గమనిక : మీరు చదవబోయే ఈ విశ్లేషణ పెద్దదిగా ఉండబోతోంది. ఓపిక, సమయం ఉంటేనే చదవండి…
ఓ సినిమా కథ కనీసం ఓ కోటిమందికి నచ్చేలా ఉండాలట. తట్టిన ప్రతీ కథ కోటిమందికి నచ్చేలా ఉండదు కనుక మన దర్శకరచయితలు వారికి తట్టిన కథలకంటే అందరికీ నచ్చిన కథలనే వండేస్తుంటారు. కథ నచ్చాలంటే, ముందుగా అది అందరికీ అర్థమవ్వాలి. ఆ శ్రమ తీసుకునేవారు కూడా తక్కువే. ఈ విషయంలో కేవలం దర్శకరచయితలనే తప్పుబట్టకూడదు. మనలో చాలామంది అలాగే ఉన్నాం. ఓ కొత్త కథను హాలీవుడ్ సినిమాలో చెబితే, వారి ధైర్యాన్ని పొగిడేసి, మనవాళ్ళ చేతకానితనాన్ని తిట్టేస్తుంటాం. పైగా, ఆ హాలీవుడ్ కథ అర్థం కాకపోతే ఆ దర్శకుడి మేథాశక్తిని మరింత పొగిడేస్తాం. అదే మన దర్శకుడు తీసిన సినిమా అర్థం కాకపోతే అతడికి సినిమాలు తీయడం రాదని టక్కున అనేస్తాం. ఈ రెండు రకాల విమర్శలకు అతీతుడైన దర్శకుడు “విక్రమ్ కుమార్”. తన ఆలోచన క్లిష్టమైనదని, అందరికీ నచ్చే అవకాశం లేదని వదిలేయకుండా, తను చెప్పాలనుకున్నది అందరికీ అర్థమయ్యేలా చెప్పగల సత్తా ఉన్న దర్శకుడు. అందుకే తన జీవితంలో ఎంతో ముఖ్యమైన సినిమా “మనం”ని నాగర్జున విక్రమ్ చేతిలో పెట్టాడు. ఇప్పుడు అదే పని చేశాడు “సూర్య” కూడా. ఇదివరకు తను చేసిన ప్రయోగాలు ఫలితాన్ని ఇవ్వలేదని తెలిసినా, తనే నిర్మాతగా మారి 75కోట్లు ఖర్చుపెట్టాడంటే, అది పూర్తిగా విక్రమ్ ప్రతిభపై అతడికున్న నమ్మకమే. ప్రతిభకు ప్రోత్సాహం ఎప్పుడూ అవసరం కనుక ఓసారి నితిన్, నాగార్జున, సూర్యలకు అభినందనలు తెలిపాలి. ఇక “24” సినిమా విషయానికి వస్తే, సూర్య త్రిపాత్రాభినయం చేయగా, సమంత, నిత్య మేనన్ హీరోయిన్లుగా నటించారు. “ఏ.ఆర్.రెహమాన్” సంగీతం అందించారు. “జ్ఞానవేల్ రాజా” మరో నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమాను తెలుగులో “శ్రేష్ట్ మూవీస్” ద్వారా నితిన్ విడుదల చేశారు.
కథ :
కాలంలో ప్రయాణం చేయించగల వాచ్ కోసం దాన్ని తయారుచేసిన తన తమ్ముడు శివకుమార్ (సూర్య) కుటుంబాన్ని అంతం చేస్తాడు ఆత్రేయ (సూర్య). కానీ వాచ్ ని దక్కించుకోలేకపోతాడు. అది వాచ్ మెకానిక్ అయిన మణి (సూర్య) దగ్గరికి చేరుతుంది. దానితో మణి ఏమి చేశాడు? దాన్ని సొంతం చేసుకోవాలన్న ఆత్రేయ కోరిక తీరిందా లేదా? అన్నవి కథాంశాలు.
కథనం – దర్శకత్వం :
ఈ సినిమా విడుదలకు ముందు అనేక ట్రైలర్లను విడుదల చేశారు. అన్నీ నిమిషంపైనే ఉన్నాయి. ఓ ట్రైలర్లో చూపించిన విషయం మరో ట్రైలర్లో లేదంటే, ఈ సినిమాలో ట్రైలర్లలో చూపించని విషయాలు ఇంకా చాలా ఉండబోతున్నాయని అర్థమైంది. అప్పటినుండి ఈ సినిమా చూడాలన్న కుతూహలం బాగా పెరిగింది. మాములుగా, సినిమా చూశాక ట్రైలర్ గుర్తుకురాదు. కానీ “మనం” చూశాక, ఆ సినిమా ట్రైలర్ ని ఎంత పకడ్బందీగా కట్ చేశారో అర్థమైంది. ఈ సినిమా చూశాక కూడా, ట్రైలర్లని అతి పకడ్బందీగా కట్ చేశారనిపించింది. పోస్టర్ల మీద చక్రాల కుర్చీలో వింత వేషంలో ఉన్న సూర్యను చూస్తే కూడా సినిమాను చూడాలన్న కోరిక పుట్టింది. విక్రమ్ ని ప్రచారం విషయంలో కూడా అభినందించాలి.
