ప్రతి మనిషి జీవితం ఒక సినిమా కథ. ఆ మనిషిలోని పలు కోణాలే ఆ కథలోని పాత్రలు. “మంచి” అంటే రాముడు, “చెడు” అంటే రావణుడు, “సాయం” అంటే ఆంజనేయుడు. ఇలాంటి కోణాలను చూపిస్తూ చెప్పిన కథే “మనఊరి రామాయణం”. “ప్రకాష్‌రాజ్” దర్శకత్వం చేస్తూ ప్రధాన పోషించిన ఈ సినిమాలో ప్రియమణి, సత్యదేవ్, పృథ్విరాజ్ మరో మూడు ప్రధాన పాత్రలు పోషించారు. రాంజీ నరసింహన్, ప్రకాష్‌రాజ్ నిర్మించారు.
కథ :
ఊరికి పెద్ద భుజంగయ్య (ప్రకాష్‌రాజ్), అతడి నమ్మినబంటు ఆటోడ్రైవర్ శివ (సత్యదేవ్), ఓ వేశ్య సుశీల (ప్రియమణి), ఓ సినీదర్శకుడు గరుడ (పృథ్విరాజ్) ఇలా అందరూ ఒక సమస్యలో ఇరుక్కుంటారు. అదేంటి? దానికి కారణం ఎవరు? ఆ సమస్య ఎలా తీరింది? అది తీరే క్రమంలో అందరు ఏమి తెలుసుకున్నారు? అనేవి కథాంశాలు.
కథనం, దర్శకత్వం – విశ్లేషణ :
ఈ సినిమా మలయాళంలో వచ్చిన “షట్టర్” అనే సినిమా రీమేక్ అని తెలిసింది. అది నేను చూడలేదు కనుక ఇది “మనఊరి రామాయాణం” మీద వ్రాసే సమీక్షే.
“ఒక సమస్య” అని పైన వ్రాసినందుకు అది ఏదో పెద్ద సమస్య అనుకోకండి. ఒక ప్రేక్షకుడిగా తెరకు ఈవైపు నుండి చూస్తే అది చాలా చిన్న సమస్య. తెరను దాటి ఆయా పాత్రల కోణాల్లోంచి చూస్తే అది చాలా పెద్ద సమస్య. అలా ప్రేక్షకుడిని తెరను దాటించడంలో ప్రకాష్‌రాజ్ చాలావరకు సఫలమయ్యారు. పాత్రలను ప్రత్యేకంగా ప్రేక్షకుడికి పరిచయం చేయకుండా వాటి దయనందన జీవితాల్లో అతడిని భాగం చేయడం వల్ల ఆ పాత్ర తత్వాన్ని ఆ ప్రయాణంలోనే తెలుసుకుంటాడు ప్రేక్షకుడు. ఇది “బాలచందర్” గారి శైలి. ఈ సినిమాలో ప్రకాష్‌రాజ్ కూడా అదే అనుసరించారు. ఇలా చేయడంతో పాత్రపై ప్రేక్షకుడికి ఆసక్తి పెరుగుతుంది. ఒక ఉదాహరణ చెప్పాలంటే భుజంగయ్య ఇంట్లోని ముసలావిడ అస్తమానం అతడిని వారిస్తుంటుంది. అది ఆవిడ దయనందన జీవితం. అందులో ప్రేక్షకుడు భాగమవడంతోనే భుజంగయ్య అతడికి దగ్గరవుతాడు.
ఒక మనిషిని చూసినప్పుడు మనకేమి అనిపిస్తుందో అదే ఆ మనిషి వ్యక్తిత్వమని అనుకుంటాం. నిజానికి ఆ మనిషి వ్యక్తిత్వం వేరే అయ్యుంటుంది. ఇలాంటి అపార్థాలు మన వ్యక్తిత్వాన్ని ఎలా దిగాజారుస్తాయో దర్శకుడు చూపించిన విధానం చాలా బాగుంది. ఇదే కాకుండా, తెరపై కనిపించే ఏ పాత్రపై ప్రేక్షకుడికి చులకన భావం కలగకుండా చేయడం కూడా దర్శకుడి పటిమ. ఉదాహరణకు, సుశీల పాత్ర ఒక వేశ్యగా పరిచయమైనా ఎక్కడా ఆ పాత్రపై అగౌరవం కలగదు. పైగా, కథనం క్రమంలో దానిపై గౌరవం పెరుగుతూ వెళ్తుంది. చివర్లో కూడా ఆ పాత్రపైనే సినిమాను ముగించడం ఎంతో బాగుంది. ఇక్కడ దర్శకుడిగా ప్రకాష్‌రాజ్ ని “మేకింగ్ సీన్స్”ని చూపించనందుకు మెచ్చుకోవాలి. సుశీలపై సినిమా చివరి షాట్ పెట్టిన తరువాత ఏ షాట్ చూపించినా కూడా భావోద్వేగాలు మారిపోతాయి. అలా చేయకుండా చివర్లో “మనఊరి రామాయణం” పాటను పెట్టడం కథ, కథనాలపై మంచి అభిప్రాయం కలిగించింది.
