ఆద్యంతం ఒకే అంశంపై సాగే సినిమాలు హాలీవుడ్ లో అతి సహజం. భారతదేశంలో అరుదు. ఒకవేళ తీయలనుకుంటే వ్యాపార లెక్కలు, ప్రేక్షకుల అభిరుచి, వీటిని బట్టి సినిమాకు ఎదురయ్యే ఆర్ధిక ఇబ్బందులు, ఇలా ఎన్నో అంశాలను మనసులో ఉంచుకోవాలి. మంచి విషయమేమిటంటే, ప్రేక్షకుల అభిరుచి మారిపోతోంది. మూస సినిమాలకన్నా కొత్తరకం సినిమాలకు ఆదరణ పెరుగుతోంది. దానికి తగ్గట్టుగా నటులు, నిర్మాతలు కూడా మారుతున్నారు. కొత్త దర్శకులను, సరికొత్త ఆలోచనలను ప్రోత్సహిస్తున్నారు. ఇలాంటి మంచి తరుణంలో వచ్చిన సినిమా “ఘాజీ“. “సంకల్ప్ రెడ్డి” దర్శకుడిగా పరిచయమైన ఈ సినిమాలో రానా, కె.కె.మేనన్, ఓం పురి, అతుల్ కులకర్ణి, సత్యదేవ్, రవివర్మ, తాప్సీ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. తెలుగు, హిందీ భాషల్లో తీయబడిన ఈ సినిమాను తెలుగులో “మ్యాటినీ ఎంటర్టైన్మెంట్స్“, “పీవీపీ సినిమా” సంస్థలు నిర్మించాయి.
కథ :
1971లో భారతదేశంపై రహస్య దాడి చేయాలనుకున్న పాకిస్థాన్ తమ జలాంతర్గామి “ఘాజీ“ని పంపింది. అది తెలుసుకున్న భారతదేశ నావికాదళం రన్వీర్ సింగ్ (కె.కె.మేనన్), అర్జున్ వర్మ (రానా)ల నేతృత్వంలో “S21” అనే జలాంతర్గామిని పంపింది. S21 ఘాజీని ఎలా ఎదుర్కొందన్నది ఈ సినిమా కథాంశం.
కథనం, దర్శకత్వం – విశ్లేషణ :
నిజానికి ఇది ఒక షార్ట్ ఫిలింగా తీయాలనుకున్న కథ. దర్శకుడి అదృష్టం, పరిశ్రమ అదృష్టం, ప్రేక్షకుడి అదృష్టం ఇలా అన్నీ కలిసొచ్చి ఒక ఫీచర్ ఫిలింగా మారింది. వెనుక పెద్ద నిర్మాణ సంస్థలు, చేతిలో మంచి నటులున్నా, ఇలాంటి కథలను ప్రేక్షకులకు చెప్పే విధానం అన్నింటికన్నా బాగుండాలి. అప్పుడే అందరికి సరైన న్యాయం జరుగుతుంది. దర్శకుడు సంకల్ప్ ఆ విషయంలో చాలా శ్రమించాడు. అతడికి తోడుగా “గుణ్ణం గంగరాజు” లాంటి మేధావులున్నారు. ఎవరికీ తెలియని కథని, తరువాత ఏమవుతుందో తెలుసుకోవాలన్న కుతూహలాన్ని ప్రేక్షకుడికి కలిగించేలా చెప్పిన వీరికి ముందుగా అభినందనలు తెలుపుకోవాలి.
ఈ సినిమా నిడివి 123 నిమిషాలు. “రాహుల్ ద్రావిడ్” తీసుకునే ధూమపానం క్లాస్ రెండుసార్లు వచ్చి కనీసం ఒక అయిదు నిమిషాలైనా తినేస్తుంది. ఈ లెక్కన సినిమా నిడివి రెండు గంటలకన్నా కూడా తక్కువే. కారణం, దర్శకుడు ఎక్కడా వేరే విషయాలు చర్చించకుండా కేవలం తను చెప్పాలనుకున్న కథపైనే దృష్టి సారించడం. ఇలాంటి కథలకు ఇలాంటి కథనమే అవసరం.