“కాలంలో ప్రయాణం” అనే అంశం మీద హాలీవుడ్ లో “బ్యాక్ టు ది ఫ్యూచర్”, తెలుగులో “ఆదిత్య 369” లాంటి సినిమాలు క్లాసిక్స్ గా మిగిలిపోయాయి. అదే అంశాన్ని మళ్ళీ ముట్టుకున్నప్పుడు ఆ సినిమాల ప్రభావం ప్రేక్షకుడిపై పడకుండా జాగ్రత్తపడాలి. అంటే, వాటికి భిన్నంగా ఈ కథనం ఉండాలి. అందుకేనేమో, ముఖ్యమైన హీరో, విలన్ పాత్రలలో కూడా సుర్యనే తీసుకున్నాడు విక్రమ్. పైగా, సూర్య చాలామంచి నటుడు, “కమల్” తరువాత ఎటువంటి పాత్రకైనా, మేకప్ కైనా సరిపోయే నటుడు కనుక దర్శకుడి పని సులువు అయిపొయింది.
సినిమా నిడివి 164 నిమిషాలైనా, సమయాన్ని దాదాపుగా వృథా చేయలేదు విక్రమ్. ఒకప్రక్క “లాలి” పాటను పెట్టి, మరోప్రక్క శివకుమార్ తన ప్రయోగం చేస్తూ ఉండగా, అటు పాట, ఇటు ప్రయోగంలోని శబ్దాలు వినిపించేలా రికార్డు చేసిన విధానం బాగుంది. “టైమ్ ట్రావెల్” (time travel) అంశానికి “బటర్ఫ్లై ఎఫెక్ట్”ని (butterfly effect) అనుసంధానం చేసిన విధానం అద్భుతం. ఆ క్రమంలో వాచ్ ని మణి పరీక్ష చేసే సమయంలో చూపించిన విజువల్స్ కట్టిపడేశాయి. ముఖ్యంగా, ఆగిపోయిన వర్షపు చినుకులతో మణి ఆడుకునే సన్నివేశం సినిమాపై ఆసక్తిని మరింత పెంచింది. ఆ తరువాత వచ్చిన “కాలం నా ప్రేయసి” పాట సినిమా ఔన్నత్యాన్ని మరింత పెంచిందని చెప్పాలి. ఇది సరైన సమయంలో రావడమే కాకుండా మంచి విజువల్స్ కలిగి ఉంది. వాచ్ సాయంతో సత్యభామ (సమంత)తో మణి చేసిన అల్లరి కూడా బాగా నవ్వించింది. కోడిగుడ్డు మీద ఈకలు పీకినట్టు లోతుగా ఆలోచిస్తే, మణి వాచ్ ని పరీక్ష చేసే “ఘట్టం”, జనాలు మరిచిపోయిన “బాబా” సినిమాలో మంత్రాలను పరీక్షించే “ఘట్టం”తో అంతర్లీనంగా ఎక్కడో పోలి ఉంటుంది. కానీ రెండింటి ప్రదర్శనలో ఎంతో తేడా ఉంది. ఈ సినిమాలోని ప్రదర్శన ఎంతో అద్భుతంగానూ ఉంది.
“మనసుకే” పాట సినిమాను నెమ్మదించినా, ఆ తరువాత వచ్చిన విరామ ఘట్టం ఊపిరిని బిగపట్టి చూసేలా చేసింది. ముఖ్యంగా, ఆత్రేయ “టోకెన్ 144″ని కనిపెట్టిన తరువాత బాగా ఉత్కంఠను రేకెత్తించాడు దర్శకుడు. ఇక్కడ రెహమాన్ నేపథ్య సంగీతం సన్నివేశానికి బాగా బలాన్నిచ్చింది. ఈ విరామ సన్నివేశం కథ ప్రకారమే వెళ్ళినా, జరగబోయేది మణి ముందే చూసేశాడా అనే ఆలోచన వచ్చినా, అన్నింటినీ తారుమారు చేసి కథలో ఓ ఊహించని సమస్యను ప్రవేశపెట్టి పూర్తిగా మార్కులు కొట్టేశాడు దర్శకుడు. ఎడమ చేతికి ఉండాల్సిన వాచ్ కుడిచేతికి ఉన్నప్పుడు మణికి గుట్టు తెలిసిపోయింది అనుకున్న ప్రేక్షకుడు మళ్ళీ ఖంగుతినేలా చేసిన దాని తరువాతి సన్నివేశం గురించి పొగడకుండా ఉండడం కష్టం. ఇది రచయిత తన ప్రేక్షకులతో ఆడుకునే ఓ అందమైన ఆట. పలుచోట్ల ప్రేక్షకుడికి దొరకకుండా ప్రయాణం చేస్తూ, చివరకు తను చెప్పినదానితో కూడా ప్రేక్షకుడు ఏకీభవించేలా చేయడంలోనే రచయిత విజయం ఉంది. అందుకే, ఈ సినిమాను “రచయిత విజయం” అన్న తరువాతే “దర్శకుడి విజయం” అనాలి.
