జ్యో అచ్యుతానంద (2016)

jyo-achyutananda-poster

ఒక సినిమా కథ వ్రాయడానికి ఏవేవో చదివేసి ఎక్కడో దూరంగా సన్యాసిలా బ్రతకాల్సిన అవసరంలేదు. తొంగిచూస్తే, ప్రతి మనిషి జీవితంలో బోలెడు కథలుంటాయి. వాటికి సరైన నాటకీయతను జోడించగలిగితే అవే సినిమా కథలవుతాయి. ఈ నిజాన్ని నమ్ముకున్న ఏ దర్శకుడూ పరాజయం పొందలేదు. అలాంటివారిలో “అవసరాల శ్రీనివాస్” ఒకడు. “ఊహలు గుసగుసలాడే”తో మెప్పించిన ఈయన ఈసారి “జ్యో అచ్యుతానంద” సినిమాతో మన ముందుకొచ్చారు. నారా రోహిత్, నాగశౌర్య, రెజీన నటించిన ఈ సినిమాను “వారాహి చలన చిత్రం” పతాకంపై “రజని కొర్రపాటి” నిర్మించారు. “సాయి కొర్రపాటి” సమర్పించారు.

కథ :

అన్నదమ్ములు అచ్యుత రామారావు (రోహిత్), ఆనంద్ వర్ధనరావు (శౌర్య) తమ ఇంటిపైనున్న జ్యోత్స్న (రెజీన)పై మనసుపడతారు. వారిద్దరూ వారి ప్రేమలను జ్యోకు ఎలా తెలిపారు? ఆమె ప్రేమను ఇద్దరిలో ఎవరు పొందారు? అసలు పొందారా లేదా? అన్నవి కథాంశాలు.

కథనం, దర్శకత్వం – విశ్లేషణ :

అన్నదమ్ముల అనుబంధం గురించి చెప్పిన ఇటీవలి సినిమాల్లో మనసుకు హత్తుకున్న సినిమా “సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు”. అనేక భావోద్వేగాలున్న ఈ బంధంలో ఎక్కువగా కోపం, అహంకారాలనే అందులో చూపించడం జరిగింది. ఈ సినిమా దర్శకుడు అవసరాల ఆ బంధంలోని ఈర్ష్య, అసూయలను చూపించడం జరిగింది.

అన్నదమ్ములు నిజజీవితంలో ఎలా ఉంటారనేది సహజంగా చూపించినప్పటికీ దర్శకుడు కాస్త నాటకీయ స్వేచ్చను కూడా తీసుకున్నాడు. ఉదాహరణకు, తెలిసి కూడా అన్నదమ్ములిద్దరూ ఒకే అమ్మాయిని ప్రేమించడం. బహుశా, నిజజీవితంలో ఇలాంటి సందర్భం ఇద్దరు స్నేహితుల మధ్య వస్తుందేమో కానీ అన్నదమ్ముల మధ్య దాదాపుగా రాకపోవచ్చు. తను తీసుకున్న నాటకీయ స్వేచ్చను కూడా ఎబ్బెట్టుగా అనిపించేలా చేయకపోవడం పూర్తిగా దర్శకుడి గొప్పతనం.

సినిమా ఆరంభంనుండే ఆకట్టుకోవడం మొదలెట్టాడు దర్శకుడు. ముఖ్యంగా, తమ్ముడు తను చేసిన పనులు అన్నయ్య చేశాడని, అన్నయ్య తను చేసిన పనులు తమ్ముడు చేశాడని చెప్పే సన్నివేశాలు కొత్త అనుభూతినిచ్చాయి. ఇందుకు “కిరణ్ గంటి” కూర్పు విభాగం దర్శకుడికి చేసిన సాయం అభినందనీయం. పైన చెప్పినట్టుగా, అన్నదమ్ముల మధ్యనుండే చిన్నచిన్న ఈర్శ్యలను చూపించిన విధానం ఆకట్టుకుంది. ఉదాహరణకు, అప్పటివరకు టెన్నిస్ సరిగ్గా ఆడని ఆనంద్, అచ్యుత్,జ్యోలు సరదాగా మాట్లాడుకోవడం చూసి కోపంతో ఆడి గెలవడం, కుక్కపై విసరవలసిన రాయిని అచ్యుత్ తమ్ముడుపై విసరడంలాంటి సన్నివేశాలు నిజజీవితపు అన్నదమ్ములు తమ జీవితాలతో పోల్చి చూసుకునేలా ఉన్నాయి.

వీటన్నిటినీ మించి సంతోషపరిచిన మరో విషయం దర్శకుడు “బుచ్చిబాబు” వ్రాసిన “చివరకు మిగిలేది” నవలను ప్రస్తావించడం. అసలు బుచ్చిబాబు అనే ఓ రచయిత ఉన్నాడని, చివరకు మిగిలేది అనే నవలున్నదని ఇప్పటివారికి దాదాపుగా తెలియదు. నాకు తెలిసి, ఇప్పటివరకు “ఇంద్రగంటి మోహనకృష్ణ” తప్ప ఆ నవల గురించి మాట్లాడిన మరో దర్శకుడు లేడు. అలాంటిది అవసరాల ఆ నవలను తన సినిమాలో చూపించడం, “దాని విలువ తరువాత తెలుస్తుంద“ని చెప్పడం అభినందనీయం. అక్కడితో వదిలేశాడేమో అనుకుంటే, “చప్పుడు చేయని సంకెళ్ళు” అని ఆ నవలలోని అధ్యాయం పేరును చెప్పడం, చివర్లో ఆ నవలను వాడుకొని సినిమాను ముగించడం మరింత అభినందనీయం. తెలుగు భాషపట్ల, సాహిత్యంపట్ల ఇంత గౌరవమున్నందుకు “అవసరాల”ని మనస్పూర్తిగా అభినందించాలి. ఇక్కడ తీసుకున్న నాటకీయ స్వేచ్చలో కూడా దర్శకుడి నేర్పరితనం కనిపించింది.

