నిత్యం ప్రేక్షకులను గమనించుకుంటూ, వాళ్ళ ఆలోచనల వేగంతో తమ ఆలోచనల వేగాన్ని సరితూచుకుంటూ వెళ్ళే దర్శకులు అధికంగా ఉన్న పరిశ్రమ మనది. అలా కాకుండా, తమకు నచ్చిన వేగంతో ప్రయాణిస్తూ తమకు వచ్చింది తమకు నచ్చినట్టుగా చెప్పుకుంటూ వెళ్ళే దర్శకులకు ప్రేక్షకుడే తమ దారిలో పరిచయమవుతాడు, ప్రభావితుడవుతాడు. అప్పటి నుండి, ఆ దర్శకుడు తన ప్రయాణాన్ని మొదలుపెట్టిన ప్రతిసారీ ఆ దర్శకుడితో ప్రయాణించడానికి తపించిపోతాడు. ఒక ప్రయాణం నిరాశపరిచినా కూడా మరో ప్రయాణం కోసం ఎదురుచూస్తాడు. అలాంటి దర్శకుల్లో “మణిరత్నం” ఖచ్చితంగా ముందువరసలో ఉంటారు.
రెండేళ్ళ క్రితం “ఒకే బంగారం” అన్న ఆ మణిరత్నం ఇప్పుడు “చెలియా” అంటూ వచ్చారు. కార్తి, అదితి రావు హైదరి జంటగా నటించిన ఈ సినిమాకు మణి చిరకాల మిత్రుడు “రెహమాన్” సంగీతం అందించారు. తెలుగులో ఈ సినిమాను “శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్” పై “దిల్ రాజు” అందించారు.
కథ :
కార్గిల్ యుద్ధంలో యుద్ధ ఖైదిగా పాకిస్థాన్ కారాగారంలో ఉన్న వరుణ్ (కార్తి), తన ప్రేయసి లీలాని (అదితి) తలచుకుంటూ ఎలాగైనా ఆమెని తిరిగి కలవడానికి చేసే ప్రయత్నమే ఈ సినిమా కథాంశం.
కథనం, దర్శకత్వం – విశ్లేషణ :
“కంచె” సినిమాలో “యుద్ధంలో కూడా ప్రేమ ఉంది. ఎక్కడైనా ప్రేమ యుద్ధంలానే ఉంటుంది” అనే మాటను ఇందులో దృశ్యరూపంలో చూపించారు మణిరత్నం. ఇందులోని వరుణ్, లీలా పాత్రలు భిన్న ధ్రువాలు. ఫైటర్ పైలట్ అయిన వరుణ్ ఆలోచనలు విధ్వంసం వైపు నడిస్తే, డాక్టర్ అయిన లీలా ఆలోచనలు ధ్వంసమైపోతున్న ఆశలను (ప్రాణాలను) బ్రతికించే దిశగా నడుస్తాయి. విధ్వంసాన్ని సృష్టించే అబ్బాయి, ప్రేమను ఆశించే అమ్మాయి ఒక్కటైతే ఎలా ఉంటుందన్న ఆలోచనతో ఈ కథను తెరకెక్కించాడు దర్శకుడు.
విడివిడిగా పాత్రల స్వభావాలను నెలకొల్పిన విధానం బాగుంది కానీ ఇద్దరూ కలిసున్నప్పుడు వారి మధ్యనున్న యుద్ధాన్ని (ప్రేమ) మాత్రం సరిగ్గా నెలకొల్పలేకపోయాడు దర్శకుడు. ఆ ఇద్దరూ ఒకరి భావాలను మరొకరితో పంచుకోవడంలో బాగా తడబడ్డారు. అంతగా ప్రేమించిన లీలాను వరుణ్ ప్రతిసారి బాధపెట్టి దూరం చేసుకోవడానికి అతడికున్న సాకేంటో, అసలు వరుణ్ తనని అణచివేస్తున్నాడని లీలా భావించడానికి గల కారణమేంటో ప్రేక్షకుడికి సరిగ్గా అర్థంకాదు. ఇలా కాదు సర్వశక్తులను కేంద్రీకరించి మణిరత్నంతో కలిసి ప్రయాణం చేసి, అసలు వాళ్ళ గొడవేంటో తెలుసుకోవాలనుకునే ప్రేక్షకుడిని కెమరామెన్ “రవివర్మన్“, సంగీత దర్శకుడు “రెహమాన్” ఆద్యంతం ప్రక్కదారి పట్టిస్తూనే ఉంటారు. అప్పుడు మణిని వదిలేసి, వీరిద్దరికీ “సాహో” అన్న ప్రేక్షకుడి పరిస్థితి అగమ్యగోచరంగా మారిపోతుంది. ఏది ఏమైనా, పాటలను చిత్రీకరించిన విధానం ఎప్పటిలాగే అద్భుతంగా ఉంది. అందులోనూ, “అల్లై అల్లై” పాటను నేపథ్యంలో ఏమాత్రం సంగీతం లేకుండా వినిపించిన విధానం సినిమాకు దీన్ని ఉత్తమ గీతంగా నిలబెట్టింది. దీనికి శబ్దగ్రహణం కూడా ఓ కారణం.
