మగ’మెగా’రాజు

Megastar Chiranjeevi

సినిమా అనేది మన జీవితాల్లో భాగమైపోయినప్పుడు సినీనటులు కూడా మన కుటుంబసభ్యులు అయిపోతారు. అలా మన కుటుంబాల్లో ఓ విశిష్టమైన స్థానం సంపాదించుకున్న నటుడు “మెగాస్టార్ చిరంజీవి”. ఈయన గురించి ఇంతకంటే ఉపోద్ఘాతము అవసరంలేదు.

ఆయన పుట్టినరోజున ఈ ఆర్టికల్ వ్రాస్తున్న నన్ను చిరంజీవి అభిమాని అనుకుంటారేమో మీరు. కానే కాదు. చిరంజీవి నాకు ఒక పదేళ్ళ క్రితం పరిచయం అయ్యుంటే బహుశా “అభిమాని” అనే పిలుపుకి నేను పలికేవాడినేమో. కానీ ఊహ తెలిసినప్పటి నుండి విన్న పేర్లలో ఎక్కువసార్లు వినబడ్డ పేరు “చిరంజీవి”. “నేను ఒక సినిమా చూస్తున్నాను!” అనేంతగా ఊహ తెలిసిన వయసులో నేను చూసిన మొదటి సినిమా “హిట్లర్”. అందులో కథానాయకుడు “చిరంజీవి”. అప్పట్లో ఓ నలుగురు స్నేహితులు పోగై మాట్లాడుకుంటున్నారంటే వారిలో ఒకడు “అంతొద్దు… ఇది చాలు!” అనేవాడు. అది ఆ సినిమాలో చిరంజీవి చెప్పిన డైలాగు. ఎవడైనా కాస్త స్టైల్ గా నడుస్తూ వెళ్తుంటే ఇంకొకడు “ఏంట్రా! నువ్వేమైనా చిరంజీవి అనుకుంటున్నావా?” అనేవాడు. “మా అబ్బాయి అచ్చు చిరంజీవిలాగే డాన్స్ చేస్తాడు!” అని తల్లిదండ్రులు తమ కొడుకుని పొగుడుతూ మురిసిపోయేవారు. స్కూలులో అల్లరి చేసే సమయంలో ఉపాధ్యాయుడు “అల్లరి మాని చదివితే నువ్వు కూడా చిరంజీవి అంత గొప్పవాడివి అవుతావు రా!” అని హితబోధ చేసేవాడు. నిజానికి చదువుకి, చిరంజీవికి ఎలాంటి సంబంధం లేదని అప్పుడు తెలియదు. వారు అలా చెప్పేవారు, మేము అలా నమ్మేవాళ్ళం. ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే, 80, 90వ దశకాల్లో పుట్టిన నాలాంటి ప్రతి తెలుగువాడి దయనందన జీవితంలో “చిరు” ఒక చిరు భాగం.

అప్పట్లో చిరంజీవి అంటే గుర్తొచ్చేది “డాన్స్”. ఆయన పాట ఏదైనా టీవీలో వస్తే కళ్ళప్పగించి చూసేవాళ్ళం.”నవ్వింది మల్లెచెండు”, “బంగారు కోడిపెట్ట”, “ఈ పేటకు నేనే మేస్త్రి”, “భద్రాచలం కొండ”, “నడక కలిసిన నవరాత్రి”, “చిక్ చిక్లేట్”, “రామ్మా చిలకమ్మా”, “ఆంటీ కూతురా”, ఇలా లెక్కలేనన్ని పాటలతో ఆయన ఎంత దగ్గరయ్యారో “అనుకోకుండా ఒక రోజు” సినిమా కోసం “సీతారామశాస్త్రి” గారు వ్రాసిన “ఎవరైనా చూసుంటారా నడిచే నక్షత్రాన్ని, ఎదురొస్తే ఎగబడిపోరా నేనే ఆ చిత్రాన్ని…” అనే పాట విన్నప్పుడల్లా గుర్తొస్తుంది.

