తెలుగు సినిమాకు ప్రేమకథ అనాదిగా నమ్ముకున్న సూత్రం “కోటలో రాణి తోటలో రాముడు“. కానీ మారుతున్న ప్రేక్షకుడి అభిరుచికి తగ్గట్టుగా సినిమా కూడా మారాలి కనుక అదే సూత్రానికి కొత్త పూతలు పూసి తీసే ప్రయత్నాలు చేస్తుంటారు దర్శకులు. అలాంటి ఓ ప్రయత్నమే “నిర్మలా కాన్వెంట్”. హీరో శ్రీకాంత్ కొడుకు “రోషన్” తొలిపరిచయంగా, అతడికి జంటగా “శ్రేయా శర్మ” నటించిన ఈ సినిమాతో “నాగ కోటేశ్వరరావు” దర్శకుడిగా పరిచయమయ్యారు. “అక్కినేని నాగార్జున” నిర్మిస్తూ ఓ ప్రత్యేక పాత్రలో నటించిన ఈ సినిమాకు “నిమ్మగడ్డ ప్రసాద్” మరో నిర్మాత.
కథ :
“నిర్మలా కాన్వెంట్”లో చదువుతున్న పదహారేళ్ళ వయసుగల శామ్యూల్ (రోషన్), శాంతి (శ్రేయ) ప్రేమలో పడతారు. పేదవాడైన శామ్యూల్ రాజవంశానికి చెందిన శాంతిని పొందడానికి గల అడ్డంకులను ఎలా తొలగించాడు అన్నది ఈ సినిమా కథాంశం.
కథనం, దర్సకత్వం – విశ్లేషణ :
టీనేజ్ ప్రేమకథలు “చిత్రం” మొదలుకొని ఇదివరకు చాలానే వచ్చాయి. కానీ “టీనేజ్” అనగానే వయసు వేడిలో చేసే తప్పులు చూపించడంతో కొన్ని సినిమాలు “బీ గ్రేడ్” సినిమాలుగా కూడా ముద్రవేయించుకున్నాయి. కానీ ఈ సినిమాలో ఆ “తప్పులు” చేయలేదు దర్శకుడు.
ఇది ప్రక్కనబెడితే, ఈ సినిమా కథ అసలు ఒక కాన్వెంట్ నేపథ్యంలో తీయాల్సిన అవసరం ఏమాత్రం కనిపించలేదు. పైగా 16 ఏళ్ళ వయసుకు అంత పరిపక్వత ఎలా సాధ్యమని అనిపించే సన్నివేశాలు కూడా బోలెడున్నాయి ఇందులో. ఉదాహరణకు, ప్రేమకు కొత్త భాష కనిపెట్టడం, ముద్దులతో భాష కనిపెట్టడం లాంటివి సినిమా నేపథ్యం వలన ప్రేక్షకుడి మనసులో రిజిస్టర్ అవ్వవు. ప్రస్తావన వచ్చింది కాబట్టి “కొత్త కొత్త భాష” పాట. ఇది గుర్తుపెట్టుకోండి, తరువాత మాట్లాడుకుందాం! “ఒక్కోసారి ఓ ముద్దు” అనే పాట సాహిత్యం, సంగీతం, చిత్రీకరించిన విధానం అన్నీ బాగున్నాయి. సినిమాటోగ్రాఫర్ “విశ్వేశ్వర్” పనితనం అందులో బాగా కనిపించింది. కానీ అంత భావుకత హీరో, హీరోయిన్ల వయసులకు చాలా ఎక్కువనిపించింది. ఇదే కాకుండా శామ్యూల్, శాంతి పాత్రలకు వ్రాసిన డైలాగులు కూడా కొన్నిచోట్ల అతిశయోక్తిగా అనిపిస్తాయి.
చదువులేని తండ్రి చదువుకునే కొడుకు మాటను నమ్మి సంబంధం మాట్లాడడానికి వెళ్ళాడంటే అర్థముంది. అన్నీ తెలిసిన రాజు గారి కుటుంబంలో కూడా పదహారేళ్ళకే పెళ్ళేంటని ఎవరూ ప్రశ్నించకపోవడం ఆశ్చర్యం.
అక్కడక్కడ ఈ సినిమా “స్లమ్‌డాగ్ మిలియనీర్”తో పాటు “మైత్రి” అనే కన్నడ సినిమాను కూడా గుర్తుచేసింది. దర్శకనిర్మాతలు “మైత్రి” సినిమానే రీమేక్ చేసున్నా బాగుండేది. మంచి సందేశం కలిగిన భావోద్వేగపు సినిమాగా మిగిలివుండేది. రెండో సగమంతా ఏదో టీవీషో చూస్తున్న భావనే తప్ప సినిమా చూస్తున్న భావన చాలా తక్కువ కలుగుతుంది. దీనికి మరో కారణం, చిన్నవాడైనా, పెద్దవాడైనా ఓడిపోయే లక్షణం తెలుగు హీరోకి లేకపోవడం. కనీసం గెలుస్తాడా లేదా అనే ఉత్కంఠను కూడా కలిగించలేకపోయాడు దర్శకుడు. ఇలాంటి కథలో అలాంటి కమర్షియల్ కోణంలో ఆలోచించాల్సిన అవసరంలేదు. ఇక ఈ సినిమాకు చూపించిన ముగింపే సరైనది. దర్శకుడికి వేరే దారి కూడా దొరకని కథ ఇది.
