నేను సినిమా రివ్యూలు వ్రాయడం మొదలుపెట్టాక, విడుదలయిన 50 రోజుల తరువాత చూసిన ఏకైక సినిమా “బిచ్చగాడు”. కేవలం సమయం కుదరకే దీన్ని చూడడం జరగలేదు. ఒక డబ్బింగ్ సినిమా, ప్రేక్షకులకు పెద్దగా పరిచయంలేని ఓ హీరో “విజయ్ ఆంటోనీ” సినిమా, ఎన్నో ఏళ్ళ క్రితం వెంకటేష్ తో “శీను” అనే సినిమాను తీసిన “శశి” అనేవాడు దర్శకత్వం వహించిన సినిమా, ఇలా ఈ సినిమాను ఒక మామూలు తెలుగు ప్రేక్షకుడు చూడడానికి ఆసక్తి చూపించని అంశాలివి. కానీ ఎన్నో తెలుగు సినిమాల నుండి పోటీని తట్టుకొని, యాభై రోజులుగా దిగ్విజయంగా “ఫుల్ హౌస్”లతో ఆడుతూ, ధియేటర్ల సంఖ్యను కూడా పెంచాల్సిన పరిస్థితిలో ఉన్న ఈ సినిమాను అందరూ చూసేసిన తరువాత రివ్యూలు వ్రాసేసి, చదివేసిన తరువాత, రివ్యూలు వ్రాసుకునే నేను చూడడం నిజంగా నాకు చాలా బాధాకరమైన విషయం.
ఎలాగు ఈ సినిమాను మీరందరూ చూసే ఉంటారు కనుక ఇందులోని “కథ”ను చెప్పదలచలేదు. నిజానికి మూలకథ పెద్ద గొప్పగా కూడా లేదు. ఇంచుమించు రజినీకాంత్ “అరుణాచలం” సినిమాకు దగ్గరగానే ఉంది. కానీ అందులోలాగ కేవలం డబ్బుతోనే ముడిపెట్టకుండా, దర్శకుడు శశి ఎంచుకున్న బిచ్చగాడి నేపథ్యం చాలా ఆసక్తికరంగా అనిపించింది. వందలకొట్లున్న ఓ వ్యక్తి తన తల్లిని కాపాడుకోలేని స్థితిలో ఉన్నప్పుడు ఎవరో స్వామీజీ ఏదో చెబితే గుడ్డిగా నమ్మి వెళ్ళిపోవడం మొదట్లో రుచించకపోయినా, ఓ తల్లి కోసం ఎంతగానో పరితపించే ఆ కొడుకుని చూస్తే అతడి నిర్ణయం సరైనదేనని అనిపిస్తుంది. దాన్ని తెలిపేలా ఉన్న “వంద దేవుళ్ళే” అనే పాట చాలా బాగుంది. ఆ తరువాత దర్శకుడు నడిపిన కథనాన్ని చూస్తే అసలు ఆ పాయింట్ గుర్తుకే రాదు. అది పూర్తిగా దర్శకుడి గొప్పతనం. మనం రోజు చూసే ఎన్నో నిజాలను హాస్యాన్ని జోడించి చెప్పాడు. ఉదాహరణకు ఓ బిచ్చగాడు “జనం, వాళ్ళు వేసే ఒక్క రూపాయి కోసం మనకు రెండు కళ్ళూ ఉండకూడదు అనుకుంటారు” అనే మాట నవ్విస్తూనే ఆలోచింపజేసేలా ఉంది. ఇలాంటి అంశాలు ఇంకా చాలా ఉన్నాయి ఈ సినిమాలో.
హీరోయున్ మహేశ్వరి పాత్రను కూడా చాలా బాగా మలిచాడు దర్శకుడు. “నేను నీకు ఏదో ఒక పని ఇప్పిస్తాను. ఈ పని మాత్రం చేయకు” అని బిచ్చమెత్తుకునే హీరోతో అనడం ఆమెకు అతడిపై ఎంత ఇష్టముందో తెలిపింది. ఏదేమైనా, కనీసం తన ప్రేయసికి కూడా నిజం చెప్పకూడదని అనుకునే హీరో పాత్రలోనూ అంతే నిజాయితి ఉంది. ముఖ్యంగా, రెండో సగంలో “పోనీ ఈ డబ్బుని బిచ్చంగా వేస్తే తీసుకుంటావా?” అని అడిగే సన్నివేశం చాలా బాగుంది. ఇది తెరపై కనిపించే పాత్రల్లోనే కాదు తెర వెనుక నుండి వాటిని నడిపించే దర్శకుడిలోనూ నిజాయితి ఉందని తెలిపింది.
