గీతను భగవంతుడు భోదించాడు కనుకే అది “భగవద్గీత” అయ్యింది. అదే మనిషి చెప్పుంటే అది ఓ మామూలు గీతగా మిగిలిపోయి ఉండేది. అంటే, మంచి విషయాన్ని బలహీనుడు చెబితే అది మామూలు విషయం అవుతుంది. అదే ఓ బలవంతుడు చెబితే శాసనం అవుతుంది. దర్శకుడు “క్రిష్” కూడా ఇదే సూత్రాన్ని పాటిస్తాడు తన సినిమాల్లో. కేవలం మంచి కథలుంటే ఉంటే సరిపోదు. ఆ మంచి అందరికీ చేరాలి అంటే అంత బలమున్న వ్యక్తి చేత దాన్ని చెప్పించాలి. అప్పుడే దానికి విలువ కూడా ఉంటుంది అంటాడు. తనవద్దనున్న “గౌతమిపుత్ర శాతకర్ణి” అనే కథను “నందమూరి బాలకృష్ణ” అనే బలవంతుడు ద్వారా చెప్పాడు. శ్రియ కథానాయికగా, హేమమాలిని ముఖ్యపాత్రను పోషించిన ఈ సినిమాను “ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్” పతాకంపై “రాజీవ్ రెడ్డి“, “సాయిబాబు” నిర్మించారు.
కథ :
చిన్న చిన్న రాజ్యాలుగా ముక్కలయిన అఖండ భరత ఖండాన్ని ఒక గొడుగు క్రిందకి తీసుకొనివచ్చి ఇకపై యుద్ధాలే లేకుండా చేస్తానని, తల్లి చేతి గోరుముద్దలు తినే ఓ అయిదేళ్ళ రాకుమారుడు ఆ తల్లికి మాటిస్తాడు. అతడే తరువాత శాతకర్ణి మహారాజు (బాలకృష్ణ)గా పట్టాభిషిక్తుడు అవుతాడు. తన తల్లి గౌతమి బాల (హేమమాలిని)కి ఇచ్చిన మాటను నిలుపుకొని అతడు “గౌతమిపుత్ర శాతకర్ణి”గా ఎలా చరిత్రలో నిలిచాడో చెప్పే కథే ఈ సినిమా కథ.
కథనం, దర్శకత్వం – విశ్లేషణ :
“గౌతమిపుత్ర శాతకర్ణి” గురించి మాట్లాడుకునే ముందుగా “అంజనాపుత్ర క్రిష్” గురించి మాట్లాడుకోవాలి. ఇతడు తీసిన సినిమాను మళ్ళీ తీయలేదు. కానీ ఇతడు తెలుగులో తీసిన ప్రతీ సినిమాలో అంతర్లీనంగా ఉన్న కథాంశం ఒకటే. అదే “జాతీయ సమైక్యత“. ఒకరికొకరు సాయపడుతూ భూమ్మీదనున్న మనుషులు ఎలాంటి విభేదాలు లేకుండా బ్రతకాలని తన “గమ్యం” నుండి ఇప్పటివరకు చెబుతూనే వచ్చాడు. ఒకే మాటను ఒకసారి చెప్పినట్టుగా ఇంకోసారి చెప్పలేదు. సినిమాలు తీయడం అతడి కలే కావచ్చు కానీ సినిమా సమజానికి ఉపయోగపడేలా కూడా ఉండాలనే అతడి సంస్కారానికి “సాహో” అనాల్సిందే.
ఇక ఈ సినిమా విషయానికి వస్తే, శాతకర్ణి గురించిన చరిత్ర ఎక్కువగా అందుబాటులో లేదని వినికిడి. అయినప్పటికీ, అనేక పరిశోధనలు చేసి శాతకర్ణి జీవితగాథను సేకరించి, దానికి కాస్త కల్పనను జోడించి, ఇది చరిత్రలో జరిగిన కథేనా, లేక సినిమా కోసమే శాతకర్ణిని సృష్టించారా అనిపించేలా చేసిన దర్శకుడి కష్టం సినిమాలోని ప్రతీ సన్నివేశంలో కనిపించింది. ఇలా అనడానికి కారణం, “మీరు శాంతిని ఉపదేశిస్తున్నారు, నేను అశాంతిని ఉపసంహరిస్తున్నాను. మీరు వెలుగుని వెతుకుతున్నారు, నేను చీకటిని చంపి దాన్ని సృష్టిస్తునాను” అని శాతకర్ణి బౌద్ధ గురువులతో అన్నప్పుడు అతడు “గౌతమిపుత్ర శాతకర్ణి” నుండి “క్రిష్ పుత్ర శాతకర్ణి“గా మారిపోయినట్టు అనిపించడం. శాతకర్ణి గురించి మనం వినలేదు, చదవలేదు కనుక మనకు తెలిసింది క్రిష్ మాత్రమే కనుక ఇలా అనిపించడంలో తప్పులేదు.