ఇంతగా ప్రేక్షకుడిని కట్టిపడేసి, విరామంలో కూడా విరామం ఇవ్వని ఈ సినిమా “గోపాల సముద్రం”లో కొంచెం విరామం ఇచ్చింది. వాచ్ సాయంతో అల్లరి చేస్తే బాగుంది కానీ అదే అల్లరి వాచ్ లేకుండా చేస్తే, ఒక మామూలు కమర్షియల్ సినిమా చూసిన భావన కలిగింది. ఎడిటింగ్ లో ఈ సన్నివేశాన్ని కత్తిరించేసినా సినిమాకు వచ్చే నష్టమేమి లేదు. ఈ సన్నివేశాన్ని సమంత నటన నెట్టుకోచ్సింది. తరువాత, అద్దెకు తెచ్చుకున్న అనువాదపు సాహిత్యమున్న “ప్రేమ పరిచయమే” పాటను కూడా తీసేసి ఉన్నా లేదా చిత్రీకరణ ఇంకాస్త బాగా చేసున్నా బాగుండేది.
ఆ పది నిమిషాలు పోతే సినిమా మళ్ళీ అదే ఉత్కంఠతో పరుగులు పెట్టింది. అసలు సమస్య ఎలా పరిష్కారమవుతుందని ఎదురుచూసిన సమయంలో విక్రమ్ తెలివిగా “బటర్ఫ్లై ఎఫెక్ట్”ని వాడాడు. ఇక్కడ నాకు బాగా నచ్చిన విషయం ఇంకోటి ఉంది. చర్చి సన్నివేశంలోనూ, రైలుగేటు దగ్గరి సన్నివేశంలోనూ మిత్ర (అజయ్) ఇచ్చిన అయోమయపు హావభావం. ఇంత చిన్న విషయంలో కూడా జాగ్రత్త వహించి విక్రమ్ మళ్ళీ మార్కులు కొట్టేశాడు. సినిమా చూసినవారు ఓసారి గుర్తుచేసుకోండి. చూడనివారు చూసినప్పుడు గమనించండి.
ఎక్కడ మొదలైన కథను మళ్ళీ అక్కడికే, ప్రేక్షకుడి మనసులో ఎటువంటి ప్రశ్నలు లేకుండా తీసుకొనిరావడం మామూలు విషయం కాదు. ఇలాంటి కథనం వ్రాసుకోవడానికి విక్రమ్ పడిన శ్రమకు, అతడు గడిపిన నిద్రలేని రాత్రులకు, నిజంగా “సాహో విక్రమ్!”.
మొత్తానికి, ఈ ప్రాజెక్ట్ “24”, చూసిన కనీసం 24 గంటలైనా ప్రేక్షకుడితో ప్రయాణం చేస్తుంది. మూస కమర్షియల్ సినిమాలతో విసిగిపోయిన సినీ అభిమానులకు ఒక కొత్త ఊపిరిని అందించే గొప్ప సినిమా. ఇది “మన సినిమా” అని గర్వంగా చెప్పుకోదగ్గ సినిమా. ప్రతిభకు ప్రోత్సాహం తోడైతే అద్భుతాలు సృష్టించవచ్చని నిరూపించిన సినిమా. తప్పకుండా చూడవలసిన సినిమా. ఒక్కరిగా చూసినా, స్నేహితులతో చూసినా, కుటుంబంతో చూసినా, ఎలా చూసినా సరే మీకు మంచి అనుభూతినిచ్చే సినిమా.