“మన్మధుడు” సినిమాలో ఒక డైలాగు ఉంటుంది… “పని చేస్తుంటే ఆటోమేటిక్ గా వాళ్ళే పరిచయం అవుతారు. పరిచయాల కోసం పనులు మానక్కర్లేదు!” అని. ఈ సినిమా కథ ప్రకారం కథనం అంతా జలాంతర్గామిలోనే జరగుతుంది. ఇందులో కనిపించే నటులందరూ నేవీ ఆఫీసర్లు కనుక వారి మాటలన్నీ ఆ పరిభాషలోనే ఉంటాయి. వారి పని జలాంతర్గామిని నడపడమే కనుక దానిలోని పలు పరికరాలను ఉపయోగిస్తారు. ఏ పరికరం ఎలా పనిచేస్తుందో ఒక సగటు ప్రేక్షకుడికి తెలియదు. అయితే, ప్రయాణం మొదలయ్యే ముందు ప్రతి పరికరాన్ని ప్రేక్షకుడికి పరిచయం చేసి, దాని ఉపయోగాన్ని తెలిపి ఆ తరువాత అసలు కథలోకి వెళ్ళడం తెలుగు సినిమాలో తరచుగా కనబడే తంతు. ఇలాంటి అదనపు పనులేమి పెట్టుకోకుండా దర్శకుడు నేరుగా కథను చెప్పడం ప్రారంభించాడు. నేవీ దళంతో పాటు ప్రేక్షకుడు కూడా ఆ జలాంతర్గామిలో ప్రయాణించేలా చేశాడు. ఆ ప్రయాణంలోనే ఆ పరికరాల గురించి, వాటి పనితనం గురించి ప్రేక్షకుడికి తెలిసిపోతుంది. హాలీవుడ్ సినిమాలు ఇలాగే ఉంటాయి. దర్శకుడు కూడా అదే పోకడను అనుసరించాడు.
సినిమాలో కొన్ని అంశాలను గమనిస్తే సంకల్ప్ కి ఇది నిజంగా మొదటి సినిమానా అనిపించేలా ఉన్నాయి. ఉదాహరణకు, జలాంతర్గామి నీటిలో మునిగే షాట్స్ మరియు పైకి తేలే షాట్స్, ఘాజీ చేసే దాడులనుండి “S21” తప్పించుకునే సన్నివేశాలు. ఇంకా బాగా మెచ్చుకోదగిన విషయమేమిటంటే, ఇది రెండు దేశాలకు సంబంధించిన సినిమా. మరో దేశం “పాకిస్థాన్“. ఓ మామూలు దర్శకుడు అయితే అడుగడుగునా భారతదేశం గొప్పతనం గురించి చూసే భారతీయ ప్రేక్షకులకు నేరుగా చెబుతాడు. ఇందులోనూ చెప్పాడు దర్శకుడు. కానీ అది నేరుగా ప్రేక్షకులకు కాదు. శత్రువుపై విజయం సాధించినప్పుడు ఓ సైనికుడికి కలిగే విజయగర్వం, ఆ సమయంలో అతడు చేసే కవాతులను చూపించాడు. తద్వారా ప్రేక్షకుడిలోని దేశభక్తి నరాలను స్పృశించాడు. ఇవన్నీ ఈ సినిమాలోని “డైరెక్టర్ మూమెంట్స్” అని చెప్పొచ్చు.
అంతే, ఇంకా ఎక్కువగా ఈ సినిమా గురించి చెప్పడం భావ్యం కాదు. చదివి తెలుసుకునే విషయాలకన్నా చూసి అనుభవించాల్సిన ఘట్టాలే ఎక్కువగా ఉన్నాయి ఈ సినిమాలో. మూస సినిమాల వల్ల విసిగిపోయి కొత్తదనం కోరుకునే ప్రతి ప్రేక్షకుడు తప్పకుండా చూడవలసిన సినిమా “ఘాజీ“. పరిశ్రమకు మంచిరోజులు రావాలని కోరుకోవడంతోనే సరిపోదు. ఇలాంటి సినిమాలు వచ్చినప్పుడు వాటిని ఆదరిస్తే మరిన్ని మంచి సినిమాలు, సృజనాత్మక దర్శకులు పరిశ్రమకు వస్తారు. అప్పుడే నిజమైన మంచిరోజులు వచ్చినట్టు పరిశ్రమకు.