48 రోజుల దీక్ష పూనిన హీరోకి 46 రోజులు పెద్దగా కష్టాలు పెట్టకుండా కేవలం హాస్యం, ప్రేమ అనే అంశాలపై దృష్టి సారించిన దర్శకుడిపై ఎక్కడో చిన్న అనుమానం ఉండేది. కానీ చివరి రెండు రోజులూ అతడికి వచ్చిన కష్టాలను సినిమా చివరి నిమిషాల్లో ప్రేక్షకుడు కూడా ఫీల్ అయ్యేలా చేశాడు దర్శకుడు. ఆ క్రమంలో, గూండాలు తరుముతున్నా కూడా మధ్యలో గోడపై వ్రాసుకున్న రోజుల సంఖ్యను హీరో మార్క్ చేసే షాట్ చాలా క్రియేటివ్ గా అనిపించింది. ఓ ప్రక్కన తల్లికోసం చేసే దీక్ష, ఇంకోప్రక్క ప్రాణం కోసం పోరాడుతున్న ప్రేయసి, మరోప్రక్క గడువు ముగియడానికి అరగంట సమయం, ఇన్ని సమస్యలు ఒకేసారి అల్లుకున్న సమయంలో దారి లేక దీక్షను విరమించాలని అనుకున్న హీరోకు అతడి తోటి బిచ్చగాళ్ళు సాయం చేయడం మనసుకు హత్తుకునే సన్నివేశం. ఆ తరువాత బిచ్చగాడైన హీరో తన అసలు రూపంలోకి వెళ్ళిపోయే సన్నివేశం, “మొదటిసారి కోటీశ్వరుడు అయినందుకు కంపరంగా ఉంది” అని చెప్పే సన్నివేశం చాలా బాగున్నాయి.
ఇన్ని మంచి అంశాలతో అలరించిన బిచ్చగాడులో మేచ్చుకోలేని అంశాలూ ఉన్నాయి. అందులో మొదటిది హీరో పెదనాన్న పాత్ర. ఇది అంతగా మెప్పించలేదు. రెండవది హీరో “విజయ్ ఆంటోనీ”. ఈ కథను ఎంతగానో ప్రేమించిన అతడు దీనికి నిర్మాతగా కూడా మారాడు, మంచి సంగీతం అందించాడు కానీ పాత్రకు కావాల్సిన లోతైన భావోద్వేగాలను మాత్రం తెరపై పండించలేకపోయాడు. ఎలాంటి సన్నివేశంలోనైనా అతడిలో ముఖకవళికలు లేకపోవడం గమనార్హం. కేవలం కథనమే ప్రేక్షకుడిని కట్టిపడేసింది కానీ విజయ్ నటన కాదు. ఎంతో భావోద్వేగాన్ని పండించాల్సిన చివరి సన్నివేశంలో కూడా అతడు తేలిపోయాడు. బహుశా ఇతడి గురించి తెలిసేనేమో దర్శకుడు ఆ సన్నివేశంలో కెమెరాను అతడి వెనుక ఉంచాడు అనిపిస్తుంది. ఈ పాత్రను తమిళంలో “సూర్య” లేదా “కార్తి” పోషించి ఉంటే బాగుండేది. తెలుగులో అయితే, దీనికి పరిపూర్ణ న్యాయం చేయగల నటుడు “ఎన్టీఆర్” మాత్రమే అనిపిస్తుంది.
ఏదేమైనా, “బిచ్చగాడు” మంచి కథ, కథనాలతో వచ్చి “మిలియనీర్”గా నడుస్తోంది. ఇంకా బాగా నడవాలని కోరుకుంటున్నాను. మంచి అంశాలతో వచ్చిన సినిమాను భాషాభేదాలు, అభిమానభేదాలు లేకుండా మన ప్రేక్షకులు అక్కున చేర్చుకున్నందుకు సంతోషపడుతున్నాను. ఈ సినిమాను ఇంత ఆలస్యంగా చూసినందుకు నన్ను నేను చీవాట్లు పెట్టుకుంటున్నాను. ఒక మంచి సినిమాను మనకు అందించినందుకు “శశి”, “విజయ్ ఆంటోనీ”, “చదలవాడ శ్రీనివాసరావు”లకు అభినందనలు తెలుపుకుంటున్నాను.
– యశ్వంత్ ఆలూరు