మందు కొట్టే అలవాటు లేనివారికి కూడా కిక్కెక్కించే మత్తు “రజినీకాంత్”. మందు పాతబడే కొద్ది దాని ఖరీదు పెరిగినట్టు, వయసు పైబడే కొద్ది రజిని సినిమాలకు అయ్యే ఖర్చు కూడా పెరుగుతోంది. అలాంటి ఓ సినిమానే “కబాలి”.
కొందరు దర్శకులు కథను “కథ”గా చెప్పడంలో తడబడతారు కానీ దాన్ని తెరపై అద్భుతంగా ప్రదర్శించగలరు. కొందరేమో “కథ”గా చెప్పినప్పుడు అద్భుతంగా చెప్పగలరు కానీ దాన్ని తెరపై ప్రదర్శించడంలో తడబడతారు. ఈ సినిమా దర్శకుడు “రంజిత్”ని ఈ రెండో కోవలోకి చెప్పుకోవచ్చు. ఎందుకంటే కబాలి “కథ”గా బాగుంది కాబట్టి.
రజినిని పక్కనబెట్టి చూస్తే, ఈ కథలో నిరుద్యోగులు మాఫియాలో చేరి జీవితాలను నాశనం చేసుకోవడం, వాళ్ళని కబాలి అనే ఓ మాఫియా డాన్ మార్చే ప్రయత్నం చేయడం, వయసు పైబడిన అతడు జైలు నుండి వచ్చి తన సంతోషాన్ని వెతుక్కునే ప్రయత్నం చేయడం… ఇలా ఎన్నో మంచి అంశాలను పొందుపరిచాడు దర్శకుడు. బహుశా, వీటిని గమనించిన రజిని, “నాయకుడు” లాంటి కథ తనకు కూడా దొరికినందుకు, “మంచిది” అని సినిమా చేయడానికి ఒప్పుకొని ఉంటారు. అయితే, ఇక్కడ ఓ మెలిక ఉంది. తన కథని రజిని ద్వారా చెప్పడం వల్ల చాలామందికి చేరువవుతుంది. ఇది దర్శకుడికి దక్కిన వరం. కానీ రజిని ద్వారా ఓ కథని చెప్పాలనుకుంటే అందులో పలు అంశాలు, అనగా, రజిని నుండి ఆయన అభిమానులు ఆశించే స్టైల్, సంభాషణలు, ఫిలాసఫీ, కామెడీ ఉండేలా చూసుకోవాలి. అప్పుడు రజిని, సినిమాలో కథానాయకుడిగా కాకుండా, కథకన్నా పై స్థాయిలో ఉంటూ తన అభిమానులను తృప్తిపరుస్తారు. అది ఈ సినిమాలో లేదు. సినిమా మొత్తంలో ఎక్కడో ఒకట్రెండు చోట్ల మినహాయించి “కబాలి” తప్ప “రజిని” కనిపించరు. ఆయన కథకు లోబడి నడుచుకునే “కబాలి”గా మారిపోయారు. అంటే, ఇది “రంజిత్” సినిమా అయ్యింది కానీ “రజిని” సినిమా కాలేదు. అంతటి స్టార్ నుండి ఇంతటి స్వేచ్చను సంపాదించిన రంజిత్ గొప్పవాడే… “మంచిది“. దర్శకుడికి కథపైనున్న ప్రేమ అణువణువునా కనిపించింది కానీ రజినిపైనున్న అభిమానం ట్రైలర్లలో తప్ప సినిమాలో ఎక్కడా కనిపించలేదు. ఇదే, అతడి వరాన్ని శాపంగా మార్చేసింది. దాంతో, అటు తన కథనూ స్పష్టంగా చెప్పలేక, ఇటు రజిని అభిమానులనూ ఆనందపరచలేక 152 నిమిషాలపాటు తాను ఇబ్బందిపడి, ప్రేక్షకులను కూడా ఇబ్బందిపెట్టాడు.
