ఏ సినిమాకైనా కథే ప్రాణం. ఒకవేళ కథ బలంగా లేకపోయినా, కథనం పటిష్టంగా ఉంటే చాలు, ఆ సినిమా బ్రతికేస్తుంది. కానీ కొన్ని సినిమాలకు ఈ విషయాలు కూడా అక్కర్లేదు. కేవలం కథానాయకుడు చాలు. అలాంటి కథానాయకుడే “పవర్ స్టార్ పవన్ కళ్యాణ్”. ఆయన సినిమాలను కథ, కథనాలకన్నా అభిమానమే నడిపించేస్తుంది. ఆయనకున్న అభిమానాన్ని రెట్టింపు చేసిన సినిమా “గబ్బర్‌సింగ్”. ఇప్పుడు అదే పేరుని వాడుకుంటూ “సర్దార్ గబ్బర్‌సింగ్” అనే సినిమాతో మన ముందుకు వచ్చారు పవన్. “పవర్” సినిమాతో పరిచయమైన “రవీంద్ర” అలియాస్ “బాబీ” దర్శకుడిగా, కాజల్ కథానాయికగా, పవన్ సొంత కథ, కథనాలతో తెరకెక్కిన ఈ సినిమా ఉగాది పండుగ రోజు విడుదలయి “దుర్ముఖి” నామ సంవత్సరాన్ని ప్రారంభించింది. శరత్ మారార్, పవన్ కళ్యాణ్, సునీల్ లుల్లా ఈ సినిమాకు నిర్మాతలు.
అందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలుపుకుంటూ సమీక్షను ప్రారంభిస్తున్నాను.పెద్దదిగా అనిపిస్తే క్షమించండి.
మీరు సినిమా చూసినా, చూడకపోయినా నా ఈ సమీక్ష వల్ల మీకు ఎటువంటి హాని జరగదని మాటిస్తున్నాను. ఇది కేవలం నా అభిప్రాయం మాత్రమే.
నాంది
కథ :
రతన్పూరు రాజ సంస్థానంలోని ప్రజలను భైరో సింగ్ (శరద్ కేల్కర్) అనేక ఇబ్బందులు పెడుతుంటాడు. ఆ ఊరికి బదిలీపై వెళ్ళిన సర్దార్ గబ్బర్‌సింగ్ (పవన్ కళ్యాణ్) అతడినెలా అడ్డుకున్నాడు? ఆ సంస్థానంలోని రాజకుమారి అర్షిత (కాజల్) కథేంటి? అనేవి కథాంశాలు.
కథనం – దర్శకత్వం :
ఈ సినిమా ప్రారంభం అయినప్పటినుండే అంచనాలు పెంచేసింది. పైగా దర్శకుల మార్పు, షూటింగ్ ఆలస్యం అవ్వడంతో ఆ అంచనాలు రెట్టింపయ్యాయి. నా వరకూ వస్తే, పవన్ సొంతంగా కథ, కథనాలు అందించడమే నాలో ఈ సినిమా పట్ల ఆసక్తిని పెంచింది. కానీ సినిమా చూశాక ఇంతోటి కథకు “పవన్”లాంటి తెలివైన బుర్ర అనవసరమనిపించింది. ఆరంభంలో ఈ సినిమాను తన అభిమానులకు అంకితమిచ్చాడు పవన్ కళ్యాణ్.
ఈ సినిమా పట్ల నాలో ఆసక్తిని పెంచిన మొదటి అంశం “ఎర్ర తుండు”. ట్రైలర్ మరియు పాటల్లో దాని గురించి ప్రస్తావన వస్తే, పవన్ విప్లవ భావాలు కలిగిన వ్యక్తి కనుక, భైరో సింగ్ పై గబ్బర్‌సింగ్ సాగించే విప్లవం గురించిన కథ కనుక దాన్ని వాడాడేమో అనుకున్నాను. ఇదే విషయం మొదట్లో కంచెకు వేలాడుతున్న ఎర్ర తుండుని చూస్తే కూడా అనిపించింది. కానీ దాని గురించి అటువంటి ప్రస్తావన లేకపోగా, అనవసరమైన చోట్ల కూడా దాన్ని వాడి ఇబ్బందిపెట్టారు.
