ఒక సినిమా చూడడానికి కారణం హీరో కావచ్చు, మరో సినిమాకు విలన్ కావచ్చు, ఇంకొక సినిమాకు దర్శకుడు లేదా నిర్మాత కావచ్చు, కొన్నిసార్లు ట్రైలర్ కావచ్చు. అంటే, ఎదో ఒక అంశం కోసమే సినిమా చూసే రోజుల్లో, పైన చెప్పిన అంశాలన్నీ ఒకే సినిమాలో వస్తే, అదే “రాజా చెయ్యి వేస్తే”. నారా రోహిత్, ఇషా తల్వార్ జంటగా నటించగా, నందమూరి తారకరత్న విలన్ గా నటించిన ఈ సినిమాకు “ప్రదీప్ చిలుకూరి” దర్శకుడు. “వారాహి చలన చిత్రం” పతాకంపై సాయి కొర్రపాటి నిర్మించారు. ఇక రాజా చెయ్యి వేస్తే ఎలా ఉందో చూద్దాం…
కథ :
రాజకీయ అండతో అదుపులేని అరాచకాలు చేస్తుంటాడు మాణిక్ (తారకరత్న). సినిమా డైరెక్టర్ అవ్వాలని ప్రయత్నిస్తుంటాడు రాజారామ్ (నారా రోహిత్). ఏమాత్రం సంబంధంలేని జీవితాలు గడిపే వీరిద్దరూ ఓసారి తలపడాల్సివస్తుంది. దానికిగల కారణమేంటి? ఇద్దరిలో ఎవరు గెలిచారు? అన్నవి కథాంశాలు.
కథనం – దర్శకత్వం :
ఇది పాత్రల సినిమా. వేర్వేరు స్వభావాలు కలిగిన రెండు పాత్రలను అనుసంధానం చేసే కథనం ఎక్కువగా వర్మ సినిమాల్లో కనబడుతుంది. అదే పోకడను ఈ సినిమా కోసం అనుసరించాడు దర్శకుడు ప్రదీప్. ముఖ్యమైన రెండు పాత్రలను బాగా వ్రాసుకున్నాడు. సినిమా ప్రారంభంలో, ఓ హత్య చేసి, దాన్ని జ్ఞాపకంగా మలుచుకోవాలని తన మనుషులతో సెల్ఫీ దిగే ఆలోచనతో, “వాడు హత్య చేసిన చోట వాడి క్రూరత్వం కనిపిస్తుంది తప్ప క్లూస్ కనబడవు” అనే మాటతో మాణిక్ పాత్రను బాగా నెలకొల్పాడు దర్శకుడు. కేవలం క్రూరత్వమే కాకుండా, “నేనెవరినీ నమ్ముకోను, నన్ను నేను నమ్ముకుంటాను” అనే తెలివిని కూడా ఆ పాత్రకు ఇవ్వడం తుదిమెరుగు. అందుకు పూర్తి భిన్నంగా, క్రియేటివిటీ ఉంటే చాలు, క్రూరత్వం అవసరంలేదని నమ్మే రాజా పాత్రను కూడా బాగా పరిచయం చేశాడు. అందుకే, పాత్రల చిత్రణ విషయంలో దర్శకుడిని అభినందించాలి.
ఈ కథలో హీరో, విలన్ చివరివరకు ఒకరికొకరు ఎదురుపడరు. ఎలాగు ఆఖరిలో కలుపుతున్నాం కదా అని, మధ్యలో కమర్షియల్ గా వెళ్ళాలని ప్రయత్నించి బాగా తడబడ్డాడు దర్శకుడు. మొదటి ఉదాహరణ హీరో-హీరోయిన్ల ప్రేమకథ. అటు రొమాంటిక్ గా లేకపోగా, బొద్దుగా ఉన్న రోహిత్ బొద్దుగా ఉన్న ఇద్దరు స్నేహితులతో కలిసి కామెడీ చేయడం ప్రేక్షకుడికి పరీక్ష. దానికితోడు కొన్నిచోట్ల అతితెలివి ఉపయోగించాడు దర్శకుడు. “అమ్మాయిలను పడేయడానికి అనాథలను వాడుకోవడం 1940 నుండి సినిమాల్లో వాడుతున్నారు” అని హీరో అంటే, “ఇప్పటికీ ఆ సీనే మన సినిమాలో హిట్టు” అని అతడి స్నేహితుడితో చెప్పించి, తను కూడా అదే చేసి, చేతులు దులుపుకున్నాడు. ఆలోచించడానికి బద్ధకం వేస్తే, ఇలాంటి సన్నివేశాలే వస్తాయి మరి!
