మన జీవితాలు అనుకున్న విధంగా సాగవు. అలా సాగితే అవి జీవితాలే కావు. ఒకవేళ సాగితే బాగుంటుందనే ఊహే “సినిమా”. నిజజీవితాన్ని సినిమాలో ఆవిష్కరిస్తే నిజంగానే బాగుంటుంది. “శ్రీకాంత అడ్డాల” తన “సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు”లో అదే పనిచేసి మెప్పించాడు. అందులోని “వసుధైక కుటుంబం” అంశానికి ఈసారి “బ్రహ్మోత్సవం” అనే పేరు పెట్టి మన ముందుకొచ్చాడు. మహేష్ బాబు, సమంత, కాజల్, ప్రణీత, సత్యరాజ్, రేవతి, జయసుధ, రావురమేష్, నరేష్, తనికెళ్ళ భరణి, ఇలా పలువురు ప్రముఖ నటులతో, “పీవీపీ” నిర్మాణ సారథ్యంలో వచ్చింది ఈ సినిమా.
సినిమాలో “నిజజీవితపు ఆవిష్కరణ” అనుకున్నప్పుడు కథ బలంగా ఉండాల్సిన అవసరంలేదు. ఎందుకంటే నిజజీవితంలో నాటకీయత ఉండదు. కానీ కథనం మీద మంచి పట్టుండాలి. అడ్డాల మొదటి రెండు సినిమాల్లో కనిపించిన ఆ పట్టు “ముకుంద”లో కాస్త తప్పింది. అప్పుడు పోనీలే అనుకుంటే ఈసారి అది పూర్తిగా తప్పింది. నిర్మాత “దిల్ రాజు” కథ, కథనాలు స్పష్టంగా తయారవుతేకానీ సినిమా మొదలుపెట్టడు. ఇప్పుడు అనిపిస్తోంది, “కొత్త బంగారులోకం”, “సీతమ్మ…” సినిమాల “రచన” విషయంలో కూడా రాజుకి ఘనత ఇవ్వాలేమోనని. దేవుడి “బ్రహ్మోత్సవం”లో మనకు కనిపించేవి ఇసుకేస్తే రాలనంత జనం, హడావుడి, గందరగోళం, ఎవరెలా వస్తూ వెళుతున్నారో తెలియని అయోమయం, కోట్ల రూపాయల ఖర్చు. ఈ “బ్రహ్మోత్సవం”లో కనిపించేవి కూడా ఇలాంటివే. తెర నిండా నటులు, వారి సంబరాల హడావుడి, అసందర్భంగా వచ్చే పాటలు, హఠాత్తుగా ప్రత్యక్షమై, మాయమయ్యే పాత్రలు, కోట్లు ఖర్చుపెట్టి చేసిన నిర్మాణం. ప్రస్తుత దేవుడి బ్రహ్మోత్సవాల్లో కరువైపోయిన “భక్తి”లా ఈ “బ్రహ్మోత్సవం”లో కరువైపోయాయి “కథ”, “కథనం”.
సంగీతంలో “సపస” రాకపోతే “హైలెస్సా” అనుకోవచ్చు. “హైలెస్సా” రాకపోతే ఇంకోటి అనుకోవచ్చు. అదీ రాకపోతే మరోటి అనుకోవచ్చు. కానీ సినిమా నడవడికలో “కథ”కు “కథనమే” ప్రత్యామ్నాయం. సరైన కథనం లేకపోతే సినిమా బ్రతకదు. ఈ రెండూ లేని సినిమాకు మహేష్ తో సహా మిగిలిన నటులందరినీ అడ్డాల ఎలా ఒప్పించాడో, దీనికోసం అన్ని కోట్లు ఖర్చుపెట్టగల నమ్మకాన్ని పీవీపీకి ఏ అంశం ఇచ్చిందో అర్థంకాని విషయాలు. పోనీ ఎంచుకున్న నటులకు సరైన పాత్ర చిత్రణలైనా చేశాడా అంటే అదీ లేదు. సన్నివేశంలో ఎంతమంది నటులున్నా, కెమెరా పొద్దు తిరుగడు పువ్వులా మహేష్ వైపే తిరుగుతుంది. మహేష్, సత్యరాజ్, రావురమేష్ లకు తప్ప మరే నటుడికీ ప్రాధాన్యం లేదు. దీనికితోడు, అర్థాంతరంగా ముగిసిపోయే సన్నివేశాలే దాదాపు. ఎడిటర్ గా “కోటగిరి వెంకటేశ్వరరావు” గారు చేశారు. కానీ ఈ విషయంలో అడ్డాలనే తప్పుబట్టాలి.
