సాహసం శ్వాసగా సాగిపో (2016)

saahasam-swasaga-sagipo-poster

అతడి సినిమా ఎప్పుడొస్తుంది?” అని ప్రేక్షకుడు ఎదురుచుసేలా చేసే దర్శకుల్లో “గౌతమ్ మేనన్” మొదటి వరసలోనే ఉంటారు. దీనికి కారణం జీవితాన్ని సినిమాగా చూపించాలనే ఆయన అభిరుచే. అదే “సూర్య సన్నాఫ్ కృష్ణన్”, “ఏ మాయ చేశావే” లాంటి సినిమాలను ప్రేక్షకుల మనస్సులో చెరగని ముద్రవేసింది. “ఏ మాయ చేశావే” తరువాత నాగచైతన్య, గౌతమ్ మేనన్ కలిసి చేసిన సినిమా “సాహసం శ్వాసగా సాగిపో“. మంజిమ మోహన్ కథానాయికగా పరిచయమైన ఈ సినిమాను “ద్వారక క్రియేషన్స్” పతాకంపై “మిర్యాల రవీందర్ రెడ్డి” నిర్మించారు.

కథ :

ఎటువంటి ప్రణాళికలు లేకుండా ఆడుతూ పాడుతూ జీవితాన్ని సాగించే ఒక వ్యక్తి (నాగచైతన్య) తన చెల్లెలి స్నేహితురాలైన లీల (మంజిమ)ను ఇష్టపడతాడు. ఇద్దరూ కలిసి బైకుపై కన్యాకుమారికి వెళతారు. ఆ ప్రయాణంలో జరిగిన ఓ సంఘటన ఆ వ్యక్తి జీవితాన్ని మార్చేస్తుంది. అదేంటి? అతడి జీవితం ఎలా మారిపోయింది? అప్పటినుండి అతడు ఎటువంటి ప్రణాళికలు వేసుకున్నాడు? అన్నవి కథాంశాలు.

కథనం, దర్శకత్వం – విశ్లేషణ :

నిజజీవితంలో మనం ఒక వ్యక్తికి గతాన్ని వివరించే సమయంలో, ఆ కథలో మనమున్న సన్నివేశాలనే చెబుతాం. కానీ సినిమాల్లో ఒక పాత్ర గతాన్ని చెబుతున్నప్పుడు ఆ పాత్ర హాజరుకాని సన్నివేశాలను కూడా అదే గతంలో చెబుతుంది. ఉదాహరణకు, “మన్మథుడు” సినిమాలో “తనికెళ్ళ భరణి” పాత్ర కథానాయకుడి గతాన్ని చెబుతుంది. ఆ గతంలో ఆ పాత్ర లేని సన్నివేశాలను (నాగార్జున-అన్షు మధ్యనున్నవి) కూడా అదే పాత్ర చెప్పడం జరుగుతుంది. ఇలాంటి తర్కాన్ని గౌతమ్ మేనన్ తన సినిమాల్లో దాదాపుగా తప్పకుండా చూసుకుంటాడు. “ఏ మాయ చేశావే” కథ, కథానాయకుడు తన గతం చెబుతున్నట్టుగా ప్రారంభమవుతుంది. అతడి గతంలోని సన్నివేశాలన్నింటిలో అతడు లేని సన్నివేశం ఉండదు. ఇదే తర్కాన్ని మేనన్ ఈ సినిమాలో కూడా పాటించారు. ఇది ప్రేక్షకుడి దృష్టికి వెళ్ళకుండా అంతర్లీనంగా జరిగినప్పటికీ, “రచన” అనే అంశం పరంగా మెచ్చుకోవాల్సిన, నేర్చుకోవాల్సిన విషయం.

