ఓ మంచిమాట ఓ మామూలు హీరో చెబితే అది మామూలు మాటే అవుతుంది. అదే మంచిమాట ఓ స్టార్ చెబితే అది మరింత మంచిమాట అవుతుంది. అదే చేయిస్తాడు “కొరటాల శివ” తన సినిమాల్లో. ఓ మంచిమాటను ఎన్టీఆర్ ద్వారా చెబుతూ “జనతా గ్యారేజ్” సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కంప్లీట్ యాక్టర్ “మోహన్‌లాల్” మరో ముఖ్యపాత్రను పోషించిన ఈ సినిమాలో సమంత, నిత్యమేనన్ కథానాయికలు. “మైత్రి మూవీ మేకర్స్” పతాకంపై నవీన్, రవిశంకర్, మోహన్ నిర్మించారు.
కథ :
“జనతా గ్యారేజ్” ద్వారా ఆపదలో ఉన్న ప్రజలకు అండగా ఉండే సత్యం (మోహన్‌లాల్), ప్రకృతిని ప్రేమిస్తూ దాన్ని తనవంతుగా కాపాడుకునే ప్రయత్నం చేసే ఆనంద్ (ఎన్టీఆర్) ఎలా కలిశారు? తన తరువాత జనతా గ్యారేజ్ బాధ్యతలు తీసుకోమని సత్యం ఆనంద్ ని ఎందుకు కోరాడు? గ్యారేజ్ బాధ్యతను తీసుకున్న ఆనంద్ ఏమి చేశాడు? అన్నవి కథాంశాలు.
కథనం – విశ్లేషణ :
అన్నింటికంటే ముందు, తన సినిమాల ద్వారా సమాజానికి ఏదో ఒక మంచి విషయాన్ని చెప్పాలన్న తాపత్రయంతో సినిమాలు తీస్తున్న దర్శకుడు కొరటాలని మనస్పూర్తిగా అభినందించాలి. అలాంటి మంచి విషయాలు స్టార్స్ ద్వారా చెబితే ఎక్కువమందికి చేరువవుతాయి కనుక తన కథలను స్టార్స్ కు సరిపోయేలా వారిచేత ఆ సినిమాను చేయించుకునే అతడి నేర్పుని కూడా మెచ్చుకోవాలి.
పాత్రలు :
“సత్యం” పాత్ర ఈ కథకు పునాది. ఆ పాత్రకు మోహన్‌లాల్ లాంటి అద్భుతమైన నటుడిని ఎంచుకోవడం మొదట్లో ఒకింత అనుమానాన్ని రేకెత్తించింది. “శ్రీమంతుడు”లో జగపతిబాబు, రాజేంద్రప్రసాద్ లాంటి అనుభవజ్ఞులైన నటులకు న్యాయం చేయలేకపోయిన కొరటాల ఇందులో మోహన్‌లాల్ కు ఎంతమాత్రం న్యాయం చేస్తాడోనన్న అనుమానం ఉండేది. కానీ మొదటి అరగంటలో, జనం కష్టాలు చూసి “జనతా గ్యారేజ్” రూపంలో ఓ సమాంతర ప్రభుత్వాన్ని నడిపే సత్యం పాత్రని బలంగా కథలో నెలకొల్పే ప్రయత్నం చేశాడు కొరటాల. దాంతో నటుడికి కూడా గౌరవం దక్కినట్లయింది.
కథను నిలబెట్టే స్తంభం “ఆనంద్” పాత్ర. మనుషులకు ప్రాణం పోసే ప్రకృతికి మనిషి బదులుగా ఏమి చేయకపోగా, అదనంగా దాన్ని నాశనంచేసే ప్రయత్నం చేస్తున్నాడు కనుక ప్రకృతి మేలుకోసం మనిషి తనవంతుగా ఏమి చేయగలడనే విషయాన్ని ఈ పాత్ర ద్వారా చెప్పాడు కొరటాల. ఇతడికి ఎంతో సాయం చేశాడు తారక్. “నువ్వెంత, నేనెంత రవ్వంత, ఎన్నో ఏళ్లది ఈ సృష్టి చరిత” అని అద్భుతమైన “రామజోగయ్యశాస్త్రి” గారి వాక్యాలు కూడా ఆనంద్ పాత్రని మరింత బలపరిచాయి. అలా, ఈ పాత్రను కూడా బాగా నెలకొల్పాడు కొరటాల.
