కమర్షియల్ తెలుగు సినిమాలో కథానాయికకు ఉన్న ప్రాధాన్యం చాలా తక్కువ. పైగా, పేరున్న కథానాయకుడు ఉంటే, అది కేవలం పాటలకే పరిమితం అవుతుంది. ఈ పోకడకు భిన్నంగా తెరకెక్కిన సినిమా “సావిత్రి”. నందిత, నారా రోహిత్ జంటగా నటించిన ఈ సినిమాకు “ప్రేమ ఇష్క్ కాదల్”తో పరిచయమైన “పవన్ సాదినేని” దర్శకత్వం వహించారు. “విజన్ ఫిలిం మేకర్స్” పతాకంపై “వీ.బీ.రాజేంద్రప్రసాద్” నిర్మించారు.
కథ :
చిన్నప్పటినుండి “పెళ్ళి” అంటే పిచ్చి ఇష్టంతో పెరిగిన సావిత్రి (నందిత)కి ఓ రైలు ప్రయాణంలో రిషి (నారా రోహిత్) పరిచయమవుతాడు. మొదటి చూపుకే సావిత్రిని ఇష్టపడిన రిషి, సావిత్రి మనస్తత్వాన్ని ఎలా అర్థం చేసుకున్నాడు? చివరకు, ఆమె మనసును ఎలా గెలిచాడు అన్నది కథాంశం.
కథనం :
ముందుగా ఈ కథ వెనుక దర్శకుడి ఆలోచనను మెచ్చుకోవాలి. మాములుగా అయితే, ఇలాంటి కథల్లో కథానాయకుడు ముందు కథానాయికను అవలీలగా ప్రేమలో పడేసి, ఆ తరువాత ఆమె కుటుంబాన్ని పడేసే ప్రయత్నం చేస్తాడు. అది “శ్రీనువైట్ల”లాంటి దర్శకులు మొదలుపెట్టిన పోకడ. పవన్ సాదినేని తెలివిగా అదే పోకడను అటువైపు నుండి “తిప్పి” చెప్పడం చాలా బాగుంది. అందుకు అతడికి మార్కులు వేయాలి.
గౌరవించదగ్గ విషయాలు…
పైన చెప్పినట్టుగా మామూలు పోకడను “తిప్పి” చెప్పడమంటే, రిషికి సావిత్రి అంగీకారమే చాలా ముఖ్యం. సినిమా అంతా రిషి సావిత్రి పట్ల ఎంతో గౌరవం చూపించాడు. ఆమె మనసును గెలవడానికి ఎక్కడా నటించలేదు, ఆమె కోసం ఆమె ముందే ఎవరినైనా కొట్టి తన మగతనం నిరూపించుకోలేదు. అలాగని ఆమెకు ఎవరూ హాని చేయకుండా చూసుకున్నాడు. తను తనలాగే ఉంటూ, సావిత్రిని సావిత్రిలాగే ప్రేమించాడు, ఆమె కుటుంబాన్ని కూడా గౌరవించాడు. అందరి ముందు సావిత్రి అతడికి చెంపదెబ్బ ఇస్తే, చుట్టూ అందరూ నవ్వుతున్నా సరే భరించాడు. ఇంతటి గౌరవం ఇప్పటి కమర్షియల్ కథానాయకుడు తన కథానాయికకు ఇవ్వడం చాలా అరుదు. రిషికే కాదు, అతడిని అర్థం చేసుకోకుండా ఇబ్బందిపెట్టే సావిత్రిపై ప్రేక్షకుడికి కూడా ఎక్కడా అగౌరవం కలగదు. ఇది సినిమా మొత్తంలో ఎక్కడా తప్పకుండా చూసుకున్నందుకు దర్శకుడు పవన్ ని అభినందించాలి.
