ఒక దర్శకుడు ఎన్ని సినిమాలు తీశాడన్నది ముఖ్యం కాదు. మంచి సినిమాలు ఎన్ని తీశాడన్నది ముఖ్యం. “చంద్రశేఖర్ యేలేటి” విషయంలో ఇది ఋజువైంది. పరిశ్రమలో ఎన్నో ఏళ్ళుగా ఉన్నప్పటికీ ఆయన తీసిన సినిమాల సంఖ్య చాలా తక్కువ. ఎప్పుడు సినిమా తీసినా అందులో ఏదో ఒక కొత్త విషయం చెప్పడం ఆయన సృజనాత్మకతకు నిదర్శనం. మూడు సంవత్సరాల తరువాత ఆయన తీసిన సినిమా “మనమంతా”. సుప్రసిద్ధ మళయాళ నటుడు “మోహన్‌లాల్” మొదటిసారిగా తెలుగులో నటించిన ఈ సినిమాలో గౌతమి, విశ్వాంత్, రైనా రావు ముఖ్యపాత్రలు పోషించారు. “వారాహి చలనచిత్రం” పతాకంపై “సాయి కొర్రపాటి” నిర్మించారు.
కథ :
వేర్వేరు పరిస్థితుల్లో, వేర్వేరు మనస్తత్వాలు కలిగిన సాయిరామ్ (మోహన్‌లాల్), గాయత్రి (గౌతమి), అభి (విశ్వాంత్), మహిత (రైనా)ల జీవితాల సమాహారమే ఈ సినిమా.
కథనం – విశ్లేషణ :
ఇలాంటి నేపథ్యంతో రెండేళ్ళ క్రితం ప్రవీణ్ సత్తారు “చందమామ కథలు” సినిమాను తీశారు. అలాంటి నేపథ్యమే ఎంచుకున్నప్పటికీ పాత్రల చిత్రణలో కానీ, కథనం నడిపిన విధానంలో కానీ ఆ సినిమాను గుర్తురాకుండా చేయడం పూర్తిగా దర్శకుడి గొప్పతనమేనని చెప్పాలి.
ఇందులో కనిపించే పాత్రలన్నీ రోజూ మనం చూసేవే. స్వలాభం కోసం అడ్డదారిలో ప్రయాణించే సాయిరామ్, కుటుంబం కోసం అనుక్షణం ఆరాటపడే గాయత్రి, అల్ప సంతోషాల కోసం భవిష్యత్తుని పట్టించుకోని అభి, అందరూ తనవాళ్ళేనని బ్రతికే మహిత మనకు నిత్యం కనబడే వ్యక్తులే.
ఊహల్లో పుట్టిన కథకంటే అనుభవంలోంచి పుట్టిన కథకే బలమెక్కువని చెప్పడానికి ఈ సినిమా ఒక ఉదాహరణ. ఏ మనిషైనా తన తప్పుని తెలుసుకున్నప్పుడు దాన్ని సరిదిద్దుకోవాలనుకుంటాడు. కానీ ఒక మధ్యతరగతి వ్యక్తి తప్పు చేస్తే, తప్పుని సరిదిద్దుకోవాలనుకుంటాడు కానీ అది ఎవరికీ తెలియకూడదు, పరువు పోకూడదని ఆలోచిస్తాడు. ఆ మనస్తత్వాన్ని బిక్కుబిక్కుమంటూ ఫోనులో మాట్లాడే సాయిరామ్ ద్వారా దర్శకుడు ఆవిష్కరించిన తీరు చాలా బాగుంది. “చిన్నప్పుడు వందరూపాయలు దొరికితే దేవుడి హుండీలో వేసిన నువ్వు ఈ దారిలోకి ఎలా వచ్చావు?” అని బాబాయి అడిగితే, “బ్రతకడం నేర్చుకున్నాననుకొని మనిషిలా బ్రతకడం మర్చిపోయాను” అని సాయిరామ్ చెప్పే సన్నివేశం నిజజీవితాలను ఆవిష్కరించాలనుకున్న దర్శకుడి ఆలోచనకి ఒక నిదర్శనం. మధ్యతరగతి మనుషుల ఆశలకు అంతులేదని గౌతమి, ఊర్వశిల పాత్రల ద్వారా చూపించిన విధానం కూడా చాలా బాగుంది.
పసితనం నుండే అందరినీ కలుపుకొని పోవాలనే ఆలోచనతో మహిత పాత్రని చూపించిన విధానం ఆ పాత్రను దగ్గరగా చేసింది కానీ ఒక అమ్మాయి కోసం తన భవిష్యత్తుని పణంగా పెట్టిన అభి పాత్ర విషయంలో మాత్రం దర్శకుడు మరింత శ్రద్ధ వహించిఉంటే బాగుండేది. కాలేజీ నుండి హఠాత్తుగా వెళ్ళిపోయిన అభికి ఆ తరువాత కాలేజీలో ఒక సమస్యను సృష్టించి, భవిష్యత్తు, ప్రేమల మధ్య అతడిని బంధించివుంటే ఈ పాత్ర లోతు తెలిసేది. అయినప్పటికీ, చివరకు అభి ఏమి చేస్తాడన్న విషయంపై ఆసక్తి రేపడం యేలేటి రచనా గొప్పతనం.