చిరు డాన్స్ అంటే కేవలం డాన్స్ కాదు. దానితో పాటు ముఖంలో చిరునవ్వు, బాడీలో ఒక రిథమ్. చిరు తరవాత రంగప్రవేశం చేసిన ఎందరో నటులలో ఎంతో క్లిష్టమైన డాన్సులు చేసేవారున్నారు. రియాలిటీ షోల పుణ్యమాని సినిమా పాటకు డాన్స్ అంటే సర్కస్ గంతులు అయిపోయాయి. కానీ చిరు “టపు టపు టపోరి” అని సులువైన స్టెప్స్ వేసినా కూడా మనసుకు కలిగే ఆనందం అంతా, ఇంతా కాదు. చిరు బాడీలోని రిథమ్ ఎఫెక్ట్ అంటే అది. చిరుని ఓ సంగీత వాయిద్యంతో పోల్చాల్సి వస్తే “డ్రమ్ సెట్”తో పోలుస్తానని గాయకుడు బాలసుబ్రహ్మణ్యం ఓ సందర్భంలో అన్నారు. ఎందుకంటే, డ్రమ్స్ వాయించినప్పుడు వచ్చే ఊపు చిరంజీవి డాన్సుని చూసినప్పుడు వస్తుంది. తాను పాడిన ఎన్నో పాటలకు చిరు తెరపై రెట్టింపు న్యాయం చేశారని కూడా బాలుగారు ఒప్పుకోవడం జరిగింది.

చిరు కేవలం డాన్సర్ మాత్రమే నటుడు కాదు అంటే కూడా పెద్ద తప్పు అవుతుంది. ఒక నటుడికి కావాల్సిన రూపు, చూపు, మాట, హావభావాలు ఇలా అన్నీ చిరు సొంతం. “మనవూరి పాండవులు” సినిమాలో పార్థు పాత్రకోసం అన్వేషణ జరుగుతున్న సమయంలో ముళ్ళపూడి వారు బాపు గారితో “ఎవరో అబ్బాయి వచ్చాడు. ఒక మగాడికి అంత పెద్ద కన్నుండడం నేనెక్కడా చూడలేదు!” అన్నారట. ఆ అబ్బాయే చిరంజీవి. “పున్నమినాగు”, “47 రోజులు”, “అభిలాష”, “చాలెంజ్”, “స్వయంకృషి”, “రుద్రవీణ”, “ఆపద్భాందవుడు”, “స్నేహం కోసం” లాంటి సినిమాలు ఆయనలోని నటనాపటిమను చూపిస్తే, “ఘరానామొగుడు”, “ముఠామేస్త్రి”, “గ్యాంగ్ లీడర్”, “రౌడీ అల్లుడు”, “అన్నయ్య” లాంటి సినిమాలు ఆయనలోని స్టైల్ ని రుచి చూపించాయి.

చిరు సినీజీవితంలో రీమేక్ సినిమాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి, ఏం పెద్ద గొప్ప?” అని విమర్శించేవారు కూడా ఉన్నారు. నిజమే! రీమేక్ సినిమాలు చేసినా కూడా మాతృకలోని నటులకంటే బాగా ఆయా పాత్రలను పోషించి అది రీమేక్ సినిమా అని ఎవరో విమర్శకులు వెతికి చెప్పేవరకు ఊహకు కూడా అందకుండా చేయడం చిరు ప్రతిభకు నిదర్శనం. ఉదాహరణకు “ఘరానామొగుడు” ఓ కన్నడ సినిమా రీమేక్ అంటే అంత సులువుగా నమ్మే విషయం కాదు. “కోదండరామిరెడ్డి” గారు చిరుతో దాదాపు 26 సినిమాల వరకు చేస్తే అందులో దాదాపు 23 సినిమాలు సూపర్ హిట్లయ్యాయి. దానికి దర్శకరచయితల పటిమతో పాటు చిరు ప్రతిభ కూడా ఓ కారణమే. నాకు బాగా గుర్తు! అప్పట్లో చిరంజీవి నటించిన ఫలానా సినిమా బాగోలేదని మొదటిరోజే తెలిసినా కూడా విడుదలయిన వారంరోజుల వరకు టికెట్లు దొరకడం కష్టంగా ఉండేది. అది జనాలపైనున్న “చిరు” ప్రభావం.

చిరంజీవిపై నేను వ్రాసిన ఈ ఆర్టికల్ ఆయనకు నేను చేసే భజన కాదు. ఆయన సినిమాలు చూస్తూ పెరిగిన అనుభవాలు. ఎన్ని రకాల వంటకాలు తిన్నా వేసవి కాలంలో ఆవకాయ కోసం ఎలా ఎదురుచూస్తామో, ముఖానికి రంగు వేసుకొని ఎనిమిదేళ్ళయినా కూడా రాబోయే “ఖైది నెంబర్ 150” కోసం అలాగే ఎదురుచూసే వారిలో నేనూ ఒకడిని.

తన నటనతో, డాన్సులతో మన జీవితాల్లో చెరగని ముద్రవేసిన “మెగాస్టార్ చిరంజీవి” ఎప్పటికీ మగ’మెగా’రాజే. ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుకుంటూ చివరగా… “చిరంజీవి అంటే అభిమానం కాదు, ఓ అలవాటు!

చదివినందుకు మీకు నా ధన్యవాదాలు…!!

– యశ్వంత్ ఆలూరు

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s