సినిమా చర్చించని విషయం ఈ సమాజంలో లేదు. చర్చించే విధానంలో ఒక్కొక్కరిది ఒక్కో శైలి. ఓ సామాజిక అంశాన్ని “పూరి జగన్నాథ్” తన శైలిలో చర్చించిన సినిమా “ఇజం”. నందమూరి కళ్యాణ్‌రామ్, అదితి ఆర్య జంటగా చేసిన ఈ సినిమాకు కళ్యాణ్‌రామ్ నిర్మాత.
కథ :
మాఫియా డాన్ జావేద్ ఇబ్రహీం (జగపతిబాబు) కూతురు ఆలియా ఖాన్ (అదితి)ని ప్రేమించిన కళ్యాణ్‌రామ్ (కళ్యాణ్‌రామ్) హఠాత్తుగా వారినుండి పారిపోతాడు. అందుకు కారణమేంటి? అసలు కళ్యాణ్‌రామ్ ఎవరు? జావేద్, ఆలియాలను కలవడం వల్ల అతడికున్న ప్రయోజనమేంటి? అన్నవి కథాంశాలు.
కథనం, దర్శకత్వం – విశ్లేషణ :
పూరి ఒక్కసారి కమిట్ అయితే తన మాట తానే వినడు. ఇందుకు ఉదాహరణలే నేనింతే, టెంపర్ సినిమాలు. ఆ కమిట్మెంట్ తనకి ఎప్పుడు వస్తుందో తనకే తెలియదు. ఇందుకు ఉదాహరణలు హార్ట్ ఎటాక్, జ్యోతిలక్ష్మీ సినిమాలు. ఒక్కోసారి సగం కమిటయి సగం కమిట్ అవ్వనట్టు అనిపిస్తాడు పూరి. దీనికి లోఫర్ తరువాత మరో ఉదాహరణ ఈ సినిమా. ఆ సినిమాలాగే ఈ సినిమాను కూడా సగం మనసు పెట్టే తీసినట్టు అనిపించింది.
కథను చెప్పే విధానంలో ఒక్కో దర్శకుడిది ఒక్కో శైలి. పూరి మాత్రం కథ చెప్పడం మొదలుపెడితే ప్రేక్షకుడికి బోరు కొడుతుంది అంటాడు. అందుకే రెండు గంటల సినిమాలో దాదాపుగా మొదటి గంట గడిచాక కానీ అసలు కథేంటో చెప్పడు. కేవలం హీరో పాత్ర చిత్రణ, డైలాగులు, కామెడీ, పాటలు, ఫైట్లతో కథనాన్ని నడిపించేస్తాడు. ఆ కథనం అంతా ఏదో పూరి మాటల కోసం, అతడి హీరో కోసం చూడాల్సిందే తప్ప చాలా కృత్రిమంగా అనిపిస్తుంది. ఇందులో హీరో హీరోయిన్ల స్నేహం బలపడే ఘట్టం పూరి శైలిలోనే సాగినా అంతగా రిజిస్టర్ అవ్వదు. పైగా హార్ట్ ఎటాక్ సినిమాను గుర్తుచేసింది. ఎలాగు గంట గడిస్తే కానీ అసలు కథలోకి వెళ్ళకూడదని దర్శకుడు నిర్ణయించుకున్నాడు కనుక ఆ గంట ఏదో పాటలు, నవ్వురాని కామెడీ సీన్లు పెట్టి లాగించేశాడు. ఈమధ్యలో కరీమ్ బీడీలు బాగా ప్రచారాన్ని పొందాయి.
