సరైనోడు (2016)

కమర్షియల్ సినిమాకు కథ బలంగా లేకపోయినా, కథనంలో పట్టుంటే చాలు, సూపర్ హిట్ అయిపోతుంది. “ఈ సినిమాకు సరైన స్క్రీన్ప్లే పడుంటే భలే ఉండేది” అని అనిపించిన సినిమాలు చాలానే ఉన్నాయి. అలాంటి సినిమాల్లో ఒకటి “సరైనోడు”. అల్లు అర్జున్, రకుల్ ప్రీత్ సింగ్, కాథరిన్ నటించిన ఈ సినిమాకు “బోయపాటి శ్రీను” దర్శకుడు. గీతా ఆర్ట్స్ పతాకంపై “అల్లు అరవింద్” ఈ సినిమాను నిర్మించారు.

కథ :

అన్యాయాన్ని ఏమాత్రం సహించలేని గణ (అల్లు అర్జున్), అన్యాయం చేసే జీవితాన్ని సాగించే వైరం ధనుష్ (ఆది పినిశెట్టి)కి మధ్య వైరం ఎందుకు ఏర్పడింది? వీరిద్దరిలో ఎవరు సరైనోడు? అన్నది కథాంశం.

కథనం – దర్శకత్వం :

ఇది కథపై కాక కథనం, పాత్రలపైనే ఆధారపడిన పక్కా కమర్షియల్ సినిమా. ఆ కథనం సరైనది అయ్యుంటే, సరైనోడు మరో మెట్టు ఎక్కుండేవాడు. కానీ దర్శకుడు బోయపాటి కేవలం సన్నివేశాల మీద దృష్టి పెట్టారే తప్ప కథనం మీద కాదు. ఒక కమర్షియల్ ప్రేక్షకుడిగా చూసిన ఈ సినిమాపై సరైన విశ్లేషణ వ్రాయాలనిపించింది. పెద్దగా అనిపిస్తే పెద్దమనసుతో క్షమించేసి ముందుకెళ్ళండి.

సరైన విషయాలు…

ఇదివరకు, బోయపాటి సినిమాలన్నీ శక్తివంతమైనవే కానీ స్టైలిష్ గా ఉన్నవి కావు. ఈ సినిమాను అందుకు భిన్నంగా చాలా స్టైలిష్ గా తెరకెక్కించారు. బహుశా, దీనికి అల్లు అర్జున్ కూడా కారణమేమో. గీతా ఆర్ట్స్ యొక్క నిర్మాణ విలువలను ఈ విషయంలో బాగా వాడుకున్నారు బోయపాటి. అందుకు ఆయనను మెచ్చుకోవాలి.

ఒక్క సన్నివేశంతో సినిమాలో తీవ్రతను పెంచడంలో బోయపాటి ఆరితేరిన దర్శకుడు. ఆయన మునుపటి సినిమాల్లో అలాంటి సన్నివేశం విరామ సమయానికి వస్తే, ఇందులో కోర్టు సన్నివేశం రూపంలో కాస్త ముందుగానే వచ్చింది. అప్పటివరకు కథనంపై సరిగ్గా దృష్టి సారించలేకపోయిన నేను, ఈ సన్నివేశాన్ని మాత్రం ఎంతో తీక్షణంగా చూడడం జరిగింది. ఇక్కడ లాయరుగా నటించిన “రాజీవ్ కనకాల” ఈ సన్నివేశపు ఔన్నత్యాన్ని పెంచడంలో తనవంతు కృషి చేశాడు. ఆ తరువాత వచ్చే పోరాటం, ఓ ఫంక్షన్ లో “వాడెవడో కనుక్కో” అని ధనుష్ తన మనుషులతో చెప్పగా, గణ ప్రవర్తించే విధానం, ఇలా అన్నీ సరిగ్గా కుదిరాయి. ఇలాంటి విషయాలకు బోయపాటే సరైనోడు.

