
కాలంతోపాటు సినిమా పాట వ్రాసే విధానం, వినబడే విధానం మారిపోయాయి. అంతేకాదు ప్రేక్షకులకు ఓపిక కూడా తగ్గిపోయింది. ఇప్పటి మా తరమంతా సినిమా పాటంటే పని ఒత్తిడి నుండి విశ్రాంతి కలిగించే సంగీతం ఉండాలి, సులువుగా పాడుకునేలా సాహిత్యం ఉండాలని చూస్తున్నాం. అసలే రకరకాల ఒత్తిళ్ళు మనసుపై ఉన్నప్పుడు, ఫలానా సినిమా పాటను అర్థం చేసుకోవడానికి మనసుకు మళ్ళీ ఒత్తిడిని కలిగించడానికి దాదాపుగా ఎవరూ ఇష్టపడట్లేదు. అందుకే, రచయితలు కూడా ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగానే సులభమైన పదాలతో పాటలు వ్రాస్తున్నారు. సంగీత దర్శకులు కూడా అలాగే బాణీలు కడుతున్నారు. సినీసాహిత్యంపై ఇంకా గౌరవమున్న “క్రిష్” లాంటి దర్శకులు “సీతారామశాస్త్రి” లాంటి కవులకు పూర్తి స్వేచ్చనిచ్చి పాటలు వ్రాయించుకుంటున్నారు. పాటలు ఎంత బాగున్నప్పటికీ, వ్రాసింది యువతరాన్ని ఉద్దేశించే అయినప్పటికీ “కంచె” సినిమా సంగీతం పూర్తిగా యువతరానికి చేరువకాలేదన్నది వాస్తవం.
ఈ ఉపోద్ఘాతమంతా ప్రక్కనబెడితే, పాత పాటలన్నీ ఆణిముత్యాలని పెద్దలు చెప్పారు. వాటిని ఎప్పుబడితే అప్పుడు వినే కుతూహలం మా తరానికి లేదు. ఒకవేళ ఉన్నా, వాటిని అర్థంచేసుకునే ఓపిక లేదు. ఒకవేళ ఓపికున్నా కూడా “నీ వయసేంటి? నువ్వు వినే పాటలేంటి?” అని స్నేహితులు హేళన చేస్తారనే భయంతో పాత పాటలు విననివారు చాలామంది ఉన్నారు. నేను కూడా చుట్టూ పెద్దవాళ్ళు ఉంటేనో లేదా ఒంటరిగా ఉంటేనో పాతపాటలు వింటానే తప్ప నా చుట్టూ నా స్నేహితులుంటే వినే ధైర్యం చేయను. చాలా పాత పాటలు విన్నాను కానీ వాటిలో చాలా పాటల్లో రచయిత భావాలేంటో తెలుసుకునే ప్రయత్నం చేయలేదు. “శంకరాభరణం” సినిమా ఓ క్లాసిక్ అని అందులోని పాటలు ఆణిముత్యాలని తెలుసు. చాలాసార్లు సినిమా చూశాం, పాటలు విన్నాం కానీ ఇప్పటికీ వేటూరిగారు “శంకరా” పాటలో “మెరిసే మెరుపులు మురిసే పెదవుల చిరు చిరు నవ్వులు కాబోలు” అని ఎందుకన్నారో తెలియదు. ఇలా అప్పటి సాహిత్య సంపదను మా తరం అనుభవించడంలేదు. శంకరాభరణం సినిమాను అప్పట్లో ధియేటరులో చూసిన యువతరమే ఇప్పటి మా తరానికి తల్లిదండ్రులు. అయినప్పటికీ ఆ భావాలను మాకు విడమర్చి చెప్పే తీరిక వారిలో చాలామంది చేసుకోలేదు. మేము కనీసం ఆ పాటలు విన్నాం, సినిమాలు చూశాం. మా రేపటి తరం అది కూడా చేస్తారని అనుకోను. అందుకే, అనేకసార్లు విని కూడా అర్థం తెలియని సినిమా పాటల భావమేంటో మళ్ళీ అనేకసార్లు విని నాకు అర్థమైనది పంచుకోవాలి అనుకుంటున్నాను.
ఈ యజ్ఞంలో మొదట ఎంచుకున్న పాట “సప్తపది” సినిమాలోని “గోవుల్లు తెల్లన” అనే పాట. ఇది వ్రాయడానికి నన్ను ప్రేరేపించిన నా మిత్రుడు “రాజేష్ శరగడం“కి మనస్పూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.
