కథ, కథనాలు కొత్తవా, పాతవా అనే విషయాన్ని పక్కనబెడితే, ధియేటరుకి వచ్చిన ఒక సాధారణ ప్రేక్షకుడు మాత్రం సినిమా తనకు బోరు కొట్టకుండా ఆనందపరిస్తే చాలనుకుంటాడు. అలా ప్రేక్షకుడిని బోరు కొట్టించకుండా కూర్చోబెట్టే దర్శకులలో “అనిల్ రావిపూడి” ఒకడు కాగలడని తన మొదటి సినిమా “పటాస్” తెలిపింది. అతడి రెండో సినిమా “సుప్రీమ్” ఆ విషయాన్ని ధ్రువీకరించింది. సాయిధరమ్ తేజ్, రాశి ఖన్నా జంటగా నటించిన ఈ సినిమాను “శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్” పతాకంపై “శిరీష్” నిర్మించారు. “దిల్ రాజు” సమర్పించారు.
కథ :
అనంతపురంలోని ఓ ట్రస్టుని అక్రమంగా విక్రమ్ సర్కార్ (కబీర్ దుహాన్) ఆక్రమించుకోగా, ఆ ట్రస్టు తాలూకు వంశపు వారసుడు రావాల్సిన అవసరం ఏర్పడుతుంది. ఈ కథకి, హైదరాబాదులో టాక్సీ డ్రైవర్ అయిన బాలు (సాయిధరమ్ తేజ్)కి ఏంటి సంబంధం? ఆ సమస్యను బాలు ఎలా తీర్చాడు? అన్నవి కథాంశాలు.
కథనం :
మంచి విషయాలు…
ఈ సినిమా కథ పాతది కనుక, పాత్రలు, వాటి స్వభావాలతో ఆకట్టుకునే ప్రయత్నాన్ని బాగా చేశాడు దర్శకుడు. హీరో పాత్రకు “డోంట్ సౌండ్ హార్న్”, కారు దొంగలు టామ్, క్రూయిస్ లకు “జింగ్ జింగ్” లాంటివి బాగా నవ్వించాయి. ఈ రెండింటిని రెండో సగంలో ఒకే సన్నివేశంలో కలిపి వాడిన విధానం కూడా బాగుంది. శివన్నారాయణ పాత్ర “కాఫీ” కూడా నవ్వించింది.
రెండో సగంలోని దాగుడుమూతల ఆట బాగా నవ్వించింది. దీని తరువాత వచ్చిన “ఆంజనేయుడు నీవాడు” పాట వినడానికి, చూడడానికి కూడా బాగుంది. సినిమా మొదలైనప్పటి నుండి పరిచయం చేసిన దాదాపు పాత్రలను దర్శకుడు బాగా వాడుకున్నాడు అనిపించింది.
నాకు బాగా నచ్చిన మరో విషయం, ఇంతటి మాస్ సినిమాలో ద్వందార్థ సంభాషణలు అతి తక్కువ మోతాదులో ఉండడం. ఈ విషయంలో దర్శకుడిని మెచ్చుకొని తీరాల్సిందే.
మామూలు విషయాలు…
హీరోకి ఒక పరిచయ గీతం పెట్టడం కోసం సినిమాలోని “హీరో” పందెం అవసరమా అనిపించింది. ఇప్పటి కమర్షియల్ సినిమాలో హీరో పరిచయం తరువాత పాటే వస్తుందని దర్శకుడికంటే ప్రేక్షకుడే ఫిక్స్ అయిపోయాడు. అలాంటప్పుడు, మొదట్లో అతడి చేత ఒక ఫైట్ చేయించేసి, వెంటనే పాటలోకి వెళ్ళిపోతే చాలు. దానికోసం ఒక పందెం, ఒక ఐటెం గర్ల్ అనవసరం.
ప్రధాన ప్రతినాయకుడి విషయం పక్కనబెడితే, సినిమాలో కామెడీ కోసం వ్రాసుకున్న “బికు” పాత్రకు బాలీవుడ్ నటుడు “రవికిషన్”ని ఎంచుకోవడం దండగ. నటుడికి భాష మీద పట్టు లేకపోతే అతడు ఎలాంటి హావభావాలు పలికించలేడు. ఇలాంటి వాళ్ళందరికీ “డబ్బింగ్” రవిశంకరే దిక్కు. రవికిషన్ ఉన్న సీనులో ప్రేక్షకుడికి నవ్వొచ్చిందంటే అది కేవలం రవిశంకర్ డబ్బింగ్ వల్లే. రవికిషన్ పెదవుల కదలిక మీద కూడా సరిగ్గా దృష్టి సారించలేదు దర్శకుడు. ఈ పాత్రకు తెలుగు ప్రతినాయకులు “అజయ్”, “సుప్రీత్” లాంటివారు బాగా సరిపోతారు. పరభాష నటుడిని ఎంచుకున్న లాజిక్ కోసం సినిమాను ఒరిస్సాకు తీసుకొని వెళ్ళకుండా, తెలుగు నటులను ఎంచుకొని ఏ కరీంనగరో, విజయనగరమో తీసుకొని వెళ్తే చాలు కదా!
