కవితకు రాగాన్ని జోడించి పాడడం బహుశా సులువేమో కానీ రాగానికి కవితను జోడింఛి పాడడం పెద్ద సాహసమని నా అభిప్రాయం. “సాహసం శ్వాసగా సాగిపో” సినిమా కోసం రచయిత “అనంతశ్రీరాం” అదే సాహసం చేశారు, “తాను నేను” అనే పాటతో. వినడానికి సొంపుగా ఉండే “రెహమాన్” సంగీత దర్శకత్వంలో వచ్చిన ఈ పాట ఇప్పటికే అందరికి బాగా నచ్చేసింది. ఒంటరిగా ఉన్నప్పుడు, స్నానం చేస్తున్నప్పుడు పాడుకోవడానికి సులభంగా ఉండే పాటను వ్రాయడం నిజంగా చాలా కష్టమనిపించింది. ఆ కష్టం అనంతశ్రీరాం గారు ఎంతగా పడ్డారో ఆయనే చెప్పాలి. ఆయన కష్టాన్ని కాస్త అర్థం చేసుకున్నవాడిగా ఈ ఆర్టికల్ వ్రాస్తున్నాను.
తమిళంలో ఈ పాటకు వ్రాసిన తరువాత బాణీ కట్టారో లేక బాణీ కట్టిన తరువాత పాట వ్రాశారో తెలియదు కానీ తెలుగులో మాత్రం బాణీకే పాటను వ్రాసే అవకాశం వచ్చివుంటుంది రచయితకు. అయినా కూడా ఎంతో అందంగా పాటను వ్రాశారు. ఈ పాటలో అబ్బాయి (హీరో), అమ్మాయి (హీరోయిన్) పట్లున్న ప్రేమను గురించి, వారిద్దరి బంధం గురించి అబ్బాయి కోణంలోంచి పలు విధాలుగా చెప్పారు.
తాను-నేను.. మొయిలు-మిన్ను..
తాను-నేను.. కలువ-కొలను..
తాను-నేను.. పైరు-చేను..
తాను-నేను.. వేరు-మాను..
శశి తానైతే.. నిశినే నేను..
కుసుమం-తావి.. తాను-నేను..
వెలుగు-దివ్వె.. తెలుగు-తీపి..
తాను-నేను.. మనసు-మేను..
ఇందులో అన్నీ అచ్చ తెనుగు పదాలుండడం విశేషం. ప్రతీ వాక్యంలో “తాను”, “నేను”కి వాడిన ఉపమానాలు, మొయిలు (మబ్బు) – మిన్ను (ఆకాశం), కలువ – కొలను, పైరు – చేను, శశి (చందమామ) – నిశి (రాత్రి), ఇలా వాటితో వాటికి విడదీయలేని సంబంధం ఉంది. ఇది గొప్ప విషయం కాదు. “నేను”కి ఉపమానంగా చెప్పిన అంశాలు “తాను”కి ఉపమానంగా చెప్పిన అంశాలు లేకుండా కూడా ఉండగలవు. కానీ “తాను” ఉంటే “నేను” ఎంత అందంగా ఉండగలదో చిన్న చిన్న పదాలతో అందంగా చెప్పడంలోనే రచయిత గొప్పతనం ఉంది.
ఉదాహరణకు, మబ్బులు లేని ఆకాశం, కలువలు లేని కొలను, పైరు లేని చేను, చందమామ లేని రాత్రి, పువ్వు లేని తావి, వెలుగు లేని దీపం ఉండగలవు. కానీ అవి ఉన్నప్పుడే ఇవి అందంగా కనిపిస్తాయి. అంటే, ఆ అమ్మాయి తనతో ఉన్నప్పుడే ఆ అబ్బాయి జీవితం అందంగా ఉంటుందని చెప్పిన ప్రయత్నం ఇది. మనసులేని మేను (శరీరం), వేరు లేని మాను (చెట్టు) ఉన్నాయంటే వాటిలో ప్రాణం లేనట్టు లెక్క. ఆ అమ్మాయే తన ప్రాణం అని చెప్పిన ఇంకో ప్రయత్నం ఇది. “తాను”, “నేను” అనే పదాలను బాణీకి తగ్గట్టుగా ముందువెనకలుగా, అర్థం మారకుండా వాడిన తీరు మరో అద్భుతమైన పదప్రయోగం. ఇదే ధోరణిలో ఆలోచిస్తే, “తెలుగు – తీపి” అనే ఉపమానం ఎందుకు వాడారో రచయితే చెప్పాలి.