పాట : గోవుల్లు తెల్లన
సినిమా : సప్తపది
రచన : వేటూరి సుందరరామమూర్తి
దర్శకత్వం : కె.విశ్వనాథ్
ఈ పాట గురించి చెప్పుకునే ముందు ఈ సినిమా కథను చూచాయగా చెప్పుకోవాలి. ఓ పెద్ద కులపు అమ్మాయి ఓ చిన్న కులపు అబ్బాయి ప్రేమించుకున్నారు. అమ్మాయి కుటుంబమంతా ఆచారాలకు విలువిస్తూ, నిత్యం దేవుడికి దగ్గరగా ఉంటూ అందరి అభిమానాన్ని స్వీకరించేవారు. తమ కులంలోనే ఓ బంధువుకి ఇచ్చి అమ్మాయిని పెళ్ళి చేయాలని నిర్ణయిస్తే, అమ్మాయి తన మనసులోని మాటను వారిపైనున్న గౌరవంతో బయటపెట్టలేకపోతుంది. తలొంచి తాళి కట్టించుకుంటుంది. మనసులో మాత్రం ప్రేమించినవాడినే తలచుకుంటూ బ్రతుకుతుంది. అటు వైపు అబ్బాయి కూడా పెద్ద కులానికి భయపడి తన ప్రేమకోసం వారికి ఎదిరించలేక లోలోపల కుమిలిపోతున్నాడు. ఇది ఈ సినిమా సగం కథ.
“ఆచార వ్యవహారాలన్నవి మనసును ఓ క్రమమైన మార్గంలో పెట్టడానికి తప్ప కులమనే పేరుతో మనుషుల్ని విడదీయడానికి కాదు” అనే శంకరాభరణం శంకరశాస్త్రి మాట ఆధారంగా అల్లిన ఈ కథలో కులమతభేదాలు మనుషులను ఎలా దూరం చేస్తాయో తెలిపే సందర్భంలో వచ్చే ఓ పాట ఇది.
ఈ పాటను పలు కచేరీలలో పాడారు. నేను కూడా చాలాసార్లు విన్నాను. విన్న ప్రతిసారీ మహదేవన్ గారి సంగీతం, బాలు, జానకిల గానం, ముఖ్యంగా చిన్నపిల్ల గొంతుతో జానకి పాడిన విధానం వింటూ ఆనందించేవాడిని. ఇక్కడ నేను పట్టించుకోని మరో ఇద్దరు వ్యక్తులున్నారు. ఒకరు పాటకు సందర్భం చెప్పిన “విశ్వనాథ్” గారు, ఆ సందర్భానికి పాత్రల మనోభావాలను తెలిపే పాట వ్రాసిన “వేటూరి” గారు.
కులమతభేదాలంటే ఏమాత్రం తెలియని ఓ చిన్న కుర్రాడు తన మనసులో మొలిచిన కొన్ని ప్రశ్నలను తన తండ్రిని అడుగుతాడు. సమాధానం తెలిసిన తండ్రి అది కొడుకుకి సులువుగా అర్థమయ్యేలా చెప్పాలి. ఇదే ప్రశ్న ఓ పెద్ద కులపు ఇంటిలో పుట్టదు. ఎందుకంటే, విభేదం చూపించేవాడికి అది తెలియదు కనుక. అవమానం అనుభవించినవాడికే ఆ బాధ తెలుస్తుంది. అందుకే, ఈ ప్రశ్న ఓ పశువుల కాపరి ఇంట్లో పుట్టింది. ఓ రోజు అతడి కొడుకు ఇలా అడిగాడు…
గోవుల్లు తెల్లన, గోపయ్య నల్లన
గోధూళి ఎర్రన ఎందువలన?
“ఇన్ని రకాల రంగులు ఈ ప్రపంచంలో ఎందుకున్నాయి?” అని ఆ కుర్రాడి (విశ్వనాథ్) ప్రశ్న. దానికి పాట రూపమిచ్చారు “వేటూరి”. ఆయన ఆలోచనల్లోకి వెళితే… గోవులు, గోపాలుడు, గోధూళి ఎప్పుడూ కలిసుంటారు. అలాంటప్పుడు అన్నీ ఒకేలా ఎందుకు సృష్టించబడలేదు? ఈ రంగుల (కులాలు) తేడాలేంటి? అనేది ప్రశ్న. దీనికి కథతో కూడా సంబంధం ఉంది. మనుషులందరూ ఒకే సమాజంలో బ్రతుకుతున్నప్పటికీ ఈ వర్ణ, వర్గ విభేదాలెందుకు? అందరూ ఒక్కటిగా ఎందుకు ఉండలేరు? అనే దర్శకుడి ఆలోచననూ చెప్పడం జరిగింది.