రిషికే కాదు, సావిత్రి అంటే దర్శకుడికి కూడా చాలా గౌరవం. అందుకే, సినిమా మొదలైన 15 నిమిషాల వరకూ సావిత్రి ఎలా జన్మించింది, ఎలా పెరిగింది, ఆమె మనస్తత్వం ఎలాంటిది అన్నది చూపించాడు తప్ప కథానాయకుడి ప్రస్తావన ఎక్కడా తీసుకొని రాలేదు. దర్శకుడికి సంగీత దర్శకుడు “శ్రవణ్” తనవంతు సాయాన్ని “అనగనగ” అనే మంచి పాటతో అందించాడు. అంతే కాకుండా, రైలు ప్రయాణంలో సావిత్రి, రిషి ఎదురుపడిన సందర్భాల్లో “పిల్లో ఓ పిల్లో” పాట రాగాన్ని పలు సంగీత వాయిద్యాల సాయంతో వినిపించి మనసుకు ఆనందం కలిగించాడు. పవన్ కూడా ఆ పాటలో సావిత్రి మనస్తత్వాన్ని బాగా చూపించాడు.
తరువాతి కథనం ఎలాగో సాగినా, ప్రీ క్లైమాక్స్ నుండి సినిమాపై మళ్ళీ గౌరవాన్ని పెంచింది. దీనికి కారణం, దర్శకుడు పవన్ తో పాటు మాటల రచయిత “కృష్ణచైతన్య” కూడా. మంచి మాటలతో కథలోని డ్రామాను నడిపించాడు. అవే మాటలే సావిత్రిని పూర్తిగా అర్థం చేసుకున్న రిషి ప్రేమను సావిత్రికి అర్థమయ్యేలా చేశాయి.
కమర్షియల్ అంశాలకు వస్తే, రైలు ప్రయాణం కాస్త నవ్వించింది. రెండో సగంలో పేకాడే సమయంలో సావిత్రి రిషికి ఫోను చేస్తే, ప్రభాస్ శ్రీను “నా కూతురు!” అనే మాట సందర్భానుసారంగా బాగా నవ్వించింది.
గౌరవించలేని విషయాలు…
ఈ సినిమాలో “రవిబాబు” పోషించిన పాత్ర తాలూకు అంశం అస్సలు ఆకట్టుకోలేదు. బహుశా అది హాస్యం పండించిందేమో కానీ కథకు అది ఏమాత్రం అవసరంలేదు. అలాంటిదే “పోసాని కృష్ణమురళి” చేసిన “కృష్ణుడి” పాత్ర కూడా. ఆ సమయానికి ఒక బకరా కావాలి కనుక బలవంతంగా పోసానిని ఇరికించాడు దర్శకుడు. దీనికి తోడు అవసరం ఉన్నా, లేకపోయినా, చంద్రబాబునాయుడు, బాలకృష్ణల ప్రస్తావన తీసుకొనిరావడం కూడా బలవంతంగా చొప్పించిందే. రెండో సగంలో జాతకాల మీద వచ్చే పోరాటం కూడా ఇదే కోవకే చెందుతుంది. ఇవన్నీ దర్శకుడు సావిత్రిని పక్కనపెట్టి తన కథానాయకుడిని పట్టించుకొని చేసినవే. అయినా, కమర్షియల్ సినిమాలో ఇలాంటివి సాధారణం అయిపోయాయి కనుక ఏమి చేయలేని పరిస్థితి.
ఒక్క మాటలో…
“సావిత్రి” కథానాయికకు ప్రాధాన్యం ఉన్న కమర్షియల్ సినిమా. అక్కడక్కడా “దిల్వాలే దుల్హనియా లేజాయేంగే” ఛాయలు కనిపించినా సరే, ప్రధాన పాత్రల చిత్రణ కోసం ఒకసారి చూడొచ్చు అని నా అభిప్రాయం.