ఈ సినిమాకు పాటలు మరియు ఛాయాగ్రహణం సరిగ్గా కుదిరాయి. పాటలన్నీ వినసొంపుగా లేకపోయినా, తెరపై అందంగా ఉన్నాయి. “అతిలోక సుందరి” పాటలో కోరియోగ్రఫీ బాగా కుదిరింది. అన్నిటికంటే, నాకు అమితంగా నచ్చిన పాట “తెలుసా తెలుసా”. తమన్ దీన్ని వినసొంపుగా చేస్తే, తెరపై మరింత అందంగా తీశారు బోయపాటి మరియు ఛాయాగ్రాహకుడు “రిషి పంజాబీ”. బొలీవియాలో తీసిన కొన్ని షాట్స్ “శంకర్” సినిమాలను తలపించాయి. “నా ఊపిరే నిలిపావురా!” అంటూ రకుల్ పలికించిన హావభావాలు ఇంకా బాగున్నాయి. ఒక అమ్మాయి తన ప్రియుడితోనే జీవించాలని నిర్ణయించుకున్నాక అతడిని ఎంతగా నమ్ముతుందో ఈ పాటలో చూడవచ్చు. “లెజెండ్”లోని “నీ కంటి చూపుల్లోకి” పాటను మించేలా ఈ పాట చిత్రీకరణ చేశారు.

మాములుగా హింసాత్మకమైన పోరాటాలను చూపించే బోయపాటి ఈ సినిమాలో స్టైలిష్ ఫైట్స్ ని చిత్రీకరించారు. చివరి పోరాటం చాలా బాగుంది. బహుశా అది “కిచ” మాస్టర్ చేశారేమో.

సరికాని విషయాలు…

బోయపాటికి ఎంతో అనుభావమున్నా కూడా పలుచోట్ల పరిపక్వతను లోపిస్తాయి ఆయన సినిమాలు. డైలాగుల్లో ఎంత చెప్పినా కూడా ఒక “ఎమ్.ఎల్.ఏ”తో అలా ప్రవర్తించడం సాధ్యపడుతుందా’? గణ “చీఫ్ సెక్రటరీ” కొడుకు కాబట్టి అది చెల్లుతుందేమోనని నచ్చజెప్పుకోవాలి. లేకపోతే, కమర్షియల్ సినిమాలో లాజిక్కులు వెతకడమేంటని వదిలేయాలి. అందుకే ఈ విషయాన్ని బోయపాటికే వదిలేస్తున్నాను. గణని పెళ్ళి చేసుకోవాలనుకున్న అంజని (కాథరిన్), జన (రకుల్) గతం వినగానే అమాంతం “నేను నీకు కరెక్ట్ కాదు రా” అని చెప్పి వెళ్ళిపోవడం, అప్పటివరకు అంజని కోసం ఎంతో తపించిన గణ కూడా దానికి ఒప్పుకోవడం అస్సలు రుచించలేదు. సినిమా చూశాక అనిపించింది, “జన” పాత్ర కథానాయిక కాకుండా ఓ చెల్లెలు లాంటి పాత్ర అయ్యుంటే, సమస్యలో ఇంకా తీవ్రత ఉండేదేమోనని. ఇది నా అభిప్రాయం మాత్రమే. ఇందులోనూ పరిపక్వత లేకపోతే క్షమించగలరు.

“దమ్ము”, “లెజెండ్” సినిమాల్లో విరామ సన్నివేశాన్ని ఎంతో తీవ్రంగా తీసిన బోయపాటి ఈ సినిమాలోని విరామ సన్నివేశంలో ఆ తీవ్రతను చూపించలేకపోయారు.

బోయపాటి కథానాయకుడిని తప్ప మరే పాత్రను గౌరవించడు. సినిమాలో పాత్రలన్నీ కథానాయకుడికే డప్పు కొడుతుంటాయి. ఉదాహరణకు, “బాబాయి” శ్రీపతి (శ్రీకాంత్). ఈ పాత్రకు అనుభవజ్ఞుడైన నటుడిని ఎంచుకున్నప్పుడు ప్రేక్షకుడు ఆయనకెంతోకొంత గౌరవాన్ని ఆశిస్తాడు. మరా గౌరవం ఇవ్వకపోతే ఎలా? ప్రతినాయకుడు అంటే “ఒక క్రూరమైన మూర్ఖుడు” అనే భావనలోంచి ఆయనెప్పుడు బయటపడతారో కూడా అర్థంకాదు. ప్రతినాయకుడు ఎప్పుడూ కథానాయకుడికంటే తక్కువగా ఉంటాడే తప్ప కనీసం సమానంగా కూడా అనిపించడు. అయినా, “జగపతిబాబు”లాంటి సీనియర్ నటుడిని ఎంచుకొని ఆయన పాత్రకే గౌరవమివ్వని బోయపాటి ఈ సినిమాలో “ఆది పినిశెట్టి” పాత్రకు గౌరవం ఎలా ఇస్తాడు? అది ఆశించడం ప్రేక్షకుడి తప్పు.