తెల్లావు కడుపుల్లో కర్రావులుండవా?
కర్రావు కడుపునా ఎర్రావు పుట్టదా?
తెల్లావు (తెలుపు), కర్రావు (నలుపు), ఎర్రావు (ఎరుపు). ఇక్కడ రంగులను ఎందుకు ప్రస్తావించారన్న అనుమానం రావాలి. నిజానికి ఇక్కడ ప్రస్తావించింది రంగులను కాదు. కులాలను. ఈ సినిమా ముఖ్య ఉద్దేశ్యం “వర్ణసంకరం” అని దూషించే అజ్ఞానపు సమాజానికి మనుషులంతా ఒకటేనన్న సత్యాన్ని తెలపడం. వేర్వేరు కులాలకు చెందిన మనుషులు వివాహం చేసుకోవడం తప్పని చెప్పే సమాజానికి చెప్పిన సమాధానమే పై రెండు వాక్యాలు. అందుకే, కులాలను ఉద్దేశించి రంగులను వాడుకొని రచయిత చెప్పడం జరిగింది. ఈ ప్రశ్న గోపాలుడి ఇంట్లో పుట్టింది కనుక గోవులను ఉదాహరణలుగా ప్రస్తావిస్తూ చెప్పడం జరిగింది.
ఈ రెండు వాక్యాలు రచయిత దృష్టిలో “సమాధానాలు” కానీ దర్శకుడి దృష్టిలో మాత్రం “ప్రశ్నలు” అనే నా ఉద్దేశ్యం. ఎందుకంటే, ఈ మాటలు అణచివేయబడిన “గోపాలుడు” పాత్ర సమాజంపై సంధించిన ప్రశ్నలు కనుక.
గోపయ్య ఆడున్నా, గోపెమ్మ ఈడున్నా
గోధూళి కుంకుమై గోపెమ్మకంటదా?
వినడానికి, తిరిగి పాడుకోవడానికి ఎంతో సులభంగా ఉన్న ఈ రెండు వాక్యాల భావాన్ని అర్థం చేసుకోవడానికి మళ్ళీ సినిమాను కళ్ళముందు తెచ్చుకోవాల్సిన అవసరముంది. అప్పటివరకు గోపాలుడి కుటుంబాన్ని చూపించి, హఠాత్తుగా విడిపోయిన ప్రేమికులను చూపిస్తారు. ఇక్కడ వారిద్దరినీ గోపయ్య (కృష్ణుడు), గోపెమ్మ (గోపిక)లుగా పోల్చారు దర్శకరచయితలు. వేర్వేరుగా ఉన్నారని మొదటి వాక్యం విన్నా లేదా ఆ సమయానికి వచ్చే దృశ్యం చూసినా అర్థమైపోతుంది. కానీ చిక్కంతా వచ్చింది రెండో వాక్యంతోనే. “గోధూళి కుంకుమై గోపెమ్మకంటదా?” అంటే దూరంగా ఉన్న గోపయ్య(అబ్బాయి)ని స్పృశించిన గాలి (గోధూళి) అతడిని ప్రేమించిన గోపెమ్మ(అమ్మాయి) నుదుటిని తాకదా అని రచయిత ఉద్దేశ్యం కాబోలు. “నుదుటిని గాలి స్పృశించడం” అనే భావనను “కుంకుమై గోపెమ్మకంటదా” అనే పదాల ద్వారా పలికించాడు. అంటే ఈ భూమ్మీదనున్న మనుషులందరూ పీల్చే గాలి ఒకటేనని కూడా అర్థం చేసుకోవాలి ఈ వాక్యంతో.
ఆ పొద్దు పొడిచేనా?
ఈ పొద్దు గడిచేనా?
“ఆ పొద్దు” అంటే విడిపోయిన ప్రేమికులు ఒకటయ్యే సమయం. “ఈ పొద్దు” అంటే వారిని వేరు చూసిన కాలం.
ఎందువలన అంటే అందువలన
ఎందువలన అంటే దైవఘటన
ఇదంతా దేవుడి లీలని చెప్పడం.