అలా, “మనఊరి రామాయణం” అనే ఈ సినిమా ఏ విషయం చెప్పలేదు అనిపిస్తూనే మనుషుల్లో మానవత్వం గురించి ఎన్నో విషయాలను చెప్పే సినిమా. సమీక్షలో ఎక్కువ విషయాలు చెప్పకూడదు కనుక కొద్దిగానే చెప్పడం జరిగింది. ఒక కొత్త రకమైన సినిమాను చూడాలనే ఆశున్న ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా ఇది. ఈ సినిమా గురించి మరో మంచి విషయమేమిటంటే, సినిమా నచ్చినా, నచ్చకపోయినా కథను దాటి మరో విషయాన్ని ఆలోచించే వీలు ప్రేక్షకుడికి కలిగించదు ఈ సినిమా.
నటనలు :
ప్రకాష్‌రాజ్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఏమి లేదు. ఈ సినిమాలో ఆయన నటనకంటే ఎక్కువగా దర్శకత్వంపైనే దృష్టి పెట్టినట్టు అనిపించింది. ప్రియమణి ఈ సినిమాకు మంచి ఎంపిక. సుశీల పాత్రను ఎంతో సునాయాసంగా చేసింది. శివ పాత్రను చేసిన సత్యదేవ్ నటన ఎంతో సహజంగా ఉంది. విలన్ పాత్రలే కాకుండా అమాయకపు పాత్రలు కూడా బాగా చేయగలడని ఈ సినిమాతో చూపించాడు. పనికిరాని పేరడీలతో విసిగించిన పృథ్విరాజ్ చేత ప్రకాష్‌రాజ్ ఒక మంచి పాత్ర చేయించారు. ఈ మధ్యకాలంలో అతడికి దక్కిన మంచి పాత్ర ఇది. రఘుబాబు, అచ్యుత్ కుమార్ ఇలా మిగతా అందరూ ఫరవాలేదు.
బలాలు :
- కథ, కథనం. “సూటిగా…సుత్తి లేకుండా” అనే సూత్రంపై సాగిపోయాయి. కనుక ఏ సన్నివేశం అనవసరం అనిపించదు ఈ సినిమాలో.
- నటనలు. పైన చెప్పుకున్నట్టు, ఒక పాత్ర సమస్యను ప్రేక్షకుడు సమస్యగా భావించాడంటే ఆ పాత్రను పోషించే నటుడే కారణం. అలాంటి నటనలే చేశారు ఈ సినిమాలో అందరు.
- ఇళయరాజా సంగీతం. ఉన్నది ఒక్క పాటే ఈ సినిమాలో. అది కథకు తగ్గట్టుగా ఉంది. నేపథ్య సంగీతం కథకు బాగా సాయపడింది.
- ముఖేష్ ఛాయాగ్రహణం. చక్కటి లైటింగ్ తో ప్రతి సన్నివేశాన్ని కథకు తగ్గట్టుగా మలిచారు.
- నిర్మాణ విలువలు. తక్కువ బడ్జెట్ తో చేసినా ఈ సినిమా నాణ్యత విషయంలో ఎక్కడా లోపించలేదు.
బలహీనతలు :
- ఈ సినిమాలోని పలు సన్నివేశాలను తెలుగులో తీయలేదు. ప్రకాష్‌రాజ్ కుటుంబంతో ఉన్న సన్నివేశాలన్నీ కన్నడలోంచి డబ్బింగ్ చేసినవే. పైగా పలువురు నటులు తెలుగువారికి పరిచయం లేకపోవడం తెలుగు ప్రేక్షకుడికి ఈ సినిమాను దూరం చేసే అవకాశాలున్నాయి.
- రెండో సగంలో నెమ్మదించిన కథనం.
– యశ్వంత్ ఆలూరు
Interesting story line,but very limited appeal undhi, inka manchi ga interesting ga teyacchu, ante edho action movie laaga twists n turns kaadu but more happening undalsindhi 🙂
Shiva police station nundi vacchina taruvata nunchi entento teesinattu anipistundi, tension penchalsina daggara normal approace tho teesadu, malli towards climax konchem moment vastundhi anthey 🙂
overall manalanti cinemapicchollaki okay/avg movie avvachu but regular audience ki kashtame 😀
LikeLiked by 1 person