రాజస్థాన్ ఎడారిలో తీసిన చేజింగ్ సన్నివేశం నిడివి ఎక్కువై బోరు కొట్టేసింది. అలాగే వికలాంగులతో చేయించిన పోరాటం మొదట్లో బాగున్నా, నిడివి ఎక్కువై బోరు కొట్టేసింది. ఇది పటాస్ లోని ఎం.ఆర్.పీ.ఎఫ్ సన్నివేశాన్ని గుర్తుచేసింది.
ముగింపు…
పైన చెప్పినట్టుగా, ఒక ప్రేక్షకుడికి బోరు కొట్టించకుండా కూర్చోబెట్టే సత్తా, ఒక కథను వినోదాత్మకంగా చెప్పే నేర్పు రావిపూడికి ఉంది. పటాస్ కి, సుప్రీమ్ కి కథను చెప్పిన విధానంలో కానీ, పాత్రల చిత్రణలో కానీ ఎలాంటి తేడా లేదు. ఇదే పోకడను రాబోయే సినిమాలకు కూడా పాటిస్తే శ్రీనువైట్లలా రావిపూడి కూడా బోరు కొట్టేస్తాడు. పద్ధతి మారుస్తే మంచిదని నా అభిప్రాయం.
నేను వ్రాసిన విషయాలను పక్కనబెడితే, ఒక సాధారణ ప్రేక్షకుడిగా, “సుప్రీమ్” ఒకసారి నిర్మొహమాటంగా చూసేసి నవ్వుకొని బయటకు వచ్చే సినిమా. ఇద్దరు, ముగ్గురు స్నేహితులను వెంటబెట్టుకొని వెళ్తే ఇంకా బాగా ఎంజాయ్ చేయగల సినిమా.
నటనలు :
సాయిధరమ్ తేజ్ కి నటనంటే బాగా ఇష్టం ఉన్నట్టుంది. అందుకే సినిమా సినిమాకు నటనలో మెరుగుపడేందుకు ప్రయత్నిస్తున్నాడు. తన మునుపటి సినిమాలా ఎవరినీ అనుకరించకుండా ఇందులో నటించినందుకు అతడిని అభినందించాలి. ఆడియో ఫంక్షన్, ఇంటర్వ్యూలలో ఏ హీరోయిన్ అయినా “ఇది నా కెరీర్ లో చాలా ముఖ్యమైన సినిమా” అని అంటే అందులో ఆమెకు చెప్పుకోదగ్గ పాత్ర ఖచ్చితంగా దొరకలేదని ఈ సినిమాలోని రాశి ఖన్నా పాత్రను చూసి నిర్ధారణ చేసుకోవచ్చు. మరో ముఖ్య పాత్రను పోషించిన బాలనటుడు గాంధీ బాగా చేశాడు. పృథ్వీరాజ్, ప్రభాస్ శ్రీను “జింగ్ జింగ్”తో బాగా నవ్వించారు. సాయికుమార్, రాజేంద్రప్రసాద్, తనికెళ్ళ భరణి, పోసాని, శ్రీనివాసరెడ్డి, రఘుబాబు, శివన్నారాయణ, వెన్నెల కిషోర్, “క్షణం” రాజేష్ ఇలా అందరూ తమ పాత్రలకు న్యాయం చేశారు. ప్రతినాయకులు రవికిషన్, కబీర్ దుహాన్ డబ్బింగ్ మీద ఆధారపడిపోయారు.
బలాలు :
- సాయి శ్రీరామ్ ఛాయాగ్రహణం. “టాక్సీ వాలా”, “ఆంజనేయుడు నీవాడు” పాటల్లో ఇతడి పనితనం బాగా కనపడింది.
- సాయి కార్తీక్ సంగీతం. పాటల్లో “ఆంజనేయుడు నీవాడు” మరియు నేపథ్య సంగీతం రెండో సగంలో బాగా ఇచ్చాడు.
- నిర్మాణ విలువలు. తన ప్రతీ సినిమాలాగే ఈ సినిమాకు కూడా నిర్మాణ విలువల్లో ఎక్కడా రాజీపడలేదు దిల్ రాజు, శిరీష్.
బలహీనతలు :
- పాటల చిత్రీకరణ. “ఆంజనేయుడు” పాట తప్ప మరే పాట చిత్రీకరణ చెప్పుకోదగ్గది కాదు. చివరకు “అందం హిందోళం” పాట కూడా నిరాశపరిచింది. ఈ విషయంలో రావిపూడి కొంచెం శ్రద్ధ వహించాల్సి ఉంది.
- పోరాటాలు. నిడివి ఎక్కువై కాస్త ఇబ్బందిపెట్టాయి.
ఈ చిత్రం నేర్పిన పాఠం :
ఒక వర్గపు ప్రేక్షకులనే టార్గెట్ చేసినప్పుడు, మనకు నచ్చినా, నచ్చకపోయినా, వారికి కావాల్సింది ఇచ్చేయాలి.
– యశ్వంత్ ఆలూరు
Click here for English version of this Review…
Pingback: Supreme (2016) – Film Criticism