మజ్ను (2016)

majnu-poster

వందేళ్ళ సినిమా చరిత్రలో అన్ని రకాల కథలు వచ్చేశాయి. ఆ రకాలన్నింటినీ దాటుకొని పుట్టడానికి కొత్త కథేమి మిగలలేదు. మిగిలిందల్లా కొత్త కథనాలే. అందుకే ఈ మధ్య దర్శకులు కథకంటే ఎక్కువగా కథనం మీదే దృష్టి సారిస్తున్నారు. ఎంచుకున్న మూలకథ ఎంత పాతదైనా దాన్ని ఎంత కొత్తగా చెప్పగలమా అని చూస్తున్నారు. అలాంటి ఓ పాత కథే “మజ్ను“. నాని, అను, ప్రియశ్రీ నటించిన ఈ సినిమాకు “విరించి వర్మ” దర్శకుడు. “ఆనంది ఆర్ట్ క్రియేషన్స్“, “కేవా మూవీస్” పతాకాలపై “పి.కిరణ్“, “గీత గోళ్ళ” నిర్మించారు.

కథ :

తను ఇష్టపడిన సుమ (ప్రియశ్రీ) ప్రేమను పొందడంలో భాగంగా తను ఒకప్పుడు ప్రేమించి విడిపోయిన కిరణ్మయి (అను)తో గల ప్రేమకథను చెప్పడం మొదలుపెడతాడు ఆదిత్య (నాని). అది పూర్తిచేసే లోపే తానింకా కిరణ్మయినే ప్రేమిస్తున్నానని గ్రహిస్తాడు. ఆదిత్య తిరిగి కిరణ్మయిని ఎలా కలిశాడు? తన ప్రేమకథను విని తనతో ప్రేమలో పడిన సుమకు ఎలా సమాధానం చెప్పుకున్నాడు? ఆ ప్రయత్నంలో అతడికి ఎదురైన సమస్యలేంటి? అన్నవి కథాంశాలు.

కథనం, దర్శకత్వం – విశ్లేషణ :

పైన చెప్పుకున్నట్టుగా, ఇది పసలేని ఒక పాత ప్రేమకథ. అయినప్పటికీ, దర్శకుడు విరించికి తన కథ ప్రేక్షకుల మెప్పు పొందే అవకాశాలు బాగానే ఉన్నాయి. “మొదటిది” హీరో నాని. “రెండవది” కథనం.

నాని సినిమా అనగానే బాగుంటుందని ప్రతి ప్రేక్షకుడు ధియేటరుకు వచ్చే స్థాయిలో ఉన్నాడు నాని. పైగా నాని అనగానే పాత్రలో చలాకీతనం, హాస్యం ఆశిస్తాడు ప్రేక్షకుడు. కనుక ఇది “మినిమం గ్యారెంటి సినిమా” అయ్యే అవకాశం దక్కింది. దాన్ని వాడుకోవడంలో దర్శకుడు సఫలమయ్యాడు.

కథ పాతది కనుక కథనంలో కొత్తదనం లేకపోయినా ఓ మాదిరిగా, కళ్ళకు ఆనందం కలిగించే దృశ్యాలతో ఇబ్బంది పెట్టకుండా సాగిపోయింది. ఈ రకం కథనాలకి కాలేజీ కుర్రాళ్ళు సులువుగా కనెక్ట్ అయిపోతారనడంలో ఎలాంటి సందేహం లేదు. కాలేజీ దాటి వచ్చినవారు కూడా దీనికి కనెక్ట్ అయ్యే అంశాలు కొన్ని ఉన్నాయి. ఒక ఉదాహరణే హీరో వాడిన పాత యమహా మోటార్ సైకిల్. ఒకప్పుడు దానిపై తిరిగిన జ్ఞాపకాలను అందరు నెమరువేసుకోవచ్చు. దీనికితోడు మంచి ప్రదేశాలు, పాటలు తోడవడంతో మొదటి సగం ఓ మాదిరిగా సాగిపోతుంది.

విరామ సన్నివేశం కాస్త ఉత్కంఠను కలిగించినా రెండో సగంలో దాన్ని కొనసాగించలేకపోయాడు దర్శకుడు. వెన్నెల కిషోర్ పాత్ర ప్రవేశం కాస్త నవ్వించినా రెండో సగం మాత్రం నెమ్మదిగానే నడుస్తుంది. కానీ నాని నటన ప్రేక్షకుడిని సినిమా ఆఖరివరకూ కూర్చోబెట్టిందనడంలో అతిశయోక్తి లేదు. మొదట్లో వినిపించిన ప్రేమలేఖను చివర్లో దృశ్యరూపంలో చూపించడం బాగుంది. అలాగే, చివర్లో రైలులోని సన్నివేశం బాగా నవ్వించింది. దీనికి పూర్తిగా నానినే కారణం.

