త్రివిక్రమ్ కమర్షియల్ చట్రంలో ఇరుక్కుపోయి కనుమరుగైపోయాడని బాధపడిన వారిలో నేనూ ఒకడిని. కమర్షియల్ దర్శకుడిగా అగ్రస్థానంలో మెలుగుతున్న త్రివిక్రమ్ తిరిగి ఓనమాలు దిద్దే ప్రయత్నం చేసిన సినిమా “అఆ”. “అనసూయ రామలింగం v/s ఆనంద్ విహారి” అనేది ఉపశీర్షిక. సమంత, నితిన్, అనుపమ పరమేశ్వరన్ నటించిన ఈ సినిమాను “సూర్యదేవర రాధాకృష్ణ” నిర్మించారు.
మొదట, ఈ సినిమా 1973లో విజయనిర్మల గారి దర్శకత్వంలో వచ్చిన “మీనా” సినిమాను కాపీ కొట్టి తీశారని చెప్పారు. తరువాత త్రివిక్రమ్ “యద్దనపూడి” గారి దగ్గర నవల హక్కులు కొనే తీశారు కానీ ఆవిడకు కృతజ్ఞతలు తెలుపలేదని అన్నారు. ఇవే కాక పలువార్తలు వినిపిస్తున్నాయి. నేను “మీనా” నవల చదవలేదు, సినిమా చూడలేదు. కనుక ఇది త్రివిక్రమ్ తీసిన “అఆ” సినిమా మీద వ్రాసే సమీక్ష.
కథ :
కోటీశ్వరురాలైన మహాలక్ష్మి (నదియా) కూతురు అనసూయ (సమంత) జీవితం తల్లి ఆధీనంలోనే ఉండడంతో స్వేచ్చగా బ్రతకడానికి ఓ పదిరోజులు కలివిపూడి గ్రామానికి వెళుతుంది. ఆ ప్రయాణంలో ఆమెకి పరిచయమవుతాడు ఆనంద్ (నితిన్). వారి పరిచయం ఎలా కొనసాగింది? వీరిద్దరి మధ్యలో నాగవల్లి (అనుపమ) ఎవరు? అన్నవి కథాంశాలు.
కథనం :
ఇది పూర్తిగా కథానాయిక ప్రాధాన్యమున్న సినిమా. సినిమాకు నితిన్ హీరో కానీ కథకు మాత్రం సమంత పాత్రే హీరో అని చెప్పాలి. త్రివిక్రమ్ తన మునుపటి సినిమాల్లో కొన్ని పాత్రలను పరిచయం చేసిన తీరు కంటే ఈ సినిమాలో పరిచయం చేసిన తీరు బాగుంది. అనసూయ తండ్రి రామలింగం (నరేష్), గోపాల్ (శ్రీనివాసరెడ్డి), ఇలాంటి పాత్రల పరిచయాలు బాగా చేశాడు. ఇదివరకటి సినిమాల్లోలాగా ఈ సినిమాలో ఎక్కడా బలవంతంగా చొప్పించిన డైలాగులు లేవు. అన్నీ కథానుసారంగానే ఉన్నాయి.
మొదటి ఇరవై నిమిషాలు నెమ్మదిగా సాగినా, అనసూయ, ఆనంద్ పరిచయమైనప్పటి నుండి కథనం ఊపందుకుంది. ఆరోగ్యకరమైన హాస్యం అదనపు బలంగా మారింది. రావురమేష్, ప్రవీణ్, హరితేజ, అజయ్, షకలక శంకర్, చమ్మక్ చంద్ర ఉన్న సన్నివేశాలు బాగా నవ్వించాయి. “యా యా” పాట చిత్రీకరణ ఆకట్టుకుంది. నాగవల్లి ముందు ఆనంద్ అనసూయను ఎత్తుకుని వచ్చే సన్నివేశం నాకు బాగా నచ్చింది. ఆడవారిలోని అసూయను బాగా చూపించారు ఆ సన్నివేశంలో. సమంత నటన దానికి బాగా బలాన్నిచ్చింది కూడా. అలాగే బేబి మామ్మ (అన్నపూర్ణ) చనిపోయే సన్నివేశం కూడా బాగా నవ్వించింది.
త్రివిక్రమ్ తన సినిమాల్లో ముఖ్యమైన పాటలు తీయడంలో ఎందుకు తడబడతారో అర్థంకాదు. ఆడియోలో బాగా హిట్టైన పాటను తెరపై చూసేందుకు ప్రేక్షకుడికి ఎంతో ఆసక్తిగా ఉంటుంది. అలాంటిదే “రంగ్ దే” పాట. దీని చిత్రీకరణలో సన్నివేశాలనే నడిపి ఉంటే బాగుండేది.
