఏ.కె.ఎంటర్టైన్మెంట్స్” పతాకంపై సుధాకర్, కిషోర్ మరియు అజయ్ నిర్మించారు.
కథ :
బ్యాడ్ టైం వల్ల ఉద్యోగాన్ని కోల్పోయిన సంజయ్ (సందీప్) ఓ అవసరం కోసం వడ్డీ రాజా (బాబీ సింహా) దగ్గర అప్పు చేస్తాడు. ఆ అవసరం ఏంటి? చేసిన అప్పుని సంజయ్ ఎలా తీర్చాడు? తన ప్రేయసి అమూల్య (అనిషా)ను పెళ్ళి చేసుకున్నాడా లేదా? అన్నవి కథాంశాలు.
కథనం :
ఈ సినిమా మాతృక అయిన మలయాళం సినిమా “నేరం”ని నేను చూశాను. “రన్” సినిమా దర్శకుడు “అని” ఈ సినిమాలో ఎలాంటి మార్పులు చేయలేదు. “నేరం” సినిమాలోని పాత్రలన్నీ దాదాపుగా అన్ని భాషల ప్రేక్షకులకు దగ్గరయ్యేలా ఉంటాయి. బహుశా అందుకే ఈ సినిమాలో మాతృక నుండి ఎలాంటి మార్పులు చేయలేదేమో దర్శకుడు. థ్రిల్లర్ కనుక ఈ కథనాన్ని “సిడ్ ఫీల్డ్” పద్ధతిలో విశ్లేషించుకుందాం.
యాక్ట్ 1 – పరిచయం
భౌతికంగా కనిపించేవి కథలో పాత్రలుగా ఉండడం మామూలు. కంటికి కనిపించని “టైం”ని కథలో కీలక పాత్రను చేసినందుకు మళయాళ సినిమా కథకుడు “ఆల్ఫోన్స్”ని అభినందించాలి. పైగా, ఈ సినిమాలో అడుగడుగునా “టైం” ప్రస్తావన వస్తూనే ఉంటుంది.
ఎటువంటి థ్రిల్లర్ సినిమాకైనా పాత్రలు చాలా ముఖ్యం. కథ, కథనాల పట్ల ప్రేక్షకుడికి ఆసక్తి కలిగించేది పాత్రలే. సంజయ్ పాత్ర పరిచయం మెప్పించేలా ఉంది. వడ్డీ రాజా పాత్ర పరిచయం కూడా కొంచెం కొత్తగా అనిపించింది. దానికి మలయాళంలో చేసిన బాబీ సింహానే ఎంచుకొని మంచిపనే చేశారు. ఏ సంపత్ రాజ్ లాంటివారిని పెట్టుంటే మాములుగా ఉండేది. బాబీ తెలుగువారికి కొత్త కూడా. అమూల్య పాత్ర పరిచయం మాములుగానే ఉన్నా, ఆమె తండ్రి శ్రీనివాసులు (కాశీ విశ్వనాథ్) పాత్ర బాగుంది.
యాక్ట్ 2 – సమస్య
మాములుగా థ్రిల్లర్ సినిమాల్లో “సమస్య”కు కారణం ఒక పాత్ర అవుతుంది. కానీ ఈ సినిమాలో ఆ కారణం కూడా “సమయం” అవుతుంది. దాన్ని దర్శకుడు ఒప్పించిన విధానం బాగుంది. మాణిక్ (మహత్ రాఘవేంద్ర) అమూల్య వెంటపడే సన్నివేశంలో పాట అవసరంలేదు. “నేరం”లో కూడా ఆ సమయంలో పాట ఉంది. ఆ విషయాన్ని తెలుగులో మార్చుంటే బాగుండేది. ఈ క్రమంలో పద్మావతి (బ్రహ్మాజీ) పాత్ర అమూల్య తండ్రితో కలిసి అలరించింది.