రెండో సగంలో దర్శకుడి పూరి కన్నా రచయిత పూరి వెలుగులోకి వచ్చాడు. గొల్లపూడి సన్నివేశం డైలాగుల వల్ల పండింది. సమాజంలోని ప్రతి అంశాన్ని చర్చించే వీలు సినిమాకు ఉంది కనుక ఈసారి జర్నలిజంను వాడుకున్నాడు పూరి. వికి లీక్స్ (Wiki Leaks) అధినేత జూలియన్ అస్సాంజ్ (Julian Assange) స్పూర్తితో, వీ ఫర్ వెన్డేటా (V for Vendetta) మాస్కుని వాడుకొని రెండో సగమంతా కథనాన్ని నడిపించాడు. అయినా కూడా ఒకట్రెండు సన్నివేశాలు మినహాయించి పెద్దగా ఆకట్టుకోలేదు ఆ ప్రయత్నం. పోస్టర్లపై సంకెళ్ళతో హీరో కనిపించడంతో ఇందులో ఒక కోర్టు సన్నివేశం ఉందన్న ఊహ ప్రతి ప్రేక్షకుడికి కలుగుతుంది. ఆ క్షణంలో టెంపర్ కోర్టు సీను గుర్తొచ్చి, దానికోసం వేచిచూసేలా చేసింది. మధ్యలో వచ్చిన “ఎలా ఎలా” పాట కూడా గుర్తింపుకు నోచుకోలేకపోయింది. అంతలా వెయిట్ చేయించిన కోర్టు సీన్ కూడా పెద్దగా మెప్పించలేకపోయింది. దీనికి పేలవమైన నేపథ్య సంగీతం కూడా కారణం. “టెంపర్” కోర్టు సీన్లో హీరో నటన, డైలాగులతో పాటు నేపథ్య సంగీతం కూడా తనవంతు సాయం అందించింది. ఇక్కడ హీరో నటన, డైలాగులే ఆ ఘట్టాన్ని నెట్టుకొచ్చాయి. ఇక ఆ తరువాత మామూలుగా ముగిసింది సినిమా.
అలా, “ఇజం” అనే ఈ సినిమా “జర్నలిజం” ఒక “పేట్రియాటిజం” అనే నిజాన్ని నిరూపించే ప్రయత్నం చేసింది కానీ అది ఒప్పించలేకపోయింది.
నటనలు :
ఈ సినిమాలో అత్యంత మార్కులు సంపాదించింది హీరో కళ్యాణ్‌రామ్. మునుపెన్నడూ లేని ఆహార్యంతో, నటనతో ఈ సినిమాలో కనిపించి మెప్పించాడు. ఈ సినిమా చూడడానికి పూరి తరువాత మరో కారణం కళ్యాణ్‌రామే. అదితి ఆర్య ఒక పూరి హీరోయిన్ మాత్రమే. జగపతిబాబు అసలు ప్రభావం చూపలేకపోయాడు. పోసాని, అలీ, వెన్నెల కిషోర్, జయప్రకాష్ రెడ్డి, శత్రు, ఈశ్వరిరావు ఇలా అందరూ మామూలే. తనికెళ్ళ భరణి, గొల్లపూడి తెరపై కనిపించింది కాసేపే అయినా ప్రభావాన్ని చూపారు.
బలాలు :
- మాటలు. పూరి దగ్గరున్న అత్యంత పదునైన ఆయుధం “మాటలు”. అవి ఈ సినిమాకు తమవంతు సాయం చేశాయి. రైతుల గురించి వ్రాసిన మాటలు ఆలోచింపచేసేలా ఉన్నాయి.
- కళ్యాణ్‌రామ్ నటన. కొత్తగా ప్రయత్నించి మెప్పించాడు.
- ముఖేష్ ఛాయాగ్రహణం. చాలా కలర్ ఫుల్ గా ఉంది.
- నిర్మాణ విలువలు. నిర్మాతగా కూడా ఈ సినిమాతో మెప్పించాడు కళ్యాణ్‌రామ్.
బలహీనతలు :
- కథనం, దర్శకత్వం. మూలకథకు వ్యాసార్థం ఎక్కువగా లేకపోవడంతో ఇవి పెద్దగా మెప్పించాలేకపోయాయి.
- నేపథ్య సంగీతం. సామాజిక అంశాల మీద తీసే ఇలాంటి సినిమాల్లో నేపథ్య సంగీతం చాలా శక్తిమంతంగా ఉండాలి. అది కరువైంది.
– యశ్వంత్ ఆలూరు
Click here for the English version of this Review…
Pingback: ISM (2016) – Film Criticism