ఒక సినిమా పాట బాగుందంటే దాని ఘనత కేవలం గీతరచయితకు, సంగీత దర్శకుడికి, గాయకులకు మాత్రమే ఇస్తే సరిపోదు. వారంతా ఆ పాటను ఇవ్వడానికి కారణమైన దర్శకుడిని మొదటగా మెచ్చుకోవాలి. కారుకి ఇంజిన్ ఎంత ముఖ్యమో దాన్ని నడిపించే పెట్రోలు కూడా అంతే ముఖ్యం. పాట విషయంలో కూడా అంతే. రచయిత ఎంత ముఖ్యమో అతడికి సందర్భం చెప్పి స్పూర్తినిచ్చే దర్శకుడు కూడా అంతే ముఖ్యం. ఎందుకంటే, రచయిత “మాట” అయితే దాని వెనుకనున్న “మనసు” దర్శకుడు. “పూరి జగన్నాథ్“కి ఒక మనసుంది. మనసంటే అందరిలా కాదు, అదో రకం. అది ఆయన సృష్టించే పాత్రల్లో, వ్రాసే మాటల్లో ప్రస్పుటంగా కనిపిస్తుంది. అలాంటి మనసుకి ట్యూన్ అయిన మరో మనసు “భాస్కరభట్ల రవికుమార్“. అందుకే, వీరిద్దరి కలయిక అనాదిగా కొనసాగుతూనే ఉంది. పూరి మనసుని, అతడి పాత్రల తత్త్వాలను తన మాటతో బయటపెట్టే ప్రయత్నం విజయవంతంగా చేస్తూనే ఉన్నారు భాస్కరభట్ల. ఇలా ఈ రెండు మనసులు కలిసి మాట్లాడిన మా(పా)టల్లో “ఇజం” సినిమాలోని “ఎలా ఎలా” అనే పాట కూడా అలాంటి ఓ ప్రయత్నమే. మన సినిమా పాటల విశ్లేషణ కార్యక్రమంలోని ఈ సంచిక కోసం చేసిన ఎంపిక…
సినిమా : ఇజం
పాట : ఎలా ఎలా
దర్శకుడు : పూరి జగన్నాథ్
రచయిత : భాస్కరభట్ల రవికుమార్
గానం : శక్తిశ్రీ గోపాలన్
సంగీతం : అనూప్ రూబెన్స్
పూరి చిత్రించే పాత్రలు చాలా ప్రత్యేకంగా ఉంటాయి. దాదాపుగా అతడి హీరో ప్రాక్టికల్ గా ఆలోచించే అహంకారపు స్వార్థపరుడే అయ్యుంటాడు. అతడు తనకంటే తక్కువ అహమున్న హీరోయిన్ను ప్రేమిస్తాడు. ఆమెని ప్రేమలో దింపడానికి చాలా వేషాలు వేస్తాడు. చివరగా ఆ అమ్మాయి ప్రేమను పొందిన తరువాత ఆ ప్రేమను తట్టుకోలేకపోతాడు. అప్పటివరకు స్వేచ్చగా ఉన్న హీరోయిన్ను ప్రేమలో ఇరికించి ఆ తరువాత ఆమె నుండి తాను స్వేచ్చను పొందుతాడు. ఇది దాదాపుగా పూరి సినిమాల్లో జరిగే తంతు. సమాజం కోసం నిస్వార్థంగా పోరాడే పూరి హీరో ఒక అమ్మాయి ప్రేమ విషయంలో మాత్రం చాలా స్వార్థంగా ఉంటాడు, అదేంటో మరి!! మరో గమ్మత్తైన విషయమేమిటంటే, చాలామంది దర్శకులు ఆడదానితో ప్రేమలో విఫలమయిన మగాడి బాధని చూపిస్తే, పూరి మాత్రం మగాడితో ప్రేమలో విఫలమైన ఆడదాని మనోవేదనను చూపించే ప్రయత్నం చేస్తాడు. ఆ సందర్భంలో వచ్చే పాట వ్రాయడం మగవాడైన భాస్కరభట్లకి నిజానికి కత్తి మీద సాములాంటిది. అలాంటి పరిస్థితుల్లో “మగాళ్ళు వట్టి మాయగాళ్ళు” అని వ్రాసినా, “సెలవనుకో మరి ఏడవకే మనసా…” అన్నా అది భాస్కరభట్లకే చెల్లింది.
మొదట్లో విపరీతంగా వెంటపడి, అర్థాంతరంగా తనను వదిలి వెళ్ళిపోయిన తరువాత హీరోయిన్ పడే మనోవేదనే అనిపిస్తుంది ఈ పాట…
నీ మనసుకి మనసే లేదులే
ఉంటే నన్నిలా వదిలీ పోదులే
ఎలా బతికేది నేను… గుండె నిండా నువ్వే నిండి కళ్ళముందు లేకపోతే!!