పిల్లనగ్రోవికి నిలువెల్ల గాయాలు
అల్లన మోవికి తాకితే గేయాలు
పిల్లనగ్రోవి అడవిలో దొరికే “వెదురు”తో చేయబడుతుంది. ఎక్కడో అడవిలో దొరికే వెదురు అంటే వెనుకబడిన జాతికి చెందినదిగా అనుకోవచ్చు. అది శ్రీకృష్ణుడు (దేవుడు) చేతిలోకి చేరడంతో దాని స్థాయి పెరిగింది. ఇదే భావనను “సీతారామశాస్త్రి” గారు “మునులకు తెలియని జపమును జరిపినదా మురళీసఖి, వెనుకటి బ్రతుకున చేసిన పుణ్యమిదా” అని “ఏ శ్వాసలో” పాటలో కూడా వ్రాయడం జరిగింది.
ఈ వాక్యాల భావన రెండు రకాలుగా ఉంది. ఒకటి పైన చెప్పినది. రెండవది ఈ కథతో సంబంధం కలిగినది. పిల్లనగ్రోవితో వెనుకబడిన కులానికి చెందిన అబ్బాయిని పోల్చాడు రచయిత. అల్లన మోవి అనగా శ్రీకృష్ణుడి పెదవి అనగా పెద్ద కులపు అమ్మాయి. అంటే, ఇద్దరూ ఒకటైతే ఆనందం (గేయాలు) అని భావన.
ఆ మురళి మూగైనా, ఈ పెదవి మోడైనా
ఆ గుండె గొంతులో ఈ పాట నిండదా?
ఈ రెండు వాక్యాలు చమత్కార ప్రయత్నాలు. వీటిలో ఆ ప్రేమికులను మురళి, పెదవితో మళ్ళీ పోల్చడం జరిగింది. పెద్ద కులానికి భయపడి ప్రేమను గెలిచే ప్రయత్నంగా గొంతెత్తని అబ్బాయి, పెద్దలకు గౌరవమిచ్చి నోరు మెదపని అమ్మాయి గురించి చెబుతూ, అందరి ముందు మాట్లాడలేకపోయినా కూడా వారి మనసుల్లో “ఇద్దరు వ్యక్తులను కలపలేని ఈ కులమతాలేందుకు?” (పైన చెప్పిన శంకరశాస్త్రి మాట) అనే ప్రశ్న మెదులుతూనే ఉంటుంది. ఆ “ప్రశ్న” స్థానంలో “ఈ పాట నిండదా” అని చేసిన ప్రయత్నం, ఆ గోపాలుడు కుటుంబం పాడుకునే పాట విడిపోయిన ప్రేమికుల మనసులో కూడా మెదులుతోందని చెప్పింది. ఇది కేవలం పాట వింటే అనిపించేది.
తెరపై ఈ వాక్యాలకు ఆ అబ్బాయిని చూపించే దృశ్యాన్ని బట్టి చూస్తే, ప్రేయసి దూరమై అతడి గొంతు, మురళి మూగబోయినప్పటికీ అతడి మనసు ఇంకా ఆమెకోసమే నిరీక్షిస్తున్నదని కూడా అర్థం చేసుకోవచ్చు.
ఈ కడిమి పూసేనా?
ఆ కలిమి చూసేనా?
ఈ మోడుబారిపోయిన ప్రేమికుల జీవితాలు మళ్ళీ సంతోషంతో వికసిస్తాయా? మళ్ళీ ఒకటవుతారా అని ఈ వాక్యాల సారాంశం.
ఎందువలన అంటే అందువలన
ఎందువలన అంటే దైవఘటన
అంతా దేవుడి లీల అని మళ్ళీ చెప్పడం.
నాకు అర్థమైంది నేను వ్రాశాను. ఏదైనా తప్పుగా అర్థం చేసుకొని ఉంటే క్షమించి క్రింద కామెంట్స్ పెట్టండి. ఈ గొప్ప పాటను మరోసారి వినండి. 🙂
– యశ్వంత్ ఆలూరు
04/09/2016
“Wayback Machine”లో గల నవతరంగం వ్యాసం ఇక్కడ.
Dear Yeshwanth
Wonderful narration of the movie. I had watched this movie in theatre when
it was released and subsequently on TV . All said and done this is on par
with Classical movies of that period and appreciate the indepth analysis
from you .
God bless you dear
Dr Srinath PS
Virus-free.
http://www.avast.com
LikeLike