ప్రేమమ్ (2016)

premam-poster

ఒక భాష సినిమాను ఆత్మ చెడకుండా మరో భాషలో చేయడం చాలా కష్టం. అదే కష్టాన్ని ఇష్టంగా అనుభవించాడు “చందు మొండేటి“. మళయాళంలో పెద్ద విజయం సాధించిన “ప్రేమమ్” సినిమాను అదే పేరుతో నాగచైతన్య, శృతిహాసన్, మడోన్నా, అనుపమలతో చేశాడు. “సితార ఎంటర్టైన్మెంట్స్” పతాకంపై “సూర్యదేవర నాగవంశీ” నిర్మించారు.

కథ :

విక్రమ్ (నాగచైతన్య) అనే కుర్రాడి జీవితంలో మూడు దశల్లో జరిగిన ప్రేమకథల సమాహారమే ఈ కథ.

కథనం, దర్శకత్వం – విశ్లేషణ :

కథాపరంగా చూస్తే ఇది మామూలు సినిమా. ఇలాంటి కథతో ఇదివరకే “నా ఆటోగ్రాఫ్” అనే సినిమా వచ్చింది. మళయాళంలో కూడా “ప్రేమమ్” విజయం సాధించడానికి ముఖ్య కారణాలు కథనం, నటులు, వారి నటనలు. అవి అత్యున్నత స్థాయిలో ఉండడంతో ఆ సినిమా అక్కడ విజయం సాధించి మరో భాషలో రీమేక్ చేయబడే అర్హతను సంపాదించింది. దీన్ని రీమేక్ చేయడం అతికష్టం. మళయాళం సినిమా అక్కడి ప్రజలను, సంస్కృతిని, ప్రదేశాలను ఇలా పలు అంశాలను చర్చిస్తుంది. తెలుగు దర్శకుడు “చందు”కి ఈ విషయాలు పెద్ద సవాళ్లు. వాటిని తన కష్టంతో అధిగమించినందుకు అతడికి పూర్తి మార్కులు వేసేయాలి.

మొదటి దశ (2000) :

సుమ (అనుపమ)తో విక్కీ ప్రేమకథను చూపించిన దశ దాదాపుగా మళయాళంలో లాగే ఉన్నప్పటికీ కథ జరిగే వాతావరణం గురించి దర్శకుడు చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు. ఉదాహరణకు, 2000 కాలంలోనాటి బళ్ళు, సైకిల్స్, టెలిఫోన్ ఇలా వస్తువుల విషయంలో పక్కాగా ఉన్నాడు. 2000 అంటే “మెగాస్టార్ చిరంజీవి” ప్రభంజనం. అందుకు ఉదాహరణగా సుమ వెంటపడే అబ్బాయిల్లో ఒకడు “హిట్లర్ సినిమా స్టెప్” వేస్తూ కనిపిస్తాడు. ఇదే కాదు, ఈ దశలో ఏదైనా సినిమా పాట వినబడిందంటే అది ఆ కాలంలో వచ్చిన హిట్టు పాటే అయ్యుంటుంది. ఇలాంటివన్నీ ప్రేక్షకుడికి ప్రత్యేకంగా చెప్పాల్సినవసరం లేదు. అంతర్లీనంగా వచ్చినా కూడా వాటి ప్రభావం సినిమాపై తప్పకుండా ఉంటుంది. అదే చేశాడు దర్శకుడు. అప్పట్లో స్కూల్ స్టూడెంట్స్ సరదాగా ఆడే “ఫ్లేమ్స్” ఆటను ప్రస్తావించడం కూడా బాగుంది.

రెండో దశ (2005) :

ఇక్కడ కూడా ఆ కాలంనాటి వస్తువులు, వాతావరణం సృష్టించాడు దర్శకుడు. ఉదాహరణలు, CBZ బైక్, నోకియా ఫోను, “వెంకటేష్” పాటలు, బాగా పొగ వదిలే యమహా బండి.