దారి నేను.. తీరం తాను..
దారం నేను.. హారం తాను..
దాహం నేను.. నీరం తాను..
కావ్యం నేను.. సారం తాను..
నేను-తాను.. రెప్ప-కన్ను..
వేరైపోని పుడమి-మన్ను..
ఈ పాటలో అతి గొప్ప వాక్యాలు ఇవి. ప్రతీ వాక్యం ఎంతో అర్ధవంతమైనది. ఆ అమ్మాయిని చేరుకునేంత వరకు తన ప్రయాణాన్ని ఆపనని చెప్పే వాక్యం “దారి నేను.. తీరం తాను..“. చేరుకున్నాక తనకెప్పుడూ తోడుగానే ఉంటానని చెప్పే వాక్యం “దారం నేను.. హారం తాను..“. దాహం అనేది శరీరం అనుభవించే పలు బాధల్లో ఒకటి. అప్పుడు దాన్ని తీర్చేది నీరు. అంటే, బాధలో సంతోషాన్ని కలిగించేది తానేనని చెప్పే వాక్యం “దాహం నేను.. నీరం తాను..“. ఆ అమ్మాయే తన జీవితానికి అర్థమని చెప్పే వాక్యం “కావ్యం నేను.. సారం తాను..“. తనకు ఏ కష్టం రాకుండా కాపాడుకోగలనని “నేను-తాను.. రెప్ప-కన్ను..” అనే వాక్యం చెబితే, విడిపోకుండా ఎప్పటికీ తనని భరించగలనని “వేరైపోని పుడమి-మన్ను..” అనే వాక్యం చెబుతుంది.
తాను-నేను.. గానం-గమకం..
తాను-నేను.. ప్రాయం-తమకం..
స్వచ్చమైన ప్రేమలో కాస్త గర్వం కూడా ఉంటుంది. తను లేకుంటే ఆ అమ్మాయి కూడా లేదని చెప్పే వాక్యాలే ఇవి. గమకాలు లేని పాట, తమకం (కోరిక) లేని ప్రాయం (“యవ్వనం” అని రచయిత ఉద్దేశ్యం కావచ్చు) ఎలాగైతే ఉండవో తను లేకుండా ఆ అమ్మాయి కూడా లేదన్న గర్వాన్ని వ్యక్తపరిచే ప్రయత్నం ఇది కాబోలు.
ముగింపు :
ఎప్పటికైనా, ఒక మనిషిని కదిలింఛి, అతడిలో ప్రేమ, విప్లవం, జ్ఞానం ఇలా పలు అంశాలను ప్రేరేపించే సామర్థ్యం సాహిత్యానికే ఉంది కనుక సాహిత్యకారులను గౌరవించుకోవాల్సిన అవసరం మనకెంతైనా ఉంది. ఇంత చక్కని పాటని మనకిచ్చిన “అనంతశ్రీరాం” గారిపట్ల నాకున్న గౌరవాన్ని చాటుకునే ప్రయత్నమే ఈ ఆర్టికల్. ఆయనకు ఈ పాటను వ్రాసే సౌలభ్యాన్ని కల్పించిన దర్శకుడు “గౌతమ్ మేనన్” గారికి, సాహిత్యం స్పష్టంగా వినిపించేంత గౌరవాన్నిచ్చిన సంగీత దర్శకుడు “రెహమాన్” గారికి, హృద్యంగా పాడిన “విజయ్ ప్రకాష్” గారికి కృతజ్ఞతలు తెలుపుకోవాలి.
చివరగా, దీన్ని చదివిన మీరందిరికీ కూడా ధన్యవాదాలు. తప్పులుంటే కామెంట్స్ పెట్టండి. ఈ పాటను విననివారు ఎవరైనా ఉంటే తప్పకుండా ఓసారి వినండి. ఆ తరువాత అసంకల్పితంగా చాలాసార్లు మీరే వినేస్తారు. ఈ పాట తాలూకు యూట్యూబ్ లింక్ ని క్రింద ఇస్తున్నాను. 🙂
– యశ్వంత్ ఆలూరు
mamoolu song kaadu asalu addiction, lyrics/singer ultimate sync,especially charanam ayyaka malli pallavi repeat avetapudu inka too much feel, emanna song aa ARR Devudu saame, ananth sriram/vijay prakash kooda equal credits ee song varaku :thumb:
LikeLiked by 1 person