“గ్రహణం”తో అవార్డు సంపాదించినా, “అష్టాచమ్మ”తో హిట్టు కొట్టినా, “గోల్కొండ హైస్కూల్”తో విమర్శకుల మెప్పు పొందినా, “మోహన్ కృష్ణ ఇంద్రగంటి” పేరు పెద్దగా వినిపించలేదు. ఆయన ద్వారా పరిచయమైన “నాని” మళ్ళీ ఆయనతో కలిసి చేసిన సినిమా “నాని జెంటిల్‌మన్”. సురభి, నివేథా థామస్ హీరోయిన్లగా నటించగా, “ఆదిత్య 369”, “వంశానికొక్కడు”, “మిత్రుడు” లాంటి సినిమాలను నిర్మించిన “శివలెంక కృష్ణప్రసాద్” ఈ సినిమాను నిర్మించారు.
కథ :
ఓ విమాన ప్రయాణంలో పరిచయమవుతారు ఐశ్వర్య (సురభి), కాథరిన్ (నివేథా). కాథరిన్ తను ప్రేమించిన గౌతమ్ (నాని) గురించి, ఐశ్వర్య తను పెళ్ళాడబోయే జై (నాని) గురించి పంచుకుంటారు. ఆ తరువాత ఏమైంది? అసలు గౌతమ్, జై ఇద్దరు వ్యక్తులా లేక ఒక్కరేనా? హీరో ఎవరు? విలన్ ఎవరు? అనే అంశాల మీద కథ నడుస్తుంది.
కథనం :
మాములుగా ఇలాంటి థ్రిల్లర్ సినిమాలలో భూతకాలంలో జరిగిన ఓ సంఘటనతో మొదలుపెట్టి, తరువాత అక్కడివరకు జరిగిన సంఘటనలను చూపించడం జరుగుతుంది. ఈ సినిమాలో దర్శకుడు ఇంద్రగంటి వర్తమానంలోనే కథను మొదలుపెట్టి భూతకాలంలోకి తీసుకొనివెళ్ళాడు. ఇది గొప్ప విషయం కాకపోవచ్చు కానీ బాగుందనిపించింది.
గౌతమ్-కాథరిన్, జై-ఐశ్వర్యల ప్రేమకథలు చాలా బాగా చూపించారు. ముఖ్యంగా, రెండో ప్రేమకథలో రెండు రోజులు అన్నింటికీ దూరంగా బ్రతకడం అనే అంశం బాగుంది. దాన్ని ఇంకాస్త హృద్యంగా చూపించుంటే ఇంకా బాగుండేది. ఏదేమైనా, రెండు ప్రేమకథలకు “మణిశర్మ” కూడా బాగా సాయం చేశారు. “గుస గుసలాడే” మరియు “చలిగాలి చూడు” పాటలు మెలోడీ బ్రహ్మను మళ్ళీ పరిచయం చేశాయి. ఇందుకు దర్శకుడికి కూడా కృతజ్ఞతలు చెప్పుకోవాలి.
ఇక సినిమాకు ఆయువుపట్టులాంటి విరామ సన్నివేశంతో ప్రేక్షకుడికి రెండో సగం పట్ల బాగా ఉత్కంఠను కలిగించాడు దర్శకుడు. ఇతడితో పాటు మూలకథను అందించిన “డేవిడ్”ని కూడా అభినందించాలి.
రెండో సగంలోని కథనం చాలా ముఖ్యమైనది. అసలు దోషి జై అని చెప్పిన సన్నివేశాలు బాగున్నాయి కానీ ఇక్కడే ఒక విషయం అర్థంకాలేదు. కాథరిన్, వంశీ (అవసరాల శ్రీనివాస్)ల వల్ల జై దోషి అని తెలిసింది కానీ అతడు ఇబ్బందుల్లో చిక్కుకున్నట్టు ఎక్కడా అనిపించలేదు. అతడిని సమస్యలు చుట్టుముడుతున్నట్టు, వాటి నుండి అతడు తప్పించుకునే ప్రయత్నాలు చేసినట్టుగా కొన్ని సన్నివేశాలు ఉండుంటే మరింత ఉత్కంఠ కలిగేది. ఇక్కడ కూడా మణిశర్మ గారి పనితనం అద్భుతం. ముఖ్యంగా, జై రూములోకి కాథరిన్ వెళ్ళే క్రమంలో నేపథ్య సంగీతం అమాంతం ఉత్కంఠను పెంచేసింది.
