సాహసం శ్వాసగా సాగిపో – ఇది “ఒక్కడు” సినిమాలోని పాట, నాగచైతన్య నటించే సినిమా పేరు మాత్రమే కాదు. “అక్కినేని నాగార్జున” సినీజీవిత సూత్రం కూడా. “గీతాంజలి” తరువాత “శివ”, “నిన్నే పెళ్ళాడుత” తరువాత “అన్నమయ్య” లాగే యాభై కోట్ల సంపాదించిన “సోగ్గాడే చిన్నినాయనా” తరువాత ఆయన చేసిన మరో సాహసం “ఊపిరి”. “మున్నా”తో పరిచయమై “బృందావనం” మరియు “ఎవడు” సినిమాలతో క్లాస్ మరియు మాస్ ప్రేక్షకులకు దగ్గరైన దర్శకుడు “వంశీ పైడిపల్లి” ఈ సినిమాకు దర్శకుడు. తమిళ నటుడు “కార్తి” మరో ప్రధాన పాత్రలో, తమన్నా కథానాయిక పాత్రలో నటించిన ఈ సినిమాను పీ.వీ.పీ సంస్థ నిర్మించింది. ఒకప్పటి ఫ్రెంచి సినిమా “ది ఇంటచ్చబుల్స్”కి రీమేక్ ఈ సినిమా.
దీని మాతృక ఫ్రెంచి సినిమాను నేను చూడలేదు. ఇది వంశీ పైడిపల్లి తీసిన “ఊపిరి” సినిమా మీద వ్రాసే విశ్లేషణ.
కథ :
పరోల్ లో ఉన్న శ్రీను (కార్తి) కోర్టుకి తన సత్ప్రవర్తనను నిరూపించుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. అందులో భాగంగా, అవిటితనంతో ఉన్న కోటీశ్వరుడు విక్రమ్ ఆదిత్య (నాగార్జున)కు అటెండరుగా చేరతాడు. ఆ తరువాత బలపడిన వీరిద్దరి స్నేహం కథే “ఊపిరి”.
కథనం :
ఇలాంటి కథను తెరకెక్కించాలంటే దర్శకుడికి సున్నితమైన భావోద్వేగాలను ఆవిష్కరించడం వస్తే చాలు కానీ పెద్ద నటులను ఇందులో నటింపజేయడానికి చాలా ధైర్యం కావాలి. వంశీకి ఆ రెండూ ఉన్నాయి. అంతే కాదు, ఇతడు తెలివైన దర్శకుడు కూడా. నిజానికి, వంశీ తీసిన “ఎవడు” నాకు నచ్చలేదు. కానీ అందులోని చిట్టచివరి సన్నివేశం సినిమాపై అగౌరవాన్ని తగ్గించలేకపోయినా, అలాంటి మాస్ సినిమాలో కూడా పరిపక్వత కలిగిన ఆ సన్నివేశం తీసినందుకు వంశీపై గౌరవాన్ని పెంచింది. అదే తెలివి ఈ సినిమాలో కూడా ఉపయోగించాడు. అందుకే, వంశీకి పూర్తిగా మార్కులు వేస్తూ విశ్లేషణను ప్రారంభిద్దాం. పెద్దదిగా అనిపిస్తే, చదవడం మధ్యలో ఒకసారి ఆపి, చిన్న “ఊపిరి” తీసుకొని మళ్ళీ మొదలెట్టండి. ఈ సినిమాకు…
ఊపిరి పోసిన విషయాలు…
- ఎటువంటి ఆర్భాటాలు, అనవసరపు డైలాగులు లేకుండా కథానాయకులను మొదటి సన్నివేశంలోనే పరిచయం చేసిన విధానం.
- “శ్రీను జైలుపాలు కావడం” అనే అంశానికి కథలో చాలా ప్రాముఖ్యత ఉన్నప్పటికీ, అతడు చేసిన నేరానికి దృశ్యరూపం కల్పించకపోవడం, ప్రేక్షకుడికి కూడా అది అవసరం అనిపించకుండా చేయడం. ఇది దర్శకుడి తెలివికి ఓ నిదర్శనం.
