“ఎవరైనా చూసుంటారా నడిచే నక్షత్రాన్ని, ఎదురొస్తే ఎగబడిపోరా నేనే ఆ చిత్రాన్ని…” ఇది అక్షరాల “మెగాస్టార్ చిరంజీవి” అంటే. “ఖైదీ” సినిమాతో ప్రేక్షకుల గుండెల్లో ఖైదీ అయిపోయిన చిరంజీవి కొన్ని సంవత్సరాల తరువాత చేసిన సినిమా “ఖైదీ నంబర్ 150“. “వి.వి.వినాయక్” దర్శకుడిగా, “రాంచరణ్” నిర్మాతగా, కాజల్ కథానాయికగా “కొణిదెల ప్రొడక్షన్స్” పతాకంపై తెరకెక్కిన ఈ సినిమా తమిళంలో “విజయ్” కథానాయకుడిగా “మురుగదాస్” దర్శకత్వంలో తెరకెక్కిన “కత్తి” సినిమాకు రీమేక్.
కథ :
కలకత్తా జైలు నుండి తప్పించుకొని హైదరాబాదుకి వచ్చిన ఆ జైలు ఖైదీ నంబర్ 150 కత్తి శ్రీను (చిరంజీవి) పోలీసులకు దొరకకుండా ఉండడం కోసం తనలాగే ఉండే శంకర్ (చిరంజీవి) అనే వ్యక్తి స్థానంలోకి వెళతాడు. అసలు శంకర్ ఎవరు? ఆ స్థానంలోకి వెళ్ళిన శ్రీనుకి ఎటువంటి సవాళ్లు, సమస్యలు ఎదురయ్యాయి? అవి అతడి జీవితాన్ని ఎలా మార్చేశాయి? అన్నవి కథాంశాలు.
కథనం – దర్శకత్వం :
ఒక భాషలో తీసిన సినిమాను మరో భాషలో తీయడం ఎప్పటికీ తప్పుకాదు. ప్రతీ భాషకో సంస్కృతి ఉన్న మన దేశంలో, ఒక సినిమాను ఒక భాష నుండి మరో భాషకు తీసుకొనివెళ్ళాల్సి వచ్చినప్పుడు భాషతో పాటు దాని సంస్కృతిని కూడా మార్చాల్సిన అవసరం ఏర్పడుతుంది. ఆ సంస్కృతిని మూలకథతో ఎలా అనుసంధానం చేశారన్నది రీమేక్ సినిమాలో అతి ముఖ్యమైన విషయం.
ఇక “కత్తి”ని “ఖైదీ…”గా రీమేక్ చేసిన విషయానికి వస్తే, ఇక్కడి భాష “తెలుగు”, సంస్కృతి “చిరంజీవి”. పైగా, మెగాస్టార్ ముఖానికి పదేళ్ళ తరువాత రంగుని అద్దిన కథ కనుక అది ఆయనకు సరిపోయేలా ఉండాలన్న ఉద్దేశ్యంతో పలు మార్పులు చేశాడు దర్శకుడు “వినాయక్”. మొదటి సగమంతా దాదాపుగా చిరంజీవిని ప్రేక్షకులకి తిరిగి పరిచయం చేయడంపైనే దృష్టి సారించాడు. దానికి నిదర్శనమే “రత్తాలు” పాట. వినడానికి సాహిత్యం, సంగీతం ఎలా ఉన్నా, చిరంజీవి డాన్స్, ఛాయాగ్రాహకుడు “రత్నవేలు” పుణ్యమాని ఈ పాట అలరించింది. అందులో “వీణ” స్టెప్ మళ్ళీ వేయించి కన్నులకు ఆనందం కలిగించినందుకు “లారెన్స్“కి అభినందనలు తెలపాలి. దర్శకుడు ఇంకాస్త చనువు తీసుకొని తెలుగు ప్రేక్షకులను నవ్వించడానికి “బ్రహ్మానందం”, “రఘుబాబు” పాత్రలను సృష్టించాడు. మూలకథలో స్థలం ఉంది కనుకే చేసిన పని ఇది. బ్రహ్మనందం పాత్ర, దానితో చిరంజీవి చేసిన అల్లరి పనులు ఏ స్థాయిలో అలరించింది అనే విషయం అనవసరం.
ముఖ్యమైన ఘట్టాలను యథాతధంగా ఉంచేశాడు దర్శకుడు. ఇది అభినందనీయం. నిజానికి, వినాయక్ భావోద్వేగాలను బాగా పండించగలడు. ఫలితం ఎలా ఉన్నా, “యోగి” సినిమాలో భావోద్వేగాలను స్పృశించిన విధానం చాలా బాగుంటుంది. ఈ కథలో ఆ అవకాశం ఇంకా ఎక్కువగా ఉంది. అయినప్పటికీ, శంకర్ కథను తేలికగా తేల్చేశాడు వినాయక్. తెరపై చిరంజీవి ఉన్నా కూడా కొన్ని సన్నివేశాలు కృత్రిమంగా అనిపించాయి. బహుశా, వినాయక్ చిరుని జనాలకు మళ్ళీ పరిచయం చేసే క్రమంలో ఆయన ఆహార్యం, డాన్సులు, పోరాటాలపైనే దృష్టి పెట్టి ఆయన అసలు ప్రతిభ అయిన “నటన“పై దృష్టి సారించలేదేమో. చిరుని మెగాస్టార్ చేసింది ముందుగా ఆయన నటన, తరువాతే ఇవన్నీ అని మర్చిపోయాడేమో. ఏది ఏమైనా, శ్రీను పాత్రకి వహించిన శ్రద్ధ, కథకు అతి ముఖ్యమైన “శంకర్” పాత్ర పట్ల వహించలేదు వినాయక్. మంచి సాహితీ విలువలతో “రామజోగయ్య శాస్త్రి“గారు వ్రాసిన “నీరు నీరు” పాటకి కూడా పూర్తిగా న్యాయం జరగలేదనిపించింది.
విరామ ఘట్టం మాత్రం చిరంజీవి అభిమానులకు పండగలా ఉంటుంది. దేవీశ్రీప్రసాద్ స్వరపరిచిన ఏ పాటా వినసొంపుగా లేకపోగా, ఆ పాటలకు సందర్భం కల్పించడానికి దర్శకుడు చాలా శ్రమను తీసుకున్నాడు అనిపించింది. ఉదాహరణే, “పోసాని” ఉన్న సన్నివేశం. నిజానికి ఇది అయోమయంలో పడేసే ఘట్టం. ఒక శక్తివంతమైన విరామం తరువాత ప్రేక్షకులకు ఉపశమనం కలిగించాలంటే ఒక పాట కావాలి, దానికో సందర్భం కావాలి అనుకున్నాడేమో దర్శకుడు. అందుకే ఎప్పుడో వదిలేసిన ఒక తోకను మళ్ళీ లాగి ఆ సన్నివేశం వ్రాసుకున్నాడు. ఆ తరువాత వచ్చే మెలోడి పాటనైనా కేవలం హీరోహీరోయిన్లపై చిత్రీకరించకుండా ఆడంబరానికి వెళ్ళాడు. అది ఆకట్టుకోలేకపోయింది.
ఈ సినిమాలో మెచ్చుకోవాల్సిన ఓ ఘట్టం “ప్రీక్లైమాక్స్ లో వచ్చే ప్రెస్ మీట్“. ఇందుకుగాను రచయితలు “సాయిమాధవ్ బుర్రా“, “వేమారెడ్డి“లను మెచ్చుకోవాలి. ఈ సన్నివేశానికి వ్రాసిన మాటలు చాలా బాగున్నాయి. అవి చిరు గొంతులోంచి వచ్చి అద్భుతాలుగా మారాయి. “భోజనం చేశాక అన్నదాత సుఖీభవ అంటాం. అన్నదాత అంటే వండేవాడో, వడ్డించేవాడో కాదు. దాన్ని పండించేవాడు” లాంటి మాటలు గుండెను హత్తుకునేలా వ్రాశారు సదరు రచయితలు.
నిక్కచ్చిగా ఒక విషయం మాట్లాడుకోవాలి. “కత్తి” సినిమాలో ఖైదీ పాత్ర చివర్లో ఎవరికీ తెలియకుండా కనుమరుగైపోతుంది. సాయం చేయడానికి వచ్చిన పాత్ర కర్తవ్యాన్ని ముగించుకొని వెళ్ళిపోవడంలో ఎంతో అర్థం ఉంది, భావోద్వేగం ఉంది. కానీ ఇక్కడ దాన్ని మార్చడం ఏమాత్రం రుచించలేదు. కేవలం వ్యాపారం కోసం ఆడిన “సేఫ్ గేమ్“లా అనిపించింది. “చిరంజీవి” అలా వెళ్ళిపోవడమేంటి అనుకుంటే, “స్నేహంకోసం” సినిమాలో చిరంజీవి పాత్ర కథానుగుణంగా ప్రాణాలే విడిచేస్తుంది. ఇలా చేస్తే అభిమానులు ఒప్పుకోరు అన్నది ఇంకా ఎంతవరకు నమ్మశక్యమో దర్శకులు ఆలోచించాలి.
ఏది ఏమైనా, “ఖైదీ నంబర్ 150” కేవలం చిరంజీవిని పరిచయం చేసిన సినిమా, ఆయన నటించిన సినిమా కాదు. భవిష్యత్తులో ఆయన “నటించే” సినిమాలు వస్తాయి. పదేళ్ళు వేచిచూసిన మనం ఇంకొన్నాళ్ళు వేచి చూడలేమా? చిరంజీవి అంటే అభిమానం కాదు, అలవాటు.
మిగతా నటులు :
కథానాయికకు మాతృకలోనూ, తెలుగులోనూ ప్రాధాన్యం లేదు. కనుక కాజల్ గురించి మాట్లాడుకోవాల్సిన అవసరంలేదు. ప్రతినాయకుడిగా తరుణ్ అరోరా చూడడానికి బాగున్నా నటన ఆకట్టుకోలేదు. బ్రహ్మానందం, అలీ, రఘుబాబు మామూలే. ముఖ్య పాత్రలు పోషించిన వృద్ధులు అందరూ ఫరవాలేదు.
బలాలు :
- చిరంజీవి. ఆహార్యం, నృత్యాలు, పోరాటాలు.
- రత్నవేలు ఛాయాగ్రహణం. చిరుని అంత అందంగా చూపించడంలో ఇతడి నేర్పరితనం బాగా కనపడింది.
- మాటలు. బుర్రా, వేమారెడ్డిలను మాటల విషయంలో అభినందించాలి.
- నిర్మాణ విలువలు. నిర్మాణాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నిర్మాత రాంచరణ్ ఎక్కడా రాజీపడలేదు.
బలహీనతలు :
- కథనం, దర్శకత్వం.
- దేవీశ్రీప్రసాద్ సంగీతం. పాటలు, నేపథ్య సంగీతం ఏమాత్రం ఆకట్టుకోలేదు.
ఈ చిత్రం నేర్పిన పాఠం :
“కథానాయకుడు” అంటే కథను నడిపించేవాడు కానీ కథకంటే ముందు నడిచేవాడు కాదు.
– యశ్వంత్ ఆలూరు