మళయాళం సినిమాకు కూడా ముఖ్య దశ ఇదే. రెండు గంటల సినిమాలో ఈ కథే ఎక్కువసేపు నడుస్తుంది. అందులో నటించిన మలర్ (సాయి పల్లవి) వల్లే ఆ సినిమా అంతటి విజయం సాధించింది. ఆ పాత్రకు శృతిహాసన్ ని ఎంపిక చేయడంపై కాస్త అనుమానంగా ఉండేది. ఒక కొత్త ముఖం కనిపించాల్సిన చోట తెలిసిన ముఖం పెడితే ఎలో ఉంటుందోనన్న ఆందోళనకు కూడా మందిచ్చాడు దర్శకుడు. మాతృకలో తమిళమ్మాయైన మలర్ ని ఇక్కడ పూణే అమ్మాయి సితారగా మార్చాడంతో శృతిహాసన్ సరిపోయింది. పైగా నాగచైతన్య-శృతిహాసన్ ఒక స్టూడెంట్-టీచర్ గా బాగా సరిపోయారు. ఈ దశలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సినది “ఎవరే” పాటకు ముందొచ్చే సన్నివేశం గురించి. తెలుగు ప్రేక్షకులకు కావాల్సిన ఫీల్ ని ఇస్తూ పాటకు కూడా మంచి లీడ్ సన్నివేశం అయ్యింది. పాటను చిత్రీకరించిన విధానం కూడా చాలా బాగుంది. ఛాయాగ్రాహకుడు “కార్తీక్ ఘట్టమనేని” పనితనం అందులో బాగా కనబడింది.

కథలో వీలుంది కనుక వెంకటేష్ చేత అతిథి పాత్ర చేయించి దీన్ని కమర్షియల్ సినిమావైపు నడిపించాడు దర్శకుడు. అలాగే, నర్రా శ్రీనివాస్, బ్రహ్మాజీలు తెలుగు ప్రేక్షకులకు కావలసినంత వినోదం పంచారు. చందుని మళ్ళీ మెచ్చుకోలేక ఉండలేకపోతున్నాను.

మూడో దశ (2016) :

మాతృకలో ఈ దశ చాలా త్వరగా ముగుస్తుంది. పైగా హీరో, హీరోయిన్ల ప్రేమకథ అవలీలగా మొదలవుతుంది. ఇక్కడ దర్శకుడు స్వేచ్చను తీసుకొని విక్కీ, సింధు (మడోన్నా)ల స్నేహాన్ని “బ్యాంగ్ బ్యాంగ్” పాటతో నెలకొల్పే ప్రయత్నం చేశాడు. తెలుగు ప్రేక్షకులకు కావాల్సిన ఎమోషన్ ఇదే. శ్రీనివాసరెడ్డి నవ్వించాడు. విక్కీ, సింధులు ప్రేమను తెలుపుకునే సన్నివేశం కూడా హృద్యంగా ఉంది.

జీవితంలో ఒక దశలోని అనుభవాలు మరో దశకు ఎలా ఉపయోగపడతాయో రెండో దశలో విక్కీ “కుక్” అని చెప్పి, మూడో దశలో అతడిని హోటల్ యజమానిని చేయడం ద్వారా చూపించాడు దర్శకుడు. అలాగే, చివర్లో పైన చెప్పుకున్న ఆ రెండో దశలోని సన్నివేశాన్ని వాడుకోవడం చాలా అందంగా ఉంది. మాతృకలో లేని ఆ సన్నివేశం ఈ సినిమాపై, దర్శకుడిపై గౌరవాన్ని మరింత పెంచింది.

అలాగే, ముగ్గురు హీరోయిన్ల పాత్రలు “S” అక్షరంతో మొదలవడం, విక్కీ తన హోటలుకు “S*” అని పేరు పెట్టడం, ఇలా చిన్న చిన్న అంశాలనూ వదలలేదు దర్శకుడు.

అలా, ప్రతి దశలో ఆకట్టుకుంది ఈ “ప్రేమమ్”. ఈ సినిమా మలయాళం కథను దిగుమతి చేసుకొని ఎక్కడా ఆత్మ కోల్పోకుండా, తెలుగు ప్రేక్షకులకు కావాల్సిన అన్ని అంశాలు పొందుపరిచి దీన్ని ఫక్తు తెలుగు సినిమాగా మార్చిన దర్శకుడి చందు కోసం చూడాలి. మాతృక చూసినవారు కూడా ఆనందించేలా ఉన్న ఈ సినిమా నేరుగా చూసేవారికి మరింత నచ్చుతుందనే నమ్మకం ఉంది.

నటనలు :

నాగచైతన్య ఈ సినిమాకు చాలా బాగా సరిపోయాడు. మూడు దశలలోని పాత్రలకు మధ్య తేడాను బాగా చూపించాడు. సితార ఇంట్లోంచి బయటకు బాధతో వచ్చే సన్నివేశం నటనలో అతడు సాధించిన పరిణితిని చూపించింది. అనుపమ మాతృకలోని పాత్రనే చేసింది. శృతిహాసన్ టీచరుగా సరిపోయింది. మడోన్నాకు మాతృకకంటే ఎక్కువ నిడివిగల పాత్ర దొరికింది. చాలా అందంగా దాన్ని పోషించింది. నర్రా శ్రీనివాస్, బ్రహ్మాజీల కామెడీ బాగా నవ్వించింది. ప్రవీణ్, చైతన్యకృష్ణ స్నేహితులుగా బాగున్నారు. శ్రీనివాసరెడ్డి మరోసారి నవ్వించాడు. వెంకటేష్, నాగార్జునల అతిథి పాత్రలు బాగున్నాయి.