- ఇంటర్వ్యూలు తీసుకునే సమయంలో ఎగరలేని ఓ పావురాన్ని, చక్రాల కుర్చీలో కూర్చున్న విక్రమ్ ని చూపించిన సన్నివేశం.
- “నిన్ను చూసుకోవడానికి వీడికంటే మంచోడు దొరకలేదా?” అని లాయరు ప్రసాద్ (ప్రకాష్ రాజ్) విక్రమ్ తో అనగా, “అందరూ నన్ను జాలిగా చూస్తున్నారు. వీడికి జాలి, కరుణ లాంటివి లేవు కనుక నాకు నచ్చాడు” అని అతడు చెప్పే సమాధానం. ఇక్కడ మాటల రచయిత “అబ్బూరి రవి” గారి పనితనం బాగా ఉపయోగపడింది.
- విక్రమ్ ఇంట్లో పూర్తిగా అలవాటు పడే ముందు శ్రీను కీర్తి (తమన్నా), ఆయా (కల్పన) మరియు ప్రసాద్ లతో చేసిన అల్లరి. ఇందులో చెప్పుకోవాల్సినవి “పెయింటింగ్” సన్నివేశాలు. “చెల్లి పెళ్ళి కదా, ఖర్చులుంటాయి, వెళ్ళి పెయింటింగ్స్ వేసుకుంటాను” అని శ్రీను చెప్పే సన్నివేశం బాగా నవ్వించింది.
- కమర్షియల్ సినిమాల్లో ఆడంబరం కోసం ఐటెం సాంగ్ ని ఇరికిస్తారు దర్శకులు. కానీ ఈ సినిమాలోని ఐటెం సాంగ్ కథనానికి బాగా ఉపయోగపడింది. విక్రమ్ పాత్రతో పాటు కథనానికి కూడా ఊపిరి పోసింది. ఇది రచయిత విజయం. కనుక వంశీ, అబ్బూరి రవి, హరిలకు ఇక్కడ మార్కులు వేయాలి. పాట చివర్లో అందరి కాళ్ళ వంక చూస్తూ విక్రమ్ బాధపడే షాట్ కూడా రచన గొప్పతనమే.
- రెండో సగంలో, పారిస్ లోని ఇఫిల్ టవర్ ని పూర్తిగా చూడలేక ఇబ్బందిపడిన విక్రమ్ కు ఆ తరువాత మరో సందర్భంలో చూపించిన విధానం గుండెకు దగ్గరగా వచ్చింది. దీనికి “వినోద్” ఛాయాగ్రహణం, నాగార్జున నటన ఊపిరి పోశాయి. తను కోల్పోయిన ఆనందాన్ని మళ్ళీ శ్రీను తిరిగిచ్చాడు అనే భావాన్ని నాగార్జున పలికించిన విధానం చాలా బాగుంది.
- “భయముంటే ప్రేమ ఉన్నట్లే” అని శ్రీనుకి చెప్పిన విక్రమ్ మనసులో కూడా అతడు ప్రేమించిన నందిని (అనుష్క) జీవితం గురించి భయం ఉందని, ఆమె మళ్ళీ అతడిని కలిసిన సందర్భంలో “నువ్వేమిచ్చావో తెలుసా” అనే “సిరివెన్నెల”గారి పాటతో, స్వేచ్చగా ఎగిరే పావురాన్ని చూపిస్తూ దాన్నుండి అతడికి ఉపశమనం కలిగించిన విధానం ఈసారి గుండెను హత్తుకుంది. ఇక్కడ మరోసారి నాగార్జున నటన ఊపిరి పోసింది.
- “మీకు జీవితంలో కావాల్సింది కన్నీళ్లు వస్తే తుడిచే అటెండరు కాదు, అసలు కన్నీళ్ళే రాకుండా చేసే తోడు” అని శ్రీను విక్రమ్ తో చెప్పే సన్నివేశం కూడా దర్శకుడి తెలివికి నిదర్శనం. “ఎవడు” సినిమాలో చివరి సన్నివేశం లాగే, పాత్రల బాధ్యత తీర్చిన ఈ సన్నివేశం ఈ సినిమాకు ముగింపు కావడంతో సినిమాపై ఓ మంచి అభిప్రాయాన్ని కలిగించింది.
