ఎటాక్ (2016)

Attack Poster

ప్రతీ సినిమాకు రివ్యూ వ్రాసే ముందు ఆ సినిమాపై ఓ అవగాహన, దాని గురించి ఏమి రాయాలో ఓ ఆలోచన ఉంటాయి. కానీ కొన్ని సినిమాల మీద వ్రాసే రివ్యూలను ఎలా మొదలుపెట్టాలో అసలు అర్థంకాదు. పైగా, అది “రాంగోపాల్ వర్మ” సినిమా అయితే, ఆ తికమక మరింత పెరుగుతుంది. అలాంటి ఓ వర్మ సినిమానే “ఎటాక్”. మంచు మనోజ్, సురభి జంటగా నటించగా, జగపతిబాబు, ప్రకాష్ రాజ్, వడ్డే నవీన్ ముఖ్యపాత్రల్లో నటించారు. “సి.కె.ఎంటర్టైన్మెంట్స్” పతాకంపై “సి.కళ్యాణ్” నిర్మించారు.

“శివ”, “రక్తచరిత్ర” సినిమాలు తీసిన వర్మ అందరికీ నచ్చుతాడు. “దొంగలముఠా”, “ఐస్ క్రీమ్” సినిమాలు తీసిన వర్మను కూడా మీరు ఇంకా ఇష్టపడుతున్నారని మీకు స్పష్టంగా అనిపిస్తేనే ఈ రివ్యూని చదవడం కొనసాగించండి. లేదా వెంటనే ఆపేయమని నా మనవి…

ఈ “ఎటాక్” ధూల్పేటలోని వ్యాపారవేత్త గురురాజ్ (ప్రకాష్ రాజ్) హత్యతో మొదలవుతుంది. దానికి కారణం ఏంటి? దాని వెనుక ఎవరున్నారు? గురురాజ్ హత్యకు సంబంధించి అతడి కొడుకులు కాళి (జగపతిబాబు), భూపి (వడ్డే నవీన్) మరియు రాధ (మనోజ్) ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు అనే అంశాలమీద సాగుతుంది.

ఇది చాలా పాత కథ. పైగా, ఇలాంటి కథలు వర్మ తీసినన్ని సార్లు మరే దర్శకుడు తీయలేదేమో. అయినా, మళ్ళీ అలాంటి కథతోనే సినిమా ఎందుకని బహుశా వర్మను అడిగితే, “నాకు నచ్చినట్టు సినిమా తీస్తాను! నచ్చితే చూడండి లేదంటే లేదు!” అని టక్కున అనేస్తాడు. అందుకేనేమో ధియేటరులో నాతో కలిపి “అటు కూడిన, ఇటు కూడిన నలుగురంటే నలుగురే” ఉన్నారు. ఈ మాట కూడా వర్మతో పొరపాటున అంటే, “నా ఎటాక్ ని చూడమని నేనెవరినీ అడగలేదు!” అంటాడు. ఇదంతా ఆలోచిస్తే, ఎటాక్ జరిగింది గురురాజ్ మీద కాదు, దానికి ప్రత్యక్ష సాక్షి అయిన “ప్రేక్షకుడు” మీద అని తెలిసింది.

సినిమా విషయానికి వస్తే, కథ పాతదే అయినా, “చెడ్డవాడిని మంచితనంతో క్షమించి వదిలేయడం మహాపాపం” అనే మహాభారతంలోని వాక్యం చెప్పి, “ధర్మరాజు ఓడాడని…” అనే పాటతో సినిమాను మొదలుపెట్టిన విధానం బాగుంది. “సిరాశ్రీ” వ్రాసిన ఆ పాట సాహిత్యంపరంగా అద్భుతంగా ఉన్నా, “ఇప్పటి” వర్మకు సంగీతం పట్ల ఉన్న అభిరుచి ఆ పాటను చెవులకు ఎక్కనీయలేదు. బహుశా, ఈ ఒక్క పాటను మంచిగా కంపోజ్ చేయించి ఉంటే, చాలా బాగుండేది.