నటనలు :
సావిత్రి పాత్రను నందిత బాగానే పోషించింది. కొన్నిచోట్ల మాత్రం నటించడానికి “ప్రయత్నించినట్టు” అనిపించింది. ముఖ్యంగా, మాయాబజార్ “అహ నా పెళ్ళంట” పాటకు నాట్యం చేసిన ఆ చిన్న సన్నివేశాల్లో. కానీ పాత్రపై ఆమెకున్న ప్రేమ మాత్రం స్పష్టంగా తెలిసేలా చేసింది. ఎప్పుడూ చెప్పే విషయమే. నారా రోహిత్ నటనతో పాటు బరువుని కూడా పెంచుతున్నాడు. కమర్షియల్ ప్రేమకథలకు కథానాయకుడు ఇంత బొద్దుగా ఉంటే చూడడానికి ఇంపుగా ఉండదు. అంత బరువుతో అతడు ప్రేమ సన్నివేశాల్లో నటిస్తే ప్రేక్షకుడికి ఇబ్బందిగా అనిపిస్తుంది. త్వరగా సన్నబడితే తన నటనా పరిధిని మరింత పెంచుకునే అవకాశం రోహిత్ కు ఉంది. ఈ సినిమా విషయానికి వస్తే, చివర్లో తాగొచ్చి సావిత్రితో మాట్లాడే సన్నివేశంలో బాగా నటించాడు రోహిత్. దీనికి మించి, ఇలాంటి కథను ఎటువంటి ఇగో లేకుండా ఒప్పుకున్నందుకు అతడిని అభినందించాలి.
భావోద్వేగపు సావిత్రి తండ్రి పాత్రలో అతి భావోద్వేగాలు పండించే రావురమేష్ ని కాకుండా మురళీశర్మను తీసుకొని మంచిపని చేశాడు దర్శకుడు. అతడికి ఇలాంటి పాత్రలే ఎక్కువ దక్కితే బోరు కొట్టేస్తాడు. అజయ్, ప్రభాస్ శ్రీను, సత్య, రమాప్రభ, వెన్నెల కిషోర్, రవిబాబు, జీవా, ఫిష్ వెంకట్, సత్యం రాజేష్, షకలక శంకర్, పోసాని ఇలా అందరూ ఫరవాలేదు. వీరందరి కంటే, సావిత్రి అక్క పాత్రను చేసిన ధన్య బాలకృష్ణ నటన నాకు నచ్చింది.
మరిన్ని ప్రత్యేకతలు :
- వసంత ఛాయాగ్రహణం. పల్లెటూరి వాతావరణాన్ని, చివర్లో పెళ్ళి మండపంలోని సన్నివేశాలను చూపించిన విధానం సినిమాకు బాగా ఉపయోగపడింది.
- శ్రవణ్ సంగీతం. “అనగనగా” మరియు “పిల్లో ఓ పిల్లో” పాటలు బాగున్నాయి. వీటికి తోడు మంచి నేపథ్య సంగీతాన్ని కూడా అందించాడు.
- కృష్ణచైతన్య మాటలు. “అమ్మాయిలు అర్థం చేసుకోకపోతే బాధపడతారు. అర్థం చేసుకుంటే కోప్పడతారు”. ఇలా పలు మాటలు బాగున్నాయి.
- నిర్మాణ విలువలు. నిర్మాత రాజేంద్రప్రసాద్ కూడా “సావిత్రి”ని గౌరవించి ఖర్చుకు ఎక్కడా వెనుకాడలేదు.
బలహీనతలు :
- అనవసరపు కమర్షియల్ హంగులు. పైన పేర్కొన్న విషయాలు లేకుంటే సినిమా గాడి తప్పేది కాదు. పైగా రెండో సగం కొంచెం బోరు కొట్టడానికి కూడా ఆ సన్నివేశాలే కారణం అయ్యాయి.
ఈ చిత్రం నేర్పిన పాఠం :
సినిమాలోని పాత్రలపై వాటిని సృష్టించిన రచయితతో పాటు చూసే ప్రేక్షకుడికి కూడా గౌరవం కలిగించాలి. (ఇది విమర్శ కాదు)
– యశ్వంత్ ఆలూరు
Click here for English version of this Review…