ఈ సినిమాలోని కొన్ని సీన్లను మాత్రమే టీవీ’లో వేస్తే ప్రేక్షకుడికి ఉత్కంఠను కలిగిస్తాయి. కానీ ఓ క్రమంగా సినిమాలో వచ్చే సమయానికి నీరసం వచ్చేసింది కనుక ప్రేక్షకుడికి వాటిని ఆస్వాదించే అవకాశం లేకుండాపోయింది. ఉదాహరణే, ఓ దర్శకుడు మాణిక్ ని చంపమని రాజాకు చెప్పడం. దీని మర్మం ఊహకు అందినదే అయినా, స్మశానంలో మాణిక్ మీద జరిగే దాడిని మాత్రం చాలా బాగా చిత్రించాడు దర్శకుడు. “రాక్షస” అనే పాటతో మాణిక్ ని మరింత క్రూరుడిగా నెలకొల్పినందుకు అతడికి మరికొన్ని మార్కులు వేయాలి. బాగా చేసినందుకు తారకరత్నకు కూడా వేయాలి. రక్తం అతడి నుదురుమీద తిలకంలా పడిన షాట్ చాలా బాగుంది. ఈ సినిమాలో మెచ్చుకోదగిన ఆఖరి సన్నివేశం ఇదే.
తరువాతి కథనం బాగా బోరుకొట్టేసింది. ముఖ్యంగా రాజీవ్ కనకాల కథలో పాటే అనవసరమనిపిస్తే, మాణిక్ వేరెవరో అనుకోని అతడిని చంపి, సారీ చెప్పినప్పుడు బాధేయాల్సిందిపోయి నవ్వొచ్చింది. ఇంతటి ముఖ్యమైన సమయంలో అలా తడబడితే ఎలా? తరువాత నేరుగా క్లైమాక్స్ కు వెళ్ళకుండా కథనాన్ని పొడిగించడం బాగోలేదు. ఒకానొక క్షణంలో అసలు హీరో, విలన్ ఎప్పుడు ఎదురుపడతారా అన్న ఉత్కంఠ కూడా పోయింది. ఏదేమైనా క్లైమాక్స్ ఫరవాలేదనిపించింది.
అలా, రాజా చెయ్యి వేస్తే, మంచి అంశాలు కూడా దర్శకుడి పరిపక్వత, అనుభవలేమితో ప్రభావం లేకపోయింది.
నటనలు :
రోహిత్ లో పెద్ద మార్పేమీ కనబడలేదు. అదే బరువు, అదే వేదాంతం. ఈ సినిమాను చూడడానికి నన్ను ప్రేరేపించింది మాత్రం తారకరత్నే అని చెబుతాను. ప్రతినాయకుడిగా అతడు కనిపించిన విధానం బాగుంది. నటనకు ఇంకొంచెం సానపెడితే బొంబాయి విలన్లను హైదరాబాదు వరకు రప్పించే అవసరం ఉండదు. ఇషా తల్వార్ పెద్దగా అందంగా కనిపించకపోయినా, నటన ఫరవాలేదు. అవసరాల శ్రీనివాస్, శశాంక్, శివాజీరాజా, రవివర్మ, రాజీవ్ కనకాల ఇలా అందరూ ఫరవాలేదు.
బలాలు :
- పాత్రల చిత్రణ. రాజా, మాణిక్ పాత్రలను నెలకొల్పిన విధానం బాగుంది.
- సర్వేశ్ మురారి ఛాయాగ్రహణం. ఎప్పుడూ చెప్పేదే. చాలా బాగుంది ఛాయాగ్రహణం.
- నిర్మాణ విలువలు. ఈ సినిమా చూడడానికి మరో కారణం “వారాహి చలన చిత్రం”. సినిమా ఎక్కడా తగ్గకుండా చూసుకున్నారు నిర్మాత సాయి కొర్రపాటి.
బలహీనతలు :
- కథనం. బాగుందనుకొనే లోపే నీరసం కలిగించే కథనం సినిమా పట్ల మంచి భావాన్ని కలిగించలేకపోయింది.
- ఎడిటింగ్. హఠాత్తుగా ఒక రకమైన సన్నివేశం నుండి మరో రకమైన సన్నివేశానికి వెళ్ళిపోయి మూడ్స్ ని అమాంతం మార్చేసిన ఎడిటింగ్ పై దృష్టి పెట్టుంటే బాగుండేది. అలాగే 143 నిమిషాలు ఈ సినిమాకు చాలా పెద్ద నిడివి.
ఈ చిత్రం నేర్పిన పాఠం :
క్రియేటివిటీ చూపించాల్సిన చోట కమర్షియలిజం చూపిస్తే సినిమాకే చేటు.
– యశ్వంత్ ఆలూరు
Click here for English version of this Review…
Pingback: Raja Cheyyi Vesthe (2016) – Film Criticism