ఊపిరి పోయని విషయాలు…
- ఈ సినిమా కథను ఫ్లాష్ బ్యాక్ రూపంలో చెప్పాల్సిన అవసరంలేదు. నేరుగా చెప్పుంటే, విరామం సన్నివేశానికి ప్రేక్షకుడు కాస్త ఊపిరిని బిగపట్టేవాడు. ఫ్లాష్ బ్యాక్ లా మొదలుపెట్టడంతో, జరగబోయేది అప్పటికే మనసులో ఉంది కనుక విరామంలో హాయిగా ఊపిరి పీల్చుకునే అవకాశం కలిగించాడు దర్శకుడు. కనుక అది కథనానికి ఊపిరి పోయలేదని చెప్పాలి.
- శ్రీను చెల్లి పెళ్ళి విషయంలో విక్రమ్ తీసుకున్న నిర్ణయం బహుశా డబ్బు పిచ్చి ఉన్నవారికి సరైన బుద్ది చెప్పగలిగిందేమో కానీ ఆ తరువాత దాసు (తనికెళ్ళ భరణి) ప్రవర్తనను చూస్తే, అది పెద్దగా రుచించలేదు. ఇది మాతృకలోనిదో కాదో తెలియదు కానీ ఈ సినిమాలో మాత్రం బలవంతంగా చొప్పించినట్టు అనిపించి కథనానికి ఊపిరి పోయలేదు.
- పారిస్ లో తీసిన చేజింగ్ సన్నివేశం చివర్లో విక్రమ్ కి, ప్రేక్షకుడికి సంతోషం కలిగించింది. తరువాత విక్రమ్-శ్రీనుల పందెం క్రిమినల్ సినిమాలోని “తెలుసా మనసా” పాటలోని “Every breath you take, every move you make, I’ll be there with you” అనే వాక్యాన్ని వాడుకున్నా అక్కడ కథనానికి ఊపిరి పోయలేదు.
- శ్రీను-కీర్తిల ప్రేమాయణం కూడా ప్రభావం చూపలేదు. వారిద్దరి మధ్యనున్న “అయ్యో అయ్యో” పాట ప్రేక్షకుడు ఊపిరి పీల్చుకునేలా చేసింది కానీ కథనానికి కాదు.
- విరామం సమయంలో ప్రేక్షకుడు ఊపిరి పీల్చుకున్నా, కథనం ఫ్లాష్ బ్యాక్ తో ప్రారంభం అయ్యింది కనుక మొదటి సన్నివేశం ముందు ఏదో బలమైన సంఘటన జరిగి ఉంటుందని ప్రేక్షకుడు ఆశిస్తాడు. నిజానికి జరిగింది. కానీ ఆ బలం పాత్ర ఊపిరిని ఆపింది కానీ ప్రేక్షకుడిది కాదు. తద్వారా కథనానికి మళ్ళీ ఊపిరి పోయలేదు.
ఒక్క మాటలో…
పై లోటుపాట్లు వదిలేస్తే, “ఊపిరి” అనే ఈ సినిమా, మన వద్ద అన్నీ ఉన్నాయనుకొనే అసత్యపు నమ్మకంతో ముందుకెళ్తున్న ఈ తీరికలేని ఆశావాద జీవితాలలో నిజానికి ఏమి కోల్పోతున్నామో చెప్పింది. అందుకే, ఈ సినిమాను చూడమని ఈ విశ్లేషణ చదివే అందరికీ గట్టిగా సిఫార్సు చేస్తున్నాను.
నటనలు :
ఈ సినిమాకు ఊపిరి “నాగార్జున”. ఇలాంటి సినిమాను ఒప్పుకోవడమే కాదు దాన్ని ఎంతగానో ప్రేమించి విక్రమ్ పాత్రలో పూర్తిగా ఒదిగిపోయారు. “ఒక లైఫ్” పాట, ఇఫిల్ టవర్ చూసినప్పుడు, నందినిని కలిసినప్పుడు ఆయన పలికించిన భావోద్వేగాలు ఆయన “కింగ్” అని మరోసారి నిరూపించాయి. కార్తి కూడా తన పాత్రను ఎంతగానో ప్రేమించి చేశాడు. సొంతంగా డబ్బింగ్ చెప్పుకోవడం సినిమాకు ఎంతో ఉపయోగపడింది. అక్కడక్కడ తమిళ యాసలో వినపడిన మాటలు నవ్వించాయి. చెల్లి పెళ్ళి కుదిరినప్పుడు, “మా పెద్దబ్బాయితో మాట్లాడండి” అని అతడి తల్లి అన్నప్పుడు కార్తి పండించిన భావోద్వేగాలు చాలా సహజంగా ఉన్నాయి.
