“భావోద్వేగాలను రెచ్చగొడితే మిగిలేది చరిత్రే“. మహాభారతం కాలం నుండి అనేక కథల్లో ఉన్న నీతి ఇది. అన్నీ తెలిసి కూడా ఆగలేని భావోద్వేగం కట్టలు తెంచుకొని విరుచుకుపడిన ప్రతిసారీ ఒక కథ చరిత్ర పుటల్లోకి ఎక్కుతూనే ఉంటుంది. అలాంటి కొన్ని పుటలు “రాంగోపాల్ వర్మ” చేతికి దొరుకుతూనే ఉంటాయి. వాటిని అతడు సినిమాలుగా తీస్తూనేవుంటాడు. అలాంటి ఒక పుటే “వంగవీటి“. ఈ సినిమాను “దాసరి కిరణ్ కుమార్” నిర్మించగా సందీప్ కుమార్, వంశీ చాగంటి, కౌటిల్య, నైన గంగూలీ, శ్రీతేజ్ ముఖ్యపాత్రలను పోషించారు.
కథ :
విజయవాడ రౌడీ మరియు రాజకీయ చరిత్రలలో తమదైన ముద్రను వేసిన వంగవీటి సోదరులు వంగవీటి రాధ (సందీప్), వంగవీటి రంగ (సందీప్)ల జీవితాలు, వారికి ఎదురొచ్చిన మనుషులు, పరిస్థితులే ఈ సినిమా కథాంశాలు.
కథనం, దర్శకత్వం – విశ్లేషణ :
ముందుగా, బయోపిక్ లు తీయడంలో వర్మ ప్రత్యేకతను గురించి చెప్పుకోవాలి. సాధారణంగా వచ్చే బయోపిక్లలో ముఖ్య పాత్ర కోణంలోంచే కథ నడుస్తుంది. ఆ పాత్ర నమ్మిన సిద్ధాంతమే మంచిదనిపిస్తుంది. కానీ వర్మ “మంచి, చెడు అనేవి ప్రత్యేకంగా లేవు. మనకు నచ్చిందే మంచి, నచ్చనిది చెడు” అంటాడు. తాను తీసే బయోపిక్స్ లో కూడా ఇదే సిద్ధాంతాన్ని చూపిస్తాడు. వాటిలో ఎవరు మంచి, ఎవరు చెడ్డ అని ప్రేక్షకుడు ఒక నిర్ధారణకు రాలేడు. ఉదాహరణకు, “రక్తచరిత్ర”లో రవి, సూరిల ఉద్దేశ్యాలలో ఎవరివి మంచివని అడిగితే నిర్ధారించుకోవడం కాస్త కష్టమే. ఇద్దరూ మంచివారు కాదు. అలాగని చెడ్దవారూ కాదు. తమకు నచ్చింది మంచని నమ్మి చేశారంతే. ఇదే పోకడను వర్మ తన “వంగవీటి”లోనూ అనుసరించాడు. అలాంటి పాత్ర తత్వాలతో ఒప్పించే తీరు వర్మకే చెల్లింది.
“వంగవీటి”లోని ప్రతీ హత్య వెనుకవున్న ఉద్దేశ్యం ప్రేరేపితాలే. దీని వెనుక వర్మ ఉద్దేశ్యం మనస్సాక్షిని నమ్మి అడుగేయడానికి, ఇంకొకరి మాటలు విని రెచ్చిపోయి అడుగువేయడానికి గల తేడాను చూపించడమే అనిపించింది. రక్తచరిత్ర కంటే ఇందులోని హత్యలను మరింత సహజంగా చూపించాడు వర్మ. అది అందరికీ రుచించదు. ఇదే మాట వర్మతో అంటే, “నా ఇష్టం! మీకు నచ్చితే చూడండి లేదంటే లేదు!” అని ముఖం మీదే చెప్పేస్తాడు.
“గాంధీ చొక్కా విప్పేసినా, అంబేద్కర్ కోటు వేసుకున్నా, వాటి వెనుకనున్న ఉద్దేశం రాజకీయమే!” అని “కబాలి” సినిమాలో ఒక డైలాగు ఉంది. ఆ మాటను నిరూపించేలా ఒక పాత్ర ఉంది ఈ సినిమాలో. అదే, సీనియర్ పార్టీ నాయకుడు “రాజు గారు“. ఆ పాత్ర చిత్రణలో వర్మ శైలి కొట్టొచ్చినట్లు కనిపించింది. ఇవే కాకుండా, కొన్ని షాట్స్ లోనూ వర్మ సంతకం కనిపించింది. ఉదాహరణకు, రాధను చంపే సన్నివేశంలో దుర్గాదేవి బొమ్మ క్రింద పడే షాట్, దేవినేని మురళీ హత్య ఘట్టంలో లారీలోకి ఆయుధాలు విసిరే షాట్. కొన్ని షాట్స్ మాత్రం ఎప్పటిలాగే అతి నెమ్మదిగా సాగాయి.