యాక్ట్ 3 – పరిష్కారం
సమస్యకు కారణం సమయమే అయినప్పుడు దానికి పరిష్కారం కూడా సమయమే చూపుతుంది అన్న అంశం మీదే ఈ కథను వ్రాయడం జరిగింది కనుక దాని మీదే సినిమాను ముగించాడు దర్శకుడు. ఆ క్రమంలో తీసిన సన్నివేశాలు కాస్త బాగానే ఉన్నాయి. దర్శకుడు “అని”ని ఒక విషయంలో మెచ్చుకోవాలి. ఈ మధ్య ఇలాంటి థ్రిల్లర్ సినిమాల్లో పోసానిని తీసుకొని అతడి చేత “అతి” చేయించడం సర్వసాధారణం అయిపొయింది. ఈ సినిమాలో అతడిని చూసిన వెంటనే ఇదే భయం పట్టుకుంది. కానీ “నేరం” సినిమాను యథాతధంగా తీయడంతో త్వరగా అతడి పాత్రను, సినిమాను ముగించి కేవలం 109 నిమిషాల తరువాత ప్రేక్షకుడిని బయటకు పంపించేశాడు.
ముగింపు
“నేరం” సినిమా చూడని ప్రేక్షకులు ఈ సినిమాను ఓ మోస్తరుగా ఆనందిస్తారు అనే నమ్మకం అయితే ఉంది.
నటనలు :
ఇప్పటివరకు పలు సినిమాలు చేసిన సందీప్ కిషన్ హావభావాలు పలికించడంలో ఇంకా పరిణితి సంపాదించలేదు. ఎటువంటి భావోద్వేగానికి అయినా ఒకటే ముఖకవళికలు ఉండడం ఇబ్బందిగానే ఉంది. సినిమాల ఎంపిక ఎలాగు బాగుంది కనుక నటనపై మరింత దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. అనిషా పాత్రకు తగ్గట్టుగా అందంగా ఉంది. బాబీ సింహాకు ఆ పాత్ర చేయడం ఇది మూడోసారి. కాకపోతే తెలుగు ప్రేక్షకులకు అతడు కొత్త కనుక అతడి నటనను ఆనందిస్తారు. ముఖ్యంగా, “లెజెండ్” సినిమాలోని డైలాగుతో ఫోను మ్రోగిన ప్రతిసారీ అతడు ఇచ్చే హావభావాలు ఆకట్టుకుంటాయి. మహత్ రాఘవేంద్ర, ప్రవీణ్, పోసాని, కాశీ విశ్వనాథ్, బ్రహ్మాజీ ఇలా అందరూ తమ పాత్రలకు న్యాయం చేశారు.
ప్రత్యేకతలు :
- రాజశేఖర్ ఛాయాగ్రహణం. థ్రిల్లర్ కు మంచి ఛాయాగ్రహణం చేసే మేలు ఎంతో ఉంటుంది. రాజశేఖర్ కూడా తన పనితనంతో అలాంటి మేలే ఈ సినిమాకు చేశారు.
- ఎం.ఆర్.వర్మ కూర్పు. ప్రతీ సన్నివేశం మాతృకలోనిదే అయినా, కొన్ని షాట్స్ కట్ చేసిన విధానం బాగుంది. నిడివి కూడా 109 నిమిషాలు అవ్వడం మంచి విషయం.
- నిర్మాణ విలువలు. డిజిటల్ సినిమా వచ్చాక కెమెరాపై పెట్టాల్సిన ఖర్చు తగ్గిపోయింది కనుక చిన్న సినిమాలు కూడా ఈ మధ్య ధనికంగా కనబడుతున్నాయి. ఈ సినిమా నిర్మాతలు సుధాకర్, కిషోర్ మరియు అజయ్ నాణ్యతలో రాజీపడలేదు.
బలహీనతలు :
- నటనలు. బాబీ సింహా, బ్రహ్మాజీ లాంటివారిని మినహాయించి ఎవరి నటనా గుర్తుంచుకునేలా లేదు. ముఖ్యంగా, సందీప్ కిషన్ ది.
ఈ చిత్రం నేర్పిన పాఠం :
కొన్నిసార్లు రీమేక్ సినిమాలు యథాతధంగా మాతృక నుండి తీయడమే మంచిది. (నిడివి మరియు పోసాని పాత్ర)
– యశ్వంత్ ఆలూరు
Click here for English version of this Review…