పైన చెప్పుకున్నట్టుగా, పూరి హీరో చాలా ప్రాక్టికల్ మనిషి. హీరోయిన్ అమాయకురాలు. ఎంతటి అమాయకురాలంటే, మనిషికే కాదు అతడి మనసుకి కూడా ఒక మనసు ఉంటుంది నమ్మేంత. ఈ పాట వింటే అర్థమయ్యే సందర్భం, ఒకప్పుడు వెంటపడిన హీరో అమాంతం ఈ అమ్మాయి బాధపడేలా ఏదో మాట్లాడుంటాడు. ఎంతైనా పూరి హీరో కదా, కఠినంగానే మాట్లాడతాడు. ఆ మాటలకు ప్రేక్షకుడు కూడా పడిపోతాడు. ఆ మాటల వల్ల బాధపడిన అమ్మాయి గురించి మాత్రం ఎవరూ పట్టించుకోరు. ప్రతిసారీ ఆ బాధ్యతను తీసుకొని రంగంలోకి దిగుతాడు భాస్కరభట్ల. “నువ్వు చేసిన పని నన్ను చాలా బాధించింది. అలా నీ మనసెలా ఆలోచించగలిగింది” అనే అమ్మాయిని ఆలోచనను పూరి శైలిలో ప్రతిబింబించిన వాక్యమే మొదటిది. ఇక మిగతా రెండు సాధారణ వాక్యాలే అయినా, “మనసు” అనే కనబడని అంశాన్ని ఒక మనిషిగా ప్రేక్షకుడి మనసులో ముద్రవేయడానికి భాస్కరభట్ల కష్టం అర్థమవుతుంది. ఆ కష్టంతో పాటు పూరి పిచ్చి కూడా తెలుస్తుంది.
మనసంతా తోలిచేసే బాధ
జారే జారే కన్నీళ్ళకి మాటలొస్తే ఎంత ఎంత బాగుణ్ణో…
మొదటి వాక్యం మాములుగానే ఉంటుంది. రెండో వాక్యంలో కవిత్వం ఉంది. కొన్ని బాధలు మాటల్లో పంచుకోలేనివి కాని బాధపెట్టేవి. ఆ బాధను గురించి దానివల్ల వచ్చే కన్నీళ్లు చెప్పగలిగితే బాగుంటుందని అర్థం.
ఎదసడి వింటున్నావా? వినబడి కూడా దాక్కున్నావా?
తెలియక చేస్తున్నావా? తెలిసే చూస్తున్నావా?
పూరి హీరో చాలా తెలివైనవాడు. అందుకే ఎదుటివాళ్ళని, ముఖ్యంగా హీరోయిన్ను తన తెలివితో అయోమయంలోకి నెట్టేస్తాడు. ఆ అయోమయాన్ని తెలిపేవే పై రెండు వాక్యాలు. ఆ అమ్మాయి అతడిని కోరుకుంటోందని అతడికి తెలియదా లేక తెలిసి కూడా తెలియనట్టు నటిస్తున్నాడా అనే అయోమయపు మానసిక సంఘర్షణలు.
చిరునవ్వులు పూసే వాసంతాలే ఆశలు రాలే శిశిరాలవుతుంటే…
ఎలా ఎలా… ఉండేదేలా ప్రాణం?
“బిజినెస్ మాన్” సినిమా గుర్తుందా? హీరో క్రిమినల్ అని తెలిసిన హీరోయిన్ పరిస్థితి ఏంటో అదే ఈ వాక్యం. అంతా బాగుందనకునే సమయంలో ఆశలు అడియాశలు అయితే దాన్ని తట్టుకొని ప్రాణమెలా నిలబడుతుందనే ప్రశ్న ఈ వాక్యం.
కనిపించు నే పోయేలోగా
వేల వేల కళ్ళల్లోన వోత్తులేసి నిన్ను వెతుకుతున్నాగా
ఇవి కూడా సాధారణ వాక్యాలే. “కనిపించు నే పోయేలోగా” అంటే అతడు కనిపించి చాలాకాలం అయ్యింది. ఓసారి కనిపిస్తే చాలు, హాయిగా ప్రాణాలు విడవడానికి సిద్ధపడిన అమ్మాయి ఎదురుచూపు ఈ రెండు వాక్యాలు.
మనసుని ప్రేమగా ఇస్తే మనసని తెలియక విసిరేశావా?
బహుమతిగా నన్నిస్తే బరువని దించేశావా?
