ఓం నమో వేంకటేశాయ (2017)

om-namo-venkatesaya

రాఘవేంద్రరావు-భారవి-కీరవాణి-నాగార్జునల కలయిక అంటే ముందుగా “అన్నమయ్య” అనే ఓ ఆణిముత్యం గురుతుకువస్తుంది. తరువాత “శ్రీరామదాసు” అనే ఓ విజయం. ఇప్పడు వీరి కలయికలో వచ్చింది “ఓం నమో వేంకటేశాయ” అనే మరో భక్తిరస చిత్రం. దర్శకేంద్రుడి చివరి సినిమాగా చెప్పబడుతున్న ఈ సినిమాలో అనుష్క, ప్రగ్యా జైస్వాల్ ముఖ్య పాత్రలు పోషించగా “సౌరభ్ జైన్” వేంకటేశ్వరుడిగా నటించారు. “సాయి కృప ఎంటర్టైన్మెంట్స్” పతాకంపై “మహేష్ రెడ్డి” నిర్మించారు.

కథ :

తిరుమల వేంకటేశ్వరుడి (సౌరభ్ జైన్)కున్న అనేక భక్తుల్లో ఒకరైన హాథీరాం బావాజీ (నాగార్జున) జీవిత చరిత్ర ఈ సినిమా కథాంశం.

కథనం, దర్శకత్వం – విశ్లేషణ :

పూర్తిగా అందుబాటులో లేని చరిత్రను సినిమాగా తీయాలన్నప్పుడు కల్పితానికి చాలా చోటు ఉంటుంది. కానీ కల్పితాన్ని కూడా నిజంగా జరిగిందని చెప్పడంలోనే దర్శకరచయితల గొప్పతనముంది. రచయిత భారవి, దర్శకుడు రాఘవేంద్రరావు ఆ విషయంలో ఉత్తీర్ణులయ్యారని చెప్పాలి. మెచ్చుకోదగిన ఇంకో విషయమేమిటంటే, ఇది భక్తిరస సినిమా అయినప్పటికీ, కథనం పోకడను గమనిస్తే ఒక కమర్షియల్ సినిమా కథనంలా తీర్చిదిద్దారు. సినిమాలో పాటలను ప్రవేశపెట్టిన సందర్భాలు, కథానాయకుడు ప్రతినాయకులపై విసిరే సవాళ్లు, ఇలా అన్ని విషయాలు ఒక కమర్షియల్ సినిమాలో ఎక్కడ, ఎప్పుడు ఉండాలో అలాగే ఉండేలా చూసుకున్నారు.

సినిమా మాములుగానే మొదలైనా, భారవి గారు అక్కడక్కడ తన మాటలతో మెప్పించారు. అంతలోనే దర్శకేంద్రుడు “ఆనందం” పాటతో తన శైలిని చూపించారు. అందులో వేసిన సెట్ ఎప్పటిలాగే అందంగా ఉంది. ముందుగా చెప్పినట్టుగా భక్తిరసం మీదే ఎక్కువ దృష్టి పెట్టిన దర్శకుడు త్వరగా అసలు కథలోకి వెళ్ళిపోయారు. అక్కడక్కడ నవ్వురాని హాస్యరసం ఉన్నప్పటికీ దాన్ని త్వరగా కత్తిరించేశారు. కీరవాణి సాయంతో మెల్లమెల్లగా భక్తిరసం మోతాదు పెంచుకుంటూ, “అఖిలాండకోటి బ్రహ్మాండనాయక” పాటతో కథనాన్ని ఉచ్చస్థాయికి తీసుకెళ్ళిపోయారు. ఇక్కడ కీరవాణి గారి రీరికార్డింగుని మెచ్చుకోవాలి. పాటలో వచ్చే “నీకోసం విరిసే, నిను చూసి మురిసే, నీ మేను తాకి మెరిసే…” అనే చోట వెనుక “గోవింద” అనే పదాన్ని వినిపించిన తీరు పాటను, ఆ ఘట్టాన్ని మరో స్థాయికి చేర్చిందని చెప్పాలి.