అశేషమైన అభిమానాన్ని సంపాదించుకోవడంతో రజిని విభిన్నమైన కథలను చేసే ప్రయత్నం ఎప్పుడో మానేశారు. నటుడికి ఎక్కువ, దేవుడికి తక్కువ స్థాయిలో ఇప్పుడున్న రజినితో సినిమా చేసే దర్శకుడు కూడా ఆయనకు వీరాభిమానే అయ్యుండాలి, అభిమానులను తృప్తిపరచాలి. “శంకర్”, “రవికుమార్”లాంటి తలపండిన దర్శకులైతే రజినిపై తమకున్న అభిమానాన్ని చాటుకుంటూనే తమ కథలను చెప్పగలరు. ఉదాహరణకు “నరసింహ”, “రోబో” సినిమాలు. లేకపోతే, కేవలం అభిమానంతో “శివాజీ”, “లింగ” లాంటి సినిమాలనూ చేయగలరు. కానీ “రంజిత్”లాంటి కేవలం రెండు సినిమాల అనుభవమున్న దర్శకులకి “రజిని” దొరకటం సువర్ణావకాశం కనుక తమను తాము నిరూపించుకునే ప్రయత్నం చేస్తారే తప్ప రజిని గురించి, ఆయన అభిమానుల గురించి ఆలోచించడం ప్రశ్నార్థకం.
అత్యంత నేర్పు కలిగిన ఒక టీం ఈ సినిమాకు ట్రైలర్లు, పోస్టర్లు కట్ చేసింది. “కబాలి రా…” అనే డైలాగును ట్రైలర్లో చూసిన అభిమానులకి, నిర్మాతలు చేసిన “అతి” ప్రచారాలు, కంపెనీలు ప్రకటించిన సెలవులు, ఇలాంటివి గమనించిన ప్రేక్షకులకి అలాంటి సన్నివేశాలన్నీ మొదటి ఇరవై నిమిషాల్లోనే ముగించేసి, తరువాత పూర్తిగా “కబాలి”గా మారిపోయి “అండర్ ప్లే”లోకి వెళ్ళిపోయిన రజినిని చూపిస్తే ఎలా? ఒకవేళ దురదృష్టవశాత్తూ ట్రైలర్ చూడని ప్రేక్షకుడు ఎవరైనా ఉండి, అతడు నేరుగా సినిమా ధియేటరుకి వెళ్ళుంటే, ఆ “పరిచయ సన్నివేశం” కూడా అతడిని పెద్దగా ఆకట్టుకోలేదు. అభిమానులు ఈలలు వేస్తున్నారంటే అది ఖచ్చితంగా బాగుందనే భ్రమలో ఉండిపోవాలి. ఇది పూర్తిగా దర్శకుడి అవగాహన లోపమే. ఈ సినిమాను “అజిత్” లేదా “విజయ్” లాంటివారు చేసుంటే పరిస్థితి వేరుగా ఉండేది. కానీ రజిని చేసేసరికి అంచనాలు ఆకాశాన్ని తాకేశాయి. కారుతో ఒకడిని తొక్కించి చంపేసే సన్నివేశం బాగున్నా అప్పటికే నీరసించిన ప్రేక్షకుల్లో ఒక్కడు కూడా ఈల వేయలేదు మరి!! కబాలి తన భార్యను వెతుక్కుంటూ వెళ్ళడమనే అంశం రామాయాణం నుండి ప్రేరణ పొందినదిగా అనిపించినా, ఆ క్రమంలో అతడికి ఒక్క సమస్యను కూడా కలిగించకుండా ఊరికే అటు ఇటు ప్రదేశాలు మార్చి తిప్పడం భార్యకోసం కబాలి పడే ఆరాటాన్ని ప్రేక్షకుడికి చేర్చడంలో విఫలమైంది. ఆ క్రమంలో రాధిక ఆప్టే నటన మాత్రం ఆకట్టుకుంది.