ఇక ఈ సినిమా విషయానికి వస్తే, రెహమాన్ పాట వినగా వినగా చెవులకు ఎక్కినట్టు, ఈ కథనం కూడా చూడగా చూడగా ప్రేక్షకుడికి ఎక్కే రకం. దీనికి చక్కని ఛాయాగ్రహణం అదనపు బలం. ఉన్న అయిదు పాటలు మొదటి సగంలోనే వచ్చేశాయి. అన్నీ ఆడియోలో ఉన్న క్రమంలోనే రావడం గమనార్హం. మొదటి నాలుగు పాటలకు సరైన సందర్భాలున్నాయి. “చక్కోరి” పాట చిత్రీకరణ ఆకట్టుకుంది. ఇక మిగిలింది ఒక్క పాట, అదీ శ్రోతలకు బాగా నచ్చిన పాట. దీనికి సరైన సందర్భం ఎక్కడ దొరుకుతుందన్న ఆలోచనలో పడినప్పుడు ఆ పాట కథనంలో వచ్చిన సమయం ఒక కొత్త ప్రయోగమే కాకుండా, ఒక అద్భుతమైన ప్రయోగం కూడా. ఇలాంటి ప్రయోగాలు గౌతమ్ మేనన్ లాంటి దర్శకుల నుండి రావడం మరింత మంచి విషయం. దర్శకుడు ప్రేక్షకుడు నమ్మి మెచ్చే విషయాలు చెప్పేకంటే తను నమ్మి మెచ్చే విషయాలు చెబితేనే ఇలాంటి కొత్త విషయాలు కాబోయే దర్శకులకు తెలుస్తాయి. “వెళ్ళిపోమాకే” పాట వచ్చే సమయం ఆ పాటను ఈ సినిమాకే ఉత్తమ గీతంగా నిలబెట్టింది.

భారతీయ సినిమాలో ఒకే కథలో రెండు జోనర్లను చెప్పడం కూడా అరుదుగా జరిగే విషయం. మొదట్లో ఒక చక్కని ప్రేమకథను చెప్పిన దర్శకుడు అమాంతం ఒక థ్రిల్లర్ కథను చెప్పడం, ఈ రెండు కథల్లో ప్రేక్షకుడు ప్రయాణం చేసేలా అతడిని ఒప్పించడం, ఆ రెండో సగంలో ఒక్క పాటైనా అవసరమని ప్రేక్షకుడికి అనిపించకుండా చేయడం అతడి నేర్పరితనాన్ని చూపిస్తుంది.

ఇంతగా పొగుడుతున్న సినిమాలో లోపాలు కూడా లేకపోలేదు. గౌతమ్ మేనన్ సినిమా స్క్రిప్ట్ 70 శాతం పూర్తికాగానే షూటింగ్ మొదలుపెడతారు. క్లైమాక్స్ షూటింగ్ జరుగుతున్నప్పుడే వ్రాసుకుంటారు. దాంతో ఆయన సినిమాల్లో ముగింపు ఘట్టం కాస్త గందరగోళంగా అనిపిస్తుంది. ఈ సినిమా విషయంలో కూడా అదే జరిగింది. సినిమా ప్రీక్లైమాక్స్ నుండి ఏదో చూపించాలి, ఎలాగో కథను ముగించాలి అన్నట్టుగా సాగుతుంది. బహుశా, ఎటువంటి “కారణం” చెప్పకుండానే సినిమాను ముగించుంటే, “జీవితంలో మనం అనుకున్నట్టు ఏది జరగదు. ఏమి జరిగినా ఎదురుకోవాలి” అని సినిమా మొదట్లో ఆయన చెప్పిన విషయానికి న్యాయం జరిగి ఉండేది. కానీ చివరకు ఇది జీవితం కాదు, సినిమా కనుక అన్నీ అనుకున్నట్టుగానే జరగాలి, ప్రతి దానికి ఒక కారణం ఉండాలి. అదంతా ఈ సినిమాలో ఒప్పించేలా జరగలేదు.