రక్తచరిత్రలో విసుగెత్తించిన వర్మ వాయిస్ ఓవర్ ఈ సినిమాలో రంజింపజేయడం గమనార్హం. ఆ వాయిస్ ఓవరుకు వ్రాసిన మాటలు చాలా బాగున్నాయి. దానితో సరిపెట్టకుండా మంచి సాహిత్యం కలిగిన పాటలను వర్మ తన గొంతులో వినిపించడం, అవి కూడా వెంటవెంటనే రావడం అనేకసార్లు ఇబ్బంది పెట్టింది. “మరణం ఇది తథ్యం” అనే పాటలోని సాహిత్యం ఉత్తమమైనది. ఒకప్పటి వర్మ అయ్యుంటే ఆ పాటను ఓ మంచి గాయకుడితో పాడించి ఉండేవాడు. ఈమధ్య సంగీతాన్ని ఏమాత్రం పట్టించుకోని వర్మ ఈ విషయాన్ని ఏమి పట్టించుకుంటాడు?
“రక్తచరిత్ర” లాగే ఈ సినిమాలో కూడా కొన్ని నిజాలను మార్చి తీశాడన్న మాటలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా, తాను ఇచ్చిన మాట మీద నిలబడనని చెప్పిన వర్మ ఇదే తెలుగులో తన ఆఖరి సినిమా అని మాటిచ్చాడు. అది నిజమైతే అతడికి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. కాదని మళ్ళీ ధియేటరులో అతడి పేరు కనబడితే ఆ సినిమా కూడా చూస్తాను. ఎందుకంటే… అతడు “రాంగోపాల్ వర్మ“. సినీదర్శకుడు కాదు, సినీశకం.
నటులు :
బయోపిక్లు తీయడంలో ముఖ్య అంశం నటుల ఎంపిక. అందులో వర్మ ఎప్పుడూ మిగతా దర్శకులకంటే పది అడుగులు ముందే ఉంటాడు. రాధ, రంగ పాత్రలను పోషించిన సందీప్ చూడడానికి నిజజీవితపు మనుషుల్లాగే ఉన్నాడు. నటన కూడా చాలా నిబద్ధతతో చేశాడు. ఉదాహరణే, రంగ పెళ్ళి సమయంలో వచ్చే పాట. అందులో అతడి ఆహార్యం పాత్రకు గౌరవాన్ని తెచ్చింది. “హ్యాపీడేస్”లో శంకర్ గా కనిపించిన వంశీ చాగంటికి మళ్ళీ ఈ సినిమాలో పూర్తిస్థాయి పాత్ర దొరికింది. వాక్చాతుర్యం కలిగిన అతితక్కువ యువనటులలో ఇతడు ముందంజలో ఉంటాడు. దేవినేని మురళీలాగే కనిపిస్తూ, నటనతో కూడా ప్రభావం చూపించాడు. ఉదాహరణ, రత్నకుమారితో ఫోనులో మాట్లాడే సన్నివేశం. గాంధీ పాత్రను పోషించిన కౌటిల్య, నెహ్రు పాత్ర చేసిన శ్రీతేజ్ ఆయా పాత్రలకు సరిగ్గా సరిపోయారు. రత్నకుమారి పాత్రలో నైన గంగూలీ అందంగా ఉంది.
బలాలు :
- పాత్రల చిత్రణ. ఏ పాత్ర మంచిది కాదు, అలాగని చెడ్డదీ కాదు. ఇది ప్రేక్షకుడు ఒప్పుకోక తప్పదు.
- నటనలు. ముఖ్య పాత్రలను పోషించిన అందరు నటులు ఆయా పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.
- వర్మ వాయిస్ ఓవర్. సినిమాలో బాగా రంజింపజేసిన విషయం ఇదే.
- సాహిత్యం. వర్మ గొంతులో వినడం మన కర్మ. కానీ సాహిత్యం అద్భుతంగా ఉండడం విశేషం.
బలహీనతలు :
- వర్మ గానం.
- నేపథ్య సంగీతం. కొన్ని సన్నివేశాల్లో కావాల్సిన దానికన్నా ఎక్కువగా వినిపించి ఇబ్బందిపెట్టింది.
– యశ్వంత్ ఆలూరు