“వచ్చింది కదా అవకాశం” పాటకు తప్ప మొదటి సగంలోని పాటలన్నీ అసందర్భంగా వచ్చేవే. నేపథ్య సంగీతం అందించిన “గోపిసుందర్”కు దర్శకుడు కథ చెప్పాడా లేకపోతే సన్నివేశాలు చూపించి సంగీతం చేయమన్నాడా అర్థంకాలేదు. భావోద్వేగపు సన్నివేశానికి శక్తివంతమైన నేపథ్య సంగీతమేంటి? ఇంకా, సినిమాలో చాలాచోట్ల గ్రాఫిక్స్ తేలిపోయాయి. ఉదాహరణకు “నాయుడోరి ఇంటికాడ” పాటకు గ్రాఫిక్స్ అవసరమేంటి? వ్రాసుకుంటూపోతే ఇలాంటివి ఎన్నో ఈ సినిమాలో!!
ఇప్పుడు కొన్ని మంచిమాటలు అనుకుందాం…!!
అడ్డాలను మొదటినుండి కొన్ని విషయాలలో మెచ్చుకోవాలి. ఒకటి, సినిమాకు “తెలుగు” పేరు పెట్టడం, రెండు సినిమాలోని పేర్లు అందంగా, ఆహ్లాదకరంగా వేయడం. ఈ సినిమాలో కూడా అదే చేశాడు. తన మునుపటి సినిమాల్లో ఏమి చెప్పాలనుకున్నాడో సూటిగా అర్థమయ్యేలా చెప్పలేదు. పైగా “ముకుంద”లో పరోక్ష మాటలతో ఇబ్బందిపెట్టాడు. ఇందులో దాదాపుగా సూటి మాటలతో తను చెప్పదలచినది చెప్పేశాడు. బహుశా, ఈ ఘనతను సహాయ రచయితలు “పరుచూరి బ్రదర్స్”, “కృష్ణచైతన్య”లకు కూడా ఇవ్వాలేమో. “రావుగోపాలరావు” రూపంలో రావురమేష్ అంతరాత్మ మాట్లాడడం మనుషుల్లో మంచోళ్ళు, తక్కువ మంచోళ్ళే ఉంటారు కానీ చెడ్డవాళ్ళుండరనే దర్శకుడి ఆలోచనను నెలకొల్పింది కానీ నీరసించే కథనంలో అది మరుగునపడిపోయింది.
మొదటి సగంలో కాజల్ విడిపోయే సన్నివేశం ఫరవాలేదనిపించినా, రావురమేష్ విడిపోయే సన్నివేశం పండింది. రెండో సగంలో వెన్నెల కిషోర్ నవ్వించే ప్రయత్నం చేయగా, అనారోగ్యంతో కింద పడిపోయిన పాపతో ఉన్న సన్నివేశానికి కళ్ళు చెమ్మగిల్లాయి. “అలసిపోయేదాకా కాదు, అర్థమయ్యేదాకా వెతకండి” అని గొల్లపూడి అన్న మాట, “విడిపోయినా వద్దంటున్నానంటే సొంతమనే కదా అర్థం” అని రావురమేష్ అన్న మాట, “మీరు విడిపోయారు కానీ దూరం కాలేదు” అని సమంత అనే మాట, ఇలా కొన్ని మాటలు బాగున్నాయి. పతాక సన్నివేశం కూడా బాగా వచ్చింది. ఇక్కడ ముకేష్ రుషి చెప్పిన “నమ్మలేని నిజాలన్నీ అబద్ధాలనుకుంటాం. కానీ అవి అద్భుతాలని వీడిని చూశాకే తెలిసింది” అనే మాట నాకు నచ్చింది. ఇలా అక్కడక్కడ బాగున్న అంశాలే టీవీ సీరియల్ చూస్తున్న భావనను కలిగించాయి.