“అవతార పురుషుడైనా అణువంతే పుడతాడు” అని “సీతారామశాస్త్రి” గారు ఓ పాటలో వ్రాసిన మాటను “శాతకర్ణి” క్రీస్తుకుపూర్వమే నిరూపించాడు. “తండ్రిని మించిన కొడుకులుంటారు కానీ తల్లిని మించిన కొడుకులుంటారా? ఉంటే చెప్పండి, అగ్రతాంబూలం అతడికే ఇస్తాను” అని శాతకర్ణి అన్నప్పుడు ఆనందంతో కంటతడి పెట్టని తల్లి, తల్లిని గుర్తుచేసుకోని కొడుకు ఉంటారా? ఇక్కడే క్రిష్ సంతకం ఉంది. ఆ సంతకాన్ని తన కలంతో మరింత బలపరిచారు “సాయిమాధవ్ బుర్రా“.
నిజజీవితంలో శాతకర్ణి ఎన్ని యుద్ధాలు చేశాడో తెలియదు కానీ క్రిష్ మాత్రం తన శాతకర్ణితో మూడు యుద్ధాలు చేయించాడు. అందులో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది రెండోదైన, భారతదేశాన్ని ఒక గొడుగు క్రిందకి తెచ్చిన, నాహపాణుడి (కబీర్ బేడి)తో చేసిన యుద్ధం. బుర్రా, స్టంట్ మాస్టర్స్ “రామ్-లక్ష్మణ్“, ఛాయాగ్రాహకుడు “జ్ఞానశేఖర్” మరియు సంగీత దర్శకుడు “చిరంతన్ భట్“ల సాయంతో ఈ ఘట్టాన్ని అద్భుతంగా తెరకెక్కించాడు క్రిష్.
కేవలం శాతకర్ణి పరాక్రమంపైనే దృష్టి సారించక అతడి వ్యక్తిగత జీవితాన్ని చూపించిన తీరు కూడా చాలా బాగుంది. శాతకర్ణి – వాసిష్టి (శ్రియ)ల దాంపత్యాన్ని హృద్యంగా చూపించాడు దర్శకుడు. నేనేమి తక్కువ తిన్నానా అన్నట్టుగా బుర్రా గారు “కన్నీళ్ళకు మనసు పుట్టినిల్లు, కళ్ళు అత్తారిల్లు” అనే మాటలు వ్రాసి రెచ్చిపోయారు. కానీ, వాసిష్టిదేవికి శాతకర్ణి గొప్పతనం తెలిపే సన్నివేశాన్ని మాత్రం చాలా తేలికగా తెల్చేశారనిపించింది. తల్లికి అగ్రతాంబూలం ఇచ్చే సన్నివేశంలోలాగే ఇక్కడ కూడా అంతే లోతైన భావోద్వేగాలను స్పృశించి ఉంటే బాగుండేది. “మృగనయన” పాట విన్నప్పుడు హత్తుకున్నంతగా చూసినప్పుడు ఆకట్టుకోలేకపోయింది.
కాస్త నీరసించిన కథనంలోకి “ఇది అయిదేళ్ళ బాలుడు కళ్ళు తెరిచి కన్న కల…” అని శాతకర్ణి వాసిష్టితో చెప్పే సన్నివేశం రావడం, దానివెనకే “సాహో సార్వభౌమ” అనే పాట రావడం క్రిష్ శైలిని ప్రతిబింబించింది. ఇక్కడి నుండి కథనం ఎక్కడా వెనుదిరిగి చూసుకోలేదు. అసలే కాక మీదున్న కథనానికి బుర్రా గారు మళ్ళీ “చీమ-సింహం” కథను జోడించి మరింత వేడిని పెంచారు. ఆ వేడిని శాతకర్ణి చివరి యుద్ధం చేసేవరకు తగ్గకుండా చూసుకుంటూ, “స్వర్గాన్నే సాధించే విజేత నువ్వే…సాహో సార్వభౌమ” అనే పాటను మళ్ళీ అందుకొని దాన్ని కళ్ళలోంచి పొంగించే ప్రయత్నం చేశాడు క్రిష్.
అలా, తన “గౌతమిపుత్ర శాతకర్ణి”తో రాజ్యాలతో పాటు ప్రేక్షకుడి గుండెను కూడా గెలుచుకున్నాడు “అంజనాపుత్ర క్రిష్“.