బలాలు :

  1. కథనం, దర్శకత్వం. ఆత్మను చెడగొట్టకుండా, తన సొంత కథకు పనిచేసినంత ఇష్టం, కష్టం చందు పనితనంలో కనిపించాయి.
  2. ఛాయాగ్రహణం. చందు తరువాత ఈ సినిమాను అంతగా ప్రేమించింది, ప్రేక్షకుడు ప్రేమించేలా చేసింది కార్తీక్ ఛాయాగ్రహణమే.
  3. సంగీతం. రాజేష్ మురుగేశన్ మళయాళంలో కంపోజ్ చేసిన పాటలే దాదాపుగా వాడినా, గోపిసుందర్ కంపోజ్ చేసిన “బ్యాంగ్ బ్యాంగ్” పాట చాలా బాగుంది.
  4. సాహిత్యం. మళయాళం ట్యూన్లకు అచ్చ తెలుగు సాహిత్యం వ్రాశారు శ్రీమణి, వనమాలి, పూర్ణ చారి, కృష్ణ మాదినేని. రామజోగయ్యశాస్త్రి వ్రాసిన పాట కూడా బాగుంది.
  5. కళాదర్శకత్వం. మూడు దశల్లోని (2000, 2005, 2016) వాతావరణాన్ని తీసుకొనిరావడానికి సాహి సురేష్ పనితనం బాగా కనిపించింది.
  6. నిర్మాణ విలువలు. పైవన్నీ కుదరడానికి సాయపడ్డాయి సూర్యదేవర నాగవంశీ నిర్మాణ విలువలు.

బలహీనతలు :

  1. విక్కీకి సితార డాన్స్ నేర్పించే ఘట్టం మరింత బాగా చూపించాల్సింది.

ఈ చిత్రం నేర్పిన పాఠం :

రీమేక్ సినిమా అంటే అదే సినిమాను మళ్ళీ తీయడం కాదు. మాతృకను చెడగొట్టకుండా, చూసేవారికి నచ్చేలా తెయాడం.

చివరిమాట :

“రీమేక్ సినిమా” అంటే చాలామందికి ఒక చిన్నచూపు ఉంటుంది. కథ వ్రాసే అవసరంలేదు కనుక అదేదో సులభమైన పని అనే భ్రమలో ఉంటారు. నిజానికి, మామూలు సినిమాకంటే రీమేక్ సినిమా చేయడమే కష్టమని నా అభిప్రాయం. ఎందుకంటే, ఒక భాషలో ఒక సినిమా తీస్తే అది ఆ భాష మాట్లాడే ప్రజలను, వారి సంస్కృతిని, ఆలోచనలను, ఆ రాష్ట్రాన్ని ఇలా పలు అంశాలను ప్రతిబింబిస్తుంది. ఆ సినిమాను మరో భాషలో తీయడమంటే కేవలం భాష మారిస్తే సరిపోదు. దాంతోపాటు రాష్ట్రాన్ని, ప్రజలను, సంస్కృతిని, ఆలోచనలను కూడా మార్చాలి. దాంతో పాత కథే అయినా సినిమా కొత్తగా అవుతుంది. అది దర్శకుడి పటిమపై ఆధారపడి ఉంటుంది. భారతీయులను తెలుగోళ్ళు, తమిళోళ్ళు, బీహారోళ్ళు అని వర్ణించడం సులభమే అనిపిస్తుంది కానీ ఓ తెలుగోడు బీహారోడుగా మారడం అంత సులువు కాదు కదా!! 🙂

– యశ్వంత్ ఆలూరు

One thought on “ప్రేమమ్ (2016)

  1. Good One, Nenu original choodaledu but aa konni scenes/videos choosa, oka mode lo veltundi anukunta movie

    ikkada mana nativitity ki taggatu oka conventional way lo teesi kudrinantha varaku entertainmetn kooda add chesaru

    feel good factor undi, but emotional connect wantedly vaddu annatundhi 2nd love track lo okati rendu scenes anna strong ga undalsindhi , last love track chala bagundi, contemporary feel tho veltundhi :thumb:

    Nuvvu cheppinatte 3 tracks ki ala chinna links baga set chesukunnadu, Especially Srikhand scene sync cheyadam last lo Fantastic asala 🙂

    Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s