తమన్నాకు చెప్పుకోదగ్గ పాత్ర ఉందేమో అనుకుంటే అలాంటిదేమీ లేదని సినిమా చూశాక తెలిసింది. కానీ సొంత డబ్బింగ్ పాత్రకు బాగా సరిపోయింది. ప్రకాష్ రాజ్ లాయరు పాత్రలో బాగా చేశారు. కొన్ని హావభావాలు బాగా నవ్వించాయి. జయసుధ పాత్ర తెరపై ఎక్కువగా కనబడకపోవడంతో, ఉన్నంతలో బాగానే చేశారు. అలీ, కల్పన ఉన్నంతలో నవ్వించారు. అతిథి పాత్రను పోషించిన అనుష్క ఆ ఒక్క సన్నివేశాన్ని బాగా చేసింది. అడివి శేష్ మరియు శ్రియ చేసిన అతిథి పాత్రలకు మాటలు లేకపోవడంతో వాటి గురించి చెప్పుకోవాల్సిన అవసరంలేదు.
మరిన్ని ప్రత్యేకతలు :
- వినోద్ ఛాయాగ్రహణం. సినిమా అంతా అందమైన విజువల్స్, కలరింగ్ మరియు లైటింగ్ లతో నింపేశారు వినోద్. ఈ సినిమాకు ఈయన పనితనం ఊపిరి పోసింది.
- గోపి సుందర్ సంగీతం. “ఒక లైఫ్”, “పోదాం” మరియు “ఎప్పుడు ఒకలా ఉండదు” పాటలు ఆడియో విడుదల నుండే ఆకట్టుకున్నా, “నువ్వేమిచ్చావో” కథనంలో నచ్చింది. నేపథ్య సంగీతంతో కూడా ఊపిరి పోశారు గోపి.
- అబ్బూరి రవి మాటలు. పలుచోట్ల కథనానికి ఊపిరి పోశాయి ఈయన వ్రాసిన మాటలు.
- నిర్మాణ విలువలు. మంచి కథలకు అద్భుతమైన నిర్మాణ విలువలతో ఊపిరి పోయడంలో పీవీపీ సంస్థ ఇప్పటికే నిరూపించుకుంది. ఈ సినిమాతో మరోసారి తమ ప్రత్యేకతను చాటుకుంది.
బలహీనతలు :
- కథనం బలహీనమైన క్షణంలో సినిమాకు ఊపిరి ఆడదు. ఈ సినిమా కూడా రెండో సగంలో ఊపిరి తీసుకోవడంలో కాస్త ఇబ్బందిపడింది. దీని వల్ల నిడివి కూడా 158 నిమిషాల వరకు వెళ్ళింది.
ఈ చిత్రం నేర్పిన పాఠం :
ఎలాంటి కథనైనా “చెప్పే” ప్రతిభ ఉంటే సరిపోదు. నటులను ఒప్పించే ధైర్యం కూడా కావాలి.
– యశ్వంత్ ఆలూరు
Click here for English version of this Review…
చాల మంచి రివ్యు. నేను మాతృక చూసాను. అందులో తనికెళ్ళ భరణి సన్నివేశాలు వుండవు.ఐటమ్ సాంగ్ వుండదు. అనుశ్క సీన్స్ వుండవు. కాని అడాప్ట్ చేసుకున్న విధానం బాగుంది. మీరన్నట్టు.. నాగ్,కార్తీ తమ తమ నటనతో మెప్పించారు.
LikeLiked by 1 person
థాంక్స్ అండి…!!
LikeLike
Pingback: Oopiri (2016) – Film Criticism