మాటలు :
త్రివిక్రమ్ తరువాత మాటలు అంత బలంగా వ్రాసే రచయిత “సాయిమాధవ్ బుర్రా“. ఈ సినిమాకు క్రిష్, బాలయ్య ఎంత బలాన్నిచ్చారో, బుర్రా కూడా అంతే ఇచ్చారు. ఆయన రచనా పటిమను తెలిపే కొన్ని మాటలు…
- తండ్రిని మించిన కొడుకులుంటారు కానీ తల్లిని మించిన కొడుకులుంటారా?
- మీరు శాంతిని ఉపదేశిస్తున్నారు, నేను అశాంతిని ఉపసంహరిస్తున్నాను. మీరు వెలుగుని వెతుకుతున్నారు, నేను చీకటిని చంపి దాన్ని సృష్టిస్తునాను.
- కన్నీళ్ళకు మనసు పుట్టినిల్లు, కళ్ళు అత్తారిల్లు.
- ప్రసవ వేదన పడే తల్లి అరుపులు ఎవరికీ అక్కర్లేదు. పుట్టాక బిడ్డ ఏడుపే అందరికీ ముఖ్యం.
- తల వంచకు. అది నేను గెలిచిన తల. అది నాది.
- ఓడించా… మారలేదు. క్షమించా… మారలేదు. వధించా… ఇక మారాల్సిన అవసరంలేదు.
- బడుగు జాతి కాదు… తెలుగు జాతి. అథములం కాదు… ప్రథములం.
నటనలు :
నందమూరి బాలకృష్ణ :
క్రిష్ ను ఎంత పొగిడినా బాలకృష్ణ లేకపోతే “గౌతమిపుత్ర శాతకర్ణి” లేదన్నది ఖచ్చితంగా ఒప్పుకోవాల్సిన నిజం. కేవలం కథుంటే సరిపోదు, ఆ పిల్లి మెడలో గంటను కట్టేవారు కూడా కావాలని క్రిష్ పలుసార్లు చెప్పాడు. ఈ కథను ప్రపంచానికి చెప్పే సామర్థ్యం బాలయ్యకే ఉందన్న క్రిష్ నమ్మకానికి నూటికి రెండొందల శాతం న్యాయం చేశారు బాలయ్య. పైన చెప్పుకున్న నాహపాణుడి యుద్ధంలో, ఇదివరకే ఒక యుద్ధంలో గెలుపొందిన పొగరుని, ఈ యుద్ధంలో బలమైన శతృవు ఎదురుదెబ్బను చవిచూసినప్పుడు కలిగే నిరుత్సాహాన్ని, ఎలాగైనా గెలిచి తీరాలన్న ఉక్రోశాన్ని ఒకే ఘట్టంలో చూపించాలి. ఆ సామర్థ్యం “బాలకృష్ణ”కు ఉందని నమ్మే క్రిష్ ఈ సినిమా కోసం బాలయ్యను ఒప్పించాడు. నమ్మినట్టుగానే, “ధిక్… కోటగోడను బద్దలుకొట్టి వస్తున్నా” అని పొగరుని, “మన వారధిని కూల్చేయి” అని నిరుత్సాహాన్ని, గుర్రంతో పాటు కోటలోకి దూకినప్పుడు ఉక్రోశాన్ని సమపాళ్ళలో ప్రదర్శించిన బాలయ్య, యుద్ధంలో గెలిచాక చెప్పిన సంభాషణలో పలికించిన గర్వాన్ని చూస్తే ఆయన శాతకర్ణిగా నటించలేదు, పరకాయ ప్రవేశం చేశాడనిపించింది. దీనికి ముందు “ఎకిమీడ” పాటలో 99 సినిమాలు చేసిన బాలకృష్ణలా కాకుండా క్రిష్ సినిమాలో హీరోగా చేసిన బాలకృష్ణలా కనిపించడం దర్శకుడిని నమ్మడంలో ఆయనకున్న క్రమశిక్షణను తెలిపింది. ఇంతేకాదు, చివర్లో గ్రీకు సైన్యపు రాయబారితోనున్న సన్నివేశంలో ఆయన అభినయం ఎంతో అభినందనీయం.