కొన్నిసార్లు, సినిమా రివ్యూలు వ్రాయడం కోడిగుడ్డు మీద ఈకలు పీకే పనిలాంటిది. ఈ సినిమాలో చివరి పోరాట సమయంలో లాంగ్ షాట్ లో బన్నీ, ఆది పరుగెత్తుకుంటూ రావడం చూసినప్పడు, ఆ జోరులో ఇద్దరూ ఓసారి డీ కొట్టుకున్నట్టు చూపిస్తే బాగుంటుందని ఊహించుకుంటే నిరాశ మిగిలింది.

ముగింపు…

సరైనోడు కొన్ని విషయాల్లో సరైనోడు అనిపించాడు, మరికొన్ని విషయాల్లో సరికానోడు అనిపించాడు. పాటలు, పోరాటాలు, ఛాయాగ్రహణం కోసం ఈ సరైనోడిని ఓసారి పలకరించవచ్చు.

నటనలు :

సినిమా అంతా బన్నీ మీదే నడుస్తుంది. అతడు తెరపై లేని నిమిషాలు చాలా తక్కువ. పలుచోట్ల యాక్షన్ సన్నివేశాల్లో బిగుసుకుపోయి నటించినట్టు అనిపించాడు. కథానాయికలతో ఉన్న సన్నివేశాల్లో అవలీలగా నటించాడు. చూడడానికి మాత్రం చాలా స్టైల్ గా ఉన్నాడు. రకుల్ ఈ సినిమాలో మంచి హావభావాలను పలికించింది. కాథరిన్ బాగా నిడివిగల పాత్రను దక్కించుకున్నా, చివరకు వ్యర్థమైపోయింది. ఉన్నంతలో అందంగా చేసింది. శ్రీకాంత్ మీద చాలా జాలి కలిగింది. బన్నీకి డప్పు కొట్టడం తప్ప మరెందుకు పనికిరాని పాత్రలో నటించారు. ఇక ఆది పినిశెట్టి “బోయపాటి ప్రతినాయకుడు”. బ్రహ్మానందం సినిమాకు అనవసరమైనా, బాగానే నవ్వించాడు. ముఖ్యంగా “భార్య” డైలాగుతో. సాయికుమార్, సుమన్ ఇంకా మిగతా నటులందరూ వ్యర్థ పదార్థాలే.

బలాలు :

  1. రిషి పంజాబీ ఛాయాగ్రహణం. దీని గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. సినిమా అంతా ఎంతో కనువిందుగా తెరకెక్కించారు ఈయన. ముఖ్యంగా “తెలుసా తెలుసా”, “ప్రైవేట్ పార్టీ” పాటలు ఈయన ప్రతిభకు ఉదాహరణలు.
  2. ఎం.రత్నం మాటలు. అక్కడక్కడ బాగున్నాయి.
  3. పోరాటాలు. మొదటిసారి బోయపాటి సినిమాలో స్టైలిష్ ఫైట్స్ ని చూడడం జరిగింది. అందుకు రామ్-లక్ష్మణ్, కిచ, వెంకట్ లకి అభినందనలు.
  4. నిర్మాణ విలువలు. తన కొడుకు సినిమా కోసం నిర్మాత అల్లు అరవింద్ ఎక్కడా తగ్గకుండా ఖర్చుపెట్టారు.

బలహీనతలు :

  1. బోయపాటి కథనం. మొదలవ్వడమే నెమ్మదిగా జరిగి, రెండో సగంలో సినిమా ఎప్పుడు అయిపోతుందా అనే భావన కలిగించి, 159 నిమిషాలకు ముగిసింది.
  2. తమన్ సంగీతం. ఇతడి సంగీతం, నేపథ్య సంగీతం గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది.
  3. వ్యర్తమైన పాత్రలు, నటులు. బోయపాటి సినిమాల్లో ఇది మారాల్సిన అవసరం చాలా ఉంది.

ఈ చిత్రం నేర్పిన పాఠం :

కేవలం కథానాయకుడి మీదే దృష్టి సారించాలనుకుంటే, మిగతా పాత్రలకు పేరొందిన నటులను ఎంచుకోవడం ప్రచారానికి పనికొస్తుందేమో కానీ ఆ నటులను అవమానించినట్టే అవుతుంది.

– యశ్వంత్ ఆలూరు

Click here for English version of this Review…

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s