గురురాజ్ పాత్రని మొదట్లోనే అంతం చేసేసినా, అడుగడుగునా ఆ పాత్ర స్వభావాన్ని చూపిస్తూ దాని ఔన్నత్యాన్ని పెంచిన విధానం బాగుంది. ఆ సన్నివేశాల్లో ఆ పాత్రకు వ్రాసిన మాటల్లో లోతైన భావం కూడా ఉంది. ఉదాహరణే, ఓ సన్నివేశంలో కాళితో గురురాజ్ “మనిషికి కోపం పెరగొచ్చు, తగ్గొచ్చు లేదా పూర్తిగా పోవొచ్చు. కానీ శత్రుత్వం మాత్రం ఎప్పటికీ పోదు. సరైన అవకాశం కోసం ఎదురుచూస్తూనే ఉంటుంది” అని చెప్పే మాట. ఇలాంటివి సినిమాలో పలుచోట్ల వినిపిస్తాయి. అలాగే, మనిషిలోని ఆశ మూర్ఖత్వంగా మారినప్పుడు ఆ మనిషి భావోద్వేగాలు ఎలా ఉంటాయన్నది బహుశా వర్మ ఆవిష్కరించినట్టు మరే దర్శకుడు ఆవిష్కరించలేడేమో అనిపిస్తుంది. అందులోనూ, హత్య చేసింది ఎవరో కూడా చూపించకుండా, ఆ హత్య తాలూకు పరిణామాలను చూపించే విధానంలో వర్మకు వర్మే సాటి అని చెప్పాలి. ఈ సినిమా విషయంలో ఈ అంశానికి ఉదాహరణలు గురురాజ్ మరియు కాళి హత్యలు. ఇంకో మంచి విషయమేమిటంటే, వర్మ ఇదివరకు సినిమాల్లో కెమెరాతో వేసిన పిచ్చి వేషాలు ఈ సినిమాలో తక్కువగా ఉండడం.

ఇంకా, మనిషిని చూపించకుండా అతడి చేతికున్న ఉంగరాలు చూపించడం లాంటివి వర్మ సినిమాల్లోనే బాగా పాతబడిపోయిన అంశం. అయినా, అవి ఇంకా చూపించి ప్రేక్షకులను శత్రువులుగా మార్చుకోవడం వర్మ తత్వం. పైగా పూనమ్ కౌర్ ని చూస్తే, ఇదేం గోలరా బాబు? ఆ మనిషి మారడా? అనిపిస్తుంది. సినిమా ఎంత చెత్తగా ఉన్నా కూడా ఆ సినిమాను దాటి వేరే విషయాన్ని గురించి ఆలోచించే అవకాశం ప్రేక్షకుడికి వర్మ ఎప్పుడూ ఇవ్వడు. అందుకేనేమో, అతడి సినిమాలను ఇంకా డిస్త్రిబ్యూటర్లు కొంటూనే ఉన్నారు.

ఇప్పటివరకు వర్మ తీసిన డాక్యుడ్రామాలు “రక్తచరిత్ర”, “26/11 ముంబై దాడులు”, “కిల్లింగ్ వీరప్పన్” తీసుకుంటే, ఏ పాత్రను కూడా మంచిదనో, చెడ్డదనో చూపించలేదు. కేవలం, తమ ఆశయాన్ని సాధించడానికి ఏదైనా చేసే పాత్రలుగానే చూపించాడు. కానీ ఈ సినిమాలో “మనకు నచ్చిందే మంచి, నచ్చనిది చెడు” అని మొదట్లో “ధర్మరాజు ఓడాడని” పాటలో చెప్పిన వర్మ ఆ అంశాన్ని పూర్తిగా నిరూపించలేకపోయాడు. “కిల్లింగ్ వీరప్పన్” సినిమాలో వీరప్పన్ ని ఎందుకు చంపాలి అనే ప్రశ్నను వదిలేసి ఎలా చంపాలి అనే ప్రశ్నను ప్రేక్షకుల మదిలో నాటిన వర్మ, ఈ సినిమాలో మాత్రం, ఒకప్పుడు రౌడీగా ఉండి, అన్నీ వదిలేసిన మంచి వ్యక్తి గురురాజ్ పై ఎటాక్ జరగడం తప్పు, అలా చేసినవారిని చంపేయాలి అనే భావన ఎందుకు కలిగించాడు? బహుశా, గురు, కాళి, భూపి, రాధ పాత్రల్లో మంచి పేరున్న నటులు ఉన్నందుకా? లేక, వీరికి శత్రువుగా అభిమన్యు సింగ్ లాంటి విలన్ నటించినందుకా? కమర్షియల్ చట్రంలో వర్మ ఇరుక్కున్నాడా? పోనీ, అది చూసే ప్రేక్షకుడి మనస్తత్వమా? మరి, “రక్తచరిత్ర”లో ఒకప్రక్క వివేక్, మరోప్రక్క సూర్య నటిస్తే, ఇద్దరూ మంచిపనే చేశారు అన్న భావన ఎందుకు కలిగింది? వీటికి సమాధానం వెతుక్కునే ఓపిక నాకు ముమ్మాటికీ లేదు.