పైన చెప్పుకున్నట్టుగా, మణిరత్నం తనకు నచ్చినట్టుగా ప్రయాణం చేసే వ్యక్తి. ఆ వేగాన్ని అందుకొని ఆ ప్రయాణాన్ని అర్థంచేసుకుంటేనే మణిరత్నం సినిమాలు నచ్చుతాయి. అది జరగాలంటే, తెరపై చూపించిన సందర్భం ప్రేక్షకుడు తన నిజజీవితంలో చూసి ఉండాలి, లేదా అనుభవించి ఉండాలి. లేకపోతే, వాటిని జీర్ణించుకోవడం కాస్త కష్టమే అవుతుంది. అలాంటిదే ఈ సినిమా విరామపు ఘట్టం. “మొరెత్తుకొచ్చింది” అనే పాట వినసొంపుగా, కనులకు ఇంపుగా ఉన్నప్పటికీ అందుకు గల కారణాన్ని అందరు ప్రేక్షకులు హర్షించలేరు. ఒకవేళ “మణి సార్” సృజనాత్మకతను మెచ్చుకోకపోతే తమకు అభిరుచి లేదని ఎదుటివారు అనుకుంటారేమోనన్న భయమున్న వారు అదేదో కొత్త ప్రయత్నమనుకొని సరిపెట్టుకుంటారు. కానీ, అలాంటి సంఘటనలు చోటుచేసుకునే సందర్భాలు చాలా తక్కువ. అలాగే, మణి అక్కడక్కడ తన పాత సినిమాలను గుర్తుచేశారు కూడా. ఉదాహరణకు, ఏదో కూనిరాగం తీస్తున్న లీలా విమానం శబ్దం విన్న వెంటనే చేసే పనిపై దృష్టి పెట్టకపోవడం “దళపతి“లో గుడిలోవున్న రజినీకాంత్ రైలు శబ్దం విన్న అమాంతం వెనక్కి తిరిగి చూస్తూ నిలబడిపోయే సన్నివేశాన్ని గుర్తుచేసింది.
మొత్తానికి, తనలోని అంతర్యుద్ధం కార్గిల్ యుద్ధంతో ముగుసిపోయిందని చెప్పి, లీలాను కలవడానికి పాకిస్థాన్ సైనికులతో వరుణ్ యుద్ధం చేయడం నిజంగా కథనం స్థాయిని పెంచింది. ఇది మణి గొప్పతనం కూడా. సూటిగా ఏది చెప్పకుండా ప్రేక్షకులకే కారణం వెతుకునే సౌలభ్యం ఆయన మాములుగా ఇస్తుంటారు. ప్రక్కనే ఉంది కనుక లీలాతో ఎన్నిసార్లు గొడవపడినా మళ్ళీ మళ్ళీ కలవొచ్చనే ధైర్యమున్న వరుణ్, తను శాశ్వతంగా దూరమైపోతుందన్న భయం కలిగినప్పుడు ఆమె విలువను గుర్తించి, తిరిగి ఆమెను చేరుకోవాలని అతడు చేసే ప్రయాణాన్ని తనదైన శైలిలో చెప్పి మణి ఈ సినిమాను, తనను ప్రేక్షకుడు అందుకోలేకపోయానని బాధపడకుండా చేశారు.