మొదటి సగం సృజనాత్మకంగా, ఆహ్లాదంగా సాగినప్పటికీ, రెండో సగం సగమయ్యేవరకు కథనం నెమ్మదించింది. “డైలాగ్ ఇన్ ది డార్క్” సన్నివేశంలాంటివి బాగున్నా కథనపు పోకడ ప్రేక్షకుడు దాన్ని గుర్తించేలా చేయలేకపోయింది. ఈ నీరసానికి శక్తినిచ్చింది “ఒక లాలన” పాట. అద్భుతంగా కుదిరిన అచ్చతెనుగు “భాస్కరభట్ల” సాహిత్యం, రోహిత్, శౌర్యల నటనలు ప్రేక్షకుడి మనసులో బలమైన ముద్రను వేయగాలిగాయి. పతాక సన్నివేశం కూడా భావోద్వేగాలను సహజంగా పండించింది.

అలా, “జ్యో అచ్యుతానంద” అనే ఈ సినిమా ఆ అన్నమయ్య కీర్తనలాగే మనసుకు హాయినిచ్చే సినిమా. “సీతమ్మ వాకిట్లో…” తరువాత అన్నదమ్ముల అనుబంధాన్ని అంత హృద్యంగా, అంతకంటే సహజంగా చూపించిన సినిమా. కలిసి చూసిన అన్నదమ్ములకు సంతోషాన్ని, దూరంగా ఉంటూ విడివిడిగా చూసిన అన్నదమ్ములకు ఉన్నపళంగా కలిసి మాట్లాడాలన్న ఆరాటాన్ని కలిగించే సినిమా. ఇది మన సినిమా!! తప్పక చూడండి!!

నటనలు :

అచ్యుతానందలుగా రోహిత్, శౌర్యలు నిజమైన అన్నదమ్ములా అనేంతగా పాత్రల్లో ఒదిగిపోయారు. ఇప్పటివరకు చేసిన కమర్షియల్ సినిమాల్లో ఇబ్బందిగా అనిపించిన రోహిత్ “బరువు” ఈ సినిమాకు ఒక సహజమైన బలంగా మారింది. శౌర్య కూడా పరిపక్వతతో నటించాడు. రెజీన కూడా పాత్రకు పూర్తి న్యాయం చేసింది. మిగతా పాత్రలు పోషించిన సీత, భరణి, చైతన్యకృష్ణ, పావని, హేమంత్, శశాంక్ ఇలా అందరూ తమ పాత్రలకు సరిపోయారు.

బలాలు :

  1. కథ, కథనం, దర్శకత్వం. ఒక సహజమైన కథావస్తువుకి సృజనాత్మకమైన కథనం, దర్శకత్వం తోడైతే ఎలా ఉంటుందో అవసరాల మరోసారి నిరూపించాడు.
  2. కిరణ్ గంటి కూర్పు. దర్శకుడి సృజనాత్మకతకు పూర్తి సాయం అందించింది కిరణ్ సన్నివేశాల కూర్పు.
  3. మాటలు. ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అంశమిది. సినిమాలో దాదాపుగా అచ్చతెలుగు పదాలను వాడాడు అవసరాల. అవి హాస్యాన్ని, భావోద్వేగాలను బాగా పండించాయి.
  4. భాస్కరభట్ల సాహిత్యం. ఒక గీతరచయితకు పూర్తి స్వేచ్చనిస్తే ఎంతమంచి పాటలొస్తాయో “ఒక లాలన” పాట ఓ ఉదాహరణ. ఇదే కాకుండా, మిగతా పాటల్లో కూడా పూర్తిగా తెలుగు పదాలే వ్రాశారు భాస్కరభట్ల. తెలుగు పాటలో “తుషారం” అనే పదం వినబడి చాలాకాలమైంది. ఇంత స్వేచ్చను రచయితకు ఇచ్చిన అవసరాలను మరోసారి అభినందించాలి.
  5. కళ్యాణరమణ సంగీతం. హృద్యమైన కథకు, మరింత హృద్యమైన సంగీతాన్ని అందించారు కళ్యాణరమణ. “ఒక లాలన” పాట ఈమధ్యకాలంలో వచ్చిన ఒక ఆణిముత్యమని చెప్పాలి.
  6. నిర్మాణ విలువలు. కేవలం కథను నమ్మి సినిమాలు నిర్మించే అతితక్కువ నిర్మాణ సంస్థల్లో “వారాహి చలన చిత్రం” ముందువరుసలో ఉంటుంది.

బలహీనత :

  1. రెండో సగంలో నెమ్మదించిన కథనం. సినిమా నిడివి 126 నిమిషాలే అయినా రెండో సగం ఎక్కువసేపు ఉన్న భావన కలిగింది.

ఈ చిత్రం నేర్పిన పాఠం :

ఒక సినిమా కథ వ్రాయడానికి ఏవేవో చదివేసి ఎక్కడో దూరంగా సన్యాసిలా బ్రతకాల్సిన అవసరంలేదు. తొంగిచూస్తే, ప్రతి మనిషి జీవితంలో బోలెడు కథలుంటాయి. వాటికి సరైన నాటకీయతను జోడించగలిగితే అవే సినిమా కథలవుతాయి.

– యశ్వంత్ ఆలూరు

Click here for English version of this Review…

One thought on “జ్యో అచ్యుతానంద (2016)

  1. Pingback: Jyo Achyutananda (2016) – Film Criticism

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s