ఇక కథానాయకుడిని పరిచయం చేసిన విధానం ఎలాగూ ఊహించిందే కనుక పరిచయ గీతం వినసొంపుగా ఉంది కనుక దాని చిత్రీకరణలో ఆకట్టుకుంటారు అనుకుంటే అదీ లేదు. ఏదో హడావుడి తప్ప ఆ పాటలో ఏమి లేదు. ఆ తరువాత గబ్బర్‌సింగ్ రతన్పూరులోకి అడుగుపెట్టాక వచ్చిన ఓ అంత్యాక్షరి సన్నివేశం పవన్ హావభావాల వల్ల నవ్వించింది. రాజకుమారిని మన కథానాయకుడికి పరిచయం చేసిన విధానాన్ని పక్కనపెడితే, ఆవిడ రాజకుమారి కాదనుకొని గబ్బర్‌సింగ్ ఆమెతో ప్రవర్తించిన తీరు నవ్విస్తూనే, అక్కడక్కడ చూడడానికి బాగుంది.
మొదలయిన అరగంటకే సినిమా విషయమేంటో అర్థమైనా, “తౌబా తౌబా” పాట ఉపశమనమిచ్చింది. దీనికి కారణాలు, ఛాయాగ్రాహకుడు “ఆర్థర్ విల్సన్”, “లక్ష్మీ రాయ్”, పవన్ చేసిన నృత్యం. చివర్లో తాము చేసేది తప్పని రౌడీలతోనే చెప్పించిన విధానం బాగుంది. ఆ సమయంలో “వీడెవడో బ్రూస్ లీకి బాబాయిలా ఉన్నాడు” అనే మాట కొంచెం ఆలోచింపజేసింది. ఇక ఆ తరువాత విరామం వరకూ గబ్బర్‌సింగ్ తో కలిసి చాలా సేపు ఆ సంస్థానంలో గడిపిన భావన కలిగింది. ఆ మధ్యలో వచ్చిన “ఓ పిల్లా” పాట చిత్రీకరణ కాస్త బాగుంది. మధ్యలో బ్రహ్మానందాన్ని చూపించకుండా పూర్తిగా నాయకానాయికల మీదే దాన్ని తీసుంటే ఇంకా బాగుండేది. విరామం సమయంలో “ఆడెవడన్నా వీడెవడన్నా” అని గబ్బర్‌సింగ్ బృందం అతడి కోసం డప్పులు కొడుతున్నా అది ప్రభావం చూపలేకపోయింది.
మొదటి సగం కన్నా రెండో సగం మరింత సహనాన్ని పరీక్షించింది. అక్కడ “గౌతమ్ రాజు” గారి ఎడిటింగ్ ఏమాత్రం బాగోకపోగా, కథనానికి ఎటు వెళ్ళాలో తెలియక, చివరకు పవన్ కూడా సాయం చేయలేకపోయారు. ప్రతీసారి “విజయవాడ ఆకాశవాణి కేంద్రం” రౌడీమూకను పట్టుకోవడం, వారికేదో పాటతో బుద్ది చెప్పడం, దాన్ని కూడా అర్థాంతరంగా కట్ చేయడం చాలా ఇబ్బందిపెట్టింది. ఇదే అనుకుంటే, “నీ చేపకళ్ళు”, “ఖాకీ చొక్కా” పాటలు ఆ అసహనానికి ఆజ్యం పోశాయి. కథకి, దాన్ని నడిపించే నాయకుడికి ఎటువంటి దిక్కు తోచడం లేదు కనుక కనీసం అభిమానులను అలరించడానికి అన్నట్టుగా ఆ పాటలున్నాయి. అందులో పవన్ కనీస స్టెప్పులు కూడా వేయలేదు.
