“కథకు హీరో కావాలి” అనే నిజాన్ని వదిలేసి “హీరోకి కథ కావాలి” అనే సూత్రాన్ని పాటిస్తున్న తెలుగు సినిమాకు ఆ నిజాన్ని నిరూపించడం కోసమే అప్పుడప్పుడు కొన్ని కథలు వస్తుంటాయి. ఎంత పెద్ద స్టార్ హీరో అయినా సరే కథకు లోబడే ఉంటే సినిమా ఎంత అందంగా ఉంటుందో అవి చెబుతుంటాయి. అలాంటి సినిమానే “ధృవ“. తమిళ సినిమా “తని ఒరువన్“కి రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమాను “సురేందర్రెడ్డి” దర్శకత్వం వహించగా, రాంచరణ్, రకుల్ జంటగా నటించారు. “అరవింద్ స్వామి” ప్రతినాయకుడిగా నటించారు. “గీతా ఆర్ట్స్” పతాకంపై “అల్లు అరవింద్” నిర్మించారు.
కథ :
ఏ క్రిమినల్ ని అంతం చేస్తే వందమంది క్రిమినల్స్ అంతమవుతారో అలాంటి క్రిమినల్ ని అంతం చేయాలన్న ఉద్దేశ్యంతో సిద్దార్థ్ అభిమన్యు (అరవింద్ స్వామి)ని తన శత్రువుగా ఎంచుకుంటాడు పోలీస్ అధికారి ధృవ (రాంచరణ్). అతడిని ఎలా అంతం చేశాడు? “8” అంకె వెనుకనున్న ఉద్దేశ్యం ఏమిటి? అన్న అంశాల మీద కథ సాగుతుంది.
కథనం :
సాధారణంగా, రీమేక్ సినిమా అంటే భాషకు తగ్గ మార్పులు చేయాల్సివస్తుంది. కానీ కొన్ని సినిమాలకు ఆ అవసరం పెద్దగా ఉండదు. కారణం, అవి యూనివర్సల్ కంటెంట్ తో ఉండడమే. “తని ఒరువన్” కూడా అలాంటి సినిమానే. కానీ దర్శకుడు “సురేందర్రెడ్డి” తెలుగు ప్రేక్షకుల అభిరుచి తెలిసినవాడు కనుక కొన్ని మార్పులు చేశాడు. అందులో కొన్ని మార్పులు మాతృక కంటే బాగుండడం మంచి విషయం.
ఎక్కువ హంగులు లేకుండా హీరోని పరిచయం చేయడం, అతడి పాత్రను నెలకొల్పడం తమిళంలోలాగే చేసినా, మొదటిసారి ఈ సినిమాను చూసేవారికి చాలా బాగా నచ్చుతుంది అనడంలో సందేహం లేదు. ఈ సినిమాకు విడుదల ముందు, తెలుగులో అదనంగా కామెడీని జోడించారని పలు వెబ్సైట్లు ప్రచారం చేశాయి. కానీ దర్శకుడు అలాంటి పోకడలకు పోలేదు. కథను సీరియస్ గానే డీల్ చేయడం జరిగింది. అనవసరపు పాత్రను ఒక్కటి కూడా సృష్టించలేదు. ఇది అతడు తీసుకున్న మంచి నిర్ణయం.
మార్పుల విషయానికి వస్తే, “ఏంజలీనా” పాత్రను రక్షించే ఘట్టం తమిళంలోకంటే తెలుగులోనే బాగా వచ్చింది. అందులో దర్శకుడితో పాటు వినోద్ కెమెరా, స్టంట్ మాస్టర్ పనితనం కూడా బాగా ఉపయోగపడ్డాయి. నేను తమిళ సినిమా చూసినా కూడా, విరామం వరకు ఆసక్తిగా చూశాను ఈ సినిమాను. ఇది పూర్తిగా దర్శకుడి గొప్పతనమేనని చెప్పాలి.