నటనలు :
రానాకు ఈ సినిమా మంచి మైలురాయి. పరిమితమైన భావోద్వేగాలు పలికించే పాత్రలో ఒదిగిపోయాడు. భారతదేశంలోని అత్యుత్తమ నటులలో కె.కె.మేనన్ ఒకరు. ఆయనకు సరైన పాత్ర దొరికింది. అందులో ఎలా నటించారో చెప్పడం అనవసరం. అతుల్ కులకర్ణి కూడా పాత్రలో ఒదిగిపోయాడు. ఓం పురి, నాజర్ లకు గౌరవనీయమైన పాత్రలు దక్కాయి. తాప్సీ పాత్రకు పెద్దగా ఆస్కారం లేదు.
వీరితోపాటు ఈ సినిమాలో ప్రతిభావంతులు కొంతమంది ఉన్నారు. మొదటగా చెప్పుకోవాల్సింది సత్యదేవ్ గురించి. కొందరు నటులు కళ్ళతో ఆకట్టుకోగలరు. కొందరు మాటలతో ఆకట్టుకోగలరు. రెండింటితో ఆకట్టుకోగలిగే నటులు అతికొద్దిమందే ఉంటారు. అలాంటి ఈతరం తెలుగు నటుల్లో ఖచ్చితంగా సత్యదేవ్ ఒకడు. నా రాత అతిశయోక్తి అనిపిస్తే సినిమా చూడండి. మీకే తెలుస్తుంది. “పెళ్ళిచూపులు”లో నవ్వించిన ప్రియదర్శి కూడా తనలోని భావోద్వేగపు కోణాన్ని చూపించాడు చేతిలో జాతీయజెండా పట్టుకున్న ఓ సన్నివేశంలో. అలాగే, రవివర్మ, లక్ష్మణ్ మీసాల, భరత్ రెడ్డి, తిరువీర్ ఇలా ప్రతిభావంతులైన నటులు కూడా ఉన్నారు.
బలాలు :
- సంకల్ప్ రెడ్డి కథ, కథనం, దర్శకత్వం. “కథనం”లో “గుణ్ణం గంగరాజు” గారికి కూడా భాగం ఉంది.
- మది ఛాయాగ్రహణం.
- శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్. ఒక విపత్కర సమయంలో పలువురి భావోద్వేగాలను చూపించాల్సిన అవసరమున్న సినిమా ఇది. దీనికి ఎడిటింగ్ చాలా ముఖ్యం.
- కృష్ణకుమార్ సంగీతం. పాటలు అవసరంలేదు. నేపథ్య సంగీతంతో తనవంతు ప్రాణం పోశాడు ఈయన.
- శివరామ్ కళాదర్శకత్వం. జలాంతర్గామి సెట్ ని అద్భుతంగా నిర్మించారు.
- నిర్మాణ విలువలు. ఎంతటి మహత్తరమైన సినిమా అయినా నిర్మాత పూనుకోకపోతే రూపుదిద్దుకోదు. “క్షణం” తరువాత కొత్త దర్శకుడిని ప్రోత్సహించి పీవీపీ సంస్థ మరోసారి తన అభిరుచిని చాటింది. నాణ్యత విషయంలో ఎక్కడా రాజీపడలేదు నిర్మాతలు.
ఈ చిత్రం నేర్పిన పాఠం :
దర్శకుడు తాను నమ్మింది చేయాలి.
– యశ్వంత్ ఆలూరు
Click here for the English version of this Review…
Pingback: The Ghazi Attack (2017) – Film Criticism