సాంకేతిక విభాగాలు :
“తోటతరణి” గారి కళాదర్శకత్వం అద్భుతం. “వచ్చింది కదా అవకాశం”, “బాలా త్రిపురమణి” పాటల్లోని సెట్స్ ఉదాహరణలు. వీటికి ఛాయాగ్రాహకుడు “రత్నవేలు” చేసిన లైటింగ్ మరో అద్భుతం. కెమెరాకు ఎదురుగా లైట్లు పెట్టి కూడా అక్కడున్న మనిషి ముఖం స్పష్టంగా కనిపించేలా చేయడం రత్నవేలు ప్రత్యేకత. వీరిద్దరి పనితనం ఇంత బాగా రావడానికి సాయపడిన పీవీపీ నిర్మాణ విలువలు అత్యద్భుతం. మిక్కీ సంగీతం ఆకట్టుకోలేదు కానీ గోపిసుందర్ నేపథ్య సంగీతం బాగుంది. ముఖ్యంగా, హరిద్వార్ సన్నివేశాల్లో.
నటనలు :
నటనల విషయానికి వస్తే, మహేష్ నటనలో ఏమాత్రం మార్పులేదు. నిజానికి, ఇందులో అతడు నటించిన సందర్భాలకన్నా అనవసరంగా నవ్విన సందర్భాలే ఎక్కువ. ఇది అడ్డాల తన స్క్రిప్టులో వ్రాసుకున్నాడో లేక ఎలాగైనా సన్నివేశాన్ని ముగించడానికి మహేష్ నవ్వుని వాడుకున్నాడో తెలియలేదు. మరో విషయమేమిటంటే, తొలిసారి మహేష్ అందవిహీనంగా కనిపించాడు. ఉదాహరణకు “నాయుడోరి ఇంటికాడ” పాట. ఇక అతడి “డాన్సుల” గురించి మాట్లాడడం అనవసరం. సమంత పాత్ర అక్కడక్కడ అతిగా అనిపించినా, నటన బాగానే ఉంది. స్వతంత్రభావాలున్న అమ్మాయిగా కాజల్ ప్రభావం చూపలకపోయింది. ప్రణీత సినీజీవితం కేవలం ప్రచారానికి, పాటలకే పరిమితమయ్యేలా ఉంది. సత్యరాజ్ ఫరవాలేదు. రావురమేష్ కి మరోసారి మంచి పాత్రనిచ్చాడు అడ్డాల. అతడు రెచ్చిపోయాడు. మిగతా పాత్రలు పోషించిన రేవతి, జయసుధ, తులసి, శుభలేఖ సుధాకర్, తనికెళ్ళ భరణి, సాయాజీ షిండే, నరేష్, కృష్ణభగవాన్, రోహిణి హట్టంగడి, గొల్లపూడి, శరణ్య, పోసాని, వెన్నెల కిషోర్, ముకేష్ రుషి, జయప్రకాష్ రెడ్డి, చాందిని చౌదరిలను దర్శకుడే పట్టించుకోలేదు ఇక వారి నటనల గురించి వ్రాయడానికి ఏముంటుంది?
చివరిమాట :
నా ఉద్దేశ్యంలో “బ్రహ్మోత్సవం” ప్రతిభ ఉండీ అర్థాంతరంగా చచ్చిపోయిన భారతంలోని “కర్ణుడు”లాంటి సినిమా. అతడి చావుకి కోటి కారణాలుండొచ్చు కానీ ఈ సినిమా ఫలితానికి మాత్రం దీని రథసారథి “శ్రీకాంత్ అడ్డాల” కారణం.
ఈ సినిమాలో కాజల్ అన్న ఓ మాటను నా సమీక్ష కోసం మారుస్తే, “ఈ సినిమాపై కేవలం ఒక్క భాషలో సమీక్ష రాసినందుకే అలసిపోయిన ఫీలింగ్ వచ్చింది. ఇక మరో భాషలో కూడా రాసి నా జీవితాన్ని ఓ గంటసేపు ఆపలేను”
– యశ్వంత్ ఆలూరు