మిగతా నటులు :
శాతకర్ణి తల్లిగా హేమమాలిని చాలా హుందాగా కనిపించారు. వాసిష్టిదేవిగా శ్రియ సరైన ఎంపికగా అనిపించింది. “ఒక బిడ్డ కడుపులో ఉన్నప్పుడు యుద్ధానికి వెళ్ళారు. ఇప్పుడు సరాసరి ఇంకో బిడ్డను యుద్ధానికే తీసుకొని వెళ్తున్నారు” అనే సన్నివేశంలో మరియు శాతకర్ణి చివరి యుద్ధానికి వెళ్ళే సన్నివేశంలో చాలా బాగా చేసింది. చాలారోజుల తరువాత ఒకప్పటి హీరో శివకృష్ణ గారిని ఓ ప్రాముఖ్యమైన పాత్రలో చూడడం జరిగింది. తనికెళ్ళ భరణి, శుభలేఖ సుధాకర్ తమ పాత్రలకు సరిపోయారు. ప్రతినాయకులుగా నటించిన కబీర్ బేడి, మిళింద్ గునోజి, గ్రీకు రాజుల పాత్రలు వేసిన నటులు ఇలా అందరూ పాత్రలకు సరిగ్గా సరిపోయారు. శాతకర్ణి కథను హరికథగా చెప్పే పాత్రలో కన్నడ సూపర్ స్టార్ “శివ రాజకుమార్” కనిపించారు.
బలాలు :
- క్రిష్ కథ, కథనం, దర్శకత్వం.
- సాయిమాధవ్ బుర్రా మాటలు.
- చిరంతన్ భట్ట సంగీతం. పాటలు చాలా బాగా ఇచ్చాడు చిరంతన్. నేపథ్య సంగీతంలో మరో కీరవాణిలా అనిపించాడు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.
- జ్ఞానశేఖర్ ఛాయాగ్రహణం.
- సీతారామశాస్త్రి సాహిత్యం. సినిమాకు మరో వెన్నెముక. శృంగారంలో కూడా మహారాజులోని దర్పం, మహారాణికున్న గర్వాన్ని సున్నితమైన వాక్యాల్లో “మృగనయన” పాటలో పలికించిన తీరు శాస్త్రిగారికే చెల్లింది. అలాగే, మరుగునపడిపోయిన “ఎకిమీడ” అనే పదంతో పాటను అందుకోవడం కూడా ఆయనకే చెల్లింది.
- రామ్-లక్ష్మణ్ పోరాటాలు.
- నిర్మాణ విలువలు. శాతకర్ణిని క్రిష్ ఎంతగా ప్రేమించాడో అంతే ప్రేమించారు నిర్మాతలు సాయిబాబు, రాజీవ్ రెడ్డి.
- బాలకృష్ణ నటన.
- నిడివి. ఇలాంటి సినిమాను కేవలం 135 నిమిషాల్లో ముగించడం దర్శకుడి నేర్పరితనం మరియు స్పష్టతను తెలుపుతుంది.
బలహీనత(లు) :
- ఆడియో, వీడియోల మధ్యనున్న సింక్. పాటల్లో కొన్నిచోట్ల ఇది తప్పింది. ఆడియో ముందుగా వచ్చి, వీడియో తరువాత వచ్చిన సందర్భాలున్నాయి.
ఈ చిత్రం నేర్పిన పాఠం :
చేతిలో మంచి కథుంటే సరిపోదు. దాన్ని ఎవరి ద్వారా ప్రపంచానికి చెప్పాలో కూడా తెలియాలి. ఏది ఏమైనా నమ్మిన సిద్ధాంతం మీదే వెళ్ళాలి.
బాలయ్య గురించి మరికొంత :
ఎంత చెప్పినా బాలయ్య గురించి ఇంకాస్త చెప్పాలనిపిస్తోంది. యాక్షన్ సినిమాలు, ఫ్యాక్షన్ సినిమాలు ఎన్ని చేసినా, జయాపజయాలు ఎన్నున్నా తెలుగు సినీ చరిత్రలో ఎప్పటికీ చెప్పుకునే అరుదైన సినిమాలు కొన్ని బాలయ్య నుండే వచ్చాయి. “ఆదిత్య 369”, “భైరవద్వీపం”, “శ్రీరామరాజ్యం”, ఇప్పుడు “గౌతమిపుత్ర శాతకర్ణి”. ఇవన్నీ బాలయ్య పూనుకోకపోతే రాని సినిమాలు. వీటిలో బాలయ్యను తప్ప మరొకరిని ఊహించుకోవడానికి కూడా కష్టమే. ఎన్టీఆర్ తరువాత పౌరాణికి సినిమాలు తీయాలంటే దర్శకుల మదిలో మొదట మెదిలేది బాలయ్యే. ఇప్పటి వయోజనులకు “రాముడు”, “కృష్ణుడు” అంటే “ఎన్టీఆర్” గుర్తుకు వస్తారు. రాబోయే తరాలకు “బాలకృష్ణ” వస్తారు. ఇది నిజం. 40ఏళ్ళ అనుభవమున్నా దర్శకుడి మాటనే అనుసరించి చేయడం బాలయ్య నిబద్ధతకు నిదర్శనం. అందుకే “సాహో బసవరామతారక పుత్ర బాలకృష్ణ!“.
– యశ్వంత్ ఆలూరు