మొత్తానికి “సాహసం శ్వాసగా సాగిపో” అనే ఈ సినిమా గౌతమ్ మేనన్ చేసిన ఒక సాహసం. గమనం మారే కథనంలో ప్రేక్షకుడిని ప్రయాణం చేయించిన తీరు కోసం, సంగీతానికి, పాటలకి కథనంలో ఇచ్చిన ప్రాముఖ్యం కోసం, ఒక కొత్త అనుభూతిని పొందడం కోసం చూడాల్సిన సినిమా.

ఈ సినిమా కథనంలో దాగున్న మరో అంశం ఒకటుంది. అదేంటో, సినిమా చూడనివారు చూసి తెలుసుకోండి, చూసినవారు ఈ ఆర్టికల్ కు కామెంట్స్ పెట్టండి.

నటనలు :

నాగచైతన్య ఈ సినిమాకు ఆయువుపట్టు. సినిమా సినిమాకు అతడు మెరుగవడం ఎంతో ఆనందించగల విషయం. “వెళ్ళిపోమాకే” పాటలో అతడి హావభావాలు చాలా బాగున్నాయి. మంజిమ మోహన్ నటన బాగుంది కానీ “గౌతమ్ మేనన్ హీరోయిన్”లా అనిపించే సన్నివేశాలు చాలా తక్కువ. బాబా సెహగల్ నటన బాగుంది. రచయిత వెన్నెలకంటి రాజేశ్వరరావు తనయుడు రాకేందు మౌళికి చెప్పుకోదగ్గ పాత్ర దక్కింది. డేనియల్ బాలాజీ, సతీష్ కృష్ణన్ లాంటివారు ఫరవాలేదు. నాగినీడుకి ముఖ్య పాత్రే లభించినా ఎక్కడా మాట్లాడే పాత్ర కాదు.

బలాలు :

  1. కథనం. జీవితాన్ని సినిమాగా మార్చడంలో గౌతమ్ మేనన్ తనను మరోసారి నిరూపించుకున్నారు.
  2. రెహమాన్ సంగీతం. ఆడియోలో వినడం కన్నా తెరపై చూసినప్పుడు పాటలు చాలా బాగా నచ్చేలా ఉన్నాయి. నేపథ్య సంగీతం కూడా సినిమాకు చాలా సాయపడింది.
  3. డాన్ మెకార్తర్ & డాని రేమండ్ ఛాయాగ్రహణం. ప్రేమకథలకు, థ్రిల్లర్ కథలకు ఛాయాగ్రహణం ఎంతో సాయపడుతుంది. ఆ రెండు కథలు ఒకే సినిమాలో ఉండడంతో ఈ ఇద్దరు తమ పనితనాన్ని బాగా చూపించారు.
  4. రాజీవన్ కళాదర్శకత్వం. ఇలాంటి సినిమాలకు సాయపడే మరో అంశం కళాదర్శకత్వం. అందులో రాజీవన్ పనితనం కూడా కనిపించింది.
  5. నాగచైతన్య నటన. చాలా పరిణితితో నటించాడు.
  6. వెళ్ళిపోమాకే పాట. దీని గురించి సినిమా చూసి తెలుసుకోండి.

బలహీనత(లు) :

  1. బలవంతంగా చొప్పించినట్టు అనిపించిన క్లైమాక్స్ సన్నివేశాలు.

ఈ చిత్రం నేర్పిన పాఠం :

జనం మెచ్చేదానికన్నా మనకు నచ్చేదాన్ని నమ్ముకుంటే మంచిది.

– యశ్వంత్ ఆలూరు

Click here for English version of this Review…

3 thoughts on “సాహసం శ్వాసగా సాగిపో (2016)

  1. Pingback: Saahasam Swaasaga Saagipo (2016) – Film Criticism

  2. last 20 mins bad.. police charcter ne main villain ga chesi heroine parents side konchem story petti unte impact undedhi.. and herro wanna be police ala training lo unnattu choopinchi unte actin part ki more depth vachi undedhi 🙂

    avunu enti aa screenplay lo inko element ??

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s