ఈ మధ్యలో గబ్బర్‌సింగ్ ని జైలుపాలు చేయడం మామూలుగా ఉన్నా, రాజకుమారిని భైరోతో పెళ్ళికి ఒప్పించిన సన్నివేశం ఫరవాలేదు. ముఖ్యంగా, తాంబూలాలు భైరో భార్య గాయత్రి (సంజన)తోనే ఇప్పించడం, వాటిని మధు (ఊర్వశి) అందుకున్న విధానం బాగున్నాయి. వీటికి కారణమైన కుల ప్రస్తావనల మీదైనా కొంత కథనాన్ని “సాయిమాధవ్ బుర్రా” సాయంతో నడిపించి ఉంటే సరిపోయేది. అసలు సినిమా మొత్తం మీద “మనవాడు కాకపోయినా సరే సాయం తీసుకోగలం కానీ ప్రేమను తీసుకోలేమా?” అని రాజకుమారి చెప్పే సన్నివేశంలోనే బుర్రాగారు కనిపించారు. మిగిలిన సినిమా మొత్తం మాటలు ఆయనవేనా అనిపించాయి. గబ్బర్‌సింగ్ – హరినారాయణ (ముఖేష్ రుషి)కి మధ్యనున్న ఓ సన్నివేశంలో ముఖేష్ రుషిని మాత్రం గ్రీన్ మ్యాట్ లో ఉన్నారని బాగా తెలిసిపోయేలా ఉంది.
“గబ్బర్‌సింగ్” సినిమాకు “అంత్యాక్షరి” ఘట్టం ఆయువుపట్టు అయ్యింది. అప్పుడు కేవలం రౌడీలే డాన్స్ చేశారు కనుక ఈ సినిమాలో కథానాయకుడి చేత వేయించాలనుకున్నారేమో, ఆ “సంగీత్”లో పవన్ చేత పిచ్చి పిచ్చిగా డాన్స్ వేయించారు. “ఇంద్ర”లోని వీణ స్టెప్పుని పవన్ వేశారని ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తే, వెనుక తెరపై చిరంజీవి వేసిన విజువల్స్ ని చూపిస్తూ దాని ముందు పవన్ వేశారు. కనీసం వెనుక ఆ తెర లేకుండా ఉంటే, ప్రేక్షకుడి దృష్టి చిరంజీవిపై కాకుండా పవన్ పై ఉండేది. మొత్తానికి “సంగీత్” ఎందుకూ పనికిరాకుండా పోయింది.
గబ్బర్‌సింగ్ భైరో ఆటకట్టించడం ఒక మామూలు కమర్షియల్ సినిమా పంథాలోనే సాగింది. కష్టపడి కట్టుకున్న సెట్ ని తమ చేతులతోనే కూల్చేసుకునే ప్రయత్నం చేశారు. ఇకపోతే, దర్శకుడు బాబీ ట్విట్టరులో చివరి వరకూ కాగితాలు మిగిల్చుకోమని, లేకపోతే చొక్కాలు చించుకోవలసిందేనని చెప్పిన ఆ ఆఖరు సన్నివేశం చొక్కాలు కాదు, సినిమాకు వచ్చినందుకు కోపంలో టికెట్లను చింపేలా చేసింది. ఎందుకంటే, అప్పటివరకు అనేకసార్లు చూసిన గబ్బర్‌సింగ్ డాన్స్ బోరుకొట్టేసింది కాబట్టి. ఎంత అభిమానుల కోసం చేసినా, శృతి మించితే ఏది రుచించదు.
మొత్తానికి, సర్దార్ గబ్బర్‌సింగ్ “రాజా సర్దార్ గబ్బర్‌సింగ్”గా మారడానికి ప్రేక్షకులను తనతోపాటు 163 నిమిషాలు కూర్చోబెట్టుకున్నాడు.
