ఒక మనసు (2016)

Oka Manasu Poster (2)

వర్షంలో పాటంటే “చిటపటచినుకులు” అని మొదలుపెట్టినట్టు, ప్రేమకథంటే “రెండు మనసులు” అని మొదలుపెట్టడం సహజం. ఎన్నిసార్లు చెప్పినా, అవే మనసులు, అవే భావాలు. అంతకంటే గొప్పగా, కొత్తగా చెప్పడానికి ఏ ప్రేమకథలోనైనా ఏముంటుంది? అయినాసరే, ఇప్పటివరకు ప్రేమకథలతో బోలెడు సినిమాలొచ్చాయి. కాకపోతే, “రెండు మనసులు” అని మొదలుపెట్టకుండా దర్శకుడు “రామరాజు” తన కథను “ఒక మనసు” అని మొదలుపెట్టాడు. ఈయన పేరు, ఈయన తీసిన “మల్లెల తీరంలో సిరిమల్లె పువ్వు” సినిమా విడుదలయినట్టు చాలామందికి తెలియదు. మంచి అబిరుచి గల నిర్మాతగా పేరొందిన “మధుర శ్రీధర్”, టీవీ9 ఛానల్ తో కలిసి నిర్మించిన ఈ సినిమాలో నాగశౌర్య, నిహారిక కొణిదెల జంటగా నటించారు.

కథగా చెప్పాలంటే, మొదటి చూపులోనే ఒకరినొకరు ఇష్టపడిన సూర్య (నాగశౌర్య), సంధ్య (నిహారిక)ల ప్రేమకథే ఈ సినిమా కథ. అంతకంటే చెప్పడానికి ఏమి లేదు. కానీ అన్ని కథలూ ఒకేలా ఉండవు.

ఇదొక “సహజమైన” ప్రేమకథ. “సినిమా” ప్రేమికులు గొడవపడితే, వెంటనే దూరమైపోయి, కాసేపు బాధపడి, ఓ విరహగీతం పాడుకొని, క్షమాపణలు చెప్పుకొన్న తరువాత దగ్గరవుతారు. దాంతో సినిమా కూడా అయిపోతుంది. కానీ నిజజీవిత ప్రేమకథలలో అలా జరగదు కదా! ఓ రోజు గొడవపడినంత మాత్రాన మరుసటిరోజున కలవకుండా ఉంటారా? ఇదే ఈ సినిమాలో చూపించాడు దర్శకుడు. అతడికి ఎడిటర్ “ధర్మేంద్ర” బాగా సాయం చేశారు. అందుకే, ఇది సహజమైన ప్రేమకథ.

ఈ కథలో కనిపించే సూర్య, సంధ్యలను మనం ఎప్పుడో వినేవుంటాం, చూసేవుంటాం. ఇద్దరి జీవితాలు, ఆలోచనలు వేరు. “ఇష్టం” వారిని కలిపింది కానీ వారి దారులను కలపలేదు. అలాంటప్పుడు సంధ్య, సూర్య ఇష్టాలను ఇష్టపడుతూ అసలు తానంటూ లేకుండా చేయమని అతడిని అడిగే కవితాత్మక అంశాన్ని అంతే కవితాత్మకంగా దర్శకుడు తెరపై చూపించడం విశేషం. అడుగడుగునా సమస్యల్లో చిక్కుకున్న సూర్య తనను వదిలేస్తే సంధ్య జీవితం బాగుంటుందని చెప్పినంత సులువుగా అతడిని సంధ్య వదిలి వెళ్ళలేదు. ఎన్నిసార్లైనా చెప్పగలదు సూర్యతో, “నీ మీద ప్రేమ చావదు, ఇంకొకరి మీద ప్రేమ పుట్టదు!” అని.

పరిస్థితులు ఎలా ఉన్నా సూర్యతోనే ఉండాలన్న ప్రేమ సంధ్యది. తన సమస్యలు సంధ్యను కూడా బాధపెట్టకూడదనే బాధ్యత సూర్యది. మనసుకు కష్టమైనా, సంధ్యను తన నుండి దూరంగా వెళ్ళిపొమ్మని చెప్పిన అతడి మనోవేదన ప్రేక్షకుడి మనసుదాకా రాకుండా ఉండదు. “పరిస్థితులను బట్టి మారిపోతే అది ప్రేమ కాదు. అలాగని పరిస్థితులను అర్థం చేసుకోకపోయినా అది ప్రేమ కాదు” అని అర్థంచేసుకున్న సంధ్య అంటే గౌరవం పెరగకుండా ఉండదు. ఇసుకలో వ్రాసిన కథలను సముద్రపు అలలు చెరిపేస్తాయి, కాగితంపై వ్రాసిన కథలు చిరిగిపోతాయి కానీ మనసులో వ్రాసుకున్న కథలు ఎప్పటికీ నిలిచిపోతాయన్న విషయాన్ని బొటనవేలితో ఇసుకలో వ్రాస్తున్న సంధ్య ద్వారా చెప్పిన విధానం అద్భుతం. ఒక అంశాన్ని చెప్పడానికి దృశ్యం, మాటల్లో ఎదో ఒకటే బలమైన మాధ్యమం. కానీ ఈ సన్నివేశంలో రెండింటినీ బలమైన మాధ్యమంగా వాడడం చాలా బాగుంది.