రెండో సగం మరింత ఆసక్తిగా సాగినా, కథనం కాస్త సాగినట్టుగా అనిపించింది. కథనంలో అసందర్భంగా పాటలను పెట్టడం సురేందర్రెడ్డి ఎప్పుడు మానేస్తాడో తెలియదు. “పరేషానురా” పాట హఠాత్తుగా వచ్చి కథనపు గమనాన్ని దెబ్బతీసింది. “నీతోనే డాన్స్” అనే పాట స్థానంలో ఈ పాటను పెట్టున్నా బాగుండేదేమో. కథకు ప్రాణమైన “రెండు” ఘట్టాలను తెలుగులో కూడా బాగా తీయడం జరిగింది. దీనికి రాంచరణ్ నటన కూడా తోడయ్యింది. హీరో హీరోయిన్ కి తన ప్రేమను తెలిపే సన్నివేశం మొదటిసారి చూసేవారికి తప్పకుండా అమితంగా నచ్చేస్తుంది. ఇది థ్రిల్లర్ సినిమా కావడంతో అన్ని అంశాలను కూలంకషంగా విశ్లేషించలేకపోతున్నాను.
తమిళంలో లేని “8” అంకెను ఈ సినిమాకు జత చేశాడు దర్శకుడు. దీన్ని వివరించిన తీరు అద్భుతంగా ఉంది. దీనికి దర్శకుడికి పూర్తి మార్కులు వేయాల్సిందే.
మొత్తానికి, “ధృవ” సినిమా తమిళ మాతృక చూసినవారికి సైతం బోరు కొట్టకుండా, మొదటిసారి చూసినవారికి సూటిగా మెదడులోకి చొచ్చుకొనిపోయే సినిమా అని మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు. సీటు చివర కూర్చొని తరువాత ఏం జరగబోతోంది అన్న ఆసక్తిని తప్పకుండా కలిగించే సినిమా ఇది. కనుక, ఆలస్యం చేయకుండా త్వరగా మీ సీట్లు బుక్ చేసుకోండి.
నటనలు :
రాంచరణ్ “ఆరంజ్” తరువాత పూర్తిగా మనసుపెట్టి చేసిన సినిమా ఇదేననిపించింది. సినిమా కోసం అతడు పడ్డ శ్రమ ప్రతి సన్నివేశంలో కనిపించింది. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలకన్నా ఇలాంటివే తనకు బాగా నప్పుతాయని ఆరంజ్ తరువాత మళ్ళీ నిరూపించాడు చరణ్. రకుల్ పాత్రకు సరైన న్యాయమే జరిగింది. తమిళంలో “తని ఒరువన్” అంతటి విజయం సాధించడానికి అరవింద్ స్వామి నటనే కారణం. అందుకే, తెలుగులోనూ ఆయననే తీసుకోవడం జరిగింది. మళ్ళీ తన నటనతో సినిమాకు ప్రాణం పోశారు. నవదీప్ కు చాలా ముఖ్యమైన పాత్ర దొరికింది. పోసాని, నాజర్, సాయాజీ షిండే, ఇలా అందరూ తమ పాత్రలకు న్యాయం చేశారు.
బలాలు :
- కథ, కథనం, దర్శకత్వం. “మోహన్ రాజా” వ్రాసిన కథలోని ఆత్మను దెబ్బతీయకుండా దర్శకుడు “సురేందర్రెడ్డి” తనదైన శైలిలో ఈ సినిమాను తెరకెక్కించాడు. కొన్ని ఘట్టాలు తమిళంలోకంటే తెలుగులోనే బాగా చేశారు.
- పి.ఎస్.వినోద్ ఛాయాగ్రహణం. సినిమాకు ఇది మరో బలం. నీలం రంగు షేడ్ లో సినిమా మొత్తాన్ని తీసిన విధానం అద్భుతంగా ఉంది.
- హిప్ హాప్ తమిళ సంగీతం. పాటలు వినడానికి కొత్తగా ఉన్నాయి. నేపథ్య సంగీతం సినిమాకు ప్రాణం పోసింది. అరవింద్ స్వామి పాత్రకు తమిళంలో వచ్చే నేపథ్య సంగీతమే వాడడం చాలా బాగుంది.
- రాంచరణ్ నటన. మనసుపెట్టి చేశాడని ప్రతి సన్నివేశంలో కనిపించింది. ఇలాంటి “అండర్ ప్లే” క్యారెక్టర్లు తను బాగా చేయగలడని చూపించాడు.
- నిర్మాణ విలువలు. తమిళంలో 20కొట్లలో తీసిన ఈ సినిమాను ఇక్కడ రాజీపడకుండా తీశారు నిర్మాత అల్లు అరవింద్.
బలహీనత(లు) :
- అసందర్భ గీతాలు.
ఈ చిత్రం నేర్పిన పాఠం :
సినిమాలోనున్న స్టార్స్ అందరినీ మించిన స్టార్ “కథ”. ఇది నిజం.
– యశ్వంత్ ఆలూరు