నటనలు :
పవన్ కళ్యాణ్ నటనకంటే స్టైల్ నే ఎక్కువ చూపించారు. పాటల్లోకంటే సన్నివేశాల్లోనే ఎక్కువ డాన్స్ చేశారు. ఈ సినిమాలో ఆయన వయసు కూడా అక్కడక్కడ బయటపడినట్టు అనిపించింది. ఇప్పటివరకు చేసిన సినిమాల్లోనే కాజల్ కు నటించే అవకాశం దొరికింది చాలా అరుదు. ఇక పక్కన పవన్ కళ్యాణ్ ఉంటే అది పూర్తిగా లేనట్లే. రాజకుమారి కేవలం గబ్బర్‌సింగ్ చేసే అల్లరికి నవ్వడానికి, పాటల్లో అతడితో కలిసి డాన్స్ చేయడానికి తప్ప మరే విషయంలోనూ ఉపయోగపడలేదు. శరద్ కేల్కర్ వెనుక రవిశంకర్ ఉన్నారు కనుక క్రూరత్వం కేవలం గొంతులో వినిపించిందే తప్ప తెరపై కనిపించలేదు. బ్రహ్మానందం, అలీ, ముఖేష్ రుషి, ఊర్వశి, తనికెళ్ళ భరణి, రావురమేష్, బ్రహ్మాజీ, రఘుబాబు, పోసాని, కబీర్ దుహాన్, సంజన, షకలక శంకర్, మిగతా జబర్దస్త్ బృందం ఇలా అందరూ పవన్ కళ్యాణ్ ధాటికి తట్టుకోలేకపోయారు.
బలాలు :
- బ్రహ్మ కడలి కళాదర్శకత్వం. ఈ సినిమాకు సంబంధించి ముందుగా ఎవరినైనా అభినందించాల్సి వస్తే, అది బ్రహ్మ గారే. రతన్పూరు సెట్ ని “సెర్జియో లియోన్” సినిమా తరహాలో నిర్మించిన విధానం అద్భుతం. ఇదే సెట్ లో ఒక కౌబాయ్ సినిమా తీసుంటే బ్రహ్మాండంగా ఉండేది.
- ఆర్థర్ విల్సన్ ఛాయాగ్రహణం. బ్రహ్మగారి అందమైన సెట్ ని మరింత అందంగా చూపించారు విల్సన్ గారు. సినిమా అంతటా చక్కని కలరింగ్, లైటింగ్ వాడారు. “తౌబా తౌబా” పాట మరియు విరామ సన్నివేశంలో ఆయన పనితనం చాలా బాగుంది.
- దేవీశ్రీప్రసాద్ సంగీతం. ఓ మూడు పాటలు వినడానికి బాగున్నాయి. నేపథ్య సంగీతం ఫరవాలేదు.
- నిర్మాణ విలువలు. నిర్మాతలు శరత్ మారార్, పవన్ కళ్యాణ్, సునీల్ లుల్లా ఎక్కడా వెనుకాడకుండా ఖర్చుపెట్టారు.
బలహీనతలు :
- పవన్ కళ్యాణ్ కథ, కథనాలు. కథ కొత్తదనం లేదు. కథనంలో పటుత్వం లేదు. పైగా కేవలం కథానాయకుడి మీద ఆధారపడిన సినిమా ఇది. అతడు కూడా కాపాడలేకపోయాడు.
- నిడివి. కథ, కథనాలు సరిగ్గా లేనప్పుడు 163 నిమిషాల నిడివితో నత్తనడకన సినిమాను నడపడం ఇబ్బందిగా ఉంటుంది.
- గౌతమ్ రాజు ఎడిటింగ్. సినిమాలోని చాలా సన్నివేశాలు హఠాత్తుగా ముగిసిపోయాయి.
- ప్రచారం. మితిమీరి చేసిన ప్రచారం కూడా ఈ సినిమాకు ఓ బలహీనతేనని చెప్పుకోవచ్చు.
ఈ చిత్రం నేర్పిన పాఠం :
సినిమాకు ఎప్పుడైనా కథ, కథనాలే ప్రాణం. అవి సరిగ్గా లేకపోతే, ఎంత పేరుమోసిన కథానాయకుడైనా వాటిని నడిపించలేడు. ప్రాణంలేని శరీరంలా మిగిలిపోతుంది.
– యశ్వంత్ ఆలూరు
ముగింపు
Click here for English version of this Review…
Pingback: Sardaar Gabbarsingh (2016) – Film Criticism