హీరో పాత్ర చిత్రణ గురించి కాస్త మాట్లాడుకోవాలి. ఓ పాత్ర చేసే పనులు కథపై ఎంతోకొంత ప్రభావం చూపిస్తేనే అది బాగా నెలకొల్పబడుతుంది. ఉదాహరణకు, “ఏ మాయ చేశావే“లో హీరో పాత్రను “అసిస్టెంట్ డైరెక్టర్“గా చూపించడం ఆ కథపై తనవంతు ప్రభావం చూపించి, కథను ఓ మలుపు తిప్పడానికి కూడా ఉపయోగపడింది. ఈ సినిమాలో అది లేదు. “బాహుబలి” సినిమాకు “అసిస్టెంట్ డైరెక్టర్”గా హీరోను పరిచయం చేయడం, “రాజమౌళి” చేత అతిథి పాత్ర చేయించడం, అడుగడుగునా బాహుబలి ప్రస్తావన తేవడం, దానికి సంబంధించిన, కథకు ఏమాత్రం సంబంధంలేని గూండాలను పెట్టడం ఈ సినిమాకు ఏమాత్రం ఉపయోగపడలేదు. వేరుగా ఓ కామెడీ ట్రాక్ పెట్టడానికి, సినిమా ప్రచారానికి, “బాహుబలి”ని ప్రేక్షకులకు మళ్ళీ గుర్తుచేయడానికి ఉపయోగపడింది. దర్శకుడు గ్రహించని విషయమేమిటంటే “బాహుబలి”ని ఎవరూ ఎప్పటికీ మర్చిపోలేరని. కథలో ఎలాగు పస లేనప్పుడు కనీసం పాత్ర చేసే పనులకు ఓ పర్పస్ అయినా ఉండాలన్నది మన దర్శకులు గ్రహించాల్సిన విషయం.

అలా, “మజ్ను” అనే ఈ పాత ప్రేమకథ వర్షాలకు విసుగొచ్చిన వారికి, నాని సినిమా అంటే కాస్త నవ్వుకోవచ్చు అనుకునేవారికి, కాలేజీ స్టూడెంట్స్ కి సరదాను పంచే కథ… సారీ! సినిమా!!

నటనలు :

“న్యాచురల్ స్టార్” అని పిలవబడే నాని ఈ సినిమాలో మరింత న్యాచురల్ గా నటించాడు. పలు సన్నివేశాల్లో అలవోకగా నటించి నవ్వించడమే కాక, సెంటిమెంట్ సన్నివేశాల్లో కూడా బాగా నటించి ఈ సినిమాకు అంతా తానై నడిపించాడు. హీరోయిన్లు అను, ప్రియశ్రీ బాగానే చేసినట్టు అనిపించినా వారిలో తెలుగుదనం చీరలు కట్టుకున్నా కూడా కనిపించలేదు. రాజమౌళి, రాజ్ తరుణ్ ల అతిథి పాత్రలు ప్రభావం చూపలేదు. వెన్నెల కిషోర్, సత్య, సప్తగిరి నవ్వించే ప్రయత్నం చేశారు. సత్యకృష్ణ, పోసాని, శివనారాయణ, రాజ్ మదిరాజు, కేశవదీప్, అనుపమ, మనీష ఇలా అందరూ ఉన్నారు.

బలాలు :

  1. జ్ఞానశేఖర్ ఛాయాగ్రహణం. అందమైన ప్రదేశాల్లో మరింత అందమైన దృశ్యాలను కళ్ళకు కట్టారు. లైటింగ్ చాలా బాగుంది.
  2. గోపిసుందర్ సంగీతం. పాటలన్నీ వినసొంపుగా ఉన్నాయి. ముఖ్యంగా, “జారే జారే”, “ఓయ్ మేఘంలా”, “ఊరికే అలా” అనే పాటలు చాలా బాగున్నాయి. దర్శకుడు మొదటి సగంలో నాలుగు పాటలను వాడేశాడు. అంతగా సినిమాను నడిపించాయి పాటలు.
  3. మిర్చి కిరణ్ మాటలు. కథకు సరిపోయేలా సహజంగా ఉన్నాయి.
  4. నాని నటన. చాలా న్యాచురల్ గా ఉంది.
  5. నిర్మాణ విలువలు. నిర్మాతలు కిరణ్, గీతాలు ఎక్కడా రాజీపడకుండా నిర్మించారు.

బలహీనతలు :

  1. పాత కథ.
  2. పర్పస్ లేని పాత్రలు, సన్నివేశాలు.

ఈ చిత్రం నేర్పిన పాఠం :

ముఖ్యమైన పాత్రల చిత్రణ అవి చేసే ప్రతీ పని కథపై ఎంతోకొంత ప్రభావం చూపేలా ఉండాలి.

– యశ్వంత్ ఆలూరు

Click here for English version of this Review…

One thought on “మజ్ను (2016)

  1. First half varaku fine ala simple ga teesukellipoyadu eppudu aipotundi teliyadu anthala involve cheyagaligadu aa love track lo of course adhi instant gane but connect undindhi , interval daggare ardhamavutundi inka next emavutundo, inka second half manage cheyadaniki teesinatu undi tappite aa connect ledhu , flashback lo choopinchani 2 scenes insert cheyadam bagundi, alanti links inka konni unte baagundedhi 🙂

    Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s