ఇక ఆసుపత్రిలోని సన్నివేశం, మాల్ లోని సన్నివేశం నవ్వించాయి. ఫ్లాష్ బ్యాక్ పెద్దగా ప్రభావం చూపకపోయినా, దాని ద్వారా దర్శకుడు చెప్పిన అంశం బాగుంది. ఒక సన్నివేశం “అత్తారింటికి దారేది” క్లైమాక్స్ ని గుర్తుచేసినా, దర్శకుడు తెలివిగా దాన్ని త్వరగా కట్ చేశాడు. ఆ తరువాత చివరి ఇరవై నిమిషాలకు రావురమేష్ ప్రాణం పోశారు. ఈ సినిమాలో అంతా డ్రామాయే ఉన్నప్పటికీ, సమంత – నదియాల మధ్యనున్న చివరి సన్నివేశం చాలా సహజంగా అనిపించింది.
అలా, “అఆ” ఒక మంచి అనుభూతిని ఇస్తూ, త్రివిక్రమ్ ని మళ్ళీ పరిచయం చేసింది. ఈ సినిమా గురించి తెలిసిన ఓ ఆసక్తికరమైన విషయమేమిటంటే, త్రివిక్రమ్ దర్శకుడిగా చేయాల్సిన మొదటి సినిమా ఇదే కావాల్సిందట. కానీ ఎందుకో అది కుదరలేదట. ఏదేమైనా, “నువ్వే నువ్వే” తరువాత త్రివిక్రమ్ తీసిన సినిమా ఇదే అయ్యుంటే బాగుండేదనే అనుభూతినిచ్చింది ఈ సినిమా. చూసే ప్రేక్షకుడికి ఏమాత్రం నిరాశపరచని ఈ సినిమాను చూడనివారందరికీ సిఫార్సు చేస్తున్నాను. “కడలి” తరువాత మణిరత్నం గారు “ఒకే బంగారం”తో తనను తాను ఎలా వెతుక్కున్నారో “సన్నాఫ్ సత్యమూర్తి” తరువాత ఈ సినిమాతో త్రివిక్రమ్ అలా తనను తాను వెతుక్కున్నారు.
నటనలు :
అనసూయగా ఈ సినిమాను సమంతే తన భుజాలమీద మోసింది. ప్రక్కన కాస్త పేరుమోసిన కథానాయకుడున్నా, కథానాయికే కథను ఎక్కువగా నడిపించిన సినిమా బహుశా ఈమధ్య కాలంలో ఇదే కాబోలు. ఆనంద్ విహారిగా నితిన్ కూడా బాగా చేశాడు. ముఖ్యమైన సన్నివేశాల్లో భావోద్వేగాలను పరిమితుల్లోనే పలికించాడు. అనుపమ కూడా పాత్రకు బాగా సరిపోయింది. సమంత తరువాత ఈ సినిమాకు ప్రాణం పోసిన మరో నటుడు రావురమేష్. ప్రేక్షకుడు ధియేటరు నుండి నవ్వుకుంటూ బయటకు వచ్చాడంటే అందుకు, చివరి నిమిషాల్లోని ఈయన నటనే కారణం. నదియా, నరేష్ పాత్రలకు న్యాయం చేశారు. అనన్య, అజయ్, అవసరాల శ్రీనివాస్, శ్రీనివాసరెడ్డి, పోసాని, గిరిబాబు, రఘుబాబు, సన, ప్రవీణ్, షకలక శంకర్, హరితేజ, చమ్మక్ చంద్ర ఇలా అందరూ పాత్రలను బాగా పోషించారు.
బలాలు :
- కథ, కథనం, మాటలు. ఈ సినిమాలో దర్శకుడు త్రివిక్రమ్ కన్నా రచయిత త్రివిక్రమే విజయం సాధించారు అనిపించింది. కథానుసారంగానే వ్రాసిన మాటలు పలుచోట్ల బాగా నవ్వించాయి.
- మిక్కీ జే మెయెర్ సంగీతం. ఈ సినిమాకు ఇతడి పనితనం బాగా తోడైంది. పాటలే కాకుండా నేపథ్య సంగీతంలో కూడా మిక్కీ బాగా సాయం చేశాడు.
- నిర్మాణ విలువలు. నిర్మాత రాధాకృష్ణ ఎక్కడా రాజీపడకుండా ఖర్చుపెట్టారు.
బలహీనతలు :
- డి.ఐ. (డిజిటల్ ఇంటర్మీడియట్). ఇది బాగోకపోవడంతో సినిమాలో పలుచోట్ల రంగులు ఎక్కువగా అనిపించాయి.ఇది ఛాయాగ్రహణాన్ని కూడా ఆస్వాదించకుండా చేసింది.
ఈ చిత్రం నేర్పిన పాఠం :
ఒక దర్శకుడు కమర్షియల్ గా ఎంత ఎదిగినా, ఎప్పటికప్పుడు ఆ చట్రంలోంచి బయటపడుతూ ఉండాలి.
– యశ్వంత్ ఆలూరు
Click here for English version of this Review…