ఇదే కాకుండా, చివరలో నాలుగు పాత్రలను కలిపిన విధానం అద్భుతం. ఒక సినిమాలో సహజత్వం ఎంతగా ఉన్నప్పటికీ ఎంతోకొంత డ్రామా లేకపోతే అది రక్తికట్టదు. కానీ ఆ డ్రామాను సరైన చోట చూపించడంలోనే ఉంది దర్శకుడి నేర్పు. ఆ విషయంలో యేలేటి గారి పరిపూర్ణమైన తెలివి, స్పష్టత ఈ సినిమా క్లైమాక్స్ లో కనబడుతుంది. “One World Four Stories” అనే ఉపశీర్షికకు ఆయన చేసిన న్యాయమేంటో అక్కడే తెలుస్తుంది.
అలా, మనమంతా అనే ఈ సినిమా మీరంతా మీ కుటుంబంతో కలిసి ఆనందంగా చూడగల సినిమా. ఒక సహజమైన మధ్యతరగతి మనస్తత్వాలను చూడాలనుకునే అందరికీ ఈ సినిమాను సిఫార్సు చేస్తున్నాను.
నటనలు :
ఒక ఇంటర్వ్యూలో బాలసుబ్రహ్మణ్యం గారు మాట్లాడుతూ “మోహన్‌లాల్ సన్నాయి లాంటివాడు. మంగళానికి, అమంగళానికి సన్నాయిని ఎలా వాడవచ్చో ఆయన కూడా అంతే” అన్నారు. ఈ విషయాన్ని మోహన్‌లాల్ ఎప్పుడో నిరూపించుకున్నారు, “కంప్లీట్ యాక్టర్” అనిపించుకున్నారు. ఏ పాత్రలోనైనా ఒదిగిపోయే ఆయన నటన గురించి మళ్ళీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. మొదటిసారి ఆయనను తెలుగులో, సొంత డబ్బింగ్ చెప్పించుకున్న దర్శకనిర్మాతలకు కృతజ్ఞతలు తెలుపుకోవాలి. గౌతమి కూడా ఒక మధ్యతరగతి ఇల్లాలి పాత్రలో ఒదిగిపోయి నటించారు. “కేరింత” సినిమాతో పరిచయమైన విశ్వాంత్ ఈ సినిమాకు కొంచెం మెరుగుగా కనిపించాడు కానీ పాత్రలో లోతు లేదు. ఇక మహితగా చేసిన రైనా బాగా ఆకట్టుకుంది, ముఖ్యంగా పోలీసిచ్చిన ఫోటోను తీసుకునే సన్నివేశంలో చాలా బాగా చేసింది.
గొల్లపూడి, చంద్రమోహన్, నాజర్,ఊర్వశి, బ్రహ్మాజీ, ఎల్.బి.శ్రీరామ్, హర్షవర్ధన్, వెన్నెల కిషోర్, అనీషా, ధనరాజ్, అయ్యప్ప శర్మ ఇలా అందరూ తమ పాత్రలకు న్యాయం చేశారు.
నందమూరి తారకరత్నకు మంచి అతిథి పాత్రను ఇచ్చాడు దర్శకుడు. గుణ్ణం గంగరాజు కూడా ఒక ప్రొఫెసర్ పాత్రలో కనిపించారు.
బలాలు :
- కథ, కథనం. సినిమాకు ఆయువుపట్టు. రచనలో తన ప్రావీణ్యాన్ని మరోసారి చూపించారు యేలేటి.
- రవిచంద్ర తేజ మాటలు. “ఇక్కడ కనిపించే ప్రతి ఒక్కరూ వాళ్ళ జీవితాల్లో తప్పిపోయినవారే” లాంటి మాటలు బాగున్నాయి.
- జీ.వీ.చంద్రశేఖర్ ఎడిటింగ్. నాలుగు కథలను సమాంతరంగా చూపించాలన్న దర్శకుడి ఆలోచనకి బాగా సాయం చేశారు.
- వారాహి నిర్మాణ విలువలు. సినిమా అంటే ప్రేమతో సినిమాలు నిర్మించే నిర్మాతల్లో ఒకరైన సాయి కొర్రపాటి ఈ సినిమాను కూడా అంతే ప్రేమతో ఎక్కడా రాజీపడకుండా నిర్మించారు.
బలహీనత :
- అభి – ఐరా (అనీషా) కథలో లోపించిన భావోద్వేగం.
ఈ చిత్రం నేర్పిన పాఠం :
ఎన్ని సినిమాలు తీశామన్నది ముఖ్యం కాదు. మంచి సినిమాలు, జనం గుర్తుంచుకునే సినిమాలు ఎన్ని తీశామన్నది ముఖ్యం.
– యశ్వంత్ ఆలూరు
Click here for English version of this Review…
Pingback: Manamantha (2016) – Film Criticism
Climax lo 4 stories ni kalipe daggara super, asalu first lo aa one world four stories ante aa chaala cinemallo choosam edho oka incident tho kaluputadu anukunna but manaku aa twist mundhey ardhamaina climax portion lo aa emotion workout aindhi 🙂
first half meeda konchem care teesukovalsindhi,anni characters ni manaki connect ayelaga inkonchem work chesi unte better ga vacchedi especially vishwant track
but anyways yeleti maree hindi/english inspired stuff kaakunda mana ki baga daggara ga unde story/characters ni set chesukuni teesadu i liked it but just aa next level ki cinema vellaledu ane dissapoint ment undhi anthey 🙂
LikeLiked by 1 person