ఏదేమైనా, తాము చేసింది సరైన పనేనని చివర్లో “ఓ మనిషిని చంపడం చెడ్డ విషయం కావచ్చు. కానీ చంపాలన్న ఉద్దేశ్యం మంచిదై ఉండొచ్చు” అని రాధ ద్వారా తనును తాను సమర్థించుకున్నాడు వర్మ.

ఒక్క నిమిషం…

అసలు నేనేమి వ్రాస్తున్నాను? ధియేటరులో నలుగురు ప్రేక్షకులు మాత్రమే ఉన్నారంటే ఆ సినిమా స్థాయెంతో తెలిసిపోయింది కదా, అయినా, ఎలా వ్రాయాలో, ఏమి వ్రాయాలో తెలియదు అంటూనే, ఆ సినిమా గురించి ఇంతగా వ్రాస్తున్నానేంటి?

ఈ ప్రశ్నలు, వ్రాసే నా మనసులోనే ఉన్నాయంటే, చదివే మీ మనసుల్లో తప్పకుండా ఉంటాయి. అయినా, ఈ చెత్త సినిమా నాకు ఎలా నచ్చిందని చూసినవారు నన్ను తిట్టుకొని, ఇకపై నా రివ్యూలు చదవడం మానేస్తారేమోనన్న భయం కూడా నన్ను వెంటాడుతోంది. తన “ఎటాక్” సినిమా ద్వారా నా పాఠకులతో నామీద “ఎటాక్” చేయించే పన్నాగం పన్నాడేమో వర్మ అని భయంగా ఉంది. వర్మలాగే నాకు కూడా ఈ రివ్యూ ద్వారా శత్రువులు తయారవుతారేమో! అంతా “క(వ)ర్మఫలం“.

“ఓ రాక్షసుడిని చంపడానికి రాక్షసుడిలా మారడం తప్పు కాద”ని వర్మ చెప్పినట్టు, ఇలాంటి వర్మ సినిమాపై రివ్యూ వ్రాయడానికి నేను కూడా అక్కడక్కడ “వర్మ”లా మారక తప్పలేదు. నేను వ్రాసింది తప్పు అనుకుంటే మన్నించండి. ఇకపై నా రివ్యూలే చదవకూడదు అనే కఠిన నిర్ణయం తీసుకొని ఉంటే క్షమించండి. ఇది నా అభిప్రాయం మాత్రమే. నేను వర్మలా మారడానికి ప్రయత్నించానేమో కానీ నేను ఎప్పటికీ వర్మను కాలేను. నాకు శత్రువులు వద్దు. అందుకే ఈ సినిమాలో నటనల గురించి, సాంకేతిక నిపుణుల గురించి వ్రాయడంలేదు. మిగతా రివ్యూల్లా దీన్ని ఇంగ్లీషులో కూడా తర్జుమా చేయడంలేదు.

“వంగవీటి”తో తెలుగులో సినిమాలు తీయడం ఆపేస్తానని చెప్పిన వర్మకు శుభాకాంక్షలు తెలుపుతూ, “సావిత్రి” సినిమా రివ్యూతో మళ్ళీ మిమ్మల్ని పలకరిస్తాను. ఎప్పటికీ మీ స్నేహం కోరుకుంటూ… 🙂

– యశ్వంత్ ఆలూరు

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s