రంజిత్ తను ఇదివరకు పనిచేసిన “సంతోష్ నారాయణన్”నే సంగీత దర్శకుడిగా ఎంచుకున్నాడు. సంగీతం కథకు తగ్గట్టుగా ఉంది కానీ రజినికి తగ్గట్టుగా లేదు. పాటలు వినడానికి బాగున్నాయి కానీ తెరపైకి వచ్చేసరికి తేలిపోయాయి. ఉదాహరణకు “ఒకడే ఒకడొకడే” పాట వినడానికి బాగున్నా తెరపై ప్రభావం చూపలేదు. “నిప్పు రా” పాటను దర్శకుడు సరైన చోట వాడుకోలేదు. “ఉగ్ర త్రినేత్రుడా” అనే పాట కూడా వినడానికి బాగుంది కానీ కబాలి ఎదిగే సమయంలో అది రావడంతో కథనాన్ని నీరుగార్చేసింది. “కలవని ఓ నది”, “గుండె నిండా” పాటలు “కబాలి”కి పనికొచ్చాయి కానీ అతడి తాపత్రయాన్ని, సంతోషాన్ని ప్రేక్షకుడికి చేరవేయలేకపోయాయి. ఇక నేపథ్య సంగీతం సరేసరి. ట్రైలర్లో చూపించిన చివరి షాట్ మరియు కబాలి జాతరలో శత్రువులపై తిరగబడే క్రమంలో ఏదో “సింఫనీ” లాంటిదాన్ని వాడడం కథనాన్ని మరింత నీరుగార్చేసింది.
ఇక ఈ సినిమాను తెలుగులోకి అనువదించడం అనే ప్రక్రియ ఏమాత్రం బాగోలేదు. పలుచోట్ల డైలాగులు సినిమాకు చాలా తక్కువ స్థాయిలో అనిపించాయి. ఎప్పుడూ రజినికి ఆయువుపట్టులా ఉండే “మనో” డబ్బింగ్ కూడా ఈసారి సాయం చేయలేదనిపించింది.
నటనల విషయానికి వస్తే, రజిని “అండర్ ప్లే క్యారెక్టర్” చేసి చాలాకాలమైంది. పలుచోట్ల ఇబ్బందిపడి తేలిపోయారనిపించింది. రాధిక ఆప్టే పాత్రకు బాగా ప్రాముఖ్యత ఉంది కానీ తనకి మాత్రం ఒక్క సన్నివేశంలోనే నటించే ఆస్కారం దొరికింది. మరో ముఖ్య పాత్రను చేసిన ధన్సిక ఆ పాత్రకు సరిగ్గా సరిపోయింది. ప్రధాన ప్రతినాయకుడిగా చేసిన విన్స్టన్ చావ్, మిగిలిన నటులందరి ఎంపిక అంతగా బాగోలేదు.
సాంకేతికంగా, మురళి ఛాయాగ్రహణం, థాను నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి.
చివరి మాట :
అభిమానుల వ్యాసార్థం దేశాలు దాటేయడంతో రజినికి కథల ఎంపికలో వ్యాసార్థం బాగా తగ్గిపోయింది. ఈ క్రమంలో “కబాలి” అనే ఈ సినిమా ఒక ప్రయోగమనే చెప్పాలి. బహుశా, ఈ సినిమా “బాషా”కంటే ముందుగా వచ్చుంటే బాగుండేదేమో. రజిని నుండి స్టైల్, ఫిలాసఫీ, కామెడీ ఇవేవి నిజంగా ఆశించని ప్రేక్షకులు ఒకవేళ ఎవరైనా ఉంటే, “మంచిది, ఈ సినిమా చూడండి!”.
“రోబో 2″తో గట్టిగా తొక్కిపట్టి వదిలిన బంతిలా మన సూపర్ స్టార్ మళ్ళీ పైకి ఉవ్వెత్తున ఎగరలాని ఆశిస్తూ, కేవలం “తెలుగు” వరకే నా ఈ అభిప్రాయపు వ్యాసార్థాన్ని నియత్రించుకుంటున్నాను.
– యశ్వంత్ ఆలూరు