నటనలు :
కార్తి నటనపరంగా బాగున్నా, కనిపించిన విధానం ఈ సినిమాకు అతడు నప్పేలా చేయలేదు. మణిరత్నం సినిమా అంటే క్లోజప్ షాట్స్ ఎక్కువగా ఉంటాయి. అలాంటి పలు షాట్స్ లో అతడిని చూడడం, డబ్బింగ్ సినిమా అవ్వడంతో అతడి హావభావాలను ఆ క్లోజప్ షాట్స్ లో చూసి తట్టుకోవడం ప్రేక్షకుడికి కాస్త పరీక్షే. “బొంబాయి” సినిమాలో “ఉరికే చిలుకా” పాటలో అరవిందస్వామిని ఈ సినిమా అంతటా గుర్తుచేశాడు కార్తి.
లీలాగా అదితి అక్కడక్కడ అందంగా కనిపించింది. హావభావాలను ప్రకటించడంలో కూడా సఫలమయ్యింది. ఉదాహరణే, వరుణ్ ఎయిర్ బేస్ క్యాంపులో “బోల్ రే పప్పీ హర” పాటను ఆలపించే సన్నివేశం.
మిగతా పాత్రలను పోషించిన రుక్మిణి విజయకుమార్, బాలాజీ, విపిన్ శర్మ తదితరులు తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయంలేని వ్యక్తులే. వాళ్ళ పాత్రలు కూడా గుర్తుపెట్టుకునేలా లేవు.
బలాలు :
- రవివర్మన్ ఛాయాగ్రహణం. ఒక నాణ్యమైన కెమెరా వెనుక ఓ సృజనాత్మక నయనముంటే అవి అద్భుతాలనే ఆవిష్కరిస్తాయి.
- రెహమాన్ సంగీతం. సంగీతమనేది ఎంత ఈదినా ఇంకా ఈదాలనిపించే ఓ మంచినీటి సముద్రమని మణిరత్నం – రెహమాన్ కలయిక ఆద్యంతం నిరూపిస్తూనే ఉంటుంది.
- సిరివెన్నల సాహిత్యం. పాటలు విడిగా వింటే ఇది డబ్బింగ్ సినిమాలా ఏమాత్రం అనిపించకుండా సాహిత్యాన్ని అందించారు సిరివెన్నెల.
- నిర్మాణ విలువలు. దర్శకుడు మణిరత్నం కలకన్న ప్రపంచాన్ని నిర్మాత మణిరత్నం నూరుశాతం తెరపై ఆవిష్కరించారు.
బలహీనతలు :
- మణిరత్నం. ఆయనతో ప్రయాణం ఈ సినిమాలో కాస్త కష్టం.
- కార్తి. నటనలో తప్పులు వెతకడానికి లేదు కానీ తెరపై కనిపించిన విధానం ఒప్పుకోవడం కష్టం.
చివరిమాట :
మొదట్లో చెప్పుకున్నట్టుగా, మణిరత్నం ఇప్పటివరకు తీసిన సినిమాలను పరిశీలిస్తే, ఆయన ఎప్పుడూ ప్రేక్షకులకు నచ్చేలా సినిమాలు తీయలేదు. ఎంచుకున్న కథాంశం ఏదైనా సరే ఆయన చదివింది, విన్నది, చూసినది, ఆయనకు నచ్చినట్టే తీస్తూ వచ్చారు. అందుకే, ఎంతోమందిని ప్రభావితం చేసి, “మణి సార్” అని అందరూ పిలిచుకునే గౌరవాన్ని సంపాదించుకున్నారు. “ఒకే బంగారం” సినిమాలో మణి “సహజీవనం”పై తనకున్న ఆలోచనలను చెప్పారు. అవి ప్రేక్షకుడికి నచ్చాయి, ఆదరించాడు. ఇప్పుడు కూడా మనసులో సముద్రమంత ప్రేమున్నా ఆలోచనలు అందులోని అలల్లా నిలకడను కోల్పోతే ఎలా ఉంటుందో తనదైన శైలిలోనే చెప్పారు. ఆ విధానాన్ని ప్రేక్షకుడు అర్థం చేసుకోవడంలోనే ఉంది. లేకపోతే, మరో ప్రయాణంలో ఆ ప్రయత్నం చేస్తాడు. అలా చేస్తూనే ఉంటాడు. ఎందుకంటే, ఆయన మణిని, రత్నాన్ని తనలోనే ఇముడ్చుకున్న “మణిరత్నం” – ఓ సినీశకం.
ఇట్లు
మణిరత్నంకు అభిమానంతో
యశ్వంత్ ఆలూరు