ఈ రెండో సగంలో ఆకట్టుకున్న మరో పాత్ర దర్శనం (వెన్నెల కిషోర్). అనుమానపు బాస్ గా అతడి నటన బాగా నవ్వించింది.
ఇక చివర్లో అసలు కథను చెప్పేసి త్వరగా సినిమాను ముగించడం చకచక జరిగిపోయినట్టు అనిపిస్తుందేమో కానీ అప్పటివరకు కాస్త సాగదీసిన కథనానికి మాత్రం ఇంకాస్త సాగతీత లేకుండా జరిగిపోయిందనిపించింది.
అలా, “నాని జెంటిల్‌మన్” గొప్ప సినిమా కాకపోవచ్చు కానీ దర్శకుడు ఇంద్రగంటికి మరిన్ని అవకాశాలు ఇప్పించే సినిమా, మణిశర్మను తిరిగి పరిచయం చేసిన సినిమా. కుటుంబ సమేతంగా వెళ్ళి ఆనందించగల సినిమా.
ఇంకో విషయం… ఈ సినిమాకు “జెంటిల్‌మన్” అని పేరు పెట్టడానికి శంకర్ తీసిన “జెంటిల్‌మన్” ఓ రకంగా స్ఫూర్తి అనిపించింది. చూసినవారు ఓసారి ఆలోచించండి, చూడనివారు చూశాక ఆలోచించండి. 🙂
నటనలు :
“ఎవడే సుబ్రమణ్యం” తరువాత నాని కాస్త కొత్తగా నటించిన సినిమా ఇది. గౌతమ్ గా మామూలుగా నటించినా, జైగా మాత్రం బాగా మెప్పించాడు. నివేథా చేసిన తొలి తెలుగు సినిమా అయినా, హావభావాలు బాగా పలికించింది. సురభి ఫరవాలేదు. అవసరాల శ్రీనివాస్ అతి ముఖ్యమైన పాత్రని బాగా చేశాడు. శ్రీముఖి నటనను పక్కనబెడితే పాత్ర ముఖ్యమైనది. వెన్నెల కిషోర్ నవ్వించగా, తనికెళ్ళ భరణి, రోహిణి, ప్రగతి, వినయ్ వర్మ ఇలా అందరూ ఫరవాలేదు.
బలాలు :
- కథ, కథనం. ఎక్కువ హంగులు, ఆర్భాటాలు లేని థ్రిల్లర్ కథ ఇది. అందుకు డేవిడ్, ఇంద్రగంటిలకు అభినందనలు.
- మణిశర్మ సంగీతం. కథ, కథనాలు సాధారణమైనవే కానీ వాటికి మణిశర్మ సంగీతం తోడవ్వడంతో అవి థ్రిల్లింగ్ గా అనిపించాయి. మణిశర్మ అభిమానులకు ఆయనను తిరిగి పరిచయం చేసిన సినిమా ఇది.
- నాని నటన. “న్యాచురల్ స్టార్” అని పెట్టుకున్నందుకు కావాలని న్యాచురల్ గా చేయకుండా కొత్తగా చేశాడు.
బలహీనతలు :
- రెండో సగంలో సాగదీసిన కథనం.
ఈ చిత్రం నేర్పిన పాఠం :
థ్రిల్లర్ సినిమాకు సంగీతం ప్రాణం పోస్తుంది. అలాంటి సంగీతాన్ని సంగీత దర్శకుడి నుండి రాబట్టుకోగలిగిన పనితనం దర్శకుడికి ఉండాలి.
– యశ్వంత్ ఆలూరు
Click here for English version of this Review…
Pingback: Nani Gentleman (2016) – Film Criticism