ఇవే కాకుండా, ఈ కథలో మరో ముఖ్యమైన పాత్ర “జనతా గ్యారేజ్”. దీన్ని దాటి కథనాన్ని చెప్పకుండా, అనవసరపు కామెడీ సీన్స్ అందులో ఇరికించకుండా ప్రేక్షకులను ఇబ్బందిపెట్టలేదు కొరటాల. అందుకు మళ్ళీ అతడిని అభినందించాలి.
పనిచేసిన విషయాలు :
“శ్రీమంతుడు”లో ఎన్ని పెద్ద పాత్రలున్నా కథానాయకుడినే గొప్పగా చూపించిన కొరటాల ఈ సినిమాలో ఆ విధానాన్ని అనుసరించలేదు. ఆనంద్ పాత్రకన్నా సత్యం పాత్రకే ఎక్కువ ప్రాధాన్యతను ఇవ్వడం బాగుంది. ఆనంద్ పాత్రను నేరుగా “ప్రణామం” పాటతో పరిచయం చేయడం కూడా బాగుంది. ఆ పాత్ర చేసే మొదటి పోరాట ఘట్టం చెప్పుకోదగినది. దాని వెనుక సాధారణ కమర్షియల్ నేపథ్య సంగీతం కాకుండా ప్రకృతిలోని పంచభూతాల శక్తిని వివరిస్తూ ఓ చిన్న పాటను పెట్టడం ఆకట్టుకుంది.
సత్యం, ఆనంద్ మొదటిసారి కలిసే సన్నివేశం, సత్యం గ్యారేజ్ బాధ్యతలను ఆనంద్ కి అప్పగించే సన్నివేశం బాగున్నాయి. వీటన్నింటినీ మించిన, గ్యారేజ్ ఔన్నత్యాన్ని పెంచిన ఘట్టం వికాస్ (రాజీవ్ కనకాల) ప్రవేశం. అతడికి సాయం చేసే సన్నివేశం, అందులోని మాటలు, ఆ తరువాత వచ్చే “జయహో జనతా” పాట కథనాన్ని అత్యున్నత స్థాయికి తీసుకెళ్ళాయి.
ఆ తరువాత వచ్చే ఓ కుటుంబ సన్నివేశం నటుడిగా తారక్ పటిమను మరోసారి పరిచయం చేసింది. అందులో కొరటాల రచనకన్నా తారక్ నటనే పాత్ర ఔన్నత్యాన్ని పెంచిందని చెప్పాలి.
ఇదిలావుండగా, రెండో సగంలో నీరసించిన కథనానికి కాస్త ఊపు తెచ్చింది కాజల్ చేసిన “పక్కా లోకల్” పాట.