ప్రేమలో “మ్యాజిక్” ఉంటుంది కానీ “లాజిక్” ఉండదన్న విషయానికి ఉదాహరణ సంధ్య సూర్యతో “నాకో కలొచ్చింది. నీ చుట్టూ చాలామంది జనమున్నారు. కానీ అందులో నేను కనబడలేదు సూర్య” అని చెప్పే సన్నివేశం. సంధ్య కన్న కలలో తనను తాను ఎలా చూసుకోగలదనే తర్కం తట్టకమానదు…!!

దర్శకుడు రామరాజుకి నాదొక ప్రశ్న. “ఈ కథకు మీరు ఇచ్చిన ముగింపు చాలా బాగుంది. అంతకంటే సంధ్యకు వేరే దారి లేదు. ఇంతకంటే సహజమైన ముగింపూ ఈ కథకు లేదు. సూర్య తనకొచ్చిన ఫోనులో ఏమి తెలుసుకున్నాడో చెప్పకపోయినా ప్రేక్షకుడు యిట్టే పసిగట్టగలడు. కానీ ఆ ఉత్తరం ఎందుకు రాయించారు సార్? వాడిపోయిన మల్లెల సాక్షిగా తనెక్కడ ఉంటుందో సంధ్య సూర్యతో చెప్పేసినప్పుడు ఇక ఉత్తరాలు ఎందుకు? మీరు ఆ విషయాన్ని కూడా ప్రేక్షకుడికి వదిలేసుంటే బాగుండేది. అతడు అర్థం చేసుకోగలడు. ఏదేమైనా, బరువెక్కిన గుండెతో ప్రేక్షకుడిని ధియేటరు నుండి బయటకు పంపించారు. మీకు, మీ కథ, కథనాలకు జోహార్లు!”

ఈ సినిమా గురించి చాలా వ్రాయాలని ఉంది. కానీ చూడాలనుకునే వారికోసం వ్రాయడంలేదు. ఈ కథలోని ప్రధాన పాత్రలకు “సూర్య”, “సంధ్య” అని పేర్లు పెట్టడం వెనుక కూడా దర్శకుడు కవితాత్మకంగా ఆలోచించాడు అనిపిస్తుంది. అది నేనిక్కడ చెప్పడంలేదు. చూసినవారు ఆలోచించి కామెంట్స్ పెట్టండి. చూడాలనుకునేవారు చూశాక ఆలోచించండి.

ఈ సినిమా అందరికీ నచ్చకపోవచ్చు కానీ సహజమైన కథలను ఇష్టపడేవారికి, స్వచ్చమైన ప్రేమకథలను ఆస్వాదించేవారికి, సినిమా అంటే ఒక అనుభవం అని నమ్మేవారికి, ఎలాంటి భావోద్వేగాన్ని అయినా తీసుకోగలిగేవారికి ఈ సినిమాను చూడమని సిఫార్సు చేస్తున్నాను. మనిషికి, మనిషికి అభిప్రాయ భేదాలుంటాయి కనుక నా సమీక్షను చదివి సినిమా చూసినవారికి నచ్చకపోతే, దయచేసి నన్ను తిట్టుకోకండి. 🙂

నటనలు :

సూర్యగా శౌర్య సరిగ్గా సరిపోయాడు. మన చుట్టాలబ్బాయి అనేలా ఉండే అతడి ఆహార్యం పాత్రకు ప్రాణం పోసింది. పాత్ర పడే మనోవేదనను అతడు చూపించిన తీరు అద్భుతం. సినిమాకు వెళ్ళేముందు నా అనుమానం అంతా నిహారిక మీదే ఉండేది. యాంకరుగా అల్లరి చేసిన నిహారికను చీరకట్టులో ఓ మామూలు తెలుగమ్మాయిగా చూడడం మొదట్లో ఇబ్బందిగా అనిపించినా, దర్శకుడు తెరమీద నాగబాబు గారి కూతురు కాకుండా సంధ్యే కనిపించేలా చేశాడు. సంధ్య పాత్రకు ముందుగా సమంత, రెజినాలను సంప్రదించారట. కమర్షియల్ కథానాయికలుగా స్థిరపడిపోయిన వారిని ఈ కథలో ఊహించుకోవడం కష్టం. నిహారికను ఎంపిక చేసుకోవడమే చాలా కొత్తగా బాగుంది. ఆమె నటన విషయానికి వస్తే, నటనంటే తపన ఆమెలో బలంగా ఉన్నట్టు కనిపించింది కానీ హావభావాలు పలికించడంలో ఇంకాస్త ప్రావీణ్యం సంపాదించాల్సి ఉంది. ఇదే మొదటి ప్రయత్నం కనుక మరో సినిమాకు అది వచ్చేస్తుందనే నమ్మకం ఉంది.