ఇందాక గుర్తుపెట్టుకోమన్న “కొత్త కొత్త భాష” పాట గురించి కాస్త మాట్లాడుకోవాలి. ఏ.ఆర్.రెహమాన్ కొడుకు “అమీన్”తో పాటని పాడించడం ప్రచారం చేసుకోవడానికి ఉపయోగపడిందేమో కానీ సినిమాలో ఈ పాటను వాడిన విధానం ఒప్పించేలా లేదు. మాములుగా మొదలైన ఈ పాటకు “ప్రేమలో పసితనం ఉండాలి” అనే డైలాగును లీడ్ గా వాడుకొని అమాంతం గొంతు మార్చి వినిపించడం అస్సలు రుచించలేదు. రోషన్ కు ఆ గొంతు అతకలేదు కూడా. ఎలాగైనా ఆ పాటను అలాగే సినిమాలో వినిపించాలన్న దర్శకుడి తాపత్రయంలో పరిపక్వత లోపించింది. అమీన్ పాడిన పాటను కేవలం ఆడియోకు, ప్రచారానికి మాత్రమే పరిమితం చేసి సినిమాలో నటుడికి సరిపోయే గొంతుతో వినిపించి ఉంటే బాగుండేది. ఇక “సింగర్స్” కార్డులో “అక్కినేని నాగార్జున (తొలిపరిచయం)” అని వేయడం కూడా ప్రచారం కోసం వేసిన ఎత్తే అనిపిస్తుంది. ఎందుకంటే, గాయకుడిగా నాగార్జున గారికి ఇది తొలి పాట కాదు. “సీతారామరాజు“లో “వినుడు వినుడు” అనే పాటను ఆయన ఇదివరకే పాడారు.
ఏదేమైనా, “నిర్మలా కాన్వెంట్” అనే ఈ సినిమా “నిర్మలా కాలేజీ”లో జరిగుంటే కాస్త బాగుండేది. కాన్వెంట్ లో జరగడంవలన పాత్రలకు వాటి చర్యలకు సంబంధం లేకుండా నిరాశపరిచింది.
నటనలు :
రోషన్ మొదటి సినిమాకే చాలా బాగా చేశాడు. హావభావాలు బాగా పలికించాడు. ఇతడికి హీరోగా ఓ మంచి భవిష్యత్తు ఎదురుచూస్తోందనడంలో అతిశయోక్తి లేదు. శ్రేయ కూడా బాగా నటించింది. పాత్రకు తగ్గట్టుగా అందంగా కూడా ఉంది. ఇక ఈ సినిమాలో నాగార్జున పోషించిన పాత్ర ఆయనకు కొట్టినపిండి. అతిసులువుగా పోషించగల నిజజీవిత పాత్ర. ఆదిత్య, సూర్య, సమీర్, ఎల్.బి.శ్రీరాం, రవిప్రకాష్, అనిత చౌదరి, సత్యకృష్ణ, తాగుబోతు రమేష్, రోషన్ కనకాల ఇలా అందరూ ఫరవాలేదు.
బలాలు :
- విశ్వేశ్వర్ సినిమాటోగ్రఫీ. అందమైన ప్రదేశాలను అందంగా కెమెరాలో బంధించారు. సినిమాలో ప్రేమించగల మొదటి విషయం.
- రోషన్ సాలూరి సంగీతం. పాటలు, నేపథ్య సంగీతం చాలా బాగున్నాయి. ఖచ్చితంగా మరో అవకాశం ఇవ్వదగిన వ్యక్తి ఇతడు.
- నిర్మాణ విలువలు. నాగర్జున, నిమ్మగడ్డ ప్రసాద్ ఈ సినిమాను పెద్ద సినిమాగా మార్చారు. ఖర్చులో ఎక్కడా వెనుకాడలేదు.
బలహీనతలు :
- కథ, కథనాలు. ఏమాత్రం ఆకట్టుకోలేదు.
- నిడివి. ఒప్పించలేని ఈ కథనం 152 నిమిషాల పాటు సాగింది.
ఈ చిత్రం నేర్పిన పాఠం :
పాత కథలను కూడా కొత్తగా చెప్పాలంటే కొంత అనుభవం కావాలి.
– యశ్వంత్ ఆలూరు
Click here for my review on Mythri.