పనిచేయని విషయాలు :
కొరటాల తన కథల్లో చెప్పాలనుకున్న మూలాంశాన్ని, ముఖ్య పాత్రలను బాగా నెలకొల్పుతాడు. ఆ పాత్రలకు స్టార్స్ ని ఎంచుకోవడంతో ప్రేక్షకుల అంచనాలు ఆకాశాన్ని అంటుతాయి. ఈ సినిమా విషయంలో కూడా అదే జరిగింది. ఓ ప్రక్కన ఎన్టీఆర్, మరో ప్రక్కన మోహన్‌లాల్ అంటే ఎవరికైనా ఈ సినిమాను చూడాలన్న కుతూహలం కలుగుతుంది. అంతటి గొప్ప నటులిద్దరు. గ్యారేజ్ బాధ్యతలు ఆనంద్ తీసుకున్న తరువాత ఈ కథనం “గాడ్‌ఫాదర్” సినిమాను తలపిస్తుంది. ఆ తరహా కథనమే ఈ సినిమాకు సరైనదని కూడా అనిపిస్తుంది. కానీ ఏ పాత్ర భావోద్వేగాలూ ప్రేక్షకుడి మనసులో బలంగా నెలకొల్పబడవు. మొదటి సగంలోని లోపాన్ని “జయహో జనతా” పాట కప్పేసిందనుకునేలోపే భావోద్వేగంలేని మిగతా రెండో సగం సినిమాను మళ్ళీ నీరుగార్చేసింది.
ఒక పాత్ర తాలూకు భావోద్వేగాలు దాని సమస్య ప్రేక్షకుడి వరకు వెళ్తేనే పండినట్టు. మంచి మూలాంశానికి స్టార్స్ తోడవడం శుభపరిణామమే. కానీ “కమర్షియల్ సినిమా” అనే మాట మాత్రం సినిమాకు శాపంగా మారుతోంది. ఉదాహరణకు, “జనతా గ్యారేజ్” కోసం తన ప్రేమను సైతం త్యాగం చేసిన ఆనంద్ మనోవేదన ప్రేక్షకుడి మనసులో ముద్రపడాలంటే అతడి సంతోషానికి మరోదారి ఉండకూడదు. ఇక్కడ కమర్షియల్ చట్రంలోకి వెళ్ళిన కొరటాల “నిత్యమేనన్” పాత్రను సృష్టించాడు. ఎలాగు సమంత విడిపోయింది, ఇక మిగిలింది నిత్యమేననే కనుక హీరోకి హీరోయిన్ లేని లోటే లేదు. అంటే, అసలు గ్యారేజ్ కోసం ఆనంద్ చేసింది త్యాగమే కాదని అర్థం కాదా? ఇంతోటి దానికి సమంత పాత్రకు “నీ సెలవడిగి” అనే పాట ఎందుకు? ఇదిలావుండగా, రెండో హీరోయిన్ పాత్రకు నిత్యమేనన్ లాంటి “నటి” అవసరమేంటి? ఇదంతా సినిమాలో పెద్ద కాస్టింగ్ ఉందని ప్రచారం చేసుకోవడానికో లేదా హీరోకి ఓ హీరోయిన్ లేకపోతే అతడి అభిమానులు నొచ్చుకుంటారని చేసిన ప్రయత్నమో తెలియదు. ఇదేదీ కాదు, గాడ్‌ఫాదర్ ప్రేరణను కొనసాగించానని అంటాడేమో దర్శకుడు ఈ విషయంలో.
“జనతా గ్యారేజ్ ఎవరినీ వదలదు” అనే నిర్ణయం వెనుక చూపించిన కారణం బలంగా లేకపోగా, “మీకు నేనున్నానమ్మా!” అని ఆనంద్ అనడం కూడా ఒప్పించేలా లేదు.
సంగీతం విషయానికి వస్తే, దేవీశ్రీప్రసాద్ నేపథ్య సంగీతం కూడా సినిమాకు పెద్దగా ఉపయోగపడలేదు.
అసలు సత్యం, ఆనంద్ పాత్రలకు ఎటువంటి సంబంధం లేకుండా ఉండుంటే కూడా బాగుండేదేమో. ట్రైలర్లో చెప్పిన కథే సినిమా మూలకథ అయ్యుంటే, దానికి సరైన భావోద్వేగాలు తోడైఉంటే ఈ సినిమా ఇంకాస్త రక్తికట్టేదేమోనని నా అభిప్రాయం.
ముగింపు :
అలా, “జనతా గ్యారేజ్” సినిమా పెద్ద బడ్జెట్, అనుభవజ్ఞులైన నటులను ఉంచుకొని కూడా భావోద్వేగాలు లోపించి భారతంలో కర్ణుడిలా మిగిలిపోయిందని చెప్పాలి.