రావురమేష్, అవసరాల శ్రీనివాస్, నాగినీడు, హేమంత్, రాజారవీంద్ర, వెన్నెల కిషోర్ అందరూ పాత్రలకు న్యాయం చేశారు. సంధ్య తల్లి పాత్రలో ప్రగతి గారిని ఎందుకు ఎంపిక చేసుకున్నారో తెలియదు. మంచి ఫీల్ తో సాగే కథనంలో ఆవిడ అతిశయపు భావోద్వేగాలు ఇబ్బందిపెట్టాయి. ఆవిడ బదులు రోహిణి లాంటివారిని ఎంపిక చేసుంటే బాగుండేది. రామజోగయ్యశాస్త్రిగారు ఓ లాయరు పాత్రలో కనిపించారు.

సంగీతం – సాహిత్యం :

ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అంశాలివి. ఓ ప్రేమకథకు సంగీతం, సాహిత్యం ఎంత తోడుగా ఉంటాయో ఈ సినిమా పాటలు ఉదాహరణలు. “లోఫర్” పాటలు ఎంత కర్ణకఠోరంగా ఉంటాయో, ఈ సినిమా పాటలు అంత మధురంగా కంపోజ్ చేశాడు సునీల్. పాటలు, నేపథ్య సంగీతం ఈ సినిమాకు అత్యంత బలాన్నిచ్చాయి. “ఓ మనసా”, “నిన్న లేనంత”, “ఏమిటో ఈ క్షణం” లాంటి పాటలు మనసుకు ఎంతో హాయినిస్తాయి.

రామజోగయ్యశాస్త్రి, భాస్కరభట్లలు అందించిన సాహిత్యం చాలా హృద్యంగా ఉంది. ముఖ్యంగా, రామజోగయ్యగారు వ్రాసిన “ఓ మనసా” పాటలో “ఒక జననం ఒకటేనా ప్రేమకు? తుదివరకూ నీ కలే, మరణమే దరి రాదంట తనకు..”, భాస్కరభట్లగారు వ్రాసిన “ఏమిటో ఈ క్షణం” పాటలో “నేను అంటే నేను కాదే, నీకు ఇంకో పేరులే… నువ్వు అంటే నువ్వు కాదే, నాకు ఇంకో అర్థమే…” అనే వాక్యాల్లో ఈ కథ సారాంశాన్ని చెప్పేశారు. గీతరచయితలకు పరిపూర్ణ స్వేచ్చనిస్తేనే ఇలాంటి పాటలు మనం వినగలం. దర్శకనిర్మాతలకు ఈ విషయంలో కృతజ్ఞతలు తెలపాలి.

మరిన్ని బలాలు :

  1. రాంరెడ్డి ఛాయాగ్రహణం. మంచి ప్రదేశాల్లో, మంచి లైటింగుతో ఈ ప్రేమకథను ప్రేక్షకుడికి బాగా దగ్గర చేశారు రాంరెడ్డి.
  2. మాటలు. దర్శకుడు రామరాజు అందించిన మాటలు పలుచోట్ల చాలా బాగున్నాయి.
  3. నిర్మాణ విలువలు. ఈ సినిమాను చూడడానికి నన్ను ప్రేరేపించిన కారణాల్లో ఒకటి నిర్మాత “మధుర శ్రీధర్”. మంచి అభిరుచిగల నిర్మాత ఈయన. వ్యాపారాన్ని పట్టించుకోకుండా మంచి సినిమాలను ప్రేక్షకుడికి అందించాలనే తపన ఉన్న నిర్మాతలలో ఈయన ఒకరు. ఈయన టీవీ9 వారితో కలిసి ఎక్కడా రాజీపడకుండా దర్శకుడి ఆలోచనలు తెరపై కనిపించేలా చేశారు.

బలహీనతలు :

  1. నెమ్మదిగా సాగే కథనం. సూర్య, సంధ్య పాత్రలను బలంగా నెలకొల్పడానికి దర్శకుడు చాలా సమయం తీసుకున్నాడు. ఇది అందరికీ నచ్చదు.

ఈ చిత్రం నేర్పిన పాఠం :

  1. నాటకీయతను, సహజత్వాన్ని ఎప్పుడు కలిపి చూపించాలో, ఎప్పుడు చూపించకూడదో బాగా అధ్యయనం చేసి తెలుసుకోవాలి.

– యశ్వంత్ ఆలూరు

7 thoughts on “ఒక మనసు (2016)

  1. Awesome analysis,
    1.About the lead names ,
    2.in writing the lovestory which the director has showcased touching reality in a cinematic way with beautiful locations

    I guess you missed directors view on politics , of course main focus is on lovestory but he still managed to write few good lines ,
    and without even writing a note may not look good and may be too heavy for audience to digest , so may be that is why director has to do that ,

    Anyway keep up the good work 🙂

    Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s