నటనలు :
విక్రమ్ కథనానికి ప్రాణం పోశాడు సూర్య. భిన్న పార్శ్వాలున్న మూడు పాత్రలను సునాయాసంగా పోషించేశాడు. శివకుమార్ గా అమాయకత్వం, ఆత్రేయగా క్రూరత్వం, మణిగా చలాకీతనం ఇలా ఒక పాత్రపై మరో పాత్ర ప్రభావం లేకుండా పలికించాడు. సినిమాలో ముగ్గురు సూర్యలున్నా అందులో కేవలం పాత్రలు తప్ప సూర్య కనబడలేదు అంటే అది అతడి ప్రతిభకు నిదర్శనం. ఓ ప్రక్క పాత్రలను, మరోప్రక్క నిర్మాణ భారాన్నీ అద్భుతంగా మోసినందుకు “సాహో సూర్య!”
సమంత, నిత్య మేనన్ తమ పాత్రలకు బాగా సరిపోయారు. మణికి తల్లిగా చేసిన శరణ్య, ఆత్రేయ కుడిభుజంగా చేసిన అజయ్ కూడా పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. చాలా రోజుల తరువాత గిరీష్ కర్నాడ్ గారిని తెరపై చూడడం జరిగింది కానీ పాత్రకు ఎక్కువ ఆస్కారం దొరకలేదు.సుధ, హర్షవర్ధన్ ఇలా మిగతా నటులందరూ ఫరవాలేదు.
ప్రత్యేకతలు :
కథ, కథనం, దర్శకత్వం, నటనలు పూర్తిగా ప్రత్యేకం. ఇవి కాకుండా మరిన్ని ప్రత్యేకతలు ఇవే,
- తిరు ఛాయాగ్రహణం. సినిమాలో ఏ ఒక్క సన్నివేశంలోనూ నాణ్యత రవ్వంతైనా తగ్గలేదు. అద్భుతమైన లైటింగ్ ఉంది ఈ సినిమాలో.
- జూలియస్ ట్రౌసెల్లియర్ విజువల్ ఎఫెక్ట్స్. ఇందులోనూ నాణ్యత ఎక్కడా లోపించలేదు. డేగ షాట్స్ అన్నీ గ్రాఫిక్స్ లోనే చేశారని సినిమా ప్రారంభంలో వేశారు. ఒక్క చోట కూడా ఆ డేగలు గ్రాఫిక్స్ లో చేసినవిగా అనిపించలేదు.
- ఏ.ఆర్.రెహమాన్ నేపథ్య సంగీతం. పాటలతో కొంచెం నిరాశపరిచిన మాస్టర్ “ఆయుష్మాన్ భవ” నేపథ్య సంగీతంతో సినిమాకు బాగా బలమిచ్చారు.
- ప్రవీణ్ పూడి ఎడిటింగ్. “టైమ్ ట్రావెల్” కథలకు ఎడిటింగ్ మరో ఆయువుపట్టు. మణి సత్యతో అల్లరి చేసే సన్నివేశాలలో ప్రవీణ్ ఎడిటింగ్ పనితనం బాగా కనబడుతుంది.
- నిర్మాణ విలువలు. సూర్య, జ్ఞానవేల్ రాజా ఈ సినిమాను ఎంత ప్రేమించారో, దర్శకుడిని ఎంతగా నమ్మారో నిర్మాణ విలువలు, సినిమా నాణ్యతను బట్టి చెప్పొచ్చు. వీరు పూనుకోకపోతే ఈ సినిమా ఏమాత్రం సాధ్యపడేది కాదు, మనల్ని మెప్పించేది కాదు.
బలహీనతలు :
- గోపాల సముద్రంలోని సన్నివేశాలు.
- రెహమాన్ పాటలు. వినడానికి “మనసుకే” మరియు “కాలం నా ప్రేయసి” బాగున్నాయంతే.
- ఈ సినిమా తమిళం నుండి తెలుగులోకి వచ్చినప్పుడు, కేవలం “ఈనాడు” పేపరుని తెచ్చారు కానీ మాటల్లో విజాగ్ అని చెబుతూనే తమిళ బోర్డులు, హోర్డింగులే చూపించారు.
ఈ చిత్రం నేర్పిన పాఠాలు :
- క్లిష్టమైన కథను క్లిష్టమైన కథనంతో చెప్పాల్సిన అవసరంలేదు. కృషి చేస్తే అందరికీ అర్థమయ్యేలా చెప్పొచ్చు.
- మనం నమ్ముకున్న సిద్ధాంతం ఎప్పటికైనా మనల్ని కాపాడుతుంది. (ఇది సూర్య కోణంలో)
- మంచి కథ, కథనాలుంటే “నిడివి” అనే బంధనాలను కూడా పట్టించుకునే అవసరం లేదు.
– యశ్వంత్ ఆలూరు
Click here for English version of this travel…
Pingback: 24 (2016) – Film Criticism