నటనలు :
ఈ సినిమాలో ముఖ్యపాత్రలను పోషించిన మోహన్‌లాల్, ఎన్టీఆర్ యథావిధిగా తమ పాత్రలకు సంపూర్ణ న్యాయం చేశారు. సమంత పాత్రకు విలువ రెండో సగం సగమయ్యాక కానీ రాలేదు కానీ ఉన్నంతలో బాగా చేసింది. ఇక తన ప్రతిభకి ఏమాత్రం తూగని పాత్రను పోషించింది నిత్యమేనన్. సచిన్ ఖేడేకర్, ఉన్ని ముకుందన్ ప్రతినాయకులుగా ప్రభావం చూపలేదు. సాయికుమార్, సురేష్, విజయకుమార్, బ్రహ్మాజీ, అజయ్, బెనర్జీ, సితార, దేవయాని, వెన్నెల కిషోర్, ఆశిష్ విద్యార్థి, ఇలా అందరూ ఉన్నప్పటికీ లేనట్టే ఉన్నారు.
ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది మాత్రం “రాజీవ్ కనకాల” గురించి. ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన ఈ నటుడికి ఈమధ్య అవకాశాలు ఎందుకు తగ్గాయో తెలియదు కానీ అతడి నటనలో మాత్రం అదే కసి ఉంది. ఉన్నది అయిదారు నిమిషాలే అయినప్పటికీ “జనతా గ్యారేజ్” అంటే మోహన్‌లాల్, ఎన్టీఆర్ తరువాత గుర్తొచ్చే పాత్ర మాత్రం ఇతనిదేనని ఒప్పుకోవాలి. సందు దొరికితే చాలు పాత్రలో జీవించేసే కనకాలకు పూర్తిస్థాయిలో అవకాశాలు మళ్ళీ రావాలని కోరుకుందాం.
బలాలు :
- తిరు ఛాయాగ్రహణం. ఈయన ప్రతిభ “24” సినిమాతోనే అర్థమైంది. మరోసారి తన కెమెరాతో రెచ్చిపోయాడు. “రాక్ ఆన్ బ్రో”, “జయహో జనతా”, “పక్కా లోకల్” పాటలు, విరామం సన్నివేశం, ప్రీ-క్లైమాక్స్ సన్నివేశం, క్లైమాక్స్ సన్నివేశం… ఇవన్నీ ఈయన ప్రతిభకి నిదర్శనాలు.
- ప్రకాష్ కళాదర్శకత్వం. జనతా గ్యారేజ్ సెట్ చాలా బాగుంది.
- రామజోగయ్యశాస్త్రి సాహిత్యం. ఈయన ఈ కథను ఎంతగా ప్రేమించారో “ప్రణామం”, “జయహో జనతా” మరియు “నీ సెలవడిగి” అనే పాటల్లోని సాహిత్యం చెబుతుంది. “జయహో శాస్త్రిగారు!”
- నిర్మాణ విలువలు. ఎక్కడా రాజీపడకుండా ఈ సినిమాను నిర్మించారు మైత్రి మూవీ మేకర్స్ అధినేతలు.
బలహీనతలు :
- భావోద్వేగాలు ఏమాత్రం లేని 162.50 నిమిషాల కథనం. ఇది పది బలహీనతల పెట్టు ఈ సినిమాకు.
ఈ చిత్రం నేర్పిన పాఠం :
కథనంలో పట్టు లేకపోతే ఎంత పెద్ద స్టార్స్ అయినా సినిమాను రక్తికట్టించలేరు.
– యశ్వంత్ ఆలూరు
Perfect review. Thanks for the reviw and also one correction.. cinematography for 24 was done by P.S Vinod, not by Thiru.
LikeLike
No… It was Tiru.. you can check once again!! 🙂
LikeLike