అసలు ఈ పాటపై విశ్లేషణ వ్రాయడానికి నన్ను ప్రేరేపించిన వాక్యాలు ఇవే. ఇప్పటి కమర్షియల్ సినిమాల్లో కొన్ని పాటలకోసం రచయితకు, సంగీత దర్శకుడికి కథ కూడా చెప్పడంలేదు కొంతమంది దర్శకులు. ఎంతటి కమర్షియల్ సినిమా అయినా విరహగీతాలు వ్రాయడానికి తప్పనిసరిగా రచయితకు కథ మొత్తం తెలియాలి. పైగా, ఇది పూరి సినిమా కనుక పాత్రల తత్త్వాలు కూడా తెలియాలి. పూరి వద్ద భాస్కరభట్లకున్న స్వేచ్చ అతడిని పాత్రల్లోకి పరకాయ ప్రవేశం చేయిస్తుంది. “హార్ట్ అటాక్” సినిమాలోని “సెలవనుకో” పాటలో “పిలిచానా రమ్మని కసిరానా పొమ్మని” అనే వాక్యాన్ని గుర్తుచేశాయి ఈ రెండు వాక్యాలు.
పైన చెప్పుకున్నట్టుగా, ఇది కూడా పాత్ర యొక్క అయోమయాన్ని తెలిపే ప్రయత్నమే. మనసులని ఇచ్చిపుచ్చుకోవడమే ప్రేమ. వెంటపడిన అబ్బాయి ఓ క్షణంలో నచ్చి తన ప్రేమను బదులిచ్చిన తరువాత అతడు దాన్ని తిరస్కరించాడు. అమ్మాయిది ప్రేమని అర్థంచేసుకునే పరిస్థితిలో కూడా అబ్బాయి లేడు. ఈ సందర్భాన్నే పూరి శైలిలో మొదటి వాక్యం ద్వారా ప్రస్తావించాడేమో రచయిత. బాణీకున్న పరిధివల్ల “మనసుగా” అనే పదం “మనసుగ” అని మార్చారేమో.
రెండో వాక్యంలో అహంకారంతో కూడిన అయోమయం కనిపిస్తుంది. ఈ రెండు ఒక్కొక్కరికి ఒక్కోలా అర్థమయ్యే వాక్యాలు కూడా.
నువ్వు ఎప్పటికప్పుడు గుర్తుకువచ్చి ఊపిరి కూడా భారం అవుతుంటే…
ఎలా ఎలా… ఉండేదేలా ప్రాణం?
ఇది కూడా మంచి కవితాత్మక ప్రయత్నం. ఆ అబ్బాయి గుర్తొచ్చిన ప్రతిసారీ ఊపిరి పీల్చుకోవడం కూడా కష్టంగా అనిపిస్తుంటే, ఆ ఊపిరిపై ఆధారపడిన ప్రాణం ఎలా ఉండగలదు? ఇలాంటి వాక్యాలపై భాస్కరభట్ల సంతకం ఉంటుంది.
ఓ పాటలో కనీసం ఒక్క వాక్యం శ్రోతకు నచ్చినా ఆ రచయిత విజయం సాధించినట్టే. అలాంటిది, ఈ పాటలో పలు వాక్యాలు వినగానే నచ్చేలా ఉన్నాయి. కనుక భాస్కరభట్ల పెద్ద విజయం సాధించారు.
ఈ పాటపై నేను వ్రాసిన ఈ విశ్లేషణ కేవలం నా ఆలోచన పరిధిలోనిదే. నేను వ్రాసిన సందర్భం రేపు సినిమాలో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. నాకు అర్థమైన విధానంలోనే భాస్కరభట్ల అసలు పాట వ్రాసి ఉండొచ్చు, లేదా ఆయన ఆలోచనలు, నా ఆలోచనలు పూర్తి భిన్నంగా ఉండొచ్చు. ఈ పాట మీకు అర్థమైన విధానం వేరై ఉండొచ్చు. ఏదేమైనా ఒక పాట మంచి పాటని అనిపించినప్పుడు అందులోని మంచితనాన్ని పదిమందికి చెప్పే చిన్న ప్రయత్నమే నా ఈ విశ్లేషణ. తప్పులుంటే మన్నించండి. 🙂
ఇంత మంచి పాట వ్రాసినందుకు భాస్కరభట్లకి, ఆయనకు ఆ వీలు కల్పించి, స్వేచ్చనిచ్చిన పూరికి, చక్కగా స్వరపరించిన అనూప్ కి, హృద్యంగా పాడిన శక్తిశ్రీకి కృతజ్ఞతలు తెలుపుకుంటూ… దీన్ని ఓపికగా చదివిన మీకు ధన్యవాదాలు. 🙂
“Wayback Machine”లో ఆర్కైవ్ అయిన నవతరంగం వ్యాసం ఇక్కడ.
– యశ్వంత్ ఆలూరు
15/10/2016