ఒక మంచి అనుభూతితో విరామం ఇచ్చిన దర్శకేంద్రుడు రెండో సగం మొదలుకాగానే మళ్ళీ తన శైలిలోకి వెళ్ళడం, భోజనాన్ని ఆస్వాదించడం మొదలెట్టగానే బియ్యంలోని రాయి పంటి క్రింద పడినట్టు అనిపించింది. ఆడియో విన్నప్పుడే “ఆనందం“, “వయ్యారి కలహంసిక” పాటలు రాఘవేంద్రరావు-కీరవాణిల రక్తిరసమైన కలయికను గుర్తుచేశాయి. మొదటి దానికి ఓ సరైన సందర్భం ఉందిలే అనుకుంటే, రెండో దానికి సందర్భం లేకపోగా, దాన్ని అనుష్కపై చిత్రీకరించడం అసలు సరికాదనిపించింది. అప్పటివరకు పరమ భక్తురాలిగా కనిపించిన కృష్ణమ్మ (అనుష్క)ను ఈ పాటకు నర్తించమంటే ఒప్పుకోదు కనుక, దర్శకేంద్రుడు ఓ పాత్రను ఊహించుకొని, ఆ పాత్ర ద్వారా కృష్ణమ్మ నర్తిస్తున్నట్టు ఊహించుకున్నాడు. నిన్న కాక మొన్న వచ్చిన ప్రగ్యాను తన మార్క్ హీరోయినుగా చూపించిన దర్శకేంద్రుడు టాప్ హీరోయిన్ అయిన అనుష్కపై కూడా ఆ మార్క్ వేయాలన్న ఉద్దేశ్యంతో అవసరం లేకపోయినా ఈ పాటను బలవంతంగా చొప్పించినట్టు అనిపించింది. అందుకు జగపతిబాబుని వాడుకోవడం అన్యాయం. ఇక ఆ పాటలో నర్తించడానికి అనుష్క పడిన బాధ వర్ణనాతీతం.

ఇది వదిలేస్తే, తరువాతి కథనం నిమిష నిమిషానికి తన స్థాయిని పెంచుకుంటూ పోయింది. అందుకు నాంది పలికింది రామజోగయ్యశాస్త్రి వ్రాసిన “కమనీయం” పాట. “అప్పనై ఈనాడు అప్పగించేనయా… లోకాలకప్పడగు వేంకటాద్రీశుడా…” అని ఎంత ఆర్థ్రతతో శాస్త్రి వ్రాశారో అంతకంటే ఎక్కువ ఆర్థ్రతతో బాలుగారు ఆలపించారు. వీరివురి కృషికి తెరపై సంపూర్ణమైన న్యాయం చేశారు నాగార్జున. “సృష్టి రక్షణలోనే దృష్టి సారించక, ఇష్ట సఖులను కూడా ఇంపుగా చూడవయ్యా…” అని మోకరిల్లడం ఈ పాటను సినిమాకే ఉత్తమ ఘట్టంగా నిలబెట్టింది.

ఇలాంటి భక్తుల చరిత్రలన్నీ చివరికి వైరాగ్యంతోనే ముగిసిపోతాయి. కానీ ఒక్కొక్కరికి ఒక్కోలా కలుగుతుందది. “అన్నమయ్య”ను తీసుకుంటే మొదట్లో అన్నీ ఉండి, అవి ఒక్కొక్కటిగా దూరమై వైరాగ్య శిఖరాలను అధిరోహించాడు. హాథీరాం బావాజీ ఏమి లేకుండా మొదలై ఒక్కొక్కటిగా సంపాదించుకుంటూ, చివరికి అవి ఎక్కువైపోయి వైరాగ్యంలోకి వెళ్ళిపోయాడు. ఈ సినిమాలో తిరుమల గురించి, అక్కడి దేవుడికి చేసే అనేక సేవల గురించి వివరించిన దర్శకరచయితలు ఆ దేవుడు తన భక్తులను ఎలా పరీక్షిస్తున్నాడో కూడా చాలా హృద్యంగా చెప్పారు. ఆడే ప్రతి ఆటలో భక్తుడే గెలవడం, చివర్లో తనతోనే ఉండమని దేవుడు అతడి వెంటపడడం, “పరీక్ష పెట్టే పరమాత్ముడికే ఎంతటి విషమ పరీక్ష…” అనే అనంతశ్రీరాం పాటను విన్నప్పుడు దేవుడి మీద జాలి కలుగుతుంది. కానీ, నిజానికి జాలి కలగాల్సింది భక్తుడి మీద! “అన్నమయ్య” పతాక ఘట్టంలో “నటన సూత్రధారి… ఇంకా ఈ దేహంపై మోహం ఉందా, పోయిందా అని పరీక్షిస్తున్నావ్ కదూ గోవిందా?” అనే మాటను ఈ సినిమాలో దృశ్యరూపంలో చూపించాడు దర్శకుడు. ఆ సినిమాలో మాటలతో నడిచిన కథనాన్ని ఇందులో దృశ్యరూపంగా నడిపించిన  రచయిత భారవిని అభినందించాలి. “అన్నమయ్య” కంటే గొప్ప క్లైమాక్స్ ఉండదని, దాన్ని చెడగొట్టకూడదని అనుకున్నారట సినిమాకి ముందు. నిజమే! అందుకే, అన్నమయ్య లాంటి క్లైమాక్స్ నే మరో రూపంలో చాలా అద్భుతంగా చెప్పారు దర్శకరచయితలు ఈ సినిమాలో.

అలా, “ఓం నమో వేంకటేశాయ” అనే ఈ సినిమా రాఘవేంద్రరావు-భారవి-కీరవాణి-నాగార్జునల కలయికలో వచ్చిన “అన్నమయ్య” అంత గొప్ప సినిమా కాకపోవచ్చు కానీ నిజాయితిగా తీసిన ఒక మంచి భక్తి సినిమా. నావరకు “అన్నమయ్య” కి తక్కువ, “శ్రీరామదాసు” కి ఎక్కువ ఈ సినిమా.

నటనలు :

భక్తిరస సినిమాలు చేసినప్పుడు నాగార్జునని నాగేశ్వరరావు గారితో పోల్చకూడదు. ఎందుకంటే, నాగేశ్వరరావు గారు స్వతహాగా నాస్తికులు. అయినప్పటికీ “విప్రనారాయణ” లాంటి సినిమాలు చూసినప్పుడు “ఈయన నిజంగానే నాస్తికుడా?” అనిపించేలా చేశారు. నాగార్జున ఆస్తికుడు. ఇలాంటి భక్తి సినిమాలు చూసినప్పుడు “ఈయనలో ఇంత గొప్ప భక్తుడు ఉన్నాడా?” అనిపించేలా చేస్తారు. రెండింటికి చాలా వ్యత్యాసం ఉంది. ఎప్పటిలాగే, హాథీరాం పాత్రలో నాగార్జున జీవించారు. అందుకు ఉదాహరణలు, “అఖిలాండ కోటి బ్రహ్మాండనాయక“, “కమనీయం” మరియు “పరీక్ష” పాటలు.

అనుష్క కృష్ణమ్మగా సరిపోయింది. కానీ బరువు ఎక్కువగా ఉండడం వల్లనో ఏమో డాన్స్ లకు ఇబ్బందిపడినట్టు అనిపించింది. ప్రగ్యా జైస్వాల్ పోషించిన “భవాని” పాత్ర చరిత్రలో ఉంది. ఉన్నది తక్కువ సేపే అయినా చాలా గౌరవనీయమైన పాత్ర. జగపతిబాబుకి అన్యాయం జరిగింది ఈ సినిమాలో. ఇంతకంటే చెప్పదలచలేదు. హాథీరాం గురువు అనుభవానంద స్వామిగా సాయికుమార్ సరిపోయారు.

తనికెళ్ళ భరణి, రావురమేష్, సంపత్, వెన్నెల కిషోర్, రఘుబాబు, పవిత్ర లోకేష్, బ్రహ్మానందం, పృథ్విరాజ్, సుధ ఇలా అందరూ ఉన్నారు. బాహుబలి ప్రభాకర్ ఓ చిన్న పాత్రలో కనిపించాడు.

చివరగా చెబుతున్నది ముఖ్యమైన నటుడు గురించి. అతడే “సౌరభ్ జైన్“. వేంకటేశ్వరుడిగా సరిగ్గా సరిపోయాడు. ముఖంలోని తేజస్సు, వయసు అతడిలో దైవత్వాన్ని ఉట్టిపడేలా చేశాయి. దేవేరులుగా చేసిన విమలారామన్, అస్మిత కూడా సరిగ్గా సరిపోయారు. గరుత్మంతుడుగా అజయ్ చాలా కొత్తగా అనిపించాడు.

బలాలు :

  1. భారవి కథ, కథనం. మాటలకన్నా దృశ్యంపైనే ఈసారి ఎక్కువగా దృష్టి పెట్టారు భారవి. కథనం పోకడ చాలా బాగుంది.
  2. కీరవాణి సంగీతం. దీని గురించి ఎంత చెప్పినా తక్కువే. సినిమా అన్నమయ్య స్థాయిలో లేకపోవచ్చు కానీ సంగీతం అదే స్థాయిలో ఉంది. అయినప్పటికీ, ఎక్కడా అన్నమయ్యను గుర్తుచేయకపోవడం అభినందనీయం. నేపథ్య సంగీతంతో కూడా సినిమాను తారాస్థాయికి తీసుకొనివెళ్ళారు కీరవాణి. “అఖిలాండ కోటి బ్రహ్మాండనాయక”, “కమనీయం” మరియు “పరీక్ష” పాటలు కొన్ని సంవత్సారాలు వెంటాడతాయి. అలాగే, “మహా పద్మ సద్మే”, “గోవిందా హరి గోవిందా” కూడా చాలా బాగున్నాయి.
  3. సాహిత్యం. వేదవ్యాస్ గారే దాదాపు పాటలకు రచన చేశారు. చంద్రబోస్ వ్రాసిన “ఆనందం”, శివశక్తి దత్తా వ్రాసిన “వయ్యారి కలహంసిక” పూర్తిగా రాఘవేంద్రరావు శైలిలో ఉన్న పాటలు. రామజోగయ్యశాస్త్రి వ్రాసిన “కమనీయం” అన్నింటిలోకి ఉత్తమమైనది. అనంతశ్రీరం వ్రాసిన “పరీక్ష” పాట భావోద్వేగపూరితమైనది.
  4. గోపాలరెడ్డి ఛాయాగ్రహణం. చాలా అద్భుతంగా ఉంది. సినిమాలోని ఏ ఫ్రేములో కూడా నాణ్యత లోపించలేదు.
  5. కిరణ్ కుమార్ కళాదర్శకత్వం. ఇతడు వేసిన తిరుమల సెట్ ఆనాటి కాలాన్ని ప్రతిబింబిస్తూ నిజమైన తిరుమలలా ఉంది.
  6. నాగార్జున నటన.
  7. నిర్మాణ విలువలు. నిర్మాత మహేష్ రెడ్డి ఈ సినిమాను ఎంతో నిజాయితిగా తీశారు.

బలహీనతలు :

  1. రాఘవేంద్రరావు శైలి రక్తిరస